గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు
శౌనక మునీంద్రా! సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మ దేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు శ్రీ వినిపిస్తున్నాను.
ఇందులోని వివిధ అంశాలేవనగా సర్గ వర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణ ధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరితము, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్ధము, ఉత్తమజ్ఞానం, ముఖ్యంగా విష్ణుభగవానుని మాయామయ, సహజలీలల విస్తార వర్ణనం.
వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడమహాపురాణోపదేష్టగా అత్యంత సామర్ధ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి, స్థితి, ప్రళయకార్యాలలో కూడా పాలుపంచుకొంటున్నాడు. దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి యిచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు.
విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలూ ఉంటాయి. అయినా ఆయనకు ఆకలివేస్తే గరుడుడే దానిని తీర్చాలి. హరి శివాదులకూ, హరిరూపుడైన గరుడుడు కశ్యపమహర్షీకీ చెప్పిన ఈ పవిత్రపురాణం తనను ఆదరంగా చదివే వారికి అన్నిటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను.
మూడవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹