చంద్రగ్రహ జననం ఐదవ భాగము
శీలవతి ( సతీ సుమతి ) కథ
మహా పతివ్రత అయిన శీలవతి వాక్కు ఫలించింది. ఘడియలూ , గంటలూ , రోజులూ గడిచిపోతున్నాయి. సూర్యోదయం కానేలేదు. లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి. నిత్య నైమిత్తిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాణుల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. విశ్వచలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నిశాచరులైన రాక్షసులు ఆనందంగా ఉన్నారు గానీ , దేవతలు భీతిల్లిపోయారు. ఇంక మానవులకు జీవితం దుర్భరంగా మారింది. ఎందుకు సూర్యుడు ఉదయించలేదో తెలియని ఇంద్రుడు వ్యాకులపాటులో మునిగిపోయాడు.
నారదుడు ఇంద్రుడ్ని కలుసుకున్నాడు. సూర్యోదయం కానందుకు కారణమైన శీలవతి శాపం గురించి వివరించాడు. శాపం ఉపసంహరించమని శీలవతిని ఆదేశిస్తానన్నాడు. ఇంద్రుడు.
“శీలవతి మహాపతివ్రత , ఆమెకు భర్తే సర్వస్వం. కుష్ఠురోగీ , వృద్ధుడూ , దుర్మార్గుడూ అయిన భర్తను ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తోంది ! ఎలాంటి వాడైనా సరే భర్తను ఆమె త్యాగం చేయదు !” అన్నాడు శీలవతిని గురించి బాగా తెలిసిన నారదుడు.
“గత్యంతరం ఏమిటి నారదా ?” ఇంద్రుడు అడిగాడు.
“ఏముందీ ! బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరుడూ ఉన్నారు గదా ? వారిని ఆశ్రయించాల్సిందే !” నారదుడు సూచించాడు.
ఇంద్రుడు నారదుడితో కలిసి బ్రహ్మను సందర్శించి , సమస్య వివరించాడు. పరమేశ్వరుణ్ని వెంటబెట్టుకుని , శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్తామన్నాడు బ్రహ్మ.
పరమేష్ఠీ , పరమేశ్వరులూ , ఇంద్రుడూ , నారదుడూ శ్రీమహావిష్ణువు సన్నిధికి చేరుకున్నారు. విషయం వివరించారు.
శ్రీమహావిష్ణువు సాలోచనగా పంకించాడు. “మహేంద్రా ! శీలవతి పరమసాధ్వి! ఆమె శాపాన్ని నిర్వీర్యం చేసే శక్తి మాకెవ్వరికీ లేదు ! మాండవ్యుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే , శీలవతి కూడా తన శాపాన్ని ఉపసంహరిస్తుంది ! అయితే , మాండవ్యుడికి ప్రస్తుతం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు.”
“మరి తరుణోపాయం , దేవా !” ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.
“శీలవతి నివాస ప్రాంతానికి సమీపంలోనే మరొక మహాపతివ్రత ఉంది. ఆ సాధ్వి పేరు అనసూయ. మన బ్రహ్మ మానసపుత్రుడైన ”అత్రి” ధర్మపత్ని ఆమె. అనసూయను కలుసుకో ! లోక క్షేమం కోసం శీలవతి శాపాన్ని ఉపసంహరించేలా చేయమని అభ్యర్ధించు ! వెళ్ళి… రా ! విజయోస్తు” అన్నాడు విష్ణువు.
“మహేంద్రా ! శీలవతిని అంగీకరింపజేసే బాధ్యత తనదే అని అనసూయకు మా మాటగా చెప్పు !” పరమేశ్వరుడు హెచ్చరించాడు.
“ఔను ! మహేంద్రా ! మా మాట కూడా అదే సుమా !” బ్రహ్మ కల్పించుకుని అన్నాడు. ,”త్రిమూర్తులు ఆదేశమని చెప్పు !”
ఇంద్రుడు త్రిమూర్తులకు నమస్కరించి కదిలాడు. నారదుడు ఆయనను అనుసరించాడు.
ఇంద్రుడికీ , నారదుడికీ అనసూయ అత్రి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. సూర్యుడు కనిపించని కారణంగా భూలోకంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని అత్రి , అనసూయలకు వివరించారు. ఆ సరికొత్త అవాంతరానికి కారణం శీలవతి శాపం అని తెలిసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
“సాధ్వి శీలవతి చేత ఆమె శాపాన్ని ఉపసంహరించే బాధ్యత మీరు స్వీకరించాలి. వదినా !” నారదుడు వరుస కలుపుతూ అన్నాడు.
“ఈ అభ్యర్థన మాది కాదు జననీ , త్రిమూర్తులది. వారు ముగ్గురూ మీకు ప్రత్యేకంగా ఆదేశం పంపించారు నా ద్వారా !” ఇంద్రుడు వివరించాడు..
“అనసూయా ! శీలవతిని కలిసి ప్రయత్నిస్తావా ?” అత్రి ప్రశ్నించాడు. “శాపం వెనక్కి తీసుకుంటే లోకానికి ఆమె ద్వారా ఎనలేని మేలు జరుగుతుందని వివరించు. నచ్చజెప్పు. ఎంత త్వరితంగా సూర్యుడు ఉదయిస్తే అంత మంచిది !”
“సూర్యుడు ఉదయిస్తే – శీలవతి భర్త అస్తమిస్తాడు కదా స్వామీ ! ఏ భార్యా భర్త మరణాన్ని కోరి తెచ్చుకోదు !”
“అయితే మాతా , శీలవతికి నచ్చజెప్పలేరా ?” ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.
“మీరు ఆ మహత్కార్యం చేయగలరని త్రిమూర్తులు గాఢంగా విశ్వసిస్తున్నారే !”
“శీలవతికి నచ్చజెప్పుతాను… అయితే దానికో నిబంధన ఉంది…” అనసూయ సాలోచనగా అంది.
“నిబంధనా ? ఏమిటది ? చెప్పండి !” ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు.
“నా సహాయం కోరుతూ , మీ ద్వారా ఆదేశం పంపించిన ఆ దేవదేవులు త్రిమూర్తులు ముగ్గురూ స్వయంగా నా ఆశ్రమానికి వచ్చి , నన్ను కోరాలి ! వారు స్వయంగా కోరితే ప్రయత్నిస్తాను !” అనసూయ అంది.
అనసూయ మాత ఆశ్రమంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసింది. అత్రి , ఇంద్రుడూ , నారదుడూ క్షణకాలం అనసూయ వైపు చూసి , అయోమయంగా పరస్పరం ఒకర్నొకరు చూసుకొన్నారు.
ముందుగా నారదుడు తేరుకున్నాడు. “నారాయణ ! అదెంత పని , వదినా ! మన మహేంద్రుడు సంకల్పిస్తే త్రిమూర్తులు క్షణంలో ఈ లోగిలిలో వాలుతారు !”
నారదుని సూచనను అర్థం చేసుకున్న ఇంద్రుడు ఆకాశం వైపు తల ఎత్తి చేతులు జోడించి , ధ్యానించడం ప్రారంభించాడు. అనసూయ లోపలి కక్ష్యలోకి వెళ్లింది. అత్రి ఆమెను ఆతృతగా వెంబడించాడు. “అనసూయా , ఏమిటిది ? దేవదేవులు స్వయంగా కోరాలనడమేమిటి ? త్రిమూర్తులను రప్పించి ఏం చేస్తావు ?” ఆత్రుతగా అడిగాడు అత్రి.
“వాళ్ళని ఆడిస్తాను !” అంది అనసూయ నవ్వుతూ. పూజా ద్రవ్యాలతో , పళ్లెంతో , జలకలశంతో అనసూయ ఇవతలకి నడిచింది. అత్రి ఆమె వెనకే నడిచాడు. అయోమయంగా చూస్తూ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹