Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఆరవ అధ్యాయం

శుక్రగ్రహ జననం మూడవ భాగము

”బుద్ధికి బృహస్పతి”అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !” నారదుడు అన్నాడు.”

“ఊ… చూస్తుంటే – ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !” వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు.

“నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తరువాతే సుమా !” నారదుడు నవ్వాడు.

“నువ్వు సురపక్షపాతివి కాకపోతే , ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి వుండే వాడివి నారదా ?” వృషపర్వుడు ఉక్రోషంతో అన్నాడు.

“నారాయణ ! నువ్వెవరు ? నేనెవరు ? వీరి తండ్రి కశ్యప ప్రజాపతి. ఆయన తండ్రి మరీచి మహర్షి. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. నీకు తాతగారు. నేనెవరు ! బ్రహ్మగారి మరొక మానసపుత్రుడ్ని , నీ పితామహుడు మరీచికి సోదరుణ్ని. ఆ సుర బృందమూ , మీ అసుర బృందమూ అక్కచెళ్లెళ్ల బిడ్డలు , సోదరులు. కాకపోతే దాయాదులు. నాకు మీరూ , మీరూ అందరూ ఒక్కటే ! ఈ నారదుడికి పక్షమూ లేదు ; పాతమూ లేదు !”

“మాటలలో , పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారదా !” వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు.

“సరే ! నేను సురపక్షపాతిని కాను , అని నిరూపించడానికే వచ్చాను. అక్కడ ఒక గురువు వున్నట్లు ఇక్కడ ఒక ”సద్గురువు” వుండాలన్న ఆలోచన నాది…”

“అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు !” వృషపర్వుడు కసిగా అన్నాడు.

“నారాయణ ! ఆ బృహస్పతిని మరిచిపో , వృషపర్వా ! ఆలోచనలో , ఆచరణలో , వ్యూహ రచనలో – ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి వుంచాను. అంకుశం లాంటి నిశితమైన బుద్ధి ! నిరంకుశమైన వైఖరి ! ముఖ్యంగా జాగ్రత్తగా విను – ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి. ఇన్ని అద్భుత లక్షణాలున్న…”

“ఎవరావ్యక్తి !” వృషపర్వుడు నారదుడి వాక్ ప్రవాహానికి ప్రశ్నతో అడ్డుకట్ట వేశాడు.

“బ్రహ్మ మానస పుత్రశ్రేష్ఠుడు భృగుమహర్షి తెలుసు కదా ! ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు….”

“ఈ విషయాలు మాకు ఎరుకేలే , నారదా !” వృషపర్వుడు అడ్డు తగిలాడు.

“ఆ దంపతుల పంచమ పుత్రుడు – ”ఉశనుడు”… మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనడు , ఆ బృహస్పతికి దీటైన వాడు. సమ ఉజ్జీ ! నిజం చెప్పుకోవాలంటే – బృహస్పతి కంటే – రెండాకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశమేమిటంటే – తల్లి పులోమ ఉశనుడికి ఆ సుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. ఆ ఉశనుడు ఏ తపో దీక్షలోనో పూర్తిగా మునిగిపోక ముందే… పట్టుకోవడం మంచిదని నా సూచన !”

“మా సూత్రధారిగా వ్యవహరించి , కార్యం సానుకూలం చేయవచ్చు కదా , నారదా !” వృషపర్వుడు ఆశగా అడిగాడు.

“నారాయణ ! అందుకేగా వచ్చాను ! ఇంద్రుడికి ఒక గురువును సూచించాను. నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ! ఎంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది.”

“ఇంతకాలం నారదుడు ‘సురపక్షపాతి’ అని అనుకునే వాణ్ని ! వాస్తవానికి నువ్వు ”అసురపక్షపాతి” అని ఇప్పుడు అర్థమవుతోంది నారదా !” వృషపర్వుడు చిరునవ్వుతో అన్నాడు.

“నారాయణ ! అసురులకు ఆవేశం అధికం అని ఊరికే అన్నారా” నారదుడు నవ్వుతూ అన్నాడు.

“భృగుమహర్షి ఆశ్రమానికి…”

“ఉగ్రా ! రథం సిద్ధం చెయ్ !” నారదుడికి అడ్డు తగుల్తూ ఆవేశంగా అన్నాడు. వృషపర్వుడు.

“అసుర గురువుగానా?” భృగుమహర్షి సాలోచనగా అన్నాడు.

“ఔను ! మాకు మార్గ నిర్దేశకులు కరువయ్యారు. విద్యాదానం చేసే ఆధ్యాపకులు లేరు. ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు. మీరు అంగీకరించాలి , మా కులాన్ని ఆశీర్వదించాలి !” వృషపర్వుడు వినయంగా అన్నాడు.

“సరే అనండి , భృగుమహర్షీ ! దైత్య దానవ బాలకులూ , యువకులూ విద్యా గంధం లేకుండా వున్నారు. పాపం !” నారదుడు అందుకుని అన్నాడు..

“ప్రసాదించండి” పులోమ కల్పించుకుని అంది.

భృగుమహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వింది. “ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడిలాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను.”

“నాన్నగారూ !” అంత వరకూ మౌనంగా ఉన్న ఉశనుడు అన్నాడు. “అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం. నాన్నగారూ !”

భృగుమహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.

“మీ అందరి అంగీకారాన్ని ఆమెదించకుండా ఎలా ఉంటాను ! ఉశనా ! అసుర గురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా !”

“మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని తెచ్చి ఇస్తుంది. నాన్నగారూ !” ఉశనుడు వినయంగా , సగర్వంగా అన్నాడు..

“అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా ఋణపడి ఉంటుంది , మహాత్మా !” వృషపర్వుడు భృగుడికి పాదాభివందనం చేశాడు.

“మాతా ! దీవించండి !” అంటూ పులోమ పాదాలు స్పృశించాడు.

“వృషపర్వా ! ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం…” నారదుడు హెచ్చరించాడు.

“శుభస్య శీఘ్రం ! వృషా ! నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు” భృగుమహర్షి అన్నాడు.

“అంగరంగ వైభవంగా , ఆ దేవతలను మించి , మా గురుదేవులను పట్టాభిషిక్తుల్ని చేస్తాను !” వృషపర్వుడు ఆవేశంగా అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment