గరుడ పురాణ వక్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన.
గరుడునికి పురాణసంహిత వరదానం.
శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని వుందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమపౌరాణికుడైన సూతమహర్షి ఇలా ప్రవచించసాగాడు.
“బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో వుండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండి పోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను.
”గురుదేవా! మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులనీ నాకు బోధించండి. మీరింతసేపూ ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారనీ కూడ నాకు అవగతమైనది. అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో ”నాయనలారా” నాకు ధ్యానంలో గోచరించేది శ్రీమహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడమహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఒకమారు నారదుడు, దక్షప్రజాపతి, భృగుమహర్షి, నేనూ సత్యలోకానికి వెళ్ళాము ఆదిబ్రాహ్మణుడు, గురువులకే గురువు, సృష్టికర్తయైన ఆ దేవదేవునికి ప్రణామం చేసి హే దేవ దేవేశ! సర్వ వేదసారము, సర్వజ్ఞాన పారమూ మీరే! మాకు సారతత్త్వాన్ని అనుగ్రహించండి” అని ప్రార్థించాం.
సర్వశాస్త్రసారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకూ, శివునికీ, అన్యదేవతలకూ దీనిని వినిపించాడు, అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు.
ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెఱచి మమ్ము చూడగానే ప్రణామం చేసి ”హే సదాశివా! మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీ కంటె గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింత వరకూ ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే, మమ్ము కరుణించి ఆ పరమసారతత్త్వాన్ని మాకూ అనుగ్రహించండి” అని అడిగాను.
బ్రహ్మాది దేవతలారా! నేను సర్వఫలదాయకుడూ, సర్వవ్యాపీ, సర్వరూపుడూ, సర్వ ప్రాణి హృదయవాసీ, పరమాత్మా, సర్వేశ్వరుడునగు విష్ణుభగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవా!ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్నీ, జటా జూటాన్నీ ధరించి నిరంతర ప్రతాచరణ నిరతుడనైవుంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడూ, అద్వైతుడూ, జయశీలుడూ, నిరాకారుడూ, సాకారుడూ, పద్మనాభుడూ, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడూ అయి వుండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూన్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్త్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి” అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు.
సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయ కాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడాయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనై వుంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గ్రుచ్చబడిన మణులలాగ మనమంతా సత్వ, రజ, స్తమో గుణములతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాధికభుజుడు, సూక్ష్మము కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమ సత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్తుతింపబడు పురాణపురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయ కాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డవాడునగు ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసిస్తున్నాను.
సత్ అసత్ రూపాలకు ఆవల, సత్య స్వరూపుడై, ఏకాక్షర ప్రణవానికి మూలమై దేవ, యక్ష, రాక్షస, నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేనూ అర్చిస్తాను.
కొలనులో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్య చంద్రులూ గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మర్త్యలోకం, పాతాళం, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, అంగ సంధులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలచి వుంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆదియైన అనాది తత్త్వమాయనది. అట్టి నారాయణునికి నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలు ప్రవర్తితాలయినవో ఆ పరమాత్మ వద్దకేపోయి పరమ సారతత్త్వజ్ఞానమును పొందవలసివున్నది” అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు.
వ్యాసమునీంద్రా! ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకొని అక్కడనున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామంచేసి స్తుతులొనర్చాం. పరమసారతత్త్వ స్వరూపుడగు విష్ణువు ద్వారానే ఆ పరమతత్త్వముయొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచివుండగా పరమేశ్వరుడు మా అందరి తరఫునా మహా విష్ణువునిలా ప్రార్థించాడు.
హే దేవేశ్వరా! హరే! దేవాధిదేవుడెవరో పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్త్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపఱచగలమో, ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏయే ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం.
ఆయన స్వరూపమెట్టిది, ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది, దీనిని పాలించేదెవరు, ఆయన ఏయే అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు, ప్రళయ కాలంలో ఈ విశ్వం ఎవరిలో కలసిపోతుంది, సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తిత మవుతాయి. ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై వుంది, ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్త్వం. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని, వీరంతా ఆ తత్త్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మాహాత్మ్యాన్ని ధ్యానయోగాన్నీ కూడా విని తరించాలని వుంది. దయచేసి మమ్ము కృతార్థులను చేయండి.
అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మాహాత్మ్యాన్నీ, ఆయన ప్రాప్తికి సాధన భూతమైన ధ్యానాన్నీ, యోగాదిక నియమాలనూ, అష్టాదశ విద్యలలో విరాజమాన మైన జ్ఞానాన్నీ ఈ విధంగా ప్రసాదించాడు.
రుద్రదేవా, బ్రహ్మాది దేవతలారా! నేనే అందరు దేవతలకు ఆరాధ్యదైవాన్ని. సర్వలోకాలకీ స్వామినీ నేనే. దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్నీ, స్తుతియోగ్యుడనూ నేనే. రుద్రదేవా! మనుష్యులచేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేదీ, వ్రత నియమ, సదాచార, సదాచరణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేదీ నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్ట నాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్నీ పాలిస్తుంటాను. మంత్రాన్నీ నేనే, దాని అర్థాన్నీ నేనే. పూజవల్ల, ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే ఆ స్వర్గాదులూ నేనే. యోగినీ యోగాన్నీ ఆద్యయోగాన్నీ పురాణాన్నీ నేనే. జ్ఞాతను, శ్రోతనూ, మనన కర్తనూ కూడా నేనే. సంభాషింపబడు విషయాన్నీ, సంభాషించే వ్యక్తిని నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలూ నా స్వరూపాలే. భోగ, మోక్షప్రదాయకమైన పరమ దైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా! నేనే వేదాన్ని. ఇతిహాసస్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మ స్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్నీ, ధర్మాన్నీ, వైష్ణవాన్నీ, వర్ణాశ్రమాన్ని వాటి వెనుక నున్న సనాతన ధర్మాన్నీ నేనే. యమ నియమాలూ, వ్రతాలూ, సూర్య చంద్ర మంగళాది గ్రహాలూ నేనే.
ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్పతపస్సు ద్వారా నన్నారాధించాడు. అతని తపస్సువల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి ”నీకేం కావాలో కోరుకో” అన్నాను.
దేవదేవా! నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వగ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే వుంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికీ మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన” అని వరంకోరుకున్నాడు గరుత్మంతుడు.
అప్పుడు “నేను ఇలా ఆశీర్వదించాను. ” ఓ పక్షిరాజా! నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతల నందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత శక్తిసంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలనూ విరిచి వేసే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహితరూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మాహాత్మ్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే ”గరుడ పురాణ” మను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది.
ఓయి వినతాసుతా! దేవగణాలలో ఐశ్వర్యానికీ శ్రీరూపానికీ నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ యీ గరుడపురాణాని కుంటుంది. విశ్వంలో నా సంకీర్తనజరిగే ప్రతి చోటా నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రయాణాన్ని గావించు”
ఇంతవరకూ చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. ”పరమశివా! నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడీ పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడి విద్యా బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించ గలిగాడు. గరుడుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితులను చేశాడు.
యక్షి ఓం ఉం స్వాహా అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవా! నా స్వరూపంచే పరిపూర్ణమైన, గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరూ వినండి.
రెండవ అధ్యాయం సంపూర్ణం.
”నేను” అనగా విష్ణువు
”యక్షి ఓం ఉం స్వాహా’ గానే దీన్ని పఠించాలి. అంటే ఓ తరువాత గల ‘సున్న’ని సగమే పలకాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹