దక్షిణమార్గ వర్ణనము
మునులు తపోథనా ! పాపులు దక్షిణ మార్గముననెట్లు పోదురో సవిస్తరముగ ఆనతిమ్మన వ్యాసులిట్లనియె. ఆ మార్గము ఘోరాతిఘోరము. ఆద్వారము ఘూతుకమృగ సంకులము. భయంకరము. నక్కల ఆరుపులతో ప్రతిథ్వనించును. అగమ్యము. భూతప్రేత పిశాచ రాక్షస సంకీర్ణము. తలచికొన్నతనువు గగుర్పాటు చెందును. పాపులాద్వారమున దూరగనే కని బెదరి ప్రేలాపన సేయుచు మూర్చపడుదురు. అటుపై యమభటులు వారిని కొట్టుచు సంకెళ్లను పాశములను గట్టి ఈడ్చుచు దండములతో బెదరింతురు. ఆ జీవులు తెలివొంది రక్తమునందడిసి అడుగడుగున దడవడుచు దక్షిణ ద్వారముంజొత్తురు. ఆదారి ముండ్లతో గులకరాళ్లతో కత్తులతో పాషాణములతో నొక్కెడబురదతో దాటరాని గోతులతో ఇనుప సూదులట్టి దంతములతో దుర్గమమయి ఉండును. అందు జీవులు దుఃఖించుచు ఒడ్డులం గూల్చు కొండలు చెట్లతో నిప్పులతో గూడిన దారింబోదురు. కొన్నియెడల మట్టిపెళ్లలు కణకణలాడు ఇసుక పదునైన శంకువులు సలసలకాగు నేలతోడి నలుదారులు కలిసిన బాటలు కాలిన పాషాణములు కొన్నియెడల మంచుతో పీకదాక దిగిపోవు ఇసుక మేటలతో ముఱుగు నీటితో గనగదే మండు నిప్పులతో గూడియుండును. సింహములు తోడేళ్ళు ఈగలు దోమలు దారుణములయిన పురుగులు నొక్కెడ పెద్దపెద్ద జలగలు మీద కొండచిలువలు కందిరీగలు విషముగ్రక్కు పాములు దుష్టగ్గములు పదునైన కొమ్ములతో దారినేలరాయు ఎడ్లతో దున్నలతో ఒంటెలతో గూడి యుండును. రౌద్రములయిన ఢాకినిశాకిన్యాది పిశాచములు రాక్షసులు వ్యాధులు పీడింప ఆ దారింబీడితులై పోవుదురు. మహాధూళిగ్రమ్మ మహాప్రచండ వాయువులువీవ మహాపాషాణములు వరిక్షంచుచుండ యమభటులు బాదుచుండ నిలువ నీడగానక నొక్కెడ పిడుగుపాటున ఒడలు పగుల బాణవరక్షమున బ్రద్దలుకాగా దారుణముగ గొఱవులు పడుచుండ పైని నిప్పులు గురియుచుండ ఆ దారిం జనుదురు. పెనుధూళి కురియుచుండ అందు బ్రుంగి యేడ్తురు. మేఘముల ఉరుముల కడలిపోవుదురు. బాణ వర్షములచే చూర్ణమై పోయెదరు. పెద్ద ఉప్పునీటి దారలను తడియుచు పుండు వంటి చలిగాలికి బిగియుచు పగులుచు నొగులుచు నా దారి ఆకలివడి తినుటకేమియు లేక గుములుచు నిరాలంబము నిర్జలమునైన ఆ దుర్గమయమమార్గమునంబడి అతిశ్రమ గుడుచుచు దేహులు మూఢులు పాపాత్ములు ఆ వెంటం జనియెదరు. యమునాజ్ఞంగొని దూతలతిఘోరరూపు లీడ్వ నొంటరిగ పరాధీనులై బంధుమిత్రాదులు లేక తాము మున్ను జేసిన పాపములకు మఱిమఱి యేడ్చుచు నడుమనడుమ యమభటులు నోరెత్తవలదని కొట్టుచుండ నోరు నాలుక యెండ ప్రేతలై నొగులుదురు. బక్కచిక్కిన మేనులతో జడిసి పోవుచు ఆకలి చిచ్చునకు దహింపబడుచు సంకెళ్ళం బంధితులై కొందరు తలక్రిందుగా పాదములు మీదుగా గైకొని దూతలచే ఈడ్వబడుదురు. కొందరు మొగము క్రిందుగా ఈడ్వబడి ఏడ్తురు. అన్నము నీరు లేక మరి మరి దేహి దేహి అని అడుగుకొనుచు కంట నీర్వెట్టుచు గద్గదికతో చేతులు మొగిచి దీనులై ఆకలిదప్పులం గుమిలి మంచి భక్ష్యములు పేయములు భోజ్యములు ఘుమఘుమ వాసనలు జిమ్ముచుండ జూచుచు మఱిమఱి ప్రాధేయపడి అడిగికొనుచు పెరుగు పాలు నెయ్యియుం గలిపిన అన్నముం జూచి సుగంధభరిత పానీయములం జల్లని నీరుంగని యమదూతలం బిక్కమొగము వెట్టి యాచించికొనుచుందురు. వారింగని యమదూతలు భయంకరులు క్రోధమున కనుకొలుకు ఎఱ్ఱవడ బెదరించుచు ఇట్లందురు.
సకాలమున మీరు హోమము సేయలేదు. విప్రులకేమియు నీయలేదు. ఎవరేని యిచ్చుచున్న దానికడ్డు తగిలితిరి. దానివలని పాపమిది యనుభవింపవలసినది. అగ్నిచే గాలలేదు. నీటిపాల్గాలేదు. రాజులు దొంగలు నపహరింపలేదు. మున్ను మీరుసేయని దానమిప్పుడు బ్రాహ్మణ ముఖమున నీయబడుచున్నది. సాత్త్విక దానముసేసిన సాధువులకివిగో అన్నపర్వతము లెదురగుచున్నవి. భక్ష్య భోజ్య లేహ్య పేయాదిరూపమగు ఆహార సమృద్ధి యిది మీకుగాదు. మీరు విప్రముఖము ఎన్నడు ఇంత అన్నము పెట్టియుండలేదు. బ్రాహ్మణులం బూజింపనైనలేదు. ఆవిధముగజేసిన పుణ్యాత్ములదీ అన్నసమృద్ధి. వారిది గొనివచ్చి మేము మీకెట్లు పెట్టగలము?
యమకింకరుల మాటవిని దిగులువడి ఆకలికి కుమిలి ఆ జీవులు దారుణ శస్త్రపీడితులైరి. ఇనుపగుదియలు ఇనుపదుడ్లు శక్తితోమరపట్టి నపరిషుబిందిపాలగదాపరశు బాణాదులచే వీపున బాదుచు పరమ నిర్దయులు కింకరుల వేధింప నరిగియరిగి సింహ వ్యాఘ్రాదులచే పాపులు భక్షింపబడుదురు. అట్లు మిగుల పీడించి కింకరులు పాపులను యమ ప్రభువు ఎదుటకు గొంపోదురు. అయన ధర్మాత్ముడు ధర్మకర్త సర్వప్రాణి నియామకుడునైన యముడు ఇట్లతి కష్టమైన దారిని జని ప్రేతపురముం జేరిన నరులను ప్రభువు ఎదుట నిలబెట్టి యమదూతలు వారు చేసిన కర్మముల నివేదింప ప్రాణులకు ఆయన అతిభయంకరుని గా చూచెదరు. పాపముచే గనులు మూతవడి బుద్ధులుచెడి ప్రాణికోరలతో భయంకరమై కనుబొమలు ముడివడి మిడిగ్రుడ్ల జడుపుకూర్చు మొగము నిక్కినజుట్టు పెద్దగడ్డముతో పెదవు లదర పదునెనిమిది చేతులతో కాటుకవలె నల్లని మేనితో సర్వాయుధములంగరములంబూని పెద్దదున్నపోతునెక్కి పెద్దమబ్బువలె నిప్పులట్లు మండుకండ్లు రక్తమాల్యములు పూని ప్రళయమేఘమట్లు ఉరుముచు సముద్రుని ఆపోశనపట్టునా అన్నట్లు ముల్లోకములను మ్రింగునా అన్నట్లు నిప్పులు గ్రక్కుచున్నట్లు దగ్గరగానిల్చి కాలాగ్ని ప్రభతోనున్న మృత్యువుంగని మహా మారి కాలరాత్రియు వివిధవ్యాధులు కష్టాలు నానారూపాలు శక్తి శూలాస్త్రపాశచక్రాంకుశ ఖడ్గాదులు దాల్చి వజ్రదండములంగొని చురకత్తెలు అమ్ములపొదలు విండ్లును నసంఖ్యాకముంబూని మహావీర్యులు క్రూరులు కాటుకవలె నల్లని మేనికాంతిగలవారు సర్వాయుధ హస్తులై యమదూతలు అతిభయానకులై ఘోరముగా పరివారమై గొలువ గొలువైన యముని చిత్రగుప్తుని పాపాత్ములు దర్శింతురు. యముడుగ్రుడై వారి నురిమి నురిమి చూచును. అపుడు చిత్రగుప్త భగవానుడు ధర్మపచనములచే ప్రబోధించుచు ఇట్లనును.
ఓపాపకర్ములారా! పరద్రవ్యాపహారులారా! రూపముచే బలముచే బొగరెక్కి పరదారాభిమర్శనము సేసిన ఫలమది అనుభవింపవలయును. దుఃఖముకుడువకతప్పదు. ఈ తప్పెవనిదికాదు. ఈరాజులు నాకడకు వచ్చినవారు తెలివిచెడి బలగర్వితులై చేసిన తమ కర్మమును అనుభవించుచున్నారు. ఓ రాజులారా! ప్రజానాశనమొనరించితిరి. అల్పరాజ్యసుఖమునకై ఘోరములు సేసినారు. మీరు రాజ్యలోభముతో మోహముతో బలత్కారముగ ప్రజలను దండించినారు. దానిఫలమిపుడనుభవింపుడు. రాజ్యమేది ఇక్కడ భార్య యెక్కడ? ఇపుడు ఏకాకియై చేసిన అశుభమసుభవింప వలసినదే ఏబలముకొని ప్రజల భాదింతురో ఆ బలమిపుడు ఏ మాత్రము ఈ లోకమున కనబడదు. యమకింకరుల వలన బాధలకు గురియైతిరి పాపము. అని ఇట్లు పలుతీరుల దెప్పిపొడుచుచు నొవ్వనాడుచు యముడుత్కటకోపియై పడదిట్ట నేడ్చుచు చేసినపాపములకు పశ్చాత్తాపించుచు ప్రాణులు నోరెత్తక నిల్తురు. ధర్మరాజిట్లు చిత్రగుప్తుని వారివారికర్మల లెక్కలు సెప్పుమని విని ఆ పాపవిశుద్ధికి విధింపనగు దండనములం గూర్చి దండధరు డిట్లాదేశమిచ్చును.
ఓరిచండ ! మహాచండ ! ఈ నరపతులం గొంపోయి నరకాగ్నులందు బడనేసి పాపములనుండి విశుద్ధుల జేయుడన వెనువెంటలేచి యమభటులు నృపులకాండ్లు పట్టుకొని యెత్తి విసరిపారవేసి పాపపరమాణముంబట్టి బండపై నడిచి పిడుగుచే మహాతరువునట్లు గొట్టిరి. అంతట రక్తము ప్రవాహమెత్తినట్లు ముక్కున నోట జాల్కొనం దెలివితప్పి ఆ దేహి పడిపోవును. అటుపై దానిపై వాయువు వీవ తెలివిగొనినంత వారిని పాపవిశుద్ధికి నరకసాగరమున విసరుదురు. ఆదూతలు మహాదుఃఖముల కుములు మఱియుంగల జీవులను యమునికి నివేదింతురు. ఇడుగో వీనిని మహాపాపిని మూర్ఛబడనేసి కొనివచ్చితిమి. ధర్మవిముఖుడు నిత్యపాపరతుడు. ఇడుగో వీడు పరమలుబ్ధుడు. మహాపాతకోప పాతకములెన్నో చేసినాడు హింసాపరుడు అనాచారుడు. కూడరానిదిం గూడినవాడు పరద్రవ్యాపహారి. కన్యావిక్రయి కూటసాక్షి కృతఘ్నుడు మిత్రద్రోహి. మరియు వీడు ధర్మనింద చేసినాడు. పాపములు చేసినాడు. దురాత్ముడు వీనిని శిక్షించుటో రక్షించుటో ప్రభువు నీవు సెలవిమ్ము. నీ చెప్పినదములు సేయుటలో మేము సర్వదా విధేయులము అని యిట్లు విన్నవించి ధర్మప్రభువు నెదుటనిలిపి వేలకొలది లక్షకోటినరకములం బడవైతురు. ఆపైమఱి కొందఱిం బట్ట బోదురు. చేసినతప్పు నిర్ధారణ చేసిన మీద తనకింకరులకానయిచ్చి వశిష్ఠాదిమహార్షులేయే నేరముల కేయేదండనము విధించిరో ఆయారీతి దండింపజేయును. యమకింకరులు క్రోధమూని అంకుశముద్గరదండాదులు ఱంపములు శక్తి తోమరములు కత్తులు శూలములుంగొని అడచి కొట్టికోసి యేసిగ్రుచ్చి నరకి చీల్చి పాపశోధనము సేయుదురు.
నరకముల భయానక స్వరూపము వాని ప్రమాణములు వినుండు. మహావీచి అను నరకము రక్తపూర్ణము. వజ్రకంటకమిశ్రము. పదివేలయోజనముల విరివిగలది పాపినందుముంచి వజ్రకంటకములం గ్రుచ్చిచీల్తురు. లక్షయేండ్లక్కడ గోహత్యచేసినవాడు గూలియుండును. కుంభీపాకము మహాదారుణనరకము. నూరులక్షల యోజనములుండును. కాలుచున్న రాగిబిందెలతో నది మిడమిడకాలు నిసుక నిప్పులతో గూడి యుండును. బ్రహ్మఘ్నుడు భూమిహర్త ధననిక్షేపములను(నిధులను) హరించినవాడచట గూలును. భూతప్రలయముదాక జీవులందు కాల్పబడుదురు. అటుపై రౌరవము జ్వలించు వజ్రబాణములతో నిండియుండును. అరువదియోజనముల పొడవు వెడల్పుగల్గి యుండును. జ్వాలలుగ్రమ్ము నానరకమున బాణములచే పాపులుజీల్పబడుదురు. అయోమయ నరకము మంజూషాకారము (బొనువంటిది) దానిలో బావుల బడనేసి చెఱకునాడించినట్లాండింతురు. అదియును జ్వలించుచుండును.
ఆప్రతిష్ఠమను నరకము మలమూత్ర పురీషమయము. పాపియందధోముఖుడైకూలును.బ్రాహ్మణులను పీడించినవాడు బ్రాహ్మణద్రవ్యమపహరించినవాడు దానం గూలును విలేపకమను నరకము సలసలకాగు లక్కతో నుండును. మద్యపానరతులందు మునుగుదురు. మహాప్రభమను నరకము కాలిన శూలములతో నిండియుండును. ఆలుమగలకు తగవుపెట్టిన వారాశూలములచే బొడువబడుదురు. జయంతియను ఘోరనరకము ఉక్కు పరచిన రాతినేల. పరభార్యా సంగిదానంబడి ఉడికిపోవును.
శాల్మలమనునరకము నిప్పులముళ్ళతో నిండినది. బహుజన వ్యభిచారిణియైన స్త్రీ దానిం గౌగలించుకొనును. ఎవ్వరు ఇతరుల ఆయువుపట్టులకు తగులు అసత్యములు పల్కుదురో వారి నాలుకను లాగి ఱంపములంగోయుదురు. ఎవ్వరు సరాగములగుచూపులం బరాంగనం జూతురో వాండ్రకన్నులం బాణములం గ్రుచ్చి పగిలింతురు. తల్లిని సోదరిని గోడలిని గూతురుం బొందిన వాండ్రను స్త్రీ బాలవృద్ధ హంతకులను పదునల్వురింద్రుల కాలము జ్వాలామాలాకాకులమైన రౌద్రమగు మహారౌరవమనునరకమునం గూల్తురు. అది యిరువదినాల్గు యోజనముల విరివియైనది.
ఎవ్వడు పురగ్రామక్షేత్ర గృహాదులకు నిప్పు వెట్టునో ఆ మూఢుడు కల్పాంతముదాక పై నరకమున గాల్పబడును. తామిస్రమను నరకము లక్ష యోజనములు. కత్తులు పట్టిసములు ముద్గరములు పరచినది. అందు దొంగలను విసరివైతురు. యమకింకరులు శూలశక్తి గదాఖడ్గాదులచే కల్పశతమచట పాపుల నడంతురు. తామిస్రముకంటె రెట్టింపు విశాలము మహాతామిస్రము. అందు జలగలు పాములు నుండును. కారుచీకటి పరమదుఃఖదము.
మాతృపితృహంతకులు మిత్రవిశ్వాసఘాతకులు నందు బాడితెలం జెక్కబడుచుందురు. భూమియున్నంతదాక అది అనుభవింతురు. అసిపత్రవనము (కత్తులబోను) మహాదుఃఖదము. కాలుచున్నకత్తులతో నిండినది. ఒక్క యోజనము విరివిగలది. అందు మిత్రఘ్నుడు భూతప్రలయముదాక కత్తులచే నూరుప్రక్కలు గావింపబడును.
కరంభవాలుకమను నరక మొక్కయోజనము. కూపాకారము మిడమిడ గాలు నిప్పులతో ముండ్లతో నిసుకతోనిండినది. అందు ఒక లక్షా పదివేల మూడువందలేండ్లు జనులను మాయోపాయములచే దారుణముగ మ్రగ్గుదురు. దహించిన వాండ్రందు దహింపబడుదురు.
కాకోలమనునరకము క్రిమిమయము మలమయమును. మృష్టాన్నముందా నొక్కడ దిన్నవాడు దానం గూలును. మలమూత్ర శోణిత మయముకుడ్మలమనునది. పంచ యజ్ఞములుమానినవాండ్రందు బడుదురు. మాంసము రక్తముతో నది పాడుకంపు గొట్టుచుండును. భయంకరము. అభక్ష్యాన్నభక్షకులందు గూలుదురు.
క్రిమికీటకమయము శవ సంపూర్ణము మహావటమను నరకము. కన్యావిక్రయముచేసిన వాడక్కడ తలక్రిందుగా నాపెద్దమఱిచెట్టునుండి క్రిందపడును.
తిలపాకమనునరకము దారుణము. పరులను పీడింపగోరిన వాండ్రు అందు గానుగయందు నువ్వులట్లాడింపబడుదురు. అందు సలసల క్రాగు నూనెలో నుడికిపోదురు. మిత్రఘ్నుడు శరణాగత హంతకుడు వజ్రకపాటమను నరకమున వజ్రమయములయిన గొలుసులం బంధింపబడును. పాలమ్మువాడు నిర్దయముగ నిరుచ్ఛ్వాసమగు గాఢాంధకారబంధురము గాలియాడని నరకమునం బీడింపబడును. బ్రాహ్మణునికి చేయుదానమున కడ్డుపడినవాడు చేష్టలు దక్కి యందు గుములును. గనగన మండు నిప్పుల నరకమది. అంగారోవచయము. విప్రునికి దానము సేసి చేయలేదన్నవాడు దాన బడును. మహాపాయి యనునరకము లక్షయోజనములు. అనృతము లాడినవాడు అందధోముఖముగా బడవేయ బడుదురు. మహాజ్వాలమను నరకము పెనుమంటలతో భయంకరము. పాపులందు దహింపబడుదురు. క్రకచమను నరకమున వజ్రమువంటి పదునైన ఱంపములచే నగమ్యామగమనమును జేసిన పాపులు గోయబడుదురు.
గుడపాకమను నరకము క్రాగుచున్న బెల్లపు పాకము మడుగు. అందు వర్ణసాంకర్యము చేసినవాడు పడవేయబడును. క్షురధారమను నరకము పదునైన కత్తుల నరకము బ్రాహ్మణభూమి కాజేసినవాడందు కల్పాంతముదాక కోతలంబడును. అంబరీషమను నరకము ప్రలయ కాలాగ్ని దీపితము నూరుకల్పకోటులందు స్వర్ణస్తేయి (బంగారపుదొంగ) గూలును. వజ్రకుఠారనరకము కేవల వజ్రమయము. చెట్లను నరకినవాం డ్రట బడుదురు. పరితాపము ప్రలయాగ్నిమయము. విషము పెట్టినవాడు మధుహర్త (మధువు=తేనె) దానంబడును. కాలసూత్రము వజ్రసూత్రమయము. ఇతరుల పంటలను హరించిన వాండ్రందు బడుదురు. కశ్మలమను నరకము చీమిడి శ్లేష్మముతో నిండినది. ఒక కల్ప మక్కడ నిరంతర మాంసాభిరుచి గలవాడు గూలును. ఉగ్రగంధమను నరకము లాలా (చొంగ) మూత్రపురీషమయము. పితరులకు పిండప్రదానము చేయని వాండ్రందు బడవేయబడుదురు. జలగలు తేళ్ళతోనుండెడి దుర్భర నరకము పదివేలేండ్లందు తిండిపోతుగూలును. వజ్రమయము వజ్రమహానీడమను నరకమున ధనధాన్యహిరణ్యములును హరించినవాండ్రు కుములుదురు. యమకింకరులు లేశలేశముగా దొంగలనట చెక్కుదురు. కాకిని గ్రద్దనట్లు ప్రాణుల నరకితినువాండ్రను యమకింకరులు కల్పాంతముదాక వాండ్ర మాంసమును వాండ్రచేతనే దినిపింతురు. బరుల శయనాసన వస్త్రాదులం గాజేసినవాండ్రను శక్తితోమరాదులచే యమభటులు ఖండింతురు. పండ్లు ఆకులు హరించిన కుబుద్ధులు గడ్డినిప్పునం గాల్పబడుదురు. కాలభటులు పరదారథనాదులయెడ బుద్ధిగలవానిగుండెలలో గాలిన యినుప శూలముం గ్రుచ్చుదురు. మనోవాక్కాయకర్మలందు ధర్మవిముఖులయిన పాపులు యమలోకమున బలుఘోరమలయిన యాతనలందు వేలు లక్షలు కోట్ల సంవత్సరములు దుఃఖములు గుడువ వలసియుండును.
ఇది శ్రీబ్రహ్మపురాణమునందు దక్షిణమార్గ వర్ణనమను నూట తొమ్మిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹