Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదకొండవ భాగము

సంసారచక్ర నిరూపణం

లోమహర్షుండనియె.

మునివరులు యమమార్గము నరకయాతనలను గురించి విని తిరిగి వ్యాసుని ఈ క్రింది సందేహమడిగిరి. భగవంతుడా! సర్వ ధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారద! మానవునకు సహాయులు తండ్రియా తాతయా కొడుకా గురువా! జ్ఞాతులు బంధువర్గమా. మిత్రవర్గమా జనులు చనిపోయిన వాని శరీరము కట్టెను రాతినట్లు విసరి పారవేయుదురు గాని వాని వెంబడిని బోవువాడెవ్వడు? అన వ్యాసదేవులు నరుడొక్కడే పుట్టును ఒక్కడుగానే గిట్టును. ఒక్కడే దుర్గతిని దాటును. ఒక్కతే దుర్గతినందును. జీవుడు నిస్సహాయుడు. చచ్చిన శరీరమును నీవన్నట్లు పారవేసి బంధువులు కొలదిసేపేడ్చి వెనుదిరిగిపోవుదురు. వారు పారవేసిన ఆ జీవుని ధర్మ మొక్కటే వెంబడించును. అందుచే ధర్మమన్ని అవస్థలందు అన్ని లోకములందు సహాయమగును. కావున నరులు దానిని సేవింపవలయును. లోభ మోహములవలన జాలివలన భయమువలన బహుశ్రుతుడు (పండితుడు) కూడా ఇతరులకొరకు లోభవశుడై తప్పిదములు చేయును. బ్రతుకునకు ఫలము ధర్మము అర్థము కామము అనుమూడు పురుషార్థములు. ధర్మము తప్పకుండ నీ మూడు ఫలములను బొంది తీరవలెను. అన విని మునులిట్లనిరి. వ్యాసదేవా! నీవలన పరమహితమైనది ధర్మయుక్తమునైన వాక్యము విన్నాము. శరీరసిచయము = శరీరనాశస్థితి నెఱుంగ గోరెదము. మానవుల మృతశరీరము సూక్ష్మమై అవ్యక్తస్థితినంది కనబడనిదైనప్పుడు దానిని ధర్మమెట్లు వెంబడించును? అన వ్యాసు లిట్లనిరి. భూమి వాయువు ఆకాశము నీరు జ్యోతి (తేజస్సు) అంతరంగము (మనస్సు) బుద్ధీ అనునవి ఏకీభావమొంది ధర్మమును జూచును. అన్ని జీవులకు వారు వారు చేయు పనులన్నిటికిని రేయింబవళ్ళు సాక్షులయి యుండును. వీనితో పాటు ధర్మము జీవునివెంట నేగును. చర్మము ఎముకలు మాంసము శుక్రము రక్తము ననునిది ప్రాణముపోయిన వెంటనే శరీరమును విడిచిపెట్టును. అందువలన ధర్మవరుడొక్కడే ఇహమందు పరమందును సుఖపడువాడు. ఇంకేమి తెలుపుదునన మునులిట్లనిరి.

ధర్మమెట్లు వెంటబడునో తాము కనులగట్టినట్లు తెలిపినారు. ఇక రేతస్సు ఎట్లు ప్రవర్తించునో ఇదియు పిండోత్పత్తి క్రమమును తెలుపుమని ప్రార్థింప వ్యాసుడిట్లనియె. ఓ విప్రశ్రేష్ఠులార ! శరీరమందున్న దేవతలు (ఆ యా యింద్రియాధిష్ఠాన దేవతలు) అన్నము నారగింతురు. వారు పృథివ్యప్తేజోవాయ్వాకాశములను పంచభూతములు మనస్సు స్వరూపమున నుందురు. ఆరూపమున పంచభూతములు మనస్సు తృప్తిపడగానే పరిశుద్ధమైన రేతస్సు రూపొందును. దానివలన స్త్రీపురుషసంయోగమున గర్భమేర్పడును. ఇదంతయు మీ కెఱింగించితిన నేమి వినవలతురన మునులిట్లనిరి.

ఎముకలు చర్మము మాంసమును విడిచి ఆజీవాత్మ ఎక్కడనిలచి సుఖదుఃఖములను అనుభవించును. అని ఋషులడుగగా వ్యాసు లిట్లనిరి. అది పురుషుడై పుట్టి ప్రవర్తించు రీతి తెలుపుమన వ్యాసులు పురుషుడు (జీవుడు) పంచభూత సమావేశమంది వానికి లోబడియుండును. వానితో విడివడి తిరిగి మఱొకగతి కేగును. భూతసంబంధము పొంది ప్రాణధారణము చేయును. అప్పుడు జీవరూపమున నున్న వీడు చేయు పుణ్యపాపములను పంచభూతములందు అంతర్యామి రూపముననున్న దేవతలు గాంచుచుందురు. మఱి ఏమి విననెంతురు? అన మునులిట్లనిరి. చర్మాస్థి మాంసములను విడిచి ఆ భూతములన్నింటిని విడిచి జీవుడు తనకుదానై సుఖ దుఃఖములను అనుభవించునుగద? అన వ్యాసుడు, జీవుడు కర్మసంబంధము నంది రేతస్సును బొంది స్త్రీయొక్క పుష్పమును (ఆర్తవమును)బొంది జనించును. అవ్వల యమభటులవలన బాధలను చావును దుఃఖములను సంసారచక్ర పరిభ్రమణమును బొంది నానాక్లేశములకు వశుడగును. ఇహలోకమున నా ప్రాణి పుట్టినది మొదలు మున్ను దాజేసిన పుణ్యము ధర్మముయొక్క ఫలము నాశ్రయించి సుఖమనుభవించును. పుట్టినదాదిగ ధర్మమునే సేవించిన యెడల పురుషుడై నిత్యమును సుఖించును. అనంతరము తాజేసిన అధర్మఫలము ననుభవించును. సుఖము తర్వాత దుఃఖముం బొందును. అధర్మయుక్తుడు యమలోకమేగి మహాదుఃఖమొంది పశువక్ష్యాదులందు పుట్టును. ఏ యే కర్మమిక్కడ జేసి యేయే యోనియందు మోహవశుడై పుట్టునో యిపుడు విరముగ వినుండు.

ఈ విషయము శాస్త్రములు ఇతిహాసాదులు వేదమునందును తెలుపబడినది. మర్త్యలోకము ఘోరయమలోకమునకు విషయమై యున్నది. ఈలోకమందు దేవతుల్యములు పుణ్యములగు స్థానములున్నవి. అవి పశుపక్ష్యాది జీవభావమునకు భిన్నములు. బ్రహ్మలోకమువంటి దివ్యమైన యమమందిరమందు జీవుడు కర్మబద్ధుడై దుఃఖము లనుభవించును. ఏయే స్వరూపమున ఏయేకర్మ ఫలమును పురుషుడందునో అయా ఘోరగతులను తెలిపెదను. నాలుగు వేదములు చదివి ద్విజుడు మోహమునొంది పతితునివలన (కులభ్రష్ఠుని వలన) పరిగ్రహముసేసి (దానము పట్టి) గాడిదయై పుట్టును. గాడిద పదునైదేండ్లు బ్రతుకును. గాడిదయైచచ్చి ఏడేండ్లు ఎద్దగును. ఎద్దుచచ్చి బ్రహ్మరాక్షసి అగును. అందుమూడేండ్లుండి బ్రాహ్మణుడగును. కులభ్రష్ఠునిచేత యజ్ఞము చేయించినవాడు కృమి (పురుగు)గాపుట్టును. అందు పదునైదేండ్లుండి గాడిదయై ఐదేండ్లు నక్కగా ఐదేండ్లు కుక్కగా ఒక ఏడునుండి అటుపై మానవుడగును.

ఉపాధ్యాయునెడ బుద్ధిపూర్వముగా పాపము చేసిన శిష్యుడు మూడు జన్మములిహలోకమున సంసారమందు గుములును. అవ్వల కుక్కగును. అటుపై పచ్చి మాంసముతిను జంతువై గాడిదయైచచ్చి నరకమనుభవించి అవ్వల బ్రాహ్మణ జన్మమెత్తును. ఏ శిష్యుడు గురుపత్నిని మనసుచేతనైన బొందునో వాడధర్మచిత్త సంస్కారముచే భయంకర సంసార దుఃఖితుడగును. కుక్కగా మూడేండ్లు జీవించిచచ్చి బ్రాహ్మణజన్మమెత్తును. గురువు బుద్ధిపూర్వకముగ పుత్రుడట్లున్న శిష్యుని హననమొనర్చినచో ఘాతుక మృగమగును. ఏకొడుకు తల్లిని తండ్రిని అవమానించునో వాడు తొలుత గాడిద యగును. పదేండ్లట్లుండి ఒకయేడు కుంభీర మగును. ముదుసలి తలిదండ్రులిద్దరు ఎవ్వనికి దుష్టులుగా దోచుదురో దారుణమైన ఆ అపధ్యానమువలన (పొరపాటు తలంపు వలన) వాడు గార్దభమగును. ఆ విధముగ రెండేడ్లుండి వాడు పిల్లియై ఏడు నెలలుండును. తల్లిదండ్రులను గోలపెట్టినవాడు కోకిలయగును. వారిని కొట్టినవాడు మూడేండ్లు శాత్వకమగును (డేగ). అటుపై ఆఱుమాసములు వ్యాళమై (పామై) ఆ మీద మానవునిగా పుట్టును. యజమాని అన్నము కాజేసినవాడు రాజద్వేషుల అన్నము తిన్నవాడు కోతియగును. పదెండ్లు అట్లుండి ఏడేండ్లెలుక యగును. ఆఱు మాసములు కుక్కయై అవ్వల మానవుడగును. అసూయాగ్రస్తుడు శార్జకమగును. విశ్వాస ఘాతకుడు చేప యగును. ఎనిమిదేండ్లట్లుండి నాల్గునెలలు మృగ మగును. అవ్వల మేక యగును. ఒక్కయేడాదికి చచ్చి కీటకమయి యా మీద మానుష జన్మమందును. ధాన్యములు యవలు దొంగిలించిన వాడెలుక యగును. అటుపై చచ్చి పందియై రోగముచే చచ్చును. అవ్వల మూగ కుక్కయై ఐదేడ్లుండి మానవుడగును. పరదారగమనము చేసినవాడు తోడేలగును. కుక్క నక్క గ్రద్ద పాము కంకమురాబందు కొంగయు నగును. ఏపాపి సోదరుని భార్యను బలాత్కరించి మగకోకిలయై యొక్కడే ఉండును. స్నేహితునియొక్క గురువుయొక్క రాజుయొక్క భార్యను కామించిన వాడు పంది యగును. అయిదేండ్లట్లుండి పదేండ్లు కొంగయై మూడునెలలు చీమయై ఒకనెల కీటమై క్రిమియై పదునాల్గు నెలలుండి అవ్వల మనుజుడగును. తొలుత కన్యనిత్తునని వాగ్దానము చేసి మఱొక్కనికిచ్చిన వాడు క్రిమి యగును. పదమూడేండ్లట్లు బ్రతికి పాపము క్షయించి మనజుడగును. దేవ పితృకార్యములు చేయక వారికి తర్పణము చేయకున్న వాడు కాకియై నూరేండ్లు మీదట కోడియగును. ఆమీద ఒకనెల పామై నరజన్మమందును. తండ్రితో సముడైన పెద్ద అన్నను తమ్ముని ఎవ్వడవమానించునో వాడు బెగ్గురు పక్షిగ పదేండ్లుండి జీవకమగును. (చకోరపక్షి) అవ్వల నరుడగును. వృషలుడు (శూద్రుడు) బ్రాహ్మణస్త్రీని సంగమించి కృమియై పందియై రోగముచే జచ్చును. అటుపై కుక్కయై తుదకు నరుడగును. అపుడు సంతానముంగని చచ్చి ఎలుకయగును. కృతఘ్నుడు (చేసినమేలు మరచినవాడు) యమలోకమేగి యమభటుల క్రౌర్యమునకు కుమిలి కుమిలి వారి దండాఘాతములకు ముద్గర శూరాగ్ని దండముల దెబ్బలకు గురియై ఘోరమైన అసిపత్రవనమునందు (కత్తులబోనున) కూటశాల్మలియను మిడమిడగాలునిసుక మేటలందు నడిపింపబడి ఘోరయాతనలనుభవించి సంసారచక్ర పరిభ్రమణమంది క్రిమియగును. పదిహేను ఏండ్లట్లుండి అక్కడ కడుపువచ్చి అటనే చచ్చును. అవ్వలననేక గర్భములనంది తుదకు పశుపక్షి జన్మమందు పెక్కేండ్లట్లుండి తాబేలగును. పెరుగు దొంగిలించి కొంగ యగును. పచ్చిచేపలను హరించినవాడు తేనెటీగయగును. పండుమూలకము (ముల్లంగి) అప్పము దొంగిలి చీమ యగును.

పాయసముదొంగ తిత్తిరి (తీతువు) పక్షియగును. పిండితో జేసిన అప్పచ్చి నపహరించి గ్రుడ్లగూబ యగును. మంచినీళ్లు హరించి కాకియగును. కంచుదొంగిలించి హారితము (పచ్చపిట్ట) యగును. వెండిగిన్నె కాజేసిన పావురమగును. బంగారు బిందెను హరించి క్రిమియగును. పట్టుబట్ట దొంగిలి కురరము (టిట్టిభము-తీతువుపక్షి) యగును. పట్టు పురుగులను హరించినవాడు నర్తకుడు (నటకుడు) అగును. వస్త్రసామాన్యమును హరించినవాడు చిలక యగును. నార పట్టు బట్ట హరించి హంసజన్మ మెత్తును. నూలుబట్ట హరించి తీతువు పక్షియగును. పట్టునూరు ఆవికము గొఱ్ఱ ఉన్నితో నేసినబట్ట నారచీరను (తెల్లపట్టుబట్ట) దొంగిలించి కుందేలు (చెవులపిల్లి) యై పుట్టును. ఎఱ్ఱవస్త్రముల హరించి చకోరపక్షియగును.

చందనాది సుగంధవస్తువుల హరించినవాడు చుంచుగా బుట్టును. ఆజన్మములో పదియేనేండ్లుండి యాపాపము క్షమింపజేసికొని మానవుడై జనించును. పాలు దొంగిలించినవాడు బలాక పక్షి (పెద్దకొక్కెర) యైపుట్టును. నూనె (నువ్వులనూనె) హరించిన గబ్బిలము (తైలముంద్రావు) జంతువగును. అర్థము కొఱకు (డబ్బుకొఱకు) చేతిలోనాయుధములేనివాని సాయుధుడై కొట్టినవాని (చంపినవాడు) గాడిద యగును. ఆజన్మలో రెండేండ్లు బ్రతికి చివరకు ఆయుధముచే నరక బడును. అట్లుచచ్చి వాడు మృగముగా పుట్టి నిరంతరాందోళనముతో నుండును. ఒక్క యేడాదితర్వాత వాడాయుదముదెబ్బతిని కూలును. ఆమీద వాడే వలలోదగుల్కొన్న చేపయై నాల్గవనెలలో అడవి జంతువగును. పదేండ్లంట్లుండి పులిజన్మమెత్తి ఐదేడ్లుండి మరణించి అధర్మక్షయమై మనజుడగును.

వాద్యమును హరించినవాడు గొఱ్ఱెయగును. పిండితోకూడిన అన్నమును దొంగిలించినవాడు బభ్రుసటుపుఅను (ముంగిపింగళవర్ణముగల వేంట్రెకలు గలది) దారుణమైన మూషికముగా బుట్టును. అట్టిమనుజులను నిత్యము గఱచుచుండును. నేతిని హరించినవాడు నీరుకాకియగును. చేప మాంసము దొంగిలి కాకియగును. ఉప్పు దొంగిరి చిరి కాకమగును. చెముడుకాకి బొంతకాకి మొదలగు వానిలో రకము. తనపై విశ్వాసము (నమ్మకము) గల్గియున్నవాని మోసగించినవాడు చేపయైపుట్టి మనుజుడగును. అప్పుడాయుర్దాయు తక్కువయుండును. నరుడు పాపములుసేసి పశుపక్ష్యాది జన్మములందును తన తాహతెతో ధర్మమేదో వాడెరుంగలేడు. అట్టివారు వ్రతదూరులై వ్యాదిగ్రస్తులై దుఃఖితులగుచుందురు. ఒడలిపై బట్టకూడ లేకుండ మ్లెచ్ఛులై పాపులై లోభమోహాదివశులై పుట్టుదురు. (మ్లెచ్ఛుడు అనార్యుడు గోమాంసభక్షకుడు అపశబ్దములు భాషించువాడు శిష్టాచార రహితమగు కామరూపాది దేశములనుండువాడు) అట్టిననాటి నుండి యెవ్వరు పాపములను విడిచెదరో వారారోగ్యవంతులు. ఐశ్వర్యవంతులు రూపవంతులు నగుదురు. ఈ చెప్పిన కల్పము ప్రకారము స్త్రీలుకూడ ఆయా పాపఫలములందుదురు. అట్టి పాపాత్ములకే భార్యలగుదురు. ఇంతవరకు విశేషించి ఆయా వస్తువుల దొంగతనము వలన దోషములు తెలుపబడినవి. ఇది లేశమాత్రముగ మీకెఱింగించితిని. వాటియొక కథా సందర్భమందు ఓద్విజులారా! ఇంకను విశేషముగ విందురుగాక! నేనిది బ్రహ్మ దేవర్షులకు దెలుపు తఱివిన్నది. విన్నట్లు మీకు దెలిపితిని. ఇది విని మునివరులార! మీరు మనస్సును ధర్మమునందు నిలుపుడు.

ఇది బ్రహ్మపురాణమున సంసారచక్రనిరూపణము అను నూట పదకొండడవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment