చంద్రగ్రహ జననం ఏడవ భాగము
శీలవతి ( సతీ సుమతి ) కథ
ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది.
“అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ పాటిస్తాం. కోరిన వరాలు కొంగులో వేయాలన్నావుగా. కోరుకో !” చిరునవ్వుతో అన్నారు.
“అలాగే స్వామీ ! నాకు మూడు వరాలు కావాలి. మొదటి వరంగా – శీలవతి భర్త పునర్జీవితుడు కావాలి. ఆ ఉగ్రశ్రవుడు కుష్టురోగ విముక్తుడై యవ్వనవంతుడిగా , శీలవతికి అనుకూల పతిగా మారాలి. వెంటనే ఈ రెండు వరాలూ…” “ప్రసాదించాం ! మూడో వరం కోరుకో , సాధ్వీ !” విష్ణువు అన్నాడు.
“మాత అనసూయ పతివ్రతే కాదు. పరిణత మనస్కురాలు !” ఇంద్రుడు మెచ్చుకున్నాడు.
అనసూయ కొంచెం ముందుకి జరిగింది. తన చీర కొంగును రెండు చేతుల్లోకి విడదీసి పట్టుకొంది. ఆమె విశాల నేత్రాలు తడిగా మెరుస్తున్నాయి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఆమె తదేకంగా చూస్తోంది.
“వరం కోరుకో అనసూయా !” బ్రహ్మ ఆమెను హెచ్చరించాడు.
“మీరు ముగ్గురూ నా కుమారులుగా , నా గర్భవాసాన విడిది చేసి , జన్మించాలి…” విష్ణువు అర్ధం కానట్టు చిరునవ్వు నవ్వాడు. “ఎవరు ముగ్గురూ , అనసూయా ! పేరు పేరునా వివరంగా చెప్పు !”.
“మీరే స్వామీ… బ్రహ్మ విష్ణు మహేశ్వరులు !”
త్రిమూర్తులు ఒకర్నొకరు క్షణకాలం చూసుకొన్నారు.
“తథాస్తు !” త్రిమూర్తులు ఒకేసారి , ఒకే కంఠంతో అన్నారు.
“ధన్యురాలిని స్వామీ !” అనసూయ చేతులు జోడిస్తూ అంది. నిలువెల్లా ఆవరించిన ఏదో ఉద్రేకంతో వణికిపోతున్న అత్రి మహర్షి అనసూయ సమీపానికి జరిగి , మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు.
“అనసూయా ! నీ ప్రార్ధన ప్రకారం – ప్రథమ పుత్రుడుగా బ్రహ్మ , ద్వితీయుడుగా నేను , తృతీయుడుగా పరమేశ్వరుడూ నీ గర్భాన నీ పుత్రులుగా జన్మించి , నీ లోగిలిలో ఆడుకుంటాం !” విష్ణువు నవ్వుతూ అన్నాడు.
అనసూయ మౌనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలు ఆనందబాష్పాల్ని వర్షిస్తున్నాయి.
“అత్రీ ! మీ దంపతులు అదృష్టవంతులు. అంతరిక్షంలో సూక్ష్మరూపంలో ఉన్న చంద్రుడు , సశరీరంగా మీ పుత్రుడుగా జన్మిస్తాడు. ఆ చంద్రుడు మరెవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే !
తదనంతరం నేను దత్త నామధేయంతో జన్మిస్తాను. అత్రి పుత్రుడైన కారణంగా ”దత్తాత్రేయుడు”గా ప్రసిద్ధుడవుతాను…
ఆ తరువాత మీ తృతీయ పుత్రుడుగా పరమశివుడు ”దుర్వాసుడు”గా అవతరిస్తాడు !”
“మా జన్మలు ధన్యమైనాయి !” అత్రి కంఠం వణికింది.
బ్రహ్మ తన మానస పుత్రుడైన అత్రిని చిరునవ్వుతో ప్రత్యేకించి చూశాడు.
“కుమారా , అత్రీ ! శుభఘడియలలో నీ తేజస్సును యజ్ఞకుండలిలో హవిస్సులాగా అనసూయ గర్భంలో నిక్షేపించు !”
“ఆజ్ఞ !” అత్రి నమస్కరిస్తూ అన్నాడు. అనసూయ నమస్కరించింది.
“ఇష్టకామ్యార్ధసిద్ధిరస్తు !” అన్నాడు దీవిస్తూ.
“తథాస్తు !” అన్నారు శివుడూ , విష్ణువూ , ఇంద్రుడూ , నారదుడూ. నమస్కరించిన అత్రి అనసూయలు రెప్పలెత్తి చూశారు. త్రిమూర్తులూ , ఇంద్రుడూ , నారదుడు లేరు!
అత్రి అనసూయ మొహంలోకి పారవశ్యంతో చూశాడు.
“అనసూయా , నీ జన్మ ధన్యం ! నీ చరిత్ర శాశ్వతం ! త్రిమూర్తుల్ని ఆడిస్తాను అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు ! అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది ! నువ్వే కాదు , నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని వొడిలో ఆడిస్తాడు సుమా !” అనసూయ ఆనందాశ్రువుల్ని తుడుచుకుంటూ నవ్వింది.
“అమ్మా !” ఆశ్రమం వెలుపలి నుంచి వినిపించింది పిలుపు. అనసూయా , అత్రీ గుమ్మం వైపు చూశారు. శీలవతీ , ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తున్నారు.
“అమ్మా… అమ్మా… నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధీ , వృద్ధాప్యమూ మాయమైపోయాయి. అంతా మీ ఆశీర్వచన మహిమే అమ్మా !” భర్త చెయ్యి పట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో.
“అది నా మహిమ కాదు , శీలవతీ ! త్రిమూర్తుల దయ , నీ అదృష్టం !” అనసూయ అంది.
“మాతా ! మీ దయతో , నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి !” అందంతో , యవ్వనంతో కళకళలాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతా పూర్వకంగా అంటూ , అత్రి , అనసూయల ముందు మోకరిల్లాడు. శీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది.
“నాయనా ! శీలవతి నీకోసం ఇన్నాళ్ళూ అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో వోలలాడించే బాధ్యత నీదే !” అనసూయ ఉగ్రశ్రవుడితో అంది.
“అవున్నాయనా !” అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి !”
“మా దంపతులిద్దరికీ , మీ దంపతులిద్దరే ఆదర్శం !” అన్నాడు ఉగ్రశ్రవుడు. శీలవతి చిరునవ్వుతో చూసింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹