నరక దుఃఖ నివారణాయ ధర్మాచరణ వర్ణనము
మునులిట్లనిరి
యమలోకమార్గమందు గల్గు ఘోర దుఃఖము ఘోరములైన నరకములు నరకద్వారమును గురించి ఆశ్చర్యమైన విషయములను నీవు దెలిపితివి. భయంకరమైన ఆ దారిలో సుఖముగ వెళ్ళుటకు ఉపాయము కలదో లేదో తెలుపు మన
వ్యాసుండిట్లనియె. ఇహమందు ధర్మపరులై అహింసా నిరతులై గురు శుశ్రూష దేవ బ్రాహ్మణ పూజ చేసిన వారు భార్యా పుత్రాదులతో యమమార్గమున వెళ్ళరు.
బంగారు టెక్కెములతోఁగూడిన దివ్యవిమానములయందు అప్సరసలు సేవింప ధర్మరాజు పురమున కేగెదరు. బ్రాహ్మణులకు అన్నదానము మొదలైన వానిని భక్తితో పవిత్రముగా చేసినవారు దేవతా తరుణులచేత సేవింపబడుచూ విమానములమీద వెళ్ళెదరు. సత్యము పల్కిననారు మనసులో మాటలో స్వచ్చమైనవారు విష్ణు తాత్పర్యముతో గోదానము జేసినవారు అప్సరసలు సేవింప ధర్మపురి కేగుదురు.
పాదరక్షలు గొడుగు మంచము ఆసనము వస్త్రాభభణములను ఒసంగిన వారు గజాశ్వరథములనెక్కి బంగారు వెండి గొడుగులతో ఏగుదురు. శుద్ధాంతఃకరణముతో పానకము అన్నము పూజించి ఇచ్చినవారు బంగారు విమానముల నేగుదురు. పాలు పెరుగు నేయి బెల్లము మంత్రపూతముగా పరిమళపుష్పములనిచ్చినవారు హంసవిమానములమీద నరుగుదురు. నువ్వులను తిలధేను ఘృత ధేను దానములను శ్రద్ధతో శ్రోత్రియులకిచ్చినవారు చంద్రమండలమునట్లు ప్రకాశించు విమానములమీద గంధర్వులు గానము సేయుచుండ యమపురికి జనెదరు. వాపీకూప తటాకములు సరస్సులు దిగుడు బావులు పుష్కరుణులు మొదలైన శీతలోదక జలాశయములను త్రవ్వించినవారు బంగారు విమానముల మీద దివ్య ఘంటానాదము వినిపింప ఛత్రచామరాదులచే వీచబడుచు నేగుదురు. ఈ లోక మందు దేవాలయములు సువర్ణ రత్నమయములుగా నిర్మించినవారు వాయు వేగములైన విమానములలో లోకపాలురతో నేగుదురు. మంచినీళ్ళిచ్చినవారు దారుమయ పాదుకులు పీఠములు ఆసనములు ఇచ్చినవారు సుఖముగా స్వర్ణమణి పీఠమందు కూర్చుండి విమానములలో ఏగుదురు. పుష్పోద్యానములు పండ్లతోటలు ప్రతిష్ఠించినవారు చల్లనిచెట్ల నీడలో దేవతా గానముల వినుచునేగుదురు. బంగారము వెండి పగడము ముత్యము దానమిచ్చినవారు భూదాతలు సాలంకృత కన్యాదానము చేసినవారు సుగంధాగరు కర్పూరములను పుష్పములను ధూపద్రవ్యముల నొసంగినవారు సుగంధలిప్తులై సువేషులై సుప్రభులై సుభూషితులై ధర్మపురమేగుదురు. దీపదానము చేసినవారు సూర్య సదృశమైన విమానములమీద దశదెశలు మెరయించుచు నేగుదురు. గృహదానము చేసినవారు బంగారు గృహముల వసింతురు. జలకుంభములను కుండికలను కూజాలనిచ్చినవారు ఏనుగులమీద వెళ్ళెదరు. పాదాభ్యంగము. శిరోభ్యంగము చేయించినవారు స్నానపానోదకములనిచ్చిన వారు జాతిగుఱ్ఱమునెక్కి వెళ్ళెదరు. మార్గాయాసమున వచ్చిన బ్రాహ్మణులను విశ్రమింపజేసినవారు చక్రవాకపక్షులు పూన్చిన వాహనములనేగుదురు. ఇంటికివచ్చిన బ్రాహ్మణులకు స్వాగతముచ్చి (దయచేయుడని గౌరవించి) సుఖాసనమిచ్చి పూజించినవారు నమోబ్రహ్మణ్య దేవాయ (బ్రహణ్యమూర్తియైన భూదేవునకు నమస్కారము) అని పాదములపై వ్రాలి నమస్కరించి పాపహరయను మంత్రముతో గోదానముచేసిన వారును సుఖప్రయాణము చేయుదురు. ద్విజభుక్తశేషము అనగా బ్రాహ్మణులకు భోజనముపెట్టిన తరువాత శేషించిన అమృతమను పేరుగల ఆహారము ప్రసాద రూపముగా ఆరగించినవారు దాంఛిక వృత్తి అనృతములేనివారు హంసవిమానమున ఏగుదురు. మూడురోజులు ఉపవాసముండి నాల్గవరోజున ఏకభుక్తము చేసినవారు మూర్ఖత్వము డాంభికము లేనివారు నెమలివిమానములో ఏగుదురు. మూడురోజుల కొకసారి వ్రతముపూని భోజనము సేయువారు గజరథములమీద ఏగుదురు. ఆరురోజుల కొక్కమారే శుచియై భోజనముచేసిన ఆతడు దేవేంద్రుని వాలే ఏనుగునెక్కి వెళ్ళును. పక్షమునకొకతూరి భోజనము చేసినవారు పులులు పూన్చిన రథముననేగెదరు. నెలరోజలుపవాసము చేసినవారు గంధర్వగానములు వినుచు విమానయానము చేయుదురు. విష్ణుభక్తి తాత్పర్యముతో నారాయణ పరాయణతతో ప్రాణముబాసినవాడు అగ్ని ప్రవేశముచేసిన వానివలె విలసించు రథముననేగును. విష్ణుభక్తితో తనంతట తాను జలములోదిగి ప్రాణము వదలినవాడు, తనశరీరమును గ్రద్దలకెరవెట్టినవాడు బంగారు విమానముననేగును. గోరక్షణకు స్త్రీ రక్షణకొరకు ప్రాణమర్పించినవాడు దేవతాస్త్రీలు గొలువ సూర్యప్రభతో నేగును. విష్ణుభక్తితో తీర్థయాత్ర సేసిన వారు యజ్ఞములు చేసినవారు ఇతరులకెట్టిబాధయు గల్గింపనివారు భక్తితో సేవచేయు నౌకర్లను భరించినవారు ఓరిమిగల వారు సర్వభూతదయ గలవారు అభయమిచ్చిన వారు కామాదిగుణములు లేనివారు చంద్రప్రకాశమైన విమానమున దేవ గంధర్వుల కొలువ యమపురికేగుదురు. బ్రహ్మ విష్ణుశివమూర్తులను భేదబుద్ధిలేకుండ పూజించినవారు సూర్యప్రభములగు విమానములనేగుదురు. సత్యశౌచములు గల్గి మాంసము తిననివారును సుఖముగ నేగుదురు. భక్ష్యభోజ్యాదులందు మాంసముకంటె రుచికరమైన పదార్థములేదు. పరసుఖాభిలాషి దానిని తినగూడదు. మాంసము ముట్టనివాడు గోసహస్ర దానముసేసినవాడును సమానులేయని వేదవేత్తలకెల్ల శ్రేష్ఠుడైన బ్రహ్మచెప్పినాడు. సర్వతీర్థ సేవనము సర్వయజ్ఞాచరణము వలనకల్గు పుణ్యమొక్క మాంసభక్షణ చేయనందువలన కల్గును. దానవ్రతధర్మపరులైన మహానుభావులు సూర్య కుమారుడైన ధర్మప్రభువుయొక్క నగరమునకు సుఖముగనేగుదురు.
అట్లువచ్చిన ధర్మాత్ములకు యముడు స్వయముగా స్వాగతముపల్కి పాద్యార్ఘ్యాసనాద్యుపచారములుసేసి సత్కరించును. మీరు ధన్యులు మహానుభావులు మీ హితవేదియో తెలిసి పుణ్యముసేసినారు. ఇదిగో దివ్యస్త్రీ భోగ భాజనమైన ఈ విమానమెక్కి సర్వకామ సమృద్ధమైన స్వర్గమునకు వెళ్ళుడు. మహాభోగములను అక్కడ అనుభవించి దాన మీ పుణ్యము చెల్లిన తరువాత శేషించి ఏదైనను కొంచెము పాపమున్నయెడల దానినిక్కడ అనుభవింపుడు. పుణ్యఫలముగ సౌమ్యమైన మనస్సుతో తనకు తండ్రియైన యముని పితృదేవతారూపమున దర్శింతురు. కావున ధర్మము భుక్తిముక్తుల నిచ్చునది అవశ్యము సేవింపవలసినది. ధర్మమువలననే అర్థకామములు మోక్షముఁగూడ సిద్ధించును. ధర్మము తల్లి తండ్రి సోదరుడు. దిక్కు ధర్మము యజమానికి మిత్రుడు రక్షకుడు ధాత పోషకుడును. ధర్మము వలన అర్థము అర్థమువలన కామము కామమువలన సుఖభోగములు ధర్మము వలన సర్యోత్తమైశ్వర్యము ధర్మము వలన స్వర్గగతి పరమగతియు ధర్మము నాచరించిననది మహాభయమునుండి రక్షించును. దేవత్వము భూదేవత్వము దానివలననే. పూర్వపాపము నశించినపుడే జీవులకు ధర్మబుద్ధిగల్లును. వేలకొలది జన్మముల తరువాతగాని లభింపని మానుష్యమును బొందిగూడ ధర్మమునాచరింపనివాడు దైవవంచితుడు. ధర్మదూరులైనవారే నీచులు దరిద్రులు విరూపులు రోగులు నౌకరులు మూర్ఖులునైనగుదురు. దీర్ఘాయుష్మంతులు శూరులు పండితులు భోగులు ధనికులు నరోగులు సురూపులు నగువారు పూర్వము ధర్మముసేసినవారన్నమాట. ధర్మరతులుత్తము గతికేగుదురు.అధర్మరతులు పశుపక్ష్యాదియోనినందుదురు. నరక ధ్వంసియైన వాసుదేవుని సేవించు వ్రతముగలవారు కలలోగూడ కాలుని నరకములను జూడరు. ఆద్యంతములువేని దేవుని దైత్యదానవ నాశకుని పరమేశ్వరుని అచ్యుతుని త్రికరణశుద్ధిగ శరణొందినవారిని యముడేమియు చేయజాలడు. నారాయణుని నమస్కరించు వారు విష్ణుస్థానమును దప్ప మరియొక చోటునకు బోరు. వారికి యమదూతలు యముడు యమపురి నరకములు కానిపింపవు. పొరవడి పెక్కు పాపములు చేసిన వారుకూడ సర్వపాప హరుడగు హరిని నమస్కరించిరేని నరకమునకు బోరు. మోఢ్యముచేతనైనను జనార్దన స్మరణ చేసినవారు శరీరమును విడిచి విష్ణులోకమునకు పోదురు. పగచేనైన ఒక్క తఱి హరినామ ముచ్చరించిన చాలును శిశుపాలుడట్లు ముక్తినొందెను.
ఇది బ్రహ్మపురాణమున ధార్మికనుగతి నిరూపణమను నూటపదవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹