నైమిత్తిక ప్రాకృత ప్రళయకథనము
వ్యాసుడిట్లు మునులతో పలికెను: – ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ ప్రళయ మేఘములు వర్షించుటచే కలిగిన జలము సప్తమహర్షులుండు స్థానము వరకు వ్యాపింపగా ఈ త్రైలోక్యమంతయు ఏక సముద్రమగును. విష్ణువంతట తన నిట్టూర్పు వాయువుతోనే నూరేండ్లకు పైబడిన కాలవ్యవధిలో నశింపజేయును. సర్వ భూతమయుడును ఊహింపనలవి కానివాడు భూతములనన్నిటిని సృష్టించువాడు అదిలేకయు లోకమునకు అదియగు విష్ణుభగవానుడు వాయువునంతటిని పూర్తిగా పీల్చివేసి బ్రహ్మరూపమును ధరించి ఆఏకార్ణవమున శేషశయ్యపై పరుండును. అప్పుడతనిని జనలోకమందలి సనకాది సిద్ధులు బ్రహ్మలోకమునందలివారు స్తుతించుచుందురు. మోక్షము కోరినవారు ధ్యానించుచుందురు. ఆ పరమేశ్వరుడు వాసుదేవుడను తన స్వరూపమును చింతించుచు తన స్వమాయారూపయగు యోగనిద్ర నాశ్రయించి యుండును. ప్రళయాంతమున హరి సృష్టికి నిమిత్తకారణుడుగా బ్రహ్మ రూపము ధరించి శయనించియుండుటచే దీనికి నైమిత్తిక ప్రళయమనిపేరు. వేయి చతుర్యుగముల పరిమాణముకల బ్రహ్మదేవుని పగటి వలెనే అతని రాత్రియు అంతే పరిమాణముకలది. అంత కాలము గడచిన తరువాత విష్ణువు మరల బ్రహ్మయొక్క రూపముతో సృష్టిని ఆరంభించును. ఇట్లు ఓ విప్రులారా! మీకు నైమిత్తిక ప్రళయ విధము తెలిపితిని. ఇక ప్రాకృతప్రళయము తెలిపెదను వినుడు.
అనావృష్టి అగ్ని మొదలగు ఉపద్రవములతో భూలోక పాతాళాది లోకములందలి ఉపరి తలమున గల పదార్థములన్నియు మొదట నశించును. తరువాత విష్ణుని ఇచ్ఛకు లోబడి మహాదాది ప్రకృతి వికారములన్నియు నశించును. ఇదే ప్రాకృత ప్రళయము. దాని క్రమమిది. మొదట జలము పృధివియొక్క గంధగుణమును హరించును. అంతట పృథివియు జలరూపము ధరించును. అపుడవి మహాధ్వనితో మహావేగమున ప్రవహించి లోకాలోక పర్వతమువరకు నిండిపోవును. అంతట అగ్నితత్త్వము జలమును దానిలోని రస తన్మాత్రను హరించును. అంతట జలము జలరూపము వదలి అగ్నిగానగును. అపుడీజలమంతయు పృథివిలేక జలములేక కేవలమగ్నిజ్వాలలతో నిండియుండును. అంతటవాయువు అగ్నియొక్క విశేషగుణమగు రూపతన్మాత్రను హరించును. అప్పుడు అగ్నియంతయు అగ్నిత్వమును కోల్పోయి వాయువుగానగును. ప్రపంచమంతయు వాయువుమాత్రమే అయి అది పదిదెసల వీచుచుండును. అంతలో అకాశము వాయువు యొక్క విశేషగుణమగు స్పర్శ తన్మాత్రను తనలోనికి లయము చేసికొనుటచే వాయువు వాయువుగానుండక లయము నొందుటచే అంతటను ఆకాశము కేవల శూన్యతత్త్వము మాత్రము-ఉండును. అంతలో ఆకాశముయొక్క విశేషగుణమగు శబ్దతన్మాత్రను భూతాది తత్త్వము తనలో లయమొందించుకొనును. అదియు మహత్తత్త్వము నందును – అదియు ప్రకృతి యందును లయమునొందును. అదియే త్రిగుణముల సామ్యావస్థ. అనగా అప్పుడు సత్త్వరజన్తమో గుణములలో ఏయొక్కటియు ఎక్కువగ ఉద్రేకింపక మూడును సమస్థితిలో నుండును.
ఈ ప్రకృతినే ప్రధానహేతువు పరమ కారణము అనియు వ్యవహరింతురు. ఇది వ్యక్త-అవ్యక్త-స్పష్ట-అస్పష్ట స్వరూపము కలది. ఈ వ్యక్తావ్యక్తతత్త్వము అవ్యక్తత్త్వములో లయమునందును. ఆ అవ్యక్తమే అక్షరము – నాశము లేనిది-నిత్యము-సర్వవ్యాపియై యుండును. అదియు సర్వభూతాత్మకుడగు పరమాత్మయొక్క అంశమే. సత్తామాత్ర- జ్ఞానమాత్ర-సత్-చిత్-రూపుడును అన్నితత్త్వములకంటె గొప్పవాడును అగు ఆపరమాత్మునందే ఈ ప్రాపంచిక వ్యవహారమునకు సంబంధించిన నామము-జాతి- మొదలగు కల్పనలన్నియు లయము పొందును. ఆ తత్త్వమే బ్రహ్మము-పరంధామము పరమాత్మ – పరమేశ్వరుడు విష్ణువు అనబడును. అతనిని చేరినవారు మరల జన్మలోనికిరారు. వ్యక్తా వ్యక్త స్వరూపయగు ప్రకృతియు అవ్యక్తరూపుడు అక్షరుడును – పురుషుడును ఈ రెండును పరమాత్మయందు లయ మగును. అయనయే అన్నితత్త్వములకును అశ్రయమగుచోటు. అతడు విష్ణువను పేరుతో వేదముల-వేదాంతముల-యందు గానము చేయబడుచున్నాడు. వేదోక్తమగు కర్మలు ప్రవృత్తి ప్రధానములు నివృత్తి ప్రధానములు అని రెండు విధములు. ఋగ్యజుః సామవేదానుసారియగు మార్గమున యజ్ఞేశ్వరుడుగా యజ్ఞపురుషుడుగా పరమాత్మనారాధించుట ప్రవృత్తి మార్గము. జ్ఞానమూర్తి – చిద్రూపుడు – అగు ఆయనను జ్ఞానయోగమున ఉపాసించుట నివృత్తి మార్గము. ఆయన తత్త్వము వాక్కులకు అందరానిది. ద్విపరార్ధపరిమితిగల కాలము విష్ణువునకు ఒక పగలు – అంతే ఆయనకు రాత్రి పరిమాణమును. ఇదికూడ లోకసామ్యమునుబట్టి చెప్పుటయేకాని ఆపరమాత్మునకు పగలును రాత్రియు అనునవి లేవు. ఓ ఋషులారా! ఈ చెప్పినది ప్రాకృతలయస్వరూపము.
ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున ప్రాకృతలయ నిరూపణము అను నూట ఇరవై ఏడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹