Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదిహేడవ భాగము

సంకరజాతి లక్షణ వర్ణనము

మునులు మహానుభావా ! నీవు సర్వజ్ఞుడవు. మఱియు సర్వభూత హితాభిలాషినవి. భూతభవిష్యవర్తమానములు నీకు గరతలామలకములు. ఏకర్మచే నటచే వర్ణముల కధమ స్థితివచ్చును? ఉత్తమస్థితియుంగల్గు నానతిమ్ము. శూద్రుడే కర్మమాచరించి బ్రాహ్మణత్వ మందును. వినగోరెదమన వ్యాసభగవానులిట్లనిరి.

హిమగిరి శిఖరి మందాసీనుడైయున్న మహాదేవుంద్రిలోచనుని శైలరాజతనయ మ్రొక్కియిట్లదే ప్రశ్నమడిగినది. ఓ భగనేత్రనాశన! పూషదంత వినాశన! దక్షక్రతుహర ! బ్రహ్మమున్నుచాతుర్వర్ణ్య ధర్మములనడిగెను. ఏకర్మ విపాకముచే బ్రాహ్మణాదులు క్షత్రియాది జన్మములందుదురు. ఈ అనులోమ విలోమ వర్ణసాంకర్యమెట్లు గలుగునో నాసంశయ వారింపుమన శివుండిట్లనియె.

దేవి! బ్రాహ్మణ్యము దుర్లభము. బ్రహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు స్వభావముచేత నేర్పడిరని నాతలంపు. తరువాత దుష్కర్మమొనరించి సహజసిద్దమైన బ్రాహ్మణ్యము నుండి దిగజారును. బ్రాహ్మణుడు మొదలయినవారు తమ స్వధర్మమందుండిరేని బ్రాహ్మణ్యమును పరమావధిగ బడయుదురు. ఎవ్వడు విప్రధర్మము విడిచి క్షత్రియధర్మము నాచరించు నతడు విప్రత్వము గోల్పోయి క్షత్రియ యోనింజనించును. ఇట్లే వైశ్యాది వర్ణములందును స్వధర్మపరిత్యాగము చేసినవాడు జనించును. శూద్రత్వముదాక పతనమైన విప్రుడు బ్రహ్మలోక భ్రష్టుడై వర్ణసాంకర్యమందును.

శూద్రుడు స్వధర్మముచే జ్ఞానవిజ్ఞానములనంది శుచియై ధర్మజ్ఞుడై ధర్మనిరత్తుడై స్వదర్మఫలమువడయును. అనగా క్రమముగ ఉన్నత వర్ణములందు జన్మించి బ్రహ్మత్వ సిద్దనిగూడ నందును. మున్ను బ్రహ్మా ఉదాహరించిన అధ్యాత్మజ్ఞానము నిష్టాసిద్దిని ధర్మపరులెట్లు పొందుదురో ఆ విషయములివి. ఉగ్రాన్నము గణాన్నము శ్రాద్దాన్నము మైల అన్నము ముష్టాన్నము శూద్రాన్నము నెన్నడును తినరాదు. ఇది బ్రహ్మముఖము నుండి వచ్చిన వాక్కుగాన (వేదము) పరమప్రమాణమని నా అభిప్రాయము.

శూద్రాన్నశేషము కడుపులోనుండగా చనిపోయిన ద్విజుడు అహితాగ్ని యజ్ఞ కర్తయు శూద్రడై పుట్టును. దానికి ప్రాయశ్చిత్తము గూడలేదు. ఏయే వర్ణములవారి అన్నము జఠరమందుండగా నెవ్వడు చనిపోవునో వాడు వాడా వర్ణములందు బుట్టును. అక్కడ విమర్శలేదు. దుర్లభమైన బ్రాహ్మణ జన్మమంది ఆ భోజ్యాన్నములం దిన్నవాడో పతితుడై తీరునో బ్రాహ్మణుడు సురాపానము బ్రహ్మహత్య దొంగతనము వ్రతభంగము శౌచలపము స్వాధ్యాయ లోపముచే లుబ్దుడై నైకృతికుడై శదుడై వ్రతదూరడై వృషలిని సంగమించి కుండాశనముసేసి సోమ మమ్మి నీచులసేవించి భ్రష్టుడగును. గురుతల్పగుడు గురుద్వేషి గురువుల పరిహసించువాడు బ్రహ్మద్వేషి బ్రాహ్మణ్యపతితుడుగాను శూద్రుడు న్యాయముదప్పక యథావిధిగ స్వధర్మాచరణము చేసి అందరికిందానతిథియై అందరిభుక్త శేషముందిన్నవాడు, వారికి శుశ్రూష పరిచర్య చేసినవాడు సన్మార్గమందు స్థిరుడైనవాడు దేవతల భూదేవులను బూజించినవాడు ఋతకాల స్త్రీసంగమము చేసిన వాడు నియతమయిన ఆహారముదిన్నవాడు.వృథా మాంసము తిననివాడు వైశ్యత్వముం బడయగలడు.

ఋతవచనుడు అహంభావము లేనివాడు. సుఖదుఃఖాది ద్వంద్వముల కతీతుడు. సామనిపుణుడు బ్రహ్మయజ్ఞాది నిత్యయజ్ఞములు సేయువాడు స్వాధ్యాయపరుడు అచారశీలుడు ఇంద్రియముల నదిమినవాడు సత్కార్యకర్త సర్వవర్ణములయెడ అసూయ లేనివాడు గృహస్థవ్రతమూని రెండువేళల మాత్రమే భూజించుచు శిష్టశేషము యజ్ఞశేషము నారగించుచు నిష్కాముడు నిరహం మతి యథావిధి కాలముగ హోమము సేయుచు నగ్న్యుపాసన సేయువాడు సర్వులకు ఆతిథ్యము ఒసంగుచు శేషాన్నము మాత్రమే తాను భుజించు వాడునగు వైశ్యుడు త్రేతాగ్నిమాత్ర సంపాద్యమైన బ్రాహ్మణత్వములడుగ ఆ వైశ్యుడు తొలుత క్షత్రియుడై పుట్టి జన్మాది సంస్కారములు వొంది మంచి దక్షిణ నిచ్చి యజ్ఞములు సేయువారికి దానములు చేసి స్వర్గము కోరి అధ్యయనము చేసి త్రేతాగ్నిహోత్రియై ఎల్లపుడు తడిచేతితో దానములు చేయును. చేయి ఆరకుండ ధారాపూర్వకముగ (బహుదానములు చేయుచున్నమాట) ప్రజలను ధర్మమున బాలించుచు సత్యవచనుడై ఆచారవంతుడై సత్యము అయిన ధర్మములను జేయుచు ధర్మదండముచే దగ్దుండుగాక (రాజందఱిని దండించువాడయ్యును నాతనిపై శాస్త్రవిహిత ధర్మదండన మనునది యొకటియుండి ఆతనిని అదుపులో పెట్టుచుండును. దానిచే రాజు దగ్ధుండు కాకపోవుట యనగా దానికి లోబడి ప్రజారక్షణ శిక్షణలు చేసి దానికి విదేయుడై యుందవలెనన్నమాట) ధర్మకామార్థములను మూడు పురుషార్థములను సాధించుచు కార్యములచే కార్యసాధనములచే నియమింపబడినవాడై ప్రజలవలన ఆఱవవంతు మాత్రమే పన్ను గ్రహించువాడై స్వేచ్చగొని గ్రామ్యధర్మములను సేవింపక అర్థశాస్త్రము చక్కగ నెఱిగి ఋతుకాలమందు పత్నీసమావేశము నొంది (సదా బ్రహ్మచారియై) సదోపవాసియై (నియమిత భోజనములు రెండిటి నడుమ నెట్టి అల్పాహారములు గొనకుండువాడు సదోవవాసి) స్వాధ్యాయ నిరతుడై శుచియై గృహమందయుండి మూడువర్ణములవారికిని అతిథ్యమిచ్చుచు మంచిమనసుతో నిత్యము నన్నమడుగు శూద్రులకు సిద్దవైయున్నది రండనుచు స్వార్థముచేకాని కామముచేగాని యేకొంచెమును జూడక కేవలము పిత్రదేవాతిథి నిమిత్తముగానే సాధనము చేయుచు తనయింటనే తాను భిక్షాన్నమును సేవించి ద్వికాలమగ్ని హోత్రములు సేయుచు గోబ్రాహ్మణ హితమునకై మాత్రమే ప్రవర్తించుచు యుద్దమందు వెన్నుజూపక అటంగూలియ త్రేతాగ్ని మంత్రపూతమయిన ఉపాధితో శరీరమింకోకటి ప్రవేశించి ద్విజుడగును. అప్పుడు జ్ఞానవిజ్ఞాన సంపన్నుడై వేదపారగుడై సుసంస్కృతుడై వైశ్యుడిట్టి క్షత్రియత్వమును బడయును. శూద్రుడును అగమ విధానముచే (వైదికప్రక్రియతో గాదు) సంస్కారములనంది ద్విజుడగును.

బ్రాహ్మణుడుడేయగుగాక అసద్వృత్తముచే సర్వసంకర భోజనముచే బ్రాహ్మణ్యముం గోల్పోయి శూద్రత్వ మందును. శుచికర్మాచరణముచే దేవీకటాక్షముచే మనస్సు శుద్దినంది జితేంద్రియుడైన శూద్రుడును ద్విజుని అట్లసేవింపదగినవాడని బ్రహ్మ స్వయముగ బల్కెను. స్వభాకర్మచేత శూద్రుడు ప్రవర్తించునేని అతడు ద్విజులకంటెను. విశుద్దుడని నాతలంపు. యోనికాదు (జన్మకాదు) సంస్కారము కాదు శ్రుతి కాదు సంతానము గాదు. ద్విజత్వమునకు కారణము కేవలము వృత్తమే (నడవడియే). బ్రాహ్మణుడను నీ సర్వజాతియు లోకమందు వృత్తముననుసరించి విధింపబడును. వృత్తముననున్న శూద్రుడుగూడ బ్రాహ్మణత్వముందును. ఓ రమణి! బ్రహ్మస్వభావ మునగా సర్వత్ర సమత్వమని నాతలంపు. నిర్గుణము నిర్మలమునైన బ్రహ్మ యెవ్వనియం దుండు నతడు ద్విజుడు (బ్రహ్మవిషయక జ్ఞానము కలవాడన్నమాట) ఇట్టి పవిత్రులు ఒక స్థానము ఒక అధికారము అనిలేని యొక విలక్షణస్థితికి నిదర్శనమైయుందురు. ప్రజాసృష్టి సేయు బ్రహ్మయే స్వయముగానిట్లు చెప్పెను. బ్రహ్మపదార్థము యొక్క మహాక్షేత్రము పాదములచే నీలోకమందు బ్రాహ్మణ రూపమున సంచారము చేయు చున్నది. అక్కడపడిన విత్తనము ఈ కృషి (వ్యవసాయము) పరమందు ఫలవంతమగును. నిత్యసంతుష్టుడై బ్రహ్మమార్గము ననుసరించి సంహితాధ్యయనము నిత్యము సేయుచు గృహమందుత్తము గృహస్థై నిత్యము స్వాధ్యాయమే బ్రతుకుగా వేదాధ్యయన ముచే సంపాదనసేసి బ్రతుకక యుండు విప్రుడు నిత్య సన్మార్గవర్తి అహితాగ్ని అధ్యయన పుడునైన విప్రుడు బ్రహ్మభావమున కర్హుడగును. బ్రహ్మాణ్యము వీడక మనసు నియమించుకొని దానిం జన్మకారణమైన సహజ ద్విజత్వము. చేతను సత్ర్పతి గ్రహముచేత దానముల చేయుటచేతను విహిత కర్మాచరణములచేతను కాపాడుకొనవలయును. ఇది చాల గుహ్యమైన విషయము. శూద్రుడు ద్విజుడు కాగల విధానము ద్విజుడు ధర్మచ్యుతి నొంది శూద్రుడగురీతియు నీకు దెల్పితిని.

ఇది శ్రీ బ్రహ్మపురాణమునందు ఉమామహేశ్వరసంవాదమున సంకరజాతిలక్షణవర్ణనమను నూట పదిహేడవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment