Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదహారవ భాగము

వర్ణాశ్రమధర్మవర్ణనము.

మునులడుగ వర్ణ ఆశ్రమ ధర్మములను నాల్గాశ్రమ ధర్మములు వ్యాసభగవానుడు ఇట్లానతిచ్చెను.

బ్రాహ్మణునికి దానము దయ తపస్సు దేవ పిత్రదేవతా స్వాధ్యాయము ప్రధాన ధర్మములు. నిత్యోదకి(స్నానాదులతో చలికి వెఱువక) త్రిషవణస్నాననిరతుడు కావలెను. అగ్నులను ఉపాసింపవలెను. జీవనము కొఱకై ఇతరులచేత యజ్ఞములు చేయింప వచ్చును. శిష్యులకు వేదములు చెప్పవలెను. యజ్ఞనిమిత్తముగా తెలిసి (పాత్రాపాత్ర వివేకముతో) ప్రతిగ్రహము చేయవచ్చును. బ్రాహ్మణునికి చెప్పబడిన షట్కర్మలలో ప్రతిగ్రహము (దానము పట్టుట) కూడ విహితమైయున్నది. సర్వలోకమునకు హితమే చేయవలెను గాని అహితము చేయరాదు. సర్వభూతములతో మైత్రి బ్రాహ్మణునికి ఉత్తమధనము. ఋతుసమయమందే భార్యాభిగమనము దీనికి ప్రశంసాపాత్రము.

క్షత్రియుడు మనఃస్పూర్తిగ ద్విజులకు దానముల యజ్ఞములు వేదాధ్యయనము చేయనగును. జగద్రక్షణకై అస్త్రము పట్టి జీవించుట క్షత్రియుని ధర్మము. భూపాలనము కూడ ప్రధానధర్మము. దాననే రాజులు కృతార్థులు. యజ్ఞాదిరక్షణము రాజు ధర్మము. దుష్టులను శిక్షించుట శిష్టులను రక్షించుట వర్ణధర్మవ్యవస్థ చేయుటవలన రాజభీష్ట పుణ్యలోకగామి యగును.

పశుపాలనము వాణిజ్యము కృషి (వ్యవసాయము) వైశ్యునివృత్తిగా (జీవికగా) బ్రహ్మ యొసంగెను.అతనికి గూడ అధ్యయనము యజ్ఞము దానము ధర్మము అనునవి నిత్య నైమిత్తిక కర్మానుష్టానములు బ్రాహ్మణ పురస్సరముగా కర్మాచరణము విహితము. అందులకే బ్రాహ్మణులను పోషించుట. అందుకొరకే క్రయవిక్రయ వ్యాపారము వడ్రంగము వైశ్యునికి విహితములు. శూద్రుడు దానము లీయవలెను. పాకయజ్ఞములు చేయవలెను. పాకయజ్ఞము చేతనే పితరుల నర్చించుట మొదలగు సర్వకర్మాచరణము విహితము. నౌకరులను భరించుటకు సర్వపరిగ్రహములు చేయవచ్చును. ఋతుకాలాభిగమన అందఱికిని సామాన్యధర్మము, అంతేకాదు సర్వభూతదయ ఓరిమి దురభిమానములేమి శౌచము అనాయాసము మంగళకార్యచరణము ప్రియముగా మాట్లాడుట. సర్వులతో మైత్రి దురాశ లేకుండుట ఇవి యన్ని వర్ణములకు అన్ని ఆశ్రమములవారికిని సాధారణ లక్షణములు. ఇవిగాక బ్రాహ్మణాదులకు ఈ క్రింది ఉపధర్మములు(అపద్ధర్మము లన్నమాట) కూడ చెప్పబడినవి. అపద్ధర్మముగా (జీవనము గడువనపుడు) బ్రాహ్మణుడు క్షేత్రధర్మమును క్షత్రియుడు వైశ్యధర్మమును వైశ్యుడు శూద్రవిహిత కర్మమును జేయవచ్చును. వైశ్యశూద్రులు సమర్థులై యుండి యీ స్వధర్మములను విడువరాదు. అపద్ధర్మములో కూడ వారికిది త్యాజ్యముగాదు. కర్మసాంకర్యము మాత్రమెన్నడును జేయగూడదు. ఇవివర్ణధర్మములు సెప్పితిని.ఇక నాశ్రమధర్మములం దెల్పెద నెఱింగికొనుము.

బాలుడుపనీతుడై వేద అధ్యయన తత్పరుడై గురుగృహమందు వసించుచు బ్రహ్మచారియై ఉండవలెను. సదాచారమందు అభిలాషగొని గురుశుశ్రూష చేయవలెను. (శూశ్రూష-వినవలెనను కోరిక అనగా గురువు చెప్పినట్లు వినుటయనగా నా ప్రకారము నడుచుట) వ్రతములం జేయవలెను.(అనగా బ్రహ్మచర్య నియమములను బాటింపవలెను.) మనసు నిల్పి (అవధానము గొని) వేదము నేర్చుకోవలెను. మది కుదురుపరచికొని ఉభయసంధ్యలందు అగ్నికార్య మొనరించి గురున కభివానము సేయనగును. గురువు నిలువబడిన తాను నిలువబడి నడచిన వెంటనడచి ఆయనకు క్రిందుగ కూర్చుండవలెను. గురునకు ప్రతికూలమైన పని వదలిపెట్టవలెను. ఆయనతో వేదము పఠింపవలెను. అతనికెదురుగా కూర్చుండి వేరుతలపు గొనకుండవలెను. అపై భిక్షాన్నము తెచ్చికొని గురునకు నివేదించి తదనుమతిం దానిని తినవలెను. గురువు దిగి స్నానము సేసిన తరువాత నీ తీర్థమందు దాను దిగి స్నానము సేయవలెను. సమిధులు తీర్థమును నీయనకై ప్రతికల్పము(అవసరమైనపుడెల్ల) తేవలయము. వేదములు చదివిన తరువాత గురుదక్షిణ సమర్పించి ప్రాజ్ఞుడై గార్హస్థ్యమందు ప్రవేశింపవలెను.

శక్తికొలది గృహస్థు సేయనగు కార్యమెల్ల చేయవలెను. పితృదేవతలను నిర్వాపముచే (తర్పణములచే) దేవతలను అతిథులను యజ్ఞములచే మునుల అన్నదానము స్వాధ్యాయములచే సంతతిచేత ప్రజాపతిని బలికర్మచే భూతములను సత్యవచనముచే ఎల్లజగమ్మును నర్చించి పురుషుడు తాజేసిన యీ పుణ్యకర్మ ప్రభావమున పుణ్యలోకములనందును. భిక్షాన్న భోజనులగు సన్యానులు బ్రహ్మచారులు మఱియుంగలవారు ఈ గృహమునెడ(గృహస్థునెడ) నిలుతురుగావున గార్హస్థ్యము. పరమాశ్రమధర్మము. వేదములు నేర్చుకొనుపనితో తీర్థస్థానము కొరకు పృథివీదర్శనము కొఱకు ద్విజులు వసుధపై సంచార మొనరింతురు. ఇల్లులేక ఆహారము లేక సాయంకాలమం దెవరిండ్లకు వత్తురెవ్వరు. వారికి గృహస్థులు నిలువనీడ యని చెప్పబడినాడు. అతడు వారికి మధురాతి మధుర భాషణముల స్వాగతంబు పలుకవలె. (అయ్యా! దయసేయుడనవలయును) ఆ మీద దానములు సేయగోరు(అన్ని దానాదులు) ఇంటికేగుదెంచిన వారికి పరుండంగూరుచుండ తిన శయనాసన భోజనాదులం గూర్పవలయును. భగ్నాశుడై అతిథి యెవ్వని ఇల్లు వదిలిపోవునో ఆ అతిథి తన పాపమాయింటి యజమానికిచ్చి వాని పుణ్యము గొనిపోవును. ఈసడింపు అహంకారము డాంబికము నింద ఉపఘాత పారుష్యము గృహికి తగదు. గృహస్థీ ఉత్తమధర్మము పాటించి సర్వబంధముక్తుడై ఉత్తమ లోకములం బడయును.

వయస్సు పండినతఱి గృహాశ్రమి కృతకృత్యుడై భార్యను పుత్రుల కప్పగించి వనమేగవలెను. ఆమెతోనైన నేగవచ్చును. రాలినఆకులు దుంపలు రాలినపండ్లు తినుచు జుట్టు గడ్డము జటలు వెంచికొని నేలం బరుండుచునట మునియై సర్వులకుం దాను అతిథియై యుండవలయును. చర్మములు రెల్లు దర్భలతో నల్లినవానిం గట్టుకొనవలెను. పైని వేసికొనవలెను. తప్పక త్రిషవణ స్నానము సేయవలెను. దేవతార్చనము హోమము సర్వాభ్యాగతపూజ భిక్ష బలిప్రదానము నీ వానప్రస్థునకు ప్రశస్తమని చెప్పబడినది. అడవినూనెలతో అభ్యంగస్నానమును వీనికి బ్రశస్తము. శీతోష్ణాది ద్వంద్వసహనము తపస్సునకు నీ నియమములం బూని వానప్రస్థుడు చరింపవలెను. అట్టి పుణ్యుడు అగ్ని యట్లెల్ల దోషములం దహించి శాశ్వత పుణ్యలోకములంద గలడు.

చతుర్థాశ్రమము భిక్షువునకు సంబంధించినది. సన్న్యాసమును పేరనగు నా యాశ్రమధర్మముం దెల్పెద నెరింగి కొనుడు. కలత్రపుత్ర దనాదులందు స్నేహములం బాయవలెను. మాత్సర్యమేమాత్రము నుండరాదు. త్రైవర్ణిక ధర్మములం కర్మల నన్నింటిని విడువవలెను. మిత్రాదుల మైత్రుడు సముడునై యెల్లభూతములందు నట్లుండవలెను. జరాయుజములు(మావివలన బుట్టినవి) అండజములు(పక్షులు) స్వేదజములు(చెమటవలన బుట్టు క్రిములు) ఉద్భిజ్జములు (విత్తునుండి పుట్టు వృక్షాదులు) నగు వీనియందెందును త్రికరణములచే నెట్టి ద్రోహము సేయరాదు. సర్వసంగములు వీడవలెను. ఒకయూర నొక్క రాత్రి పురమం దైదురాత్రులు మాత్రమే యుండవలెను. పశుపక్ష్యాదులందు ప్రీతిద్వేషమును వీనికుండదు. ప్రాణయాత్రా నిమిత్తముగనే నిప్పులార్పుకొని జనములు భుజించిన తర్వాత ప్రశస్తవర్ణములు వాండ్లకడ భిక్షాటనముసేయవలెను. భిక్ష దొరకనిచో విషాదపడరాదు. దొఠకిన హర్షపడరాదు. ప్రాణయాత్రమాత్ర మాత్రాకాలనంగముగొని వెడలిపోవలెను. మితిమీరిన పూజ లాభముల నెల్లడను సహించుకొనవలెను. కామము క్రోధము దర్పము లోభము మోహము మొదలగు దోషములను వీడి నాది నేనను భావము లేక (నిర్మముడు నిరహంకురుడై) యుండవలెను. వానికి దేహమును వదలునపుడును భయము కలుగదు. తన మేనిలోని అగ్నిని తన ముఖమున అగ్నిహోత్రమాచరించి అనగా తనలోనున్న జఠరాగ్నియందు వైశ్వానరాగ్నియందు హవిస్సుగా పంచాహుతుల రూపమున ఆహారమును హోమద్రవ్యముగా వేల్చి అదిగూడ భిక్షారూపమున దెచ్చికొన్నదానినే హోమముసేసి చితాగ్నులైనవారియొక్క లోకముల కాతడేగును. అగ్నిచయనము సేసిన వారేగు లోకములందు నన్నమాట) ఇదంతయు వివిదిషాది సన్య్నాసులన్నమాట. ఇక మోక్షాశ్రమ సన్యాసియో (విద్వత్సనన్య్నాసి యన్నమాట) యథోక్త విధానమున నాశ్రమధర్మము నిర్వహించి సంకల్పిత బుద్ధితో ననింధనమయిన జ్యోతివలె (కట్టెలులేని నిప్పువలె) ప్రశాంతమయిన ఆ బ్రహ్మలోకమును బొందును. ద్విజులకు మాత్రమే ఈ ఆశ్రముము చెప్పబడినది.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు వర్ణాశ్రమధర్మవర్ణనము అను నూట పదహారవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment