Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పందొమ్మిదవ భాగము

ధర్మ నిరూపణము రెండవ భాగము

పార్వతి ఇట్లు పలికెను.

ఏశీలము ఏఆచరణము కలిగి ఏకర్మము లాచరించి ఏ దానములు చేసి మానవుడు స్వర్గమును పొందును?

మహేశ్వరుడు ఇట్లు పలికెను:-

బ్రాహ్మణులను ఆదరించుచు దీనులు ఆర్తులు బీదలు అగువారికి భక్ష్యములు భోజ్యములు అన్నపానములు వస్త్రములు ఉదారబుద్ధితో దానము చేయవలెను. బాటసారులకు ఆశ్రయములను సభామండపములను కోనేరులను నిర్మించుచు నిత్యనైమిత్తిక కామ్య కర్మలను ప్రయతుడై శుచియై చేయుచు ఆసనములు శయనములు వాహనములు గృహములు రత్నము ధనము పొలములు పైరులు స్త్రీలు మొదలగునవి ప్రశాంతమనస్సుతో నిరతము దానముచేయునతడు దేవలోకమునకు ఏగును. అచ్చట చాలకాలముండి శ్రేష్ఠములగు భోగముల అనుభవించి అప్సరసలతో కూడి నందనోద్యానము మొదలగుచోట సంతోషముతో గడిపి అక్కడినుండి క్రిందికి జారియు భూలోకమునందు ధనధాన్యములతో నిండిన మహాభాగుల ఇంట జన్మించును. అచ్చట అన్ని కోరికల ననుభవించుచు సంతోషించుచు మహాభోగములను అనుభవించును. మహాకార్యములు చేయును. ధనవంతుడగును. అందరకు చూడముచ్చటయగు బ్రాహ్మణుడగును.

ఉండియు దానము చేయక అన్నముపెట్టక దీనులను అంధులను పేదలను భిక్షుకులను అతిథులను చూచియు వారు యాచించుచున్నను నాలుక కదలించి మాటనైన ఆడక ధనము సువర్ణము వస్త్రములు భోగములు గోవులు వివిధములగు అన్నములు దానము చేయక లోభులై నాస్తికులై అవివేకులై ఉండువారు నరకము పొందుదురు. ఇట్టివారు నరకయాతనలైన తరువాత మానవులుగా జన్మించినను ఆకలిదప్పులు భాధలుపడుచు జనులచే వెలివేయబడి ఏభోగములను అనుభవించు ఆశయులేక జీవనాధారములేక తక్కువభోగములతో బీదలై ఉందురు. కవటులై గర్వముకలిగి అల్పబుద్ధులై పీఠముతో గౌరవించదగిన వారిని అట్లుగౌరవించక త్రోవ ఈయవలసినవారికి త్రోవ ఈయవలసిన వారికి త్రోవ ఈయక పూజించదగినవారిని పాద్యము ఆచమనీయము మొదలగు వానితో పూజించక గురువులతో ప్రేమగా శుభము అభిమతము అగు మాటలాడక దురభిమానము లోభముకలవారై సన్మానించదగిన పెద్దలను సన్మానించకపోగా అవమానించువారు అందరును నరకమును పొందుదురు. ఎన్నోవేలఏండ్లు నరకమనుభవించి మరల మానవులై పుట్టినను శునకమాంసము వండితినువారి వంటి బుద్ధిహీనుల నింద్యుల ఇండ్లలో నింద్యులుగా పుట్టుదురు.

డంభము దురభిమానము లేక దేవతలను అతిథులను గౌరవించుచు జనులచే పూజింపబడుచు పెద్దలను నమస్కరించుచు తీయని మాటలాడుచు సర్వకర్మలచే ఇతరులకు ప్రీతికలిగించుచు ఏప్రాణిని ద్వేషించక మంచి ముఖ లక్షణములు స్నేహభావముకలిగి ఎదుటివారికి స్వాగతము పలుకుచు యథార్థముగా సత్కార పూర్వకముగా త్రోవ ఈయదగినవారికి త్రోవఇచ్చుచు గురువుల గౌరవించుచు అతిథులను అభ్యాగతులను పూజించు నరుడు స్వర్గము పొందును. తరువాత కూడా మానవలోకమున గొప్ప ఇంటపుట్టి సర్వరత్నములు శ్రేష్ఠవస్తువులు” లభించి సర్వభోగములను పొంది తగిన విధమున దానము చేయుచు ధర్మముల నాచరించుచు సర్వప్రాణుల సన్మానమును నమస్కారములను అందుకొను వాడగును. మొత్తముమీద మనుష్యుడు ఎప్పుడును తానుచేసిన కర్మమునకు అనుగుణమగు ఫలమును పొందును. అని నిర్ణయము. విధాత బ్రహ్మ స్వయముగానే చెప్పిన ఈ ధర్మమును నీకు చెప్పితిని. సర్వప్రాణులకు భయమును కలిగించు ప్రవర్తనము కలిగి హస్తములతోనో పాదములతోనో త్రాటితోనో కఱ్ఱతోనో గడ్డలతోనో స్తంభములవంటి ఇతర ఉపాయములతోనో ప్రతీకార బుద్ధితో ప్రాణులను బాధించుచు భయపెట్టుచు ఉండువాడు నరకమును పొందును ఎంతో కాలము తరువాత అతడు మనుష్యుడై పుట్టినను జనులకు ద్వేష్యుడై అధముడై జ్ఞాతులకు బంధువులకు ఇష్టుడు కాక యుండును.

సర్వభూతములను దయతో మైత్రితో చూచుచు వానికి తండ్రి వలె మెలగుచు వైరము చూపక ఇంద్రియముల జయించి హస్తపాదాదులతో ప్రాణుల హింసించక భయపెట్టక అన్ని ప్రాణులకు విశ్వసనీయుడై శుభకర్మలను ఆచరించుచుండువారు స్వర్గమును పొంది అచ్చట దేవతల వలెనే దివ్యమగు భవనమున సంతోషము నొందును. స్వర్గసుఖానుభవము ముగిసిన తరువాతను కూడ మానవుడుగా పుట్టి శ్రమలు భయములు లేక సుఖమును అనుభవించును.

మానవులలో కొందఱు ఊహలు అపోహలు విషయముల వింగడించుకొనుట చేయుటలో నేర్పుకలిగి ఆధ్యాత్మిక విషయజ్ఞానము లౌకిక విషయములలో విజ్ఞానము కలిగి ప్రజ్ఞావంతులై అర్ధవిషయములలో నేర్పుకలిగి యున్నారు. మఱి కొందఱు ప్రజ్ఞారహితులై జ్ఞాన విజ్ఞానములు లేకయున్నారు. కొందఱు పుట్టు గ్రుడ్డివారు రోగార్తులు నపుంసకులు అశక్తులు అగుచున్నారు. ఏకర్మఫలముగా వీరు ఇట్లు వైవిధ్యము పొందుచున్నారో సర్వధర్మముల నెఱింగిన వారిలో శ్రేష్ఠుడవగు ఓ విరూపాక్షా! నాకు తెలిపి నా సంశయము తీర్చుము.

వేదార్థముల నెఱిగిన బ్రాహ్మణులను సిద్ధులను ధర్మముల నెఱిగిన వారిని అనుదినము మంచి చెడులను అడుగుచు అశుభకర్మముల విడిచి శుభకర్మలను ఆచరించువాడు ఇహలోకమున సుఖముల అనుభవించి పరమున స్వర్గమును పొందును. అతడు మరల మానవుడై పుట్టినను మేధావంతుడు యజ్ఞాది కర్మలయందాసక్తితో కూడిన శుభమగు శాస్త్ర సంస్కారము కలవాడగును. దుష్టస్వభావముతో పరదారలను చెడు చూపుచూచువాడు పుట్టిగ్రుడ్డి యగును. విపస్త్రయగు స్త్రీని అధిక దుష్టమగు మనస్సుతో చూచువాడు ఈ దుష్కృతమునకు ఫలముగా రోగములచే బాధనొందును. మూఢులై దురాచరణము కలిగి యోనికానిచేట్ల మైథునము చేయువారు ప్రజ్ఞారహితులు నపుంసకులు అగుదురు. మైథునమునకై పశువులను బంధించు వారు గురుపత్నితో సంగమించువారు వివిధములుగ మైథునము చేయువారును నపుంసకులగుదురు.

ఓ దేవశ్రేష్ఠా! దోషముతో కూడిన ఏకర్మను విడిచి దోషరహితమగు ఏకర్మను ఆచరించి మానవుడు శ్రేయమును పొందును?

శ్రేయస్సు కలిగించు మార్గమును ధర్మములను సద్గుణములను కోరుచు అవి ఎరిగిన బ్రాహ్మణులను అడిగి తెలిసి ఆచరించువాడు స్వర్గము నొందును. తరువాత మనుష్యుడై పుట్టినను ఇంద్రియనిగ్రహము మేధ ధారణాశక్తి కల ప్రాజ్ఞుడుగా జన్మించును. మానవుడు క్షేమము కలిగించు సన్మార్గము ఇది. మానవుల శ్రేయముకోరి నీకు తెలిసితిని.

ఓ పరమేశ్వరా! కొందఱు అల్పవిజ్ఞానము ధర్మ ద్వేషము కలవారై వేదధర్మముల నెఱిగిన బ్రాహ్మణులను ధర్మము నడిగి తెలిసికొన గోరక ఉన్నారు. మంచినియమములను కర్మలను ఆచరించక నియమభ్రష్టులై రాక్షసులవలె ఉందురు. మఱి కొందఱు మంచి వ్రతముల నాచరించుచు శ్రధ్ధ ఇంద్రియ నిగ్రహము కలిగి యజ్ఞాదుల నాచరించుచు మూఢత్వము లేక యుందురు. ఏ కర్మములకు ఫలముగా ఇట్లగుదురో తెలుపుము.

పూర్వులు నిర్మించిన ధర్మశాస్త్రముల లోకధర్మముల వ్యవస్థలను శాస్త్ర ప్రమాణానుసారము ఆచరించువారు దృఢ వ్రతులై ఆయా శాస్త్రీయ కర్మలను గట్టిగా ఆచరించువారుగా నున్నారు. అజ్ఞాన వశమున అధర్మమును కూడ ధర్మము అని చెప్పుచు సద్ర్వతముల నాచరించక శాస్త్ర మర్యాదలను విడిచినవారు బ్రహ్మరాక్షసులగుదురు. కాలము ననుసరించి పనుల నాచరించుచు హోమము వషట్కారమువంటి వైదికకర్మానుష్ఠానమునకు దూరముగా నుండువారు నరాధము లగుదురు. ఓదేవీ! నీ సర్వ సంశయములను ఛేదించుటకుగాను మానవుల శ్రేయమునకు అశ్రేయమునకును హేతువగు ధర్మసముద్రమును ఈ విధముగా వివరించితిని.

ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రాహ్మమున ఉమామహేశ్వర సంవాదమున ధర్మనిరూపణము అను నూట పందొమ్మిదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment