Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ఎనిమిదవ అధ్యాయం

నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం

పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము” అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు.

మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను.

సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్త్వములను ఆకాశనామకతత్వంలో ప్రవేశింపజేయాలి. తరువాత ”రం” అనే అగ్ని బీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత ”యం” అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని ఆవయింపజేస్తున్న భావన చేయాలి. తరువాత ”లం” అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట ”వం” అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ ”పీతాంబరధారియు చతుర్భుజుడునునగు శ్రీహరిని నేనే” అని భావించుకుంటూ ఆత్మతత్త్వ ధ్యానంలో నిమగ్నం కావాలి.

తరువాత శరీరంలో చేతుల్లో మూడు ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు పన్నెండక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో, న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్టంతో ప్రారంభించి మధ్య వేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్య వేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్నాంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు, అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. (చేతుల తరువాత మోకాళ్ళు)

తరువాత రెండు చేతులనూ కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వ్రేళ్ళను కలిపి నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపుండి పరమతత్త్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడునగు నారాయణ చింతనం గావించాలి.

తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు. వెనుక భాగము, రెండు మోకాళ్ళు, కాళ్ళలో కూడా న్యాసం చేయాలి.

బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి.

తరువాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్రచిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా

అగ్ని కోణంలో
ధర్మాయ నమః

నైరృత్య కోణంలో
ఓం జ్ఞానాయ నమః

వాయు కోణంలో
ఓం వైరాగ్యాయ నమః

ఈశాన కోణంలో
ఓం ఐశ్వర్యాయ నమః

తూర్పు దిక్కులో
ఓం ధర్మాయ నమః

దక్షిణ దిక్కులో
ఓం అజ్ఞానాయ నమః

పడమటి దిక్కులో
ఓం అవైరాగ్యాయ నమః

ఉత్తర దిక్కులో
ఓం అనైశ్వర్యాయ నమః

అని అంటూ న్యాసం చేయాలి.

సాధకుడీ విధంగా న్యాసవిధులతో ఆచ్ఛాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి.

తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్న్యాదులను ధ్యానించు కోవాలి. తరువాత అష్టదళకమలంపై ఎనిమిది దెసలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.

వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాల పై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాలపైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర వ్యాసాన్ని గావించాలి.

తూర్పువైపు దళంలో
హృదయాయ నమః

దక్షిణం వైపు దళంలో
శిరసే స్వాహా

పశ్చిమం వైపు దళంలో
శిఖాయై వషట్

ఉత్తరం వైపు దళంలో
కవచాయ హుం

మధ్యంలో
నేత్రత్రయాయవైషట్

కోణంలో
అస్త్రాయ ఫట్

అంటూ న్యాసం చేయాలి.

తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో ”ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయనమః” అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి.

పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాల నుంచాలి. దక్షిణం వైపు ధనుస్సు (శారంగము) నీ ఎడమ వైపు బాణములను అలాగే కుడి యెడమలలో కత్తినీ కవచాన్నీ వుంచాలి.

ఆపై సాధకుడు మండల మధ్యంలో దిశాభేదాను సారము తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతునీ వ్యాసం చేయాలి.

ఈ ప్రకారంగా అందరు దేవతల వ్యాస, ధ్యాన, పూజనాలను చేస్తూ ఆయా దేవతల కెదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ధ ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందినీ ముద్ర. మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిటిలో కుడిబొటనవ్రేలిని బంధించి ఎడమ బొటన వేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడిటినీ సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్ళనూ ఒకదానికొకటి తగిలించి వుంచి ఒక్కొక్క వ్రేలినీ వదులుకుంటూ పోవడం ద్వారా ఎనిమిది ముద్రలు ఏర్పడతాయి.

రెండు చేతుల బొటనవ్రేళ్ళనూ వాటి మధ్యమ, అనామిక, చిటికెన వ్రేళ్ళకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను ”నరసింహ”ముద్ర అంటారు. కుడిచేతిపై ఎడమ చేతిని ఉత్తనస్థితిలో పెట్టి ప్రతిమపై మెల్ల మెల్లగా తిప్పడాన్ని ”వారాహీ” ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్ళను బిగించి ఒకదానిపై నొకటిగా వుంచి ఒక్కొక్క వ్రేలినే మెలమెల్లగా విడిపించి మరల పిడికిళ్ళను బిగించడాన్ని ”అంగముద్ర” అంటారు. పది దిక్కుల పాలకులకూ సాధకుడు ఈ విధంగా ముద్రలను చూపించాలి.

భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ దేవస్థానములకు అధికారులైన దేవతలు. కాబట్టి సాధకుడు క్రమంగా ‘ఓం అం వాసుదేవాయనమః, ఓం ఆం ఐలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అః అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో పూజించాలి.

ఓంకారం, తత్సత్, హుం, క్షోం, భూః ఈ అయిదూ క్రమంగా, నారాయణ, బ్రహ్మ, విష్ణు నరసింహ మహావరాహ భగవానులు బీజమంత్రాలు.

కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణునీ ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ, ఓం హుం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవునీ, ఓం క్రౌం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహునీ, ఓం భూః మహా వరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహాన్నీ పూజించాలి.

నరసింహ” అనే శబ్దం సరికాదనీ ”నృసింహ” అనియే ఉండాలనీ కొందరు పండితులంటారు. బీజమంత్రాలు అనే మాట కన్న బీజాక్షరాలు అనే మాట తెలుగు ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతోంది.

పైన చెప్పబడిన తొమ్మండుగురు దేవతలూ (వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ) నవవ్యూహాధినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర పీతం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనెరంగు (రెండవ ఎరుపు గులాబీ రంగు) ఈ దేవతలంతా ఈయీ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతుంటారని అర్థము.

ఓంకారం ప్రతి మంత్రానికీ ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈయీ బీజ మంత్రాలను (బీజాక్షరాలను) వాడాలి. ఓం

కం టం పం శం
గరుడుడు

జఖం వం
సుదర్శనం

షం చం ఫం షం
గద

వం లం మం క్షం
శంఖ

ఘం డం భం హం
లక్ష్మి

గం జం వం శం
పుష్టి

ఘం వం
వనమాల

దం సం
శ్రీవత్సం

ఛం డం పం యం
కౌస్తుభం

గరుడుడు కమలం వలె ఎఱ్ఱనివాడు. గద నల్లనిది. పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో వుంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణ వర్ణంలో వుంటుంది. సుదర్శనునిది సహస్ర సూర్యకాంతి. శ్రీ వత్సం కుందపుష్పసమాన వర్ణితం, అనగా శ్వేతం. వనమాల పంచవర్ణశోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి ‘పుండరీకాక్ష’ విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకీ అర్ఘ్య పాద్యాదులను సమర్పించాలి.

ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం.

[ గమనిక :- సాధకులు గురు ఉపదేశం తో చేయవలసిన విధి విధానాలు పైన సూచించినవి. ఎవరు కూడా గురువు ఉపదేశం లేకుండా ప్రయత్నం చెయ్యకూడదు ]

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment