ముని-మహేశ్వక సంవాదే వాసుదేవ మహి యమర్ణనము
శివప్రోక్తమైన జన్మరాహిత్యోపాయము
ఇట్లు పరమేశ్వరుడు చెప్పిన విషయము అంతయువిని జగన్మాత హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందెను. ఆసమయములో శిపుని సమీపమున ఉన్న మునివరులును తీర్థయాత్రా ప్రసంగమున అచటికివచ్చి చేరియున్న ద్విజులును శివుని సంపూజించి నమస్కరించి లోకముల హితమునుకోరి తమకుగల సంశయమును ప్రశ్నించిరి.
ఓ త్రిలోచనా! దక్షయజ్ఞ వినాశనా! జగన్నాథా ! మా హృదయమందున్న సంశయమును అడుగుచున్నాము. మహాఘోరమై భయంకరమై గగుర్పాటు కలిగించు ఈసంసారములో అల్పప్రజ్ఞ కలవారగు మానవులు ఎంతో కాలము జన్మావృత్తి పొందుచున్నారు. వీరు జన్మ సంసారముల బంధమునుండి విడుదల పొందు ఉపాయమును వినగోరుచున్నాము చెప్పుము.
ఓ బ్రాహ్మణులారా! కర్మపాశములచే బద్ధులై దుఃఖములను అనుభవించుచున్న మానవులకు వాసుదేవుడు తప్ప వేరు ఉపాయములేదు. శంఖచక్ర గదాధరుడగు ఆదేవుని మనోవాక్కర్మలతో లెస్సగా పూజించువారు మోక్షమును పొందుదురు. జగద్రూపుడగు వాసుదేవుని వైపునకు మరలియుండని మనస్సు కలవారు పశువులవలెనే ఆహారనిద్రాది చేష్టలతో ఈలోకమున జీవించుటవలన ప్రయోజనము ఏమున్నది?
ఓపినాకధారీ! భగుడను ఆదిత్యుని నేత్రము పోగొట్టినవాడవు సర్వలోకముల నమస్కృతులనందుకొను వాడవు అగు శంకరా! వాసుదేవుని మాహాత్మ్యమును వినగోరుచున్నాము.
బ్రహ్మకంటెను మేలగువాడు శాశ్వతుడగు పురుషుడు హరి. అతడే కృష్ణుడు. మేఘములులేని ఆకాశమున ఉదయించిన సూర్యునివలె బంగారు కాంతితో ప్రకాశించువాడు. పదిబాహువులు మహాతేజస్సు కలిగి రాక్షససంహారియయి శ్రీవత్సమను మచ్చతోకూడి విషయేంద్రియములకు అధిపతియై సర్వదేవతా సమూహమునకు ప్రభువగువాడు. అతని ఉదరమునుండి బ్రహ్మ శిరస్సునుండి నేను జన్మంచితిమి. శిరోజములనుండి జ్యోతిస్సులు రోమములనుండి దేవదానవులు దేహమునుండి ఋషులు శాశ్వతములగు లోకములు జనించినవి. అతడు సాక్షాత్ బ్రహ్మకును సర్వలోకములకును గృహము. ఈ పృథ్వీ అంతటిని సృష్టించువాడు త్రిలోకములకు ఈశ్వరుడు రక్షకుడు. చరాచర భూతముల సంహరించువాడు. తానే దేవతలకును దేవుడు రక్షకుడు. పరుల తపింప జేయువాడు. సర్వజ్ఞుడు సర్వము సృష్టించువాడు అంతట ఉండువాడు. అన్నివైపులకు ముఖములు కలవాడు. మూడులోకములందును అతనికంటె మేలగు తత్త్వము ఏదియులేదు. సనాతనుడు ఎల్లప్పుడు ఉండువాడు. మహాభాగుడు గోవిందుడు సర్వధర్మరక్షకుడు అని ప్రసిద్ధి కలవాడు. మహామానవంతుడగు ఆ వాసుదేవుడు దేవకార్యార్థమై మానవదేహము ధరించి యుద్ధమున రాజులనందఱను సంహరించును. ఈత్రివిక్రముడు లేనిదే ఈలోకమున దేవతలును తమ కార్యములను నెరవేర్చుకొన జాలరు. అతడు సర్వభూతముల నమస్కారములనందుకొను సర్వభూతనాయకుడు. ఆతనికి నాయకులు ఎవరునులేరు. దేవతలకు రక్షకుడు కార్యజగద్రూపుడు పరబ్రహ్మ తత్త్వరూపుడు బ్రహ్మర్షులను శరణ్యుడు అగు అతనినాభియందు బ్రహ్మ శరీరమునందు నేను అందఱు దేవతలును సుఖముగా ఉన్నాడు. ఆదేవుడు పద్మనేత్రుడు. లక్ష్మి తనగర్భమందున్నవాడు లక్ష్మితో కూడియుండువాడు శార్జ్గము చక్రము ఖడ్గము గరుడధ్వజము కలిగి ఉత్తమమగు సుశీలము శౌచము బహిరింద్రియ నిగ్రహము పరాక్రమము వీర్యము దేహసౌందర్యము చక్కని ఆకృతి ఎత్తుసరి ఋజు స్వభావ సంపద సౌమ్యత రూపము బలము కలవాడు. ఆశ్చర్యకరమగు రూపములుకల సర్వ దివ్యాస్త్రములు కలవాడు. యోగమాయచే వేయికన్నులు విరూపములగు కన్నులు కలవాడు. ఉన్నతమనస్సు కలవాడు. వాక్కుతో తన మిత్రజనులమెచ్చువాడు. జ్ఞాతులకును బంధుజనులకును ప్రియుడు. క్షమాగుణము కలవాడు. అహంకారము లేనివాడు. బ్రహ్మత్వమును ఇచ్చువాడు. భయముచే భాధనొందువారి భయమును పోగొట్టువాడు. మిత్రుల ఆనందమును వృద్ధి చేయువాడు. సర్వభూతములకు శరణ్యుడు. దీనుల పాలించుట యందు ఆసక్తుడు. వేదశాస్త్రముల అధ్యయనము యోగ్యత కలవాడు. ఆశ్రితులకు రక్షకుడు. శత్రుభయంకరుడు. నీతితత్త్వమును ఎఱిగి ఆచరించువాడు. వేదవేదాంగతత్త్వము ప్రవచించువాడు. ఇంద్రియముల జయించినవాడు.
దేవతల మేలుకొఱకే ఆవాసుదేవుడు ఉత్తమ బుద్ధిశాలియై ధర్మముచే సంస్కరింపబడినను ప్రజాపతి యొక్క శుభమార్గమున మహాత్ముడగు మనువు వంశమున జన్మించును. మనువునకు అంశుడు అతనికి అంతర్ధాముడు అతనికి పూజ్యుడగు హవిర్ధాముడను ప్రజాపతి అతనికి ప్రాచీన బర్హిజనింతురు. అతనికి ప్రచేతనుడు మొదలగు పదిమంది కుమారులు పుట్టుదురు. వారిలో ప్రచేతసుని కుమారుడగు దక్షుడు ప్రజాపతి యగును. దక్షుని పుత్త్రికలు దాక్షాయణులను నక్షత్రములు. ఆదిత్యుని కుమారుడు వైవస్వతమనువు. ఈ వైవస్వతమను వంశమున ఇల అనునామెయు సుద్యుమ్నుడును జన్మింతురు. ఇల కుమారుడు బుధుడు. ఆతనికి పురూరవసుడు ఆతనికి ఆయువు అతనికి నహుషుడు అతనికి యయాతి అతనికి యదువు అతనికి మహాబలశాలియగు క్రోష్ట అతనికి వృజినీకాన్ అతనికి పరాజయమునే ఎఱుగని వీరుడగు ఉషంగుడు అతనికి శూరుడగు చిత్రరథుడు అతనికి కడసారి కుమారుడుగా శూరుడనువాడు కలుగును. ప్రసిద్ధమగు వీర్యముకలిగి సత్ప్రవర్తనము సద్గుణములు కలిగి యజ్ఞముల నాచరించిన పవిత్రుల వంశమున జన్మించిన క్షత్రియశ్రేష్ఠుడు మహావీర్యము మహాయశస్సుకల ఆశూరుడను నతడు తన వంశమును విస్తరింపజేయువాడును అభిమానశాలియు వసుదేవుడని ప్రసిద్ధిపొందినవాడును ఆగు ఆనకదుందుభిని కుమారునిగా పొందును. అతనికి కుమారుడు చతుర్బాహుడగు వాసుదేవుడు. యదువంశ సంజాతుడగు అతడు దాత బ్రాహ్మణుల నాదరించువాడు బ్రాహ్మణులకు ప్రీతిపాత్రుడు బ్రాహ్మణులయందు ప్రీతికలవాడు. గిరివజ్రమునందలి మగధరాజగు జరాసంధుని అతడు జయించి అతనిచే బద్ధులై యున్న రాజులను అందఱను విడిపించును. పృథివియందే తనకెదుఱులేని వీర్యవంతుడగు ఆవాసుదేవుడు శ్రీకృష్ణుడు సమస్త రాజశ్రేష్ఠులచే ఆశ్రయింపబడును. సమస్తరాజులకు రాజై విక్రమము కలిగి శూరునకు ఉండదగిన దృడదేహనిర్మాణము కలిగి ఆప్రభువు ద్వారకయందు వసించుచు చెడుమనస్సు కలవారగు శత్రువుల జయించి భూదేవిని పాలించును. మీరు అతనిని ఆశ్రయించి బ్రాహ్మణులకు చేయదగిన మేలైనపూజలతో శాశ్వతుడగు పరబ్రహ్మమునువలె శాస్త్రన్యాయానుసారము అర్చింతురు. లోకపితామహుడగు బ్రహ్మను నన్నును దర్శింపగోరువారు ప్రతాపవంతుడును భగవానుడునగు వాసుదేవుని దర్శింపవలెను. అతనిని దర్శించుట నన్ను దర్శంచుటయే. అందుసందేహము లేదు. బ్రహ్మయు వాసుదేవుడే అని ఓతపోధనులారా! తెలిసికొనుడు. పుండరీకాక్షుడగు వాసుదేవకృష్ణునకు ఎవరిపై ప్రీతికలుగునో వారివిషయమున బ్రహ్మదిదేవతలందఱు ప్రీతులగుదురు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన మానవునకు కీర్తియు స్వర్గమును లభించును. ధార్మికుడు అగు వాసుదేవుడే ఇతరులకు సర్వధర్మములను ఉపదేశించువాడగును. ధర్మము ఎఱిగిన వారెల్లరును దేవతలకు ప్రభువు అచ్యుతుడు తన్నాశ్రయించినవారిని అధోగతికి పోరీయనివాడు అగు వాసుదేవుని నమస్కరింపవలెను. విభుడగు ఆ శ్రీకష్ణుని ఆసక్తితో అర్చించినచో ధర్మమే లభించును.
మహాతేజస్సు కలవాడును పురుషశ్రేష్ఠుడును అగు ఆ వాసుడేవుడు ప్రజల హితమును కోరి ధర్మమును ఉద్ధరించుటకై ఋషులను సృష్టించెను. సనత్కుమారుడు మొదలగు ఆ ఋషులు తపోవంతులై గంధమాదన పర్వతమున నున్నారు. అందువలన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ధర్మజ్ఞుడును ధర్మప్రవచన సామర్ద్యము కలవాడును అగు ఆ వాసుదేవునికి నమస్కరించినచో అతడును వారిని నమస్కరించును. అట్లే తన్నాదరించినవారిని తానాదరించును. తన్ను దర్శించినవారిని తాను దర్శించును. తన్నాశ్రయించిన వారిని తానాశ్రయించును. తన్నర్చించినవారిని తానర్చించును. ఇట్లు మానవలోకమున సజ్జనులు దోషరహితుడు సద్గుణశాలి ఆదిదేవుడు పూజ్యుడునగు విష్ణుని విషయమున తపమాచరింతురు. సనాతనుడు-శాశ్వతుడు-అగు ఆదేవుని దేవతలును అర్చింతురు. తమకు తగిన అభయముతో-శరణాగతితో- ఆయనను అనుష్ఠించుచు ద్విజులు మొదలగువారు త్రికరణములతో నమస్కరించుచు యత్నపూర్వకముగా దర్శనము చేసికొనవలెను. ఓ మునిశ్రేష్ఠులారా! నేను వ్యవస్థ చేసిన మార్గము ఇది. సర్వదేవులకు ఈశుడగు ఆ వాసుదేవుని దర్శించినచో సర్వదేవశ్రేష్ఠులను దర్శించినట్లే. మహావరాహరూపుడు సర్వలోకసృష్టికర్త జగములకు రక్షకుడు అగు ఆ వాసుదేవుని నేనును నిత్యము నమస్కరించుచుందును. నేను మొదలుగా సమస్త దేవతలును ఆయన దేహమున వసింతుము. కనుక ఆయన దర్శనముచే త్రిమూర్తుల దర్శనము జరుగును. ఆ వాసుదేవుని అన్న వెండికొండల కాంతి వంటి కాంతి కలిగి హలి-హలము ధరించినవాడు-బలుడు అని ప్రసిద్ధుడై భూమిని రక్షించును. అతడు సహస్ర శిరస్కుడగు శేషుడే. దేవుడును ప్రభువును పరమాత్మరూపుడు నగు అతని అంతమును కశ్యపుని కుమారుడును బలశాలయునగు గరుడుడును తన వీర్యముతో చూడజాలకపోవుటచే అతడు అనంతుడు అనబడెను. ఆ శేషుడే సంతోషముతో కూడి భూమ్యంతర్భాగమున భూమిని చుట్టుకొని తన పడగలతో భూమిని ధరించుచు చరించుచు వసించుచున్నాడు. ఆ విష్ణువే ఈ అనంతుడు. అట్లే సర్వధరాధరుడగు హృషీకేశుడగు వాసుదేవకృష్ణుడే ఈ బలరాముడు. ఈ పురుషశ్రేష్ఠులిరువురును దివ్యులు దివ్య పరాక్రమము కలవారు. చక్రమును నాగలిని ధరించిన ఈ ఇరువురను మీరు నర్చించి పూజించవలెను. ఓ తపోధనులారా! మీకు నేను తెలుపుచున్న అనుగ్రహము ఇదియే. కనుక మీరు ప్రయత్నపూర్వకముగా ఆ యదుశ్రేష్ఠుని పూజించవలెను.
ఇది శ్రీ మహాపురాణమగు ఆది బ్రాహ్మామున ఋషి మహేశ్వర సంవాదమున నూట ఇరవయ్యవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹