ధర్మ నిరూపణము
పార్వతి ఇట్లు పలికెను.
సర్వప్రాణులకు ఈశుడవును దేవతలచేతను రాక్షసులచేతను నమస్కరింపబడు ఓ భగవాన్ ! శివా! మానవుల ధర్మాధర్మములను నాకు తెలిపి సంశయము తీర్చుము. మానవులు మానసికములు వాచికములు శారీరకములు అగు ఏ త్రివిధ కర్మ బంధములచే బంధింపబడుదురు? ఎట్లు విడుదల పొందుదురు? ఓదేవా ! ఏ శీలముచే ఎటువంటి కర్మచే ఏ ఆచరణములచే గుణములచే వారు స్వర్గము పోందుదురు?
శివుడు ఇట్లు పలికెను:-
ధర్మతత్త్వమును ఎఱిగి నిరతము దానియందే ఉండు ఓదేవి! సర్వప్రాణులకు హితకరమై బుద్దిని వృద్ది చేయు నీ ప్రశ్నమునకు సమాధానము చెప్పెదను. వినుము:- సత్యధర్మములందు అసక్తులై శాంతులై అన్ని బాహ్య లక్షణములను వదలి సంశయ రహితులగు వారు బంధనములకు లోబడుదురు. అట్టివారు ప్రపంచోత్పత్తి ప్రళయముల తత్త్వముతెలిసి సర్వజ్నులై కోరికలు లేక కర్మబంధములనుండి ముక్తి పొందుదురు. త్రికరణములతో ఏ ప్రాణిని హింసించక దేనియందు అసక్తి నొందనివారు దయకలిగి ప్రాణిహింసచేయక సత్‌శీలము ప్రియాప్రియములయందు సమబుద్ది కలిగి సర్వప్రాణులకు విశ్వసనీయులై ఇంద్రియ నిగ్రహము కలిగినవారు కర్మలచే బంధింపబడరు. స్వర్గమును పొందుదురు. ఇతరుల ధనములయందు దారలయందు అసక్తిలేక వారిని తల్లిగా చెల్లెలుగా తలచుచు తన భార్యను ఋతుకాలమున మాత్రమే మొరటు సుఖమునకు కాక ధర్మమునకై కలియుచు ధర్మముచే ఆర్జించిన దానితో జీవించుచు తృప్తినొందంచు దొంగతనములేక సత్ర్పవర్తనము ఇంద్రియజయము కలవారు స్వర్గము నొందుదురు. వ్యర్థముగా ఏ ప్రాణికి అపకారము చేయక మనస్సున మాలిన్యములేక దానము సత్కర్మము తపస్సుశీలము శుచిత్వము దయకలిగి జీవించు ఈ మార్గము దైవము నిర్ణయించినది. వివేకముకలిగి దీనినే మానవుడు అనుసరించ వలెను.
తన కొఱకేకాని పరులకొఱకేకాని జీవనమునకేకాని ధర్మమునకైకాని తన స్వేచ్ఛచేకాని అసత్యము పలుకరాదు. పరుషము కటువు నిష్టురము కొండెములు మిత్రభేదము కలిగించునది ఇతరులకు బాధ ద్రోహమును కలిగించునది అగుమాట పలుకక మృదువై స్వచ్చవర్ణములు కలిగి పాపములేక తీయనైన పలుకులు అంతఃకరణశుద్దిగా కోపము లేక మనోహరముగా పలుకువారు స్వర్గమును పొందుదురు. వాచికమగు ధర్మస్వరూపము ఇది.
ఓమహాభాగా!దేవదేవా!పినాక ధారీ! పురుషుని బంధించు మానసిక కర్మలను తెలుపుము.
మానవుని స్వర్గలోక గతికి సాధనమగు మానసిక ధర్మములు చెప్పెదను వినుము. అతడు మనస్సును చెడుదానినిగా చేసిన కర్మచే బద్ధుడగును. అరణ్యమున నిర్జన ప్రదేశమున పరధనము కనబడినను గ్రహించతలచక ఏకాంతమున లభించినను పరదారల కోరక – శత్రువులను మిత్రులను సమముగా మైత్రితో చూచుచు వేదశాస్త్రాధ్యయనము దయ శౌచము సత్యముకలిగి తమ ధనముతో తృప్తులై ఏప్రాణియందు దయయేకాని వైరము లేనివారు స్వర్గమును పొందుదురు. జ్ఞానము సత్కర్మలు ఓర్పు మంచిమనస్సు కలవారిపై ప్రీతి ధర్మాధర్మ జ్ఞానము కలిగి తామాచరించు శుభ-అశుభ- కర్మలలో వేనియొక్క ఫలమునందును కోరికలులేక జీవించువారు స్వర్గము నొందుదురు. ఈ చెప్పిన మానసిక పాపములను విడిచి దేవబ్రాహ్మణ భక్తికలిగి నిత్యము సత్కర్మల యందు ప్రయత్నపరులై యుండువారు స్వర్గము పొందుదురు. మానసిక సత్కర్మలు నీకు తెలిపితివి. మఱి ఏమి వినగోరెదవు?
ఓమహేశ్వరా! మానవుల విషయమున నాకొక సంశయము కలదు. మీరు దానిని వివరించి తీర్చవలయును. ఏ కర్మచే ఏతపస్సుచే దీర్ఘాయువు లభించును? ఏకర్మచే ఆయువు క్షీణించును? కర్మవిపాకము ఎట్టిది? కొందఱు మహాభాగ్యము కలవారు మఱికొందరు మందభాగ్యులు అగుటకు కొందరు గొప్పకులమున మఱికొందరు తక్కువ కులమున పుట్టుటకు కొందఱు కొయ్యబొమ్మలవలె కురూపులు మఱికొందరు అందగాండ్రు కొందఱు. ప్రజ్ఞాహీనులు మఱికొందఱు మహాప్రజ్ఞకల పండితులు జ్ఞానవిజ్ఞానవంతులు కొందఱు అల్పవాక్కుకలవారు మఱికొందఱు గొప్పవాక్పాటవము కలవారు కనబడుటకు హేతువును తాము నాకు వివరించవలయును.
ఓమహేశ్వరా! మానవుల విషయమున నాకొక సంశయము కలదు. మీరు దానిని వివరించి తీర్చవలయును. ఏ కర్మచే ఏ తపస్సుచే దీర్ఘాయువు లభించును? ఏకర్మచే ఆయువు క్షీణించును? కర్మవిపాకము ఎట్టిది? కొందఱు మహాభాగ్యము కలవారు మఱికొందరు మందభాగ్యులు అగుటకు కొందరు గొప్పకులమున మఱికొందరు తక్కువ కులమున పుట్టుటకు కొందఱు కొయ్యబొమ్మల వలె కురూపులు మఱికొందరు అందగాండ్రు కొందఱు. ప్రజ్ఞాహీనులు మఱికొందఱు మహాప్రజ్ఞకల పండితులు జ్ఞానవిజ్ఞానవం తులు కొందఱు అల్పవాక్కుకలవారు మఱికొందఱు గొప్పవాక్పాటవము కలవారు అయి కనబడుటకు హేతువును తాము నాకు వివరించవలయును.
దేవీ! మర్త్యలోకమున ప్రతిమానవుడును తనకర్మకు తగినట్లు ఫలమును పొందువిధమును చెప్పెదనువినుము. యోగీంద్రుడే అయినను ఎప్పుడును చేతిలో దండమును ఆయుధములను ధరించి ప్రాణిసమూహముల ప్రాణముల హింసించుచు వాటిపై దయలేక వానికి భయమే కలిగించుచు కీటకములను పక్షులకు కూడ రక్షణ నీయనివాడు నరకము పొందును. ఇట్టి ఏహింసను చేయనివాడు స్వర్గము పొందును. అట్టి ధర్మాత్ముడు స్వస్వరూపముతోనే ఉండును. హింసకుడు నరకమున భయంకరము క్లేశములతో కూడినదియు అగు యాతనను పొంది ఎట్లోదానినుండి బయటపడిన తరువాత కూడా మానవుడై జన్మించినను క్షీణాయువగును. పాపకర్మలు చేయుచు ప్రాణులను హింసించుచు వానికి అహితుడగుటయే ఆయుఃక్షయమునకు హేతువు. శుభకర్మల ఆచరించుచు ఆయుధము ధరించక ఏప్రాణిని దండించక హింసించక ఏప్రాణిని తానై చంపక చంపింపక చంపువారిని అనుమోదించక తనయందు వలెనే ఇతర ప్రాణియందు భావము కలిగి ప్రాణులయందు స్నేహము కల నరుడు దేవత్వమును పొందును. సముచితములగు సుఖముంను అనుభవించి స్వర్గమున సంతోషమును పొందును. ఒకప్పుడు ఒట్టి వాడు మానవుడై జన్మించినను దీర్ఘాయుడగును. ప్రాణిహింసను విడుచుటయే దీర్ఘాయువును పొందుటకు మార్గమని బ్రహ్మ విధించెను.
ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రహ్మమున ఉమామహేశ్వర సంవాదమున ధర్మనిరూపణమను నూట పద్దెనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹