అన్నదానప్రశంస
మునులిట్లనిరి:-
నీవు అధర్మమువలన కలుగు గతులనుగూర్చి తెల్పితివి. ధర్మగతులంగూర్చి వినగోరెదము. ఏ పనిచేసి అశుభగతినిపొందు దేనిచే శుభగతినందునో ఆనతిమ్మన వ్యాసుడిట్లనియె. పాపపుపనుల ధర్మపరుడై విపరీత మనస్సుతో చేసినవాడు నరకమందును పొరబడి అధర్మము చేసి పశ్చాత్తాపబడి మనస్సును కుదుట బెట్టుకొన్నవాడు పాపముననుభవింపడు. ఎంతెంతవరకు వాని మనస్సు దుష్కర్మమును గర్హించునో అంతంతవరకు వాని ఉపాధి (శరీరము) అధర్మమునుండి నిడివడును. చేసిన తప్పును ధర్మవాదులగు విప్రులకు తెల్పినయెడల అధర్మమువలన చేసిన అపరాధమునుండి వేగముగా ముక్తుడగును. మానవుడు తానుజేసిన తప్పిదమును మనసు సమాధాన పరచుకొని నలుగురిలో వెల్లడించు కొన్నకొలది అతుడు దానినుండి విడివడును. పాము కుబునమును విడిచినట్లు పూర్వమనుభవించిన పాప ఫలములనుండి విమోచనమందును. మనస్సమాధితో విప్రునికివివిధ దానములు చేసినయతడు సుగతినందును. మానవుడు పాపమాచరించియు తత్పల మనుభవింపకుండుటకు చేయవలసిన దానములను తెల్పెద వినుండు.
అన్నిదానములకంటే అన్నదానము మిన్న . ధర్మాపేక్ష కలవాడు వక్రముగాని బుద్దితో సర్వాన్నదానము చేయనగును. మునుజులకు ప్రాణమున్నముగదా! అన్నమువలననే జీవుడు పుట్టును. లోకము అన్నమునందు ప్రతిష్టితములయి ఉన్నవి. (బ్రతుకంతయు అన్నముమీద ఆధారపడి ఉన్నదన్నమాట!) అందువలన అన్నము ప్రశంసార్హమగును. దేవర్షి పితృ మానవులన్నమునే మెచ్చుకొందురు. అన్నదానముచే స్వర్గమందును. ఎంతలభించు నంతయున్నము ద్విజులకు పెట్టవలెను. నిండు మనసుతో వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులకు అన్నదానము నీయవలెను. ఒక్కమారైన పది మంది బ్రాహ్మణులు ఎవ్వడు పెట్టిన అన్నమారగింతురో మనస్పూర్తిగా పెట్టినవాడు పశుపక్ష్యాది జన్మములెత్తడు. పదివేలమంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణము గావించినాతడు మున్ను పాపరహితుడై చేసిన అధర్మమునుండి విముక్తి నందును. వేదముల చసదివి భిక్షాటనము చేసికొని తెచ్చిన అన్నమును వేదవేత్తయగు విప్రునికి పెట్టిన వాడిహ లోకమున సుఖాభివృద్ధినందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హానిసేయక న్యాయ బరిపాలన సేయుచు సుసమాహితమనస్కుడై వేదవిదులయిన ద్విజులకు బలాత్కారముగ లభించిన అన్నమును దానము చేసిన ఎడల నీతడు ధర్మాత్ముడై పానముచే జేసిన దుష్కర్మనెడబావుకొనును. కృషి(వ్యవసాయము)సేసి వైశ్యుడార్జించుకొన్న ద్రవ్యము ఆరవవంతుగ పరిశుద్దమైన దానిని ద్విజులకు దానముసేసి పాపవిముక్తుడగును. శూద్రులు ద్విజాతులకు అన్నదానము చేసి పాపవిముక్తుడగును. ప్రాణములిక పోవునన్న సమయమున శూద్రుడు కర్కశుడై (కఠినుడై) సంపాదించిన అన్నమును కన్న కొడుకుచే గూడబెట్టించి అన్నము విప్రులకు బెట్టినవాడు దుర్గమును (కడువరాని కష్టముల) దాటును. న్యాయార్జితమైన అన్నమును ఆనందముతో వేదవృద్దులయిన విప్రులకు విందు చేసినవాడు పాపముంబాయును. అన్నము లోకమందు ఊర్జస్కరము. కావున దానిని పెట్టినవాడు ఊర్జస్వియగును. సత్పురుషులేగిన దారిగేగినవాడు సర్వ పాప విముక్తుడగును. దానధర్మమెఱింగిన వారేర్పరచిన దారిం బుద్ధిమంతులేగుదురు. అందులోగూడ అన్నదాతలుత్తములు. వారివలననే సనాతన ధర్మము నిలుచును.
అందువలన అన్నదానము న్యాయము తప్పకుండ చేయవలసినది. ఏ గృహస్థు ముందు ప్రాణాహుతులు చేసి అన్నమారగించునో ఎవ్వడు అన్నదానముచే రోజును (అవంభ్యమును=గొడ్డువూనిదానిగ) సార్థకమైనదానిం గావించునో నిత్యము వేదవిదులను ధర్మవేత్తలను ఇతిమాసపురాణ విదులను నూరుమందిని విందారగింపజేయునో అతడు ఘోరనరకముల పాలుగాడు. సంసారమునంబడడు. చనిపోయిన నతడు సర్వకామ్య సాఫల్యమంది సుఖమందును. ఇట్లు సత్కర్మ నమన్వితుడై ఏ బాధలులేకుండా ఆనందపడును. చక్కనివాడు కీర్తిశాలి ధనవంతుడునై మరుజన్మమందును. మీకిట్లన్న దాన మహాఫలమంతయు చెలిపితిని. సర్వధర్మములకు దానములకును మూలమిదియే.
ఇది బ్రహ్మపురాణము నందు అన్నదాన ప్రశంసమను నూట పన్నెండవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹