విష్ణుభక్తులు పొందు ఉత్తమగతిని నిరూపించుట
ఆశ్చర్యకరమును సర్వపాపహరమును పుణ్యకరమును ధన్యత కలిగించునదియు సంసార బంధనాశనమునగు శ్రీకృష్ణ మహాత్మ్యమును మేము వింటిమి. చాలా సంతోషమయినది. ఓ మహామునీ! మానవులు వాసుదేవుని అర్చించుటయందు ఆసక్తులై భక్తితో విధివిధానమున అతని నర్చించువారు ఏగతిని పొందుదురు? స్వర్గమునా? మోక్షమునా? రెంటినా? మా ఈ సంశయమును ఛేదించుము. ఓమునిశ్రేష్ఠా! అందులకు నీవు తప్ప సమర్థులు మరెవ్వరును లేరు. అని మునులు వ్యాసునడిగిరి.
ముని శ్రేష్ఠులారా! వైష్ణవులకు సుఖము కలిగించు మీ ప్రశ్నకు సమాధానమును వినుడు. నరులు కృష్ణుని దీక్షామాత్రము చేతనే ముక్తిపొందుదురు. ఎల్లప్పుడును భక్తితో ఆ అచ్యుతుని పూజించువారి విషయము చెప్పవలసినదేమి? ఓ మునిసత్తములారా! వారికి స్వర్గముకాని మోక్షముకాని దుర్లభముకాదు. వైష్ణవులు తాము కోరిన కోరికలు ఎంత దుర్లభములైనను పొందగలరు. రత్నపర్వతము నెక్కినవారు రత్నములను వలెను కల్పవృక్షము నాశ్రయించి ఫలములు కోసికొన్నట్లును వారు జగద్గురుడగు వాసుదేవుని విధిననుసరించి అర్చించినందులకు ఫలముగా ధర్మార్థ కామమోక్షఫలములను పొందుదురు. జగన్నాధుని విశుద్ధమగు అంతఃకరణముతో ఆరాధించిన మానవులు దేవతలకును దుర్లభములగు కామితములు పొందుదురు. సర్వపాపహరుడును సర్వకామిత ఫలములనిచ్చువాడునగు శ్రీహరిని అర్చించు నరులు లోకమున ధన్యులు. ఏలయన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులును కడజాతివారును స్త్రీలును ఆ దేవశ్రేష్ఠుని అర్చించుటచే ఉత్తమగతిని పొందుదురు. కనుక ఓ మునులారా! అట్టి మహనీయులు పొందు ఉత్తమగతిని సంగ్రహముగా చెప్పెదను. వినుడు.
రోగములకు ఆశ్రయము అస్థిరము జరామరణయుక్తము నీటిబుడగతో సమము మాంస రక్తముల దుర్గందము కలది మలమూత్రాదియుక్తము ఎముకలనెడి కట్టుకొయ్యలతొ కూర్చబడినది అపవిత్రము నులినరములతో చర్మముతో రక్తనాళములతో కూడినది అగు మానవదేహమును విడిచి సంకల్పముతో నడచునది దివ్యగంధర్వుల సంగీతముతో కూడినది లేతసూర్యుడువలె ప్రకాశించునది చిఱుమువ్వలగుత్తుల మాలలు కలది అగు విమానము నెక్కి గంధర్వులు గానము చేయుచుండ అప్సరలలంకరించుచుండ వేరువేరుగా ఆయా లోకపాలుర లోకములకు పోవుదురు. ఒక్కొక్క లోకమున ఒక్కొక్క మన్వంతరకాలము సర్వభోగములను అనుభవించి వారు అంతట సర్వసుఖప్రదమగు అంతరిక్షలోకమునకు వత్తురు . అచ్చట శ్రేష్ఠమగు భోగములు పదిమన్వంతరముల పాటు అనుభవించి అక్కడనుండి గంధర్వలోకమునకు పోయి ఇరువది మన్వంతరములపాటు మనోహరములు భోగములనుభవింతురు. అచటినుండి అదిత్య లోకములకు ఏగి అచ్చట చక్కగా పూజలనందుకొనుచు ముప్పది మన్వంతరముల కాలము దేవతలకును దుర్లభములగు భోగమలనుభవింతురు. అటనుండి సుఖప్రదమగు చంద్రలోకమునకు పోయి నలుబది మన్వంతరములు అటనుండి నక్షత్రలోకమున ఏబది మన్వంతరములు దేవలోకమున అఱువది మన్వంతరములు అటనుండి ఇంద్రలోకమున డెబ్బది మన్వంతరమలు అటనుండి ప్రజాపతిలోకమున ఎనుబది మన్వంతరములు జరామరణములు లేక ఉత్తమములగు భోగములను అనుభవించి బ్రహ్మలోకమునకు పోవుదురు.
ఇట్టి వైష్ణవులు బ్రహ్మలోకమున తొంబది మన్వంతరములు నమస్త సుఖములను అనుభవించి మరల ఈ భూలోకమునకు వచ్చి బ్రాహ్మణులలో ఉత్తమ వంశమున యోగులుగా వేదశాస్త్రార్థ సారము నెఱిగిన బ్రాహ్మణులుగా జన్మింతురు. మరల క్రమక్రమముగా పైకిపైకి పోవుచు ప్రతిజన్మమునందును నూరేసి సంవత్సరమలు జీవించి యథేప్సితములగు భోగముల ననుభవించి లోకాంతరమునకు పోవుదురు. ఇట్లు పది జన్మములైన తరువాత వారు బ్రహ్మలోకము నుండి దివ్యమగు విష్ణులోకమున కేగుదురు. అచ్చట నూరు మన్వంతరమల కాలము సర్వగుణములతో కూడిన అక్షయ భోగములను అనుభవించి జన్మమరణములు లేనివారయి వారాహమూర్తి యొక్క లోకమున కేగుదురు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ వైష్ణవులు అచ్చట మహాబలము చతుర్బాహువులు కలదియగు దివ్యమగు మహాశరీరము కలిగి సర్వదేవతల నమస్కారము లందుకొనుచు పదివేలకోట్ల సంవత్సరములు ముక్తిసుఖము ననుభవించుచుందురు. అటనుండి నరసింహదేవుని గృహమున కేగి పదివేలకోట్ల సంవత్సరములు విహరించి తదంతమున విష్ణులోకమునకు పోయి అచ్చటను అనేక కోట్ల సంవత్సరమలు ఆనందింతురు. తరువాత ఈ సాధకోత్తములు బ్రహ్మ లోకమన నూరు కోట్ల సంవత్సరములనేకము లానందించి నారాయణుని పురమునకేగి అర్బుదమల కోట్లసంవత్సరములుండి ఆనందించి దివ్యరూపులై మహాబలులై సురాసురుల స్తోత్రములందుకొనుచు అనిరుద్ధుని పురమున జరామరణములు లేక పదునాలుగు వేలకోట్ల సంవత్సరములుండి ఏ సంతాపములను లేక ప్రద్యుమ్నపురమునకు పోయి అచట మూడువందల లక్షల కోట్ల సంవత్సరములు సుఖింతురు. తరువాత ఈ యోగులు బలశక్తితో కూడి స్వచ్ఛంద గమనము కలవారగుచు సంకర్షణలోకము చేరి అచట చాలకాలము సహస్ర విధములగు భోగముల ననుభవించి సర్వమోక్షమును పొంది సర్వదోషరహితము జరామరణరహితము నగు వాసుదేవ నామముగల పర్వతత్త్వమునందు ప్రవేశింతురు. ఇది నిశ్చయము. ఓ మునిశ్రేష్ఠులారా! వాసుదేవార్చనమున ఆసక్తులు పొందు ఫలములు సుఖములు ఇట్టివి.
ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రాహ్మమున వైష్ణవగతిఖ్యాపనమను నూట ఇరవై ఒకటవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹