Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై రెండవ భాగము

రాత్రిప్రజాగరముతో విష్ణుమహిమ గానమునకు ఫలము

ఓ వ్యాసముహామునీ! ప్రజాగరము చేసి గీతికాగానము చేయుటవలన కలుగు ఫలమును వినగోరుచున్నాము. అని మునులు అడిగిరి.

ఓ మునిశ్రేష్ఠులారా! ప్రజాగరము చేసి విష్ణుమహిమ గానము చేయుట వలన ఫలమును క్రమముతో చెప్పెదను వినుడు.

భూలోకమున ప్రసిద్ధిపొందిన అవంతీ నగరమున శంఖచక్రాదదాధరుడగు విష్ణువు కలడు. ఆనగరము చివరలో గానమున నేర్పరియగు చాండాలుడు కలడు. అతడు సద్వృత్తితోధనమార్జించి తన సేవకులను పోషించుచుండును. అతడు విష్ణుభక్తుడై ప్రతి మాసమునను దృఢవ్రతుడై ఏకాదశినాడు ఉపవసించి రాత్రి ప్రజాగరము చేసి విష్ణుని అవతారములను గూర్చి అతని నామముచే అంకితములగు గీతికలను సప్తస్వర ప్రస్తార యుక్తములగు గానము చేయును. ప్రాతఃసమయమున ద్వాదశీ తిథిలో విష్ణుని నమస్కరించి స్వగృహమునకు వచ్చి తన కూతుళ్లు అల్లుండ్రు మేనల్లుండ్రు పరివారము- వీరిని భుజింపజేసి తరువాత తాను భుజించును. ఇట్లు విష్ణుప్రీతిని కలిగించుచు జీవించు అతనికి చాల వయస్సు గడచెను. ఇట్లుండ ఒకప్పుడు చైత్రకృష్ణ ఏకాదశినాడు విష్ణుసేవకై అతడు భక్తితత్పయడై పూలు తెచ్చుటకై ఉత్తమ వనమునకు పోయి క్షిప్రానది యొడ్డున కలివృక్షము క్రిందనున్న ఒక రాక్షసునకు కనబడెను. ఆరాక్షసుడు ఈ చాండాలుని తినగోరెను. నీవు నన్ను ఈనాడు తినవలదు. నేను రేపు మరల నిజముగా వత్తును. నేనీవాడు పూజచేసికొన వలయును. కాన రాక్షసా ! నన్ను విడువుము. రాత్రి జాగరణము చేసి నేను విష్ణుని సేవింతును. నాకు వ్రత విఘ్నము చేయవలదు. అని చాండాలుడు రాక్షసుని వేడెను.

ఓచాండాలుడా ! పదినాళ్ళు నాకు ఆహారము లేక ఈనాడు నీవు నాకు దొరకితివి. నాకు చాల అకలిగా ఉన్నది. నేను నిన్ను విడువను. భక్షింతును. అని పలికిన రాక్షసుని బ్రతిమాలుచు చాండాలుడు దృఢములగు సత్యవచనములు ఇట్లు పలికెను.

బ్రహ్మరాక్షసా ! వినుము. జగత్తునకు అంతటికి సత్యమే మూలము. నేను మరల వత్తునని సత్యముతో శపథము చేయుచున్నాను. నరుడు చేయు పనులకు సూర్యచంద్రులు అగ్నివాయువులు భూమ్యాకాశములు జలము మనస్సు అహోరాత్రములు యముడు ప్రాతఃసాయం సంధ్యలు సాక్షులు. నేను మరల నీ దగ్గరకు రానిచో వరదార ధనములందు ఆసక్తి బ్రహ్మహత్య సురాపానము గురుదార గమనము గొడ్రాలికి శూద్రస్త్రీకి పతియగుట పూజారితనము చేప-పంది-తాబేలు- వీని మాంసము తినుట నిష్కారణముగా మాంసము తినుట వెన్నుమాంసము తినుట కృతఘ్నత మిత్ర ద్రోహము మారుమనువాడిన స్త్రీని పెండ్లాడుట సూతకము కలుపుకొనుట క్రూరకర్మలు చేయుట పిసినిగొట్టుతనము అతిథుల నాదరింపకుండుట అమావాస్య అష్టమి షష్ఠీ కృష్ణ శుక్లవక్ష చతుర్దశులు-ఈ తిథులయందును శ్రాద్ధముచేసిన తరువాతను స్త్రీతో సంగమించుట బహిష్ఠుఐన స్త్రీని కలియుట మిత్రునిభార్యను పొందుట చాడీలు చెప్పుట కపటము మోసముచేయుట తేనె దొంగలించుట బ్రాహ్మణునికి దానమిత్తునని ఒప్పుకొనినది ఈయకుండుట కన్యను గోవును కంచరగాడిదను ఇత్తునని ఈయకుండుట స్త్రీ బాలవధ అసత్యమాడుట వ్యర్థముగా మాటలాడుట దేవతలను వేదములను ద్విజులను రాజులను పుత్రులను మిత్రులను పతివ్రతలను గురువులను నిందించుట అగ్నిహోతము విడుచుట నిప్పుపెట్టుట గృహేష్టిచేయుట ద్విజాధముడై గోవధచేయుట భ్రూణవధ తమ్మునకు పెండ్లి ఐన తరువాత తాను పెండ్లాడుట అన్నకంటె ముందు తాను పెండ్లాడుట- వలన కలుగు పాపమలు నేను మరల నీకడకు రానిచో నాకు తగులును. ఇంకను భయంకర శపథము వినుము. నేను తిరిగిరానిచో తన కన్యపై జీవించుట సత్యమును మఱుగుపఱచి సాక్ష్యము పలుకుటయాగము చేయింపరాని వానిచే యాగము చేయించుట నపుంసకుడగుట శ్రవణము చేయరానివాని వానినుండి శాస్త్ర శ్రవణముచేయుట శ్రవణము చేయదగనివానికి శాస్త్రముల శ్రవణముచేయుట సన్యాసికాని బ్రహ్మచారికాని కాముకుడై ప్రవర్తించుట- వీనివలన కలుగు పాపముల పొందుదును. అని చాండాలుడు రాక్షసునకు శపథము చేసెను.

బ్రహ్మరాక్షసుడు చాండాలుని మాటవిని ఆశ్చర్యపడి ఈ సత్య శపథముతో వెళ్ళి అన్నమాట కాపాడుము అనెను. ఆ చాండాలుడును పుష్పములు తీసికొని దేవాలయమునకు పోయి బ్రాహ్మణున కిచ్చెను. అతడవి నీటితో కడిగి విష్ణుని అర్చించి తన ఇంటికి పోయెను. చాండాలుడు ఆనాడు ఉపవసించి గుడివెలుపలనుండి విష్ణుగీతుల పాడుచు రాత్రి ప్రజాగరము చేసెను. తెల్లవారగనే అతడు స్నానమాడి విష్ణుని నమస్కరించి తన సత్యమును కాపాడుకొనుటకై రాక్షసుని దగ్గరకు బయలుదేరెను. త్రోవలో తనకెదురైన ఒక నరునకును చాండాలునకును ఇట్లు సంభాషణము జరిగెను.

నరుడు”నాయనా! ఎక్కడకు పోవుచున్నావు?”

చాండాలుడు తనకు రాక్షసుని విషయమున జరిగినదంతయును చెప్పెను.

నరుడు:- ”ధర్మార్థ కామమోక్షములకు శరీరమే సాధనము. కావున వివేకవంతుడు మహాప్రయత్నముతోనైనను శరీరము రక్షించుకొనవలెను. జీవించినచో కీర్తియు లభించును. మరణించినవాని మాట ఎవడు తలచును?”

చాండాలుడు యుక్తియుక్తముగా ఇట్లనెను. ”అయ్యా నేను చాల శపథములు చేసితిని, సత్యము కాపాడుటకై నేను పోవుచున్నాను.”

నరుడు” నీవు ఇట్లు మూడబుద్ధివై ఉన్నావేమి? ఓ సత్పురుషుడా! గోవులను స్త్రీలను ద్విజులను రక్షించుటకును వివాహము విషయమునను సురత సందర్భమునను ప్రాణములును సర్వధనమును పోవుచున్నప్పుడును అసత్యమాడుట పాతకముగాదు. స్త్రీల విషయమున వివాహ సందర్భమునను శత్రువు విషయమునను మోసము ధనహాని ఆత్మనాశము జరుగునప్పుడును ఇతరులు అసత్యము చేయునప్పుడును ధర్మవాక్యములను పాటించరాదు. అని మనువు చెప్పినది నీవు వినలేదా?”

చాండాలుడు ”అయ్యా! అట్లు పలుకకుము. సత్యము లోకములందు పూజింపబడును. లోకమందలి సర్వ సౌఖ్యములును సత్యముచే లభించును. సత్యముచేతనే సూర్యుడు వెలుగును. నీరు ప్రవహించును. అగ్ని జ్వలించును గాలి వీచును. చతుర్విధ పురుషార్థములు సత్యముచేతనే లభించును. సత్యము పరబ్రహ్మము . ఉత్తమయజ్ఞము . స్వర్గము నుండి వచ్చినది సత్యము. సత్యమును విడువరాదు.”

ఇట్లుపలికి ఆ చాండాలుడు ఆ నరుని వదలివేసి ప్రాణిఘాతుకుడగు ఆ బ్రహ్మరాక్షసుడున్నచోటికి పోయెను. వాడు ఆశ్చర్యముతో కన్ను విప్పారించి తల ఆడించుచు ఇట్లు పలికెను. ”సత్యవాక్యమును అనుపాలించిన ఓ మహాభాగా! మేలుమేలు! సత్యమే లక్షణముగాగల నీవు చాండాలుడు కావని నా అభిప్రాయము. నీవు చేసిన ఈ పనిని బట్టి నీవు శుచియై అవ్యయుడగు ఏ వికారమును లేని – బ్రాహ్మణుడవే. శుభస్వరూపుడవగు నీతో ధర్మమును గూర్చి కొంచెము మాటలాడెదను. నీవు రాత్రి విష్ణ్వాలయమున ఏమి చేసితివో చెప్పుము”. చాండాలుడిట్లు పలికెను. ”వినుము. రాత్రికాలమున విష్ణ్వాలయమున నేనేమి చేసితినో ఉన్నది ఉన్నట్లు చెప్పెదను. ఆలయమునకు దిగువ వినయముతో వంగియుడి నిలిచి రాత్రి అంతయు ప్రజాగరము చేసి విష్ణుగీతికలు గానము చేసితిని. రాక్షసుడు నీవు భక్తితో ఎంతకాలము ఆలయమున ప్రజాగరము చేసితివి?” అనెను. ప్రతిమాసమునందును ఏకాదశీతిథులందు ఇరువది సంవత్సరములు ప్రజాగరము చేసితిని. అని చాండాలుడు నవ్వుచు పలికెను. అది విని బ్రహ్మరాక్షసుడు నీవు ఒకరాత్రి ప్రజాగరము చేసి పొందిన ఫలము నాకిమ్ము. అట్లెననేకాని నేను నిన్ను విడువను. అని పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్ఛగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. అయ్యా దయతో నీవు రెండుజాములు ప్రజాగరము చేసితిని. అని చాండాలుడు నవ్వుచు పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్చగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పనియేమి? స్వేచ్ఛగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. అయ్యా! దయతో నీవు రెండుజాములు ప్రజాగరము చేసి సంగీతము పాడి సంపాదించిన ఫలమునైన ఇమ్మని రాక్షసుడు బ్రతిమాలెను. అసంబద్ధముగా ఏల మాటాడెదవు? నేను ప్రజాగరఫలము నీయును. స్వేచ్ఛగా నన్ను నీవు తినుమని చాండాలుడనెను. ఆ మాటవిని బ్రహ్మరాక్షసుడిట్లనెను., ఏమందుడగు దుష్టబుద్ది ధర్మకర్మలచే రక్షితుడవగు నిన్ను చూచుటకుగాని బెదరించుటకు గాని పీడించుటకుగాని శక్తి కలవాడు అగును? అదికాక దీనుడు పాపగ్రస్తుడు విషయనుసుఖములచే మోహము పొందినవాడు నరక యాతనలచే పీడింపబడువాడు మూఢుడు అగువాని విషయములో సత్పరుషులు దయచూపుదురు. ఇట్టి నామీద నీవు దయచూపి ఒక జాము ప్రజాగరము చేసి సంపాదించిన ఫలమునైన ఇమ్ము. లేదా నీ ఇంటికి మరలిపొమ్ము. నీకు యామప్రజాగర ఫలమును కూడ ఈయను. ఇంటికిని మరలిపోను. అని చాండాలుడనెను. రాత్రిచివరలో వినోదార్థము పాడిన పాట ఫలమునైన ఇచ్చి నన్ను పాపమునుండి సముద్దరింపుము. అని బ్రహ్మరాక్షసుడు బ్రతిమాలెను. అది విని నీవు పూర్వము ఏ వికృతకర్మము చేసి ఈ దోషరాశిచే ఇట్లు బ్రహ్మరాక్షనుడవైతివని చాండాలుడడుగగా వినివాడు దుఃఖముచే సంతప్తుడగుచు తానుచేసిన దుష్కృతమును జ్ఞాపకము చేసికొనుచు ఇట్లు పలికెను.

నేను పూర్వము ఎవడవో ఏమి పాపము చేసినందున రాక్షసుడనై పాపయోనియందు జన్మించితినో చెప్పెదను వినుము. సోమయాజియు వేదధ్యయనము చేసినవాడునగు దేవశర్మ యను బ్రాహ్మణుని కుమారుడగు సోమశర్మ అనువాడనుగా ఉంటిని. యజ్ఞోపవీతధారణమునకు వేదమంత్ర గ్రహణమునకు అధికారము లేకయు యజ్ఞకర్మచేయవలెననను అసక్తికల ఒక యజమానుని యజ్ఞకర్మను జరిపించుటయందు శ్రధ్దవహించి లోభముచే మోహముచే బాధింపబడిన వాడనగుచు అగ్నీధ్రుడుగా – అగ్నీధ్రము అనుస్థానమున నుండు ఋత్విక్‌గా ఉంటిని. ఆ యజమానుని ఆ యజ్ఞము ముగియగానే మూర్ఖుడనై దంభమును అవలంబించి ద్వాదశాహ – పండ్రెండు నుత్యాహస్సులతో చేయదగిన – మహాక్రతువును చేయింపనారంభించితిని. అది జరుగుచుండగా నాకు కడుపునొప్పి కలిగెను. అప్పటికి పదినాళ్లు మాత్రము గడచెను. యజ్ఞము ముగియలేదు. రాక్షస సమయమునందు విరూపాక్షునకు ఆహుతి ఈయబడుచున్న సమయమున నేను మరణించి ఆ దోషముచే బ్రహ్మరాక్షసుడనైతిని. మూర్ఖుడనై మంత్రము సూత్రము స్వరము సరిగా తెలియక యజ్ఞవిద్య తెలియక యజ్ఞము చేయుటచే – చేయించుటచే – ఆ దోషమున బ్రహ్మరాక్షసుడనైతిని. కనుక ఇట్లు పాపమహాసముద్రమున మునిగియున్న నన్ను నీ వ్రజాగరముతో కడపటి ఒక పాటయొక్క ఫలమునైన దానము చేసి ఉద్ధరింపుము. అని బ్రహ్మరాక్షసుడు వేడెను. నీవు ఇక నుండి ప్రాణివధను మానుకొందువేని నాకడపటిపాట ఫలమిత్తునని చాండాలుడనగా బ్రహ్మరాక్షసుడంగీకరించెను. తన ప్రజాగరములో కడపటి సగము జాములో పాడినపాట ఫలమును చాండాలుడు వానికి దానము చేసెను. వెంటనే వాడును చాండాలుని నమస్కరించి తీర్థశ్రేష్టమగు పృథూదకతీర్థమునకు పోయి అక్కడ నంకల్పపూర్వకముగా ఆహారము విడిచి ప్రాణములు విడుచుటతో ఆ చాండాలుడిచ్చిన గీతికాఫల బలముచే రాక్షసత్వమునుండి విముక్తుడయ్యెను. పృథూదక తీర్థప్రభావమున పదివేల యేండ్లు దుర్లభమగు బ్రహ్మలోకమున నిరంతరముగా నుండి పిమ్మట పూర్వజన్మ ప్మృతియు ఇంద్రియు నిగ్రహమును గల బ్రాహ్మణుడై జన్మించెను. ద్విజులారా! అతని కథను మీకు మరల చెప్పెదను.

చాండాలుని కథాశేషమును చెప్పెదను వినుడు. బుధ్దిశాలియు శుచియు అగు ఆ చాండాలుడు అనంతరము తన ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని కథను తలచుకొనుచు వైరాగ్యము చెంది భార్యను కుమారులకు అప్పగించి కోకాముఖక్షేత్రమున బయలుదేఱి కుమారస్వామి దర్శనమగువరకు భూప్రదక్షిణము చేసెను. కుమారస్వామిని స్కందుని – దర్శించి ధారాచక్రమును ప్రదక్షిణము చేసి వింధ్య పర్వతమును చేరి పాపప్రమోచన తీర్థమున స్నానముచేసి పాపవిముక్తుడై తన పూర్వజన్మములనేకములు జ్ఞాపకము చేసికొనెను. ఈ జన్మపరంపరా విషయము ఇట్లున్నదిః ఈ చాండాలుడు ఒక పూర్వజన్మములో బుద్దిశాలియు వేదవేదాంగములు కడవరకు నేర్చినవాడును త్రికరణములయందు నిగ్రహము కలవాడును అగు భిక్షువుగా నుండెను. ఒకప్పుడు దొంగలు హరించుకొని పోవుచున్న గోవులచే రేగిన ధూళిచే అ భిక్షువు యొక్క భిక్ష కప్పబడగా దానినతడు వదలివేసెను. ఆ ధర్మదోషముచే అతడు చాండాలుడై పుట్టెను. అతడు నర్మదాతీరము నందలి పాపప్రమోచన తీర్థమున స్నానమూడిన పుణ్యమున మరణానంతరము వారణాసియందు మూర్ఖుడగు బ్రాహ్మణశ్రేష్టుడుగా పుట్టెను. అతడు ముప్పది ఏండ్లవాడై యుండగా అచటికి యోగమాయా బలము కలవాడును విరూపుడను అగు సిద్దుడు సంచరించుచు వచ్చి ఇతనికి కనబడెను. అతనిని చూచి ఈ మూర్ఖబ్రాహ్మణుడు ఉపహాసమునకై అతనిని నమస్కరించి ఓ సిద్దపురుషా ! కుశలమా? ఎక్కడినుండి వచ్చుచున్నావు? అని ప్రశ్నించెను. ఆ సిద్దుడు తన్ను ఈతడు తెలిసికొనెనని తలచి స్వర్గమునుండి వచ్చుచున్నాననెను. స్వర్గమునందు నారాయణముని తొడనుండి జన్మించిన యప్సరరసయగు ఊర్వశి నెఱుగుదువా? అని మూర్ఖబ్రాహ్మణుడడిగెను. అమె నారాయణముని నుండి జన్మించినది. స్వర్గమునకు అభరణము వంటిది. ఇంద్రునికి చామరగ్రాహణి. ఇట్టి ఊర్వశిని నేనెఱుగకపోవుటేమి? అని సిద్దుడనెను.

ఆ మూర్ఖ బ్రాహ్మణుడును సరళమార్గము విడిచి వక్రమార్గమున ఇట్లనెను. ఓ మిత్రమా! నా మీద ఆదరము చూపి నా వృత్తాంతము ఊర్వశికి తెలిపి అమె చెప్పిన సమాధానమును నాకు వచ్చి చెప్పుమనెను. సిద్దుడు సరే అనెను. విప్రుడు సంతసించెను. సిద్దుడు మేరుపర్వతసానువు నందలి స్వర్గమునకు పోయి ఈ బ్రాహ్మణుడు చెప్పినమాట ఊర్వశికి చెప్పెను. కాశీపతియగు బ్రాహ్మణుడెవరో నేనెఱుగను కనుక నీవు చెప్పినమాట నిజమని నేననుకొనుటలేదు. అని ఊర్వశి సిద్దునితో పలికెను.

ఊర్వశీ చెప్పిన ఈ మాటలు విని సిద్దుడు వెడలిపోయి చాలకాలము తరువాత మరల వారాణసికి పోయెను. అతనిని చూచి మూర్ఖబ్రాహ్మణుడు ఊర్వశి ఏమి చెప్పెనని అడుగగా అమె తాను నిన్ను ఎఱుగననెనని సిద్దుడు పలికెను. ఆది విని మూర్ఖవిప్రుడు చిరునవ్వు నవ్వి ఈ మాఱు పోయినప్పుడు నీవాతనిని ఏ గురుతుతో గుర్తింపగలవని ఊర్వశిని అడుగుమనగా సిద్దుడును సరేయని స్వర్గమునకు పోయినప్పడు ఇంద్రభవనము నుండి బయటికి వచ్చుచ్చున్న ఊర్వశిని చూసి మూర్ఖబ్రాహ్మణుడు చెప్పినమాట అమెకు చెప్పెను. అమె ఆ బ్రాహ్మణుడు ఏవైన నియమమును పూనినచో దానిని బట్టి అతనిని గుర్తింపగలననెను. ఆ మాట సిద్దుడు మరల మూర్ఖబ్రాహ్మణునితో చెప్పగా అతడును నేను ఇక మీదట శకటము భక్షింపను. ఇది నా నియమమని ఊర్వశితో చెప్పుమనెను. సిద్దుడు సరేయని తాను మరల స్వర్గముమునకు పోయినప్పుడీ విషయం ఊర్వశితో చెప్పెను. ఇప్పుడు నేనతని నీనియమమును బట్టి గుర్తింపగలను. ఆ మూర్ఖుడు నన్ను ఉపహాసము చేయుటచే ఇట్లు చెప్పెను. అని పలుకుచు ఊర్వశి వెడలిపోయెను. సిద్దుడను తన ఇచ్చానుసారముతో లోకసంచారము చేయుచుండెను. మహాసుందరియగు ఊర్వశియు వారాణసికి పోయి దివ్యశరీరము ధరించి మత్స్యోదరీ తీర్థమున స్నానము చేయుచుండెను. ఈ సమయమున యాదృచ్చికముగ అచటకు వచ్చిన ఆమూర్ఖబ్రాహ్మణుడు అట్టి ఊర్వశిని చూచి కామముచే కలతనొందెను. అందుచే అతడు చేసిన చేష్టలను బట్టి మునువు సిద్దుడు చెప్పిన మూర్ఖవిప్రుడు ఈతడేయని ఊర్వశి గుర్తించి చిఱునవ్వు నవ్వుచు అతనితో ఓ మహాభాగా! నావలన నీకు ఏమి కావలెనో చెప్పుము. నీ మాట ప్రకారము చేయుదును. నీవు నన్ను విశ్వసింపుము. అనెను. నిన్ను నాకు అర్పణము చేసికొని ఓ సుందరీ ! నా ప్రాణములను కాపాడుమని అతడనెను. నేను ఇప్పుడు వ్రత నియమమునందున్నాను. క్షణకాలము నారాకకై వేచియుండుమని ఊర్వశి పలుకగా అతడు సరేయనెను. అమెయు స్వర్గమునకేగి ఒక మాసము తరువాత మరల వారాణసికి గారా ఈ విప్రుడు కృశించి కనబడెను. అతడంతవరకును నిరాహారుడై నదీతీరమందే నిశ్చయముతో నుండెనని అమె తెలిసికొని వృద్దురాలి రూపముధరించి వచ్చి నదీ తీరమున శర్కరతో తేనెతో నేతితో నిండిన శకటమును కావించి మత్స్యోదరీ తీర్థమునకు పోయి స్నానమాడి ఒడ్డునకు వచ్చిశకటముకడ నిలిచి ఈ మూర్ఖబ్రాహ్మణుని పిలిచి ఇట్లు పలికెను. ఓ విప్రా! నేను తీవ్రమగు వ్రతమును సౌభాగ్యము నిమిత్తమాచరించితిని. వ్రతాంతమున ఉద్యాపనమునకై ఇది దానము చేయొచున్నాను. ప్రతిగ్రహించుము. అనెను.

అతడు ఇట్లనెనుః ఇది ఏమి? లోకములో శర్కరతో నిండిన శకటము దానముచేయుదురా? ఓ పూజ్యురాలా ! ఆకలిచే ఎండిన కంఠముతో ఉండి అడుగుచున్నాను. చక్కగా చెప్పుము. ఆమె ఇట్లనెను. ఓ విప్రా! ఈ శకటము శర్కరతోను పిండితోను నిండియున్నది. దీనిని నీవు తీసికొని నీ ప్రాణముల తృప్తినొందించుకొనుము. ఆలస్యము చేయుకుము. ఈ మాటవిని అతడు ఆకలితో భాదపడుచుండియు జ్ఞాపకముచేసికొని ఇట్లనెను. ఓ పూజ్యురాలా! నేనిది తీసికొనను. నేను సిద్దవర్యునికడ శకటమును భక్షింపననినియమును ఊర్వశికి గుర్తుగా చేసితిని. కనుక దీనిని మఱి ఎవ్వరికైన దానము చేయుము. అమె ఇట్లు పలికెను. ఓ విప్రా! పూజ్యుడా ! నీవు కొయ్యతోచేసిన శకటమును తిననని నియమము పూనితిని. ఇది కొయ్యతో చేసినది కాదు. శర్కరతో చేసిన శకటము. దీనిని భక్షింపుము. నీవును ఆకలిచే చాల బాధనొందియున్నావు. బ్రాహ్మణుడిట్లనెను: నేను శకటము అని సామాన్యముగా పలికితిని. కాని దేనితో చేసినది అని విశేషణముతో చెప్పలేదు. ఊర్వశి ఇట్లనెన: ఓ విప్రుడా ! సరే. నీవు తినకున్నను నీ కుటుంబము వారు తిందురు. నీవీ చక్కెరబండిని కొనిపొమ్ము.

బ్రాహ్మణుడిట్లుపలికెను. ఓ సుదతీ ! నేనిపుడింటికి పోవను. మూడులోకముల యందును గుణములచే అందరికంటే అధికురాలును సుందరియు ఆగు అమె ఇక్కడకువచ్చినది. నేను కామార్తుడనై వేడగా క్షణములో వత్తును. ఉండుమని నన్నోదార్చి అమె వెళ్లినది. ఓ వ్రతస్థురాలా! అమెయొక్క సత్యవచనము నందు అను రక్తుడనై అమె సంగమముకోరి అమె వెళ్లి ఇప్పటికి మాసము గడిచినను ఇక్కడనేయున్నాను. ఆ మూర్ఖవిప్రుని మాటలువిని ఊర్వశి తన స్వరూపముధరించి నవ్వుచు భావ గంభీరముగా ఇట్లు పలికెనుః ఓ విప్రుడా ! నీవు నా దర్శనము గోరి హఠముతో నిష్ఠతో కూడిన మనస్సుతో వ్రతమును నిర్వహించినమాట సత్యము. నీవిషయము తెలిసికొనగోరి వచ్చితిని. ఓ విప్రా! నేనే ఊర్వశిని. నిన్ను పరీక్షించి నీవు సత్యతపస్కుడు అను ఋషివని నిశ్చయించితిని. రూపతీర్థమని ప్రసిద్ధిపొందిన శూకరవక్షేత్రమునకు పొమ్ము. అచ్చట నీకు సిద్దికలుగును. అప్పుడు నేను నీకు లభింతును. ఇట్లు పలికి ఆ ఊర్వశి స్వర్గమునకు ఎగిరిపోయెను. అసత్యతపోయి షియు రూపతీర్థమునకుపోయి అచట శాంతిపరుడై నియమవ్రతములను పూని శుచియై జీవించి దేహత్యాగానంతరము ఉత్తమమగు గంధర్వలోకమునకు పోయెను. అచ్చట నూరులకొలది మన్వంతరములు వాస్తవములగు భోగములను అనుభవించి పిమ్మట భూలోకమున ప్రజారంజకుడగు రాజై జన్మించెను. సమగ్రమగు దక్షిణలతో వివిధములగు యజ్ఞములు ఆచరించి కుమారులకు రాజ్యమునప్పగించి మరల శూకరవ క్షేత్రమునకుఏగెను. ఈ రూపతీర్థమున మృతిపొంది ఇంద్రలోకమునకు పోయి అచట నూరలకొలది మన్వంతరము భోగములనుభవించి అచట నుండి దిగి భూమిపై ప్రతిష్టాననగరమున బుధుని కుమారుడగు పురూరవుడుగా జన్మించి ఊర్వశితో సంగమము పొందెను. ఈ విధముగ సత్యతపస్కుడన బ్రాహ్మణుడు శూకరవక్షేత్రమను రూపతీర్థమున శ్రీ మహావిష్ణువును ఆరాధించి భోగములను అనుభవించి ముక్తిని కూడ పొందెను. (ఈప్రతిష్టానగరము ఈనాడు అలహాబాదు.)

ఇది శ్రీ మహాపురాణమగు ఆది బ్రహ్మమున వ్యాసఋషి సంవాదమున ప్రజాగరముచే విష్ణుగాన ప్రశంసా నిరూపణమను నూట ఇరవై రెండవ ఆధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment