Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై మూడవ భాగము

విష్ణుభక్తి హేతు కథనము

వ్రజాగరము చేసి విష్ణుమహిమ గానము చేసి చాండాలుడును ముక్తిని పొందిన విషయము వింటిమి. మహామతి శాలివగు ఓ వ్యాసమహర్షీ ! ఏ తపస్సుచే ఏ కర్మ నాచరించుటచే విష్ణువునందు భక్తికలుగునో ఆ ఉపాయమును మాకు తెలుపుము. వినగోరుచున్నాము. అనిమునులు అడిగిరి.

ఓ మునిశ్రేష్టులారా! మానవునకు మహాఫలప్రదమగు విష్ణుభక్తి కలుగు ఉపాయము క్రమముగా చెప్పెదను. వినుడు. మహాఘోరమును సర్వప్రాణులకు భయమును కలిగించునదియు మహా మోహమును కలిగించునదియు నానా విధములగు నూర్లకొలది దుఃఖములతో నిండినదియు అగు ఈ సంసారమున జీవుడు వేలకొలదిగా తిర్యగ్యోనుల – వృక్ష పశుపక్ష్యాది జన్మముల యందు మరల మరల జన్మించి ఎంతో కష్టము మీద మనుష్య జన్మమును పొందును.

బ్రాహణుడగుట అందును వివేకములుగుట అందును ధర్మమునందు ప్రవృత్తి అందును శ్రేయః ప్రదమయిన వానిని గ్రహించుట దుర్లభము. సంచిత పాపము సంపూర్ణముగా నశించనంతవరకు సర్వజగద్రూపుడగు వాసుదేవుని యందు భక్తికలుగదు. కనుక అందులకు ఉపాయము తెలిపెదను. వినుడు. త్రికరణములతో శుద్ధిగా అన్యదేవతల యందు మనస్సునిలిపి అనుష్ఠించు భక్తివలన యజ్ఞములు చేయుటయందు శ్రద్దకలుగును. అప్పుడు అగ్నియందు భక్తికలిగి యజ్ఞములు చేసి అగ్నిని తృప్తి నొందించుటచే సూర్యునియందు భక్తికలుగును. భాస్కరుని ఉపాసించి అతనిని ప్రీతునిగా చేయుటవలన శంకరునియందు భక్తికలగును. విధివిధానానుసారము శంకరుని ఆరాధించి అతనిని తుష్టి నొందించుటవలన విష్ణునియందు భక్తికలుగును. జగద్రక్షకుడును అవ్యయుడును- నాశనములేనివాడు – అగు వాసుదేవుని సంపూజించుటవలన నరుడు భుక్తిని ముక్తిని పొందును.

ఓ మహాముని ! లోకమున వైష్ణవులు కానివారు కొందఱు కొనబడుటకును వారా విష్ణుపునర్చింపకుండుటకును హేతువేమని మునులు వ్యాసునడిగిరి.

ఓ మునిశ్రేష్టులారా! స్వయంభూ బ్రహ్మచేయు ఈ భూతసృష్టి దైవీసృష్టి అసురసృష్టి అని రెండువిధములు దైవీ ప్రకృతి – స్వభావము. కలవారు విష్ణుని భక్తితో అర్చింతురు. అసురీ ప్రకృతి కలవారు హరిని ధూషింతురు. అసురీ ప్రకృతిగల నరాధములు మాయచే విజ్ఞానము నశించినందున విష్ణుని చేరలేక అధమగతిని పొందుదురు. విష్ణుని మాయ గంభీరమైనది. సురాసురులకును తెలిసికొన శక్యముకానది. మహామోహము కలిగించునది. సంస్కారము నొందిన మనస్సులులేని వారికి దాట శక్యముకానిది.

ఓ ధర్మజ్ఞా ! సుదుస్తరమగు విష్ణుని మహామాయను గూర్చి తెలిసినకొన కుతూహలమగుచున్నది. తెలుపుము.

లోకములను ఆకర్షించు ఆ విష్ణుమాయ స్వప్నముతో ఇంద్రజాలముతో సమానమైనది. దానిని విష్ణువు తప్ప మరెవ్వరును తెలిసికొనజాలరు. మాయ విషయములో ఒక బ్రాహ్మణునకును నారదమహర్షికిని కూడ జరిగిన మోసము తెలిపెదను వినుడు. ఒక నగరమును పూర్వము అగ్నీధ్రుడగు కామదమనుడు అను రాజుండెడివాడు. అతని కుమారుడు పవిత్రుడు, ధర్మమునందే ఉండి ఆనందము పొందువాడు, క్షమాశీలము పితృసేవాసక్తి ప్రజలను రంజించు సమర్థత కలవాడు, వేదములయందు శాస్త్రములయందు పరిశ్రమ చేసినవాడు. తండ్రి అతనికి పెండ్లి చేయ యత్నించెను. అతడు ఇష్టపడలేదు. నాయనా! నీవు పెండ్లాడ ఇష్టపడని కారణమేమి? మునుజులు భార్యవలన సుఖములు లభించునను తలపుతోనే కదా పెండ్లాడుదురు. కనుక నీవును వివాహము చేసికొనుము. అని తండ్రి పలుకగా అయనయందలి గౌరవముచే కుమారుడు ఏమియు సమాధానమీయక ఊరకుండెను. ఐనను మరల అడుగగా అతడు తండ్రితో ఇట్లు పలికెను. నేను అభివ్యక్తము పరిపాలింపదగినదియు విష్ణునికి సంబంధించినదియును అగు ”నామానురూపతా” నామమునకు తగినట్లుడచుట అనునియమమును ఆశ్రయించితిని అనెను. తండ్రి ఇట్లు పలికెను. కుమారా? ఇది ధర్మముకాదు. వివేకియగు పురుషుడు తండ్రి అజ్ఞకు విరుద్ధముగా ఆలోచింప దగదు. నాకు నీపై అధికారము కలదు. నామాట పాలింపుము. సంతతి ముందునకు సాగకపోవుటచే నా వంశము నరకములో మునుగునట్లు చేయకుము. అనెను. తండ్రి ఇచ్చిన ఈ అజ్ఞను విని ఇంద్రియనిగ్రహము కల ఆ కుమారుడు అనాదిసిద్ధముగా నున్న ఈ సంసారవు విచిత్రస్థితిని జ్ఞాపకము చేసికొని ఇట్లు పలికెను.

నాయనా ! సహేతుకమగు తాత్త్విక విషయమును చెప్పెద వినుము. ఓ రాజా! నామమునకు అనుగుణముగా ఆచరించుట కర్తవ్యము. అనునది సత్యము. నేను ఎన్నియో జన్మములు జరామరణములు భార్యలతో సంయోగ వియోగములు గడ్డి పొదులు,తీగలు,సరీసృపములు, ప్రాకెడిపామువంటి ప్రాణులు, మృగములు,పక్షులు,పశువులు, మానవులలో స్త్రీ పురుషులు మొదలగు రూపములు ఎన్నియో పొందితిని. గణదేవతలగు వసురుద్రాదిత్యులు, కిన్నెర, గంధర్వ,విద్యాధరనాగులు యక్షగుహ్యక రాక్షసులు, దానవులు,అప్సరసలు,దేవతలు, సముద్రములు మొదలగు అనేక రూపములలో సృష్టింపబడితిని. సంహరింపబడితిని. దారలతో సంయోగమువలన నాకు కలిగిన మోసము ఇటువంటిది. ఈ జన్మనుండి పూర్వము మూడవ జన్మమున జరిగినదియు తీర్థ మాహాత్మ్యముతో సంబంధించినదియు అగువృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నేను నరదేవగంధర్వ నాగ విద్యాధర గరుడ కింనరాది జన్మములు అనేకములు పొందిన తరువాత సుతపస్కుడను మహా ఋషిగా జన్మించితిని. అట్టినాకు లోకములకు ప్రభువు,మధువను రాక్షసుని వధించినవాడునగు జనార్దనునియందు స్థిరమగు భక్తి కలిగెను. చక్రగదా ఖడ్గదారియగు విష్ణుని వివిధములగు వ్రతములచే ఉపవాసములచే మెప్పింపగా ఈ మహాత్ముడు నాకు వరమీయ గోరి గరుడుని ఎక్కి వచ్చి ఓ బ్రాహ్మణా ! నీకు కావలసిన వరము ఏదో కోరుము. ఇచ్చెదను. అని బిగ్గరగా పలికెను. నీకు నాపై ప్రీతి కలిగినచో నీ మాయాతత్త్వమును నాకు తెలుపుమని కోరితిని. ధర్మార్థ కామములను శ్రేష్టులగు పుత్రులను బాధా రాహిత్యమును ఇత్తును. తీసికొనుము. నా మాయను తెలిసికోని ఏమి చేయుదువు? అని విష్ణువనెను. ధర్మార్థ కామాది పురుషార్థములు చేతనైనను జయింపవలసినది నీ మాయనే కావున నేను దాని తత్త్వమును తెలిసికొనగోరుచున్నాను. కనుక ఓ పుండరీకాక్షా! నీకు నీ మాయాతత్త్వమును చూపుము. అని నేనంటిని.

నా మాయ ఇంతవరకు ఎవరును ఎఱుగరు. ఇక ముందును తెలిసికొనజాలరు. పూర్వము బ్రహ్మకు కుమారుడును దేవర్షియు అగు నారదుడు భక్తియుక్తుడై నీవు వలెనే నన్ను ఆరాధించి మెప్పించెను. నేనతనికి వరమీయబోవ అతడును ఇదే కోరును. నే నెంతగా వలదు అని చెప్పినను అతడు మూఢుడై ఈ వరమునకై పట్టుపట్టెను. అంతట నేనతనితో నారదా! నీవు నీటిలో మునిగినచో నా మాయ తెలియునంటిని. నారదుడు నామాట ననుసరించి నీట మునిగిలేచి సుశీలయను కాశిరాజ పుత్రిగాఅయ్యెను. ఆమె వనవతి ఐనతరువాత ఆ రాజామెను విదర్భ రాజకుమారుడగు సుధర్మున కిచ్చి వివాహము చేసెను. ఆ సుధర్ముడు ఈమెతో కామసుఖమును అనుభవించెను. తన తండ్రి స్వర్గమునకు ఏగిన తరువాత ప్రతాపవంతుడగు ఆ సుధర్ముడు అతని విదర్భ రాజ్యమునకు పాలకుడై పుత్త్రపౌత్త్రులతో కూడి సంతోషముతో నుండెను. ఇట్లుండ కాశీరాజును సుధర్మునకును యుద్ధముజరిగెను. తమ పుత్త్రపౌత్త్రులతోకూడ ఇరువురును నాశము నొందిరి. ఈ విషయముతెలిసి యుద్ధరంగమునకు పోయి సుశీల చాల తడపుశోకించి ఆర్తురాలై తల్లికడకుపోమెను. మఱియు మరణించిన తన తండ్రిని భర్తను వారి వారి పుత్త్రపౌత్త్రాదులను తీసికొని గొప్పచితిని పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేసి హాపుత్త్రా! హాపుత్త్రా! అని శోకించుచు అగ్నిలో ప్రవేశించెను. వెంటనే ఆమె నారదుడయ్యెను. ఆ అగ్ని స్ఫటిక మువలె నిర్మలమును చల్లనిదియునై నిండు సరస్సయ్యెను. అతని ఎదుట నిలిచి దేవ శ్రేష్టుడగు విష్ణువు బిగ్గరగా నవ్వి దేవర్షియగు నారదునితో ఇట్లు పలికెను! మహర్షీ! నీకుమారుడు ఎవ్వరు? బుద్ది పొగొట్టుకొని ఎవరిని గూర్చి శోకించుచున్నావు? అది విని నారదుడు సిగ్గుపడెను. నేను (శ్రీ మహావిష్ణువు) అతనితో మరల ఇట్లంటిని: ఓ నారదా! నామాయ ఇటువంటిది. చాలా కష్టరూపమయినది. బ్రహ్మ రుద్రుడు మహేంద్రుడుకూడ దీని ఎఱుగలేరని నేవేమి తెలిసికొనగలవు? ఈ నా మాయ ఇట్టిదని ఊహించుటకును అలవి కానది.

నారదమహర్షి నామాట విని ఇట్లుపలికెను. ఓ విష్ణూ! నాకు నీయందు భక్తిఇమ్ము. సమయమువచ్చినప్పుడు నీ సంస్మరణమును సందర్శనమును నాకు లభించుగాక! నేను ఇప్పుడు అర్తుడనై చితిని ఆరోహించిన స్థలము తీర్థముగానై ఓ అచ్యుతా! కేశవా! పాపనాశకుడవగు నీచేతను బ్రహ్మదేవుని చేతను అధిష్ఠింపబడినది అగుగాక! నారదుని కోరికవిని ఓ బ్రాహ్మణా! సుతపో మహర్షీ! నేను (శ్రీ మహావిష్ణువు) ఇట్లంటిని. ఓ నారదా! కాశిరాజకన్యగా నీవు చితిచేసిన తావు సితోదమను తీర్ధమగును. నేనును మహేశ్వరుడును దీనియందు నిలిచెదము. ఉగ్రముగా మాటలాడిన బ్రహ్మ యొక్క ముఖమును శివుడు త్రుంచిన తరువాత ఆతడు ఈ తీర్థమున స్నానముచేయగనే ఆ బ్రహ్మకపాలము ఈ తీర్థస్థానమున భూమిపై పడును. అంతటనుండి దీనికి కపాలమోచన తీర్థమను ప్రఖ్యాతి ఏర్పడును. అప్పటినుండి ఈ పుణ్యతీర్థమునందు ఇంద్రుడు నిరంతరము నిలిచియుండును. ఇంద్రునికి విడువని బ్రహ్మవధ దోషము అంటగా అతడు దాని నిచ్చట విడిపించుచుకొనును. కాన దేవతలను ఈ రహస్యమగు మహాతీర్థమును విముక్తతీర్థమని ప్రసిద్ధము చేయుదురు. నరుడు ఎన్ని మహాపాపములు చేసినవాడైనను ఈ తీర్థమున ప్రవేశించి ఏమరుపాటులేక స్నానమాడి శుచియై నన్ను స్మరించినచో శుద్ధుడై భగవదను గ్నహముపొంది ముక్తుడగును. రుద్రపిశాచమను మహాపాపుడు అనేక జన్మములంది దుఃఖములనుభవించును. అతడట్లు జన్మపరంపరలతో పాపము నశించి అనేక సహస్ర సంవత్సరముల తరువాత విప్రగృహమున జన్మించును. అతడా జన్మములో మహా నిగ్రహము కలువాడగును. అతని అంతకాలమున రుద్రుడు హితకరమగు తారకమంత్రము అతనికి ఉపదేశించును. ఓ విప్రా? నేనిట్లు నారదునకు చెప్పి నా నివాసమగు క్షీరసాగరమునకు వెళ్ళితిని. విప్రుడు-నారదమహర్షియును గంధర్వ రాజుచే సమర్పించబడుచు స్వర్గమున సంచరించెను. ఓ సుతపోమహామునీ! నిన్ను ప్రబోధించుటకై నీకు ఈ నారద వృత్తాంతము తెలిపితిని. నా మాయను నీవు ఎఱుగజాలవు. నీవది తెలిసికొనగోరినచో ఈ కోకాముఖ తీర్థమందు మునుగుము. అని విష్ణువు పలికెను.

విష్ణుని వచనమును అనుసరించి విప్రుడగు సుతపొమహాముని తన భవిష్యత్‌ ఫలమునకు వశుడై ఆ నీట మునిగెను. నాయనా! ఆ బ్రాహ్మణుడు వెంటనే చండాలగృహమున కన్యగానయ్యెను. ఆమె మంచిరూపము శీలము గుణములు కలది. క్రమముగా వనవంతురాలు కాగా ఆమెకు రూపహీనుడగు సుబాహుడను చండాల కుమారునితో వివాహమయ్యెను. భర్త ఆమెకు ఇష్టుడు కాలేదు. కాని భర్తకు ఆమె ఇష్టురాలయ్యెను. ఆమెకు ఇద్దఱు అంధులగు కుమారులును ఒక చెవిటి కుమార్తెయు కలిగిరి. భర్త దరిద్రుడు. అందుచే ఆ అమాయకురాలు అనుదినము నదికిపోయి ఏడ్చుచుండెడిది. ఒకానొకప్పుడా చండాల కన్యక బిందె తీసికొని నదికిపోయి స్శానమునకై నీటిలో ప్రవేశించి లేవగనే కర్మయోగమునందు అసక్తుడగు సుతపో మహామునియను బ్రాహ్మణుడుగా – మొదటి రూపమునకు-మారెను. భర్తయగు సుబాహుడును భార్య నదికిపోయి చాలసేపయినదేయని నదికి వెడలి అచట కడవ మాత్రముండి ఒడ్డున ఆమె కనబడకపోవుటచే మహాదుఃఖమున ఆ ప్రదేశము మారు మ్రోగునట్లు ఏడువసాగెను. అంతలో గ్రుడ్డి కుమారులును చెవిటి కూతురును అచటికి వచ్చి తమతండ్రి ఏడ్చుచుండుట చూచి తామును ఏడువసాగిరి. తరువాత సుబాహుడు అచ్చటనున్న బ్రాహ్మణులను మీరెవరైన నీటికి నదిలో దిగిన యువతిని చూచితిరా! చెప్పుడు అని అడిగెను. ఆమె నదిలో దిగుట చూచితిమి. కాని పైకి వచ్చినట్లు చూడలేదు. అని వారు చెప్పిరి. భయంకరమగు ఆమాట విని సుబాహుడు కన్నీళ్ళు కారుచుండ గట్టిగా ఏడువ నారంభించెను. ఓ రాజా ! అట్లు అతడును కొడుకులును కూతురును ఏడ్చుట చూచి నాకు చాలా బాధ కలుగుటతోబాటు నేనే అంతవరకు చండాల కన్యకగా ఉంటినను విషయము స్మరణమునకు వచ్చెను. అందుచే నేనా సుబాహునితో నీవిట్లు ఎందులకు అర్తుడవై ఏడిచెదవు? మూర్ఖుడవై ఎంత ఏద్చినను ఆమె నీకు లభింపదు. అంటిని. అతడు నాతో ఇట్లనెను. ఓ బ్రాహ్మణా! ఈ కుమారులు ఇద్దరును గ్రుడ్డివారు. కుమార్తె చెవిటిది. దుఃఖించుచున్న వీరిని నేను ఎట్లు ఓదార్చ గలను? ఎట్లు పెంచి పెద్ద చేయగలను? ఇట్లు పలికి అతడు కుమారులతో కుమార్తెతో కూడ వెక్కివెక్కి ఏడువసాగెను. అతడు ఏడ్చినకొలది నాకు వారిపై దయ కలిగెను. అందుచే నతని ఏడ్పు మాన్పించి నా వృత్తాంతము నాతనికి తెలిపితిని. అతడును మిగు ఆర్తుడై ఆ కోకాముఖ తీర్థమున మునిగెను. నీటిలో ప్రవేశించగనే ఆ తీర్థ ప్రభావమున వాడు పాపములనుండి ముక్తుడై నేను చూచుచుండగనే చంద్రునివలె ప్రకాశించెడి విమానమెక్కి స్వర్గమునకు పోయెను. అతడట్లు మరణించగనే కును మోహకరమగు మనోవ్యథ కలిగెను. ఓ రాజశ్రేష్ఠా! నేనును మహాపవిత్రమగు కోకాజలమున మునిగి స్వర్గమునకు వెళ్ళితిని.

తరువాత జన్మమున వైశ్యకులమునందు వ్యథతో బాధపడువాడనుగా కోకాముఖ తీర్థ ప్రభావమున పూర్వజన్మ స్మృతి కలవాడనుగా జన్మించితిని. అంతటనేను చాలవైరాగ్యము చెంది వాక్కును మనస్సును నిగ్రహములో ఉంచుకొని కోకాముఖతీర్థమునకు వెళ్ళితిని. అచ్చటనే వ్రతము పూని శరీరము కృశింపజేసికొని దేహత్యాగముచేసి స్వర్గమును పొందితిని. స్వర్గమునుండిదిగి భూలోకమునందు కూడ విష్ణుని అనుగ్రహము వలన పూర్వజన్మస్మృతి కలవాడనుగా నీయుంట పుట్టితిని. ఇట్లు నేను శ్రీమహావిష్ణుని ఆరాధించి కోకాముఖతీర్థమున శుభాశుభములగు కోరికలు ఏవియు లేకుండ వదలుకొనిన వాడనైతిని. అని పలికి ఆరాజకుమారుడు తండ్రిని నమస్కరించి శ్రేష్ఠమగు కోకాముఖతీర్థమునకు పోయి అ మనుజ శ్రేస్ఠుడు వరాహరూపుడగు శ్రీమహావిష్ణునారాధించి సిద్ధినిపొందెను. ఇట్లు ఆ కామదమనుడనునతడు తన పుత్రపౌత్త్రులతో కూడ మహాపవిత్రమగు కోకాముఖతీర్థమున అపవిత్రమగు మానవశరీరమును విడిచి సూర్య సమములై ప్రకాశించెడి విమానములలో స్వర్గమునకేగెను.

ఓ బ్రాహ్మణులారా! దేవతలకు ఊహింప అలవి కానిదియు స్వప్నముతోను ఇంద్రజాలముతోను సమానమును లోకమును మోహపరచునదియునగు పరమేశ్వరుడగు విష్ణునిమాయను మీకు తెలిపితినని వ్యాసమహాముని పలికెను.

ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రాహ్మమున విస్ణుధర్మాను కీర్తనమున మాయాప్రాదుర్భావ నిరూపణము అను నూట ఇరవై మూడవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment