Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – పందొమ్మిదవ అధ్యాయం

చంద్రగ్రహ జననం మొదటి భాగము

అత్రి మహర్షి సమిధలూ , దర్బా సేకరించాక అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చాడు. పాద ప్రక్షాళనం చేసుకొని లోపలికి వచ్చిన భర్తకు తాగటానికి నీళ్ళు అందించింది అనసూయ. ఆమె మొహంలోని నిరాశనూ , నిస్పృహను ఇట్టే కనిపెట్టేశాడు. అత్రి..

“నీ మొహంలో ఆనందం లేదు ?” అత్రి నవ్వుతూ అన్నాడు. జల పాత్ర ఆమెకు అందిస్తూ.

“నా మొహం మీద నవ్వు నాట్యం చేయాలంటే , ఏం జరగాలో తమకు తెలుసుగా స్వామీ !” అనసూయ కంఠస్వరంలో ఆవేదనా , వినయం రెండూ పెనవేసుకున్నాయి.

అత్రి మహర్షి అర్థం చేసుకున్నాడు. బరువుగా నిట్టూర్చాడు. మౌనంగా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు అనసూయను ఎగాదిగా చూశాడు. తన భార్య అనసూయ అందాల రాశి ! చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం ! అర్థ చంద్రుడి ఆకారంలో నుదురు ! ఆ నుదురు మీద మళ్ళీ పున్నమి చంద్రుడిలాగా గుండ్రటి తిలకం ! తిలకానికి ఇరువైపులా వంకీలు తిరిగిన చక్కటి కనుబొమ్మలు ! ఆ కనుబొమ్మల గట్ల కింద జంట సరోవరాల్లా మిలమిలలాడే పెద్ద కళ్ళు ! చిగురుటాకుల్లాంటి పెదవులు. ఆమె సౌందర్య సర్వస్వాన్ని కళ్ళకు కట్టుతున్న చీరకట్టు… ‘ఇంకా పిల్లలు పుట్టలేదు’. అని చాటుతున్నట్లు , ”సంతాన లేమి”ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తున్న సన్నటి నడుము…

“ఏమిటి స్వామి అలా చూస్తున్నారు ?” భర్త చూపుల్ని గమనించిన అనసూయ అడిగింది.

అత్రి క్షణకాలం అయోమయంలో పడిపోయాడు. “నిన్నే ! నువ్వు పతివ్రతవు. నేను సతీవ్రతుణ్ణి ! పరస్త్రీని కన్నెత్తి చూడను. నా అర్ధాంగినే చూస్తాను. అనసూయా ! రోజురోజుకీ నీ సౌందర్యం తరగడం లేదు. పెరుగుతోంది !”.

అనసూయ కళ్ళల్లో ఆనందం మెరుపు తీగలా తళుక్కుమని , అంతలోనే అంతర్థానమైంది. ఆ స్థానాన్ని మళ్ళీ ఆవేదన ఆక్రమించింది.

“సౌందర్యానికి సాఫల్యతా , సార్ధకతా ఉండాలి స్వామీ !” అంటూ అనసూయ లోనికి వెళ్ళబోతూ తిరిగింది. పొడుగాటి వాలు జడ ఆమె నడుమును , తీగను చుట్టుకున్న పాములా చుట్టుకుంది. అత్రి కళ్ళు చెదిరాయి.

“అనసూయా ! ఇలారా !” పిలిచాడాయన.

భర్త పిలుపు పగ్గంలా పనిచేస్తూ అనసూయను అత్రి వైపుకు లాగింది. దగ్గరగా వచ్చి , నిల్చుని , తన మొహంలోకే చూస్తున్న అనసూయ చెయ్యి పట్టుకొని , పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అనసూయ భర్త కళ్ళల్లోకి దీనంగా చూసింది. “స్వామీ… సంతానం ఆశించడానికి ఇంక నోములూ , వ్రతాలూ ఏవీ మిగల్లేదు.”

అత్రి చిరునవ్వు నవ్వాడు. “అన్ని సేవలూ చేసేశావు కదా ! ఇక… నీ పతి దేవుడి సేవలో మునిగిపో !!”

“స్వామీ…”

“అనసూయా ! నన్ను తన మానస పుత్రుడుగా సృష్టించినపుడు – ఆ సృష్టి కర్త ఏమన్నాడో తెలుసా ? తన మానస పుత్రులైన మా మూలంగా లోకంలో ప్రజా సృష్టి ఇబ్బడిముబ్బడిగా జరుగుతుందన్నాడు. అలా జరగాలన్నది ఆయన ఆకాంక్ష ! ఆయన ఆదేశం ! బ్రహ్మదేవుల వాక్కు వృధా పోదు కదా ! ఆ బ్రహ్మ సంకల్పించాలి. ఈ బ్రహ్మ మానసపుత్రుడికి అర్ధాంగి అనసూయ ద్వారా చక్కటి సంతానం కలగాలి ! అంత వరకూ మన ఆతృత ఆగాలి.”

“అంతేనంటారా , స్వామీ !” అనసూయ మాటల్లో అనుమానం తొంగి చూసింది.

“అనసూయా ! నువ్వు మహాపతివ్రతవు ! నీ ఆశ నెరవేరకుండా ఉండదు !”

“పతివ్రతలు నిరంతరమైన ఆవేదనలో మునిగిపోయి ఉండాలేమో అని భయమేస్తోంది స్వామీ…”

“అనసూయా !”

“అవును స్వామీ… ఆ మహాపతివ్రత శీలవతిని చూస్తుంటే !” అనసూయ అంది. అత్రి ప్రశ్నార్థకంగా చూశాడు. (“శీలవతి అంటే… ఆ ఉగ్రశ్రవుడి భార్యే కదా !”

“ఔను… ఇందాక భిక్ష కోసం వచ్చింది పాపం !” అనసూయ జాలిగా అంది. “కుష్ఠురోగి అయిన భర్తను బుట్టలో పెట్టి , ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకొని మోస్తూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ భిక్షాటనం చేస్తూ , భర్తను పోషిస్తూ సేవించుకుంటోంది.

“విన్నాను. ఆ ఉగ్రశ్రవుడు ఉగ్రస్వరూపుడనీ , కుష్ఠువ్యాధితో శరీరమూ , అకారణ ఆగ్రహంతో మనసూ పూర్తిగా పాడైపోయిందనీ ఆశ్రమ వాటికలో అందరూ అనుకుంటూ ఉంటారు !”

“అంతే కాదు స్వామీ ! శీలవతి భర్త వృద్ధుడు కూడా ! శీలవతిది నూత్న యవ్వనం ! భర్తది పండబారిన వృద్ధాప్యం ! ముసలితనానికి తోడుగా ముదిరిపోయిన వ్యాధి ! అతని శరీరం నుంచి దుర్గంధం చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. అయినా , ఆ శీలవతి నిజంగానే సార్ధక నామధేయురాలు ! రోగగ్రస్థుడై , దుర్వాసన వేస్తూ , కృశించిపోతున్న భర్తనే దైవంగా భావించి సేవిస్తున్న ఆదర్శపత్ని ఆమె !” అనసూయ ఉద్వేగంతో అంది.

“ఔను ! శీలవతి గుణవతి , సౌందర్యవతి అని అందరూ అంటూ ఉంటారు. ఆ ఉగ్రశ్రవుడే పరమదుర్మార్గుడు. అనారోగ్యమూ , అసహాయతా అతనిలో ఆగ్రహాన్ని పుట్టించాయి. వృద్ధాప్యము , అసూయనూ , ఆ ఇల్లాలి పట్ల అనుమానాన్ని పుట్టించింది ! అందుకే దుర్మార్గుడు ఆ సాధ్విని ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనివ్వడు ! భిక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద తిష్ఠ వేస్తున్నాడు !” అత్రి వివరించాడు.

“చూశారా ! అష్టకష్టాలూ , అసంతృప్తులూ కేవలం పతివ్రతలకే !” అనసూయ చిన్నగా నవ్వింది.

“ఔను ! బంగారం అందమైన ఆభరణంగా మారే ముందు దానికీ నిప్పుల్లో కాలడం , సుత్తి దెబ్బ తినడం అనే కష్టాలుంటాయి !” అత్రి నవ్వుతూ అన్నాడు.

“అయితే , శీలవతి అందమైన ఆభరణంగా మారుతుందంటారా ?” అనసూయ ప్రశ్నించింది.

“శీలవతే కాదు. నువ్వు కూడా !” అత్రి నవ్వుతూ అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment