Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఏడవ అధ్యాయం

శుక్రగ్రహ జననం నాల్గవ భాగం

వృషపర్వుడు అన్నట్టే మహా వైభవంగా ఉశనుడి స్వీకారం జరిగింది. అసుర బాలకుల విద్యా బోధనకూ , రాజసభలో మంత్రాలోచనకూ ఉశనుడు ఆరోజే నాందీ ప్రస్తావన పలికాడు.

దేవతల పట్ల అసూయ అంతస్సూత్రంగా సాగుతున్న ఉశనుడి విద్యాబోధన అసురలందరికీ మహదానందాన్ని కలిగిస్తోంది.

అచిరకాలంలోనే తన మేధస్సుతో వృషపర్వుడిని కూడా శాసించే స్థితికి చేరుకున్నాడు. ఉశనుడు. అసుర గురువుగా ఆయన ప్రస్థానం విజయ పథంలో సాగిపోతోంది.

నిర్వికల్పానంద నీళ్ళు తాగి , రాగి పంచపాత్రను అరుగు మీద పెట్టాడు. శిష్యుల వైపు చిరునవ్వుతో చూసి , ప్రారంభించాడు.

“నవగ్రహ దేవతలలో ఒకడైన బుధుడి జన్మవృత్తాంతం చంద్రుడు , బృహస్పతి , శుక్రుడు (ఉశనుడు) అనే ముగ్గురు గ్రహ దేవతల చరిత్రలతో ముడిపడి ఉందని చెప్పాను కదా ! ఆ ముగ్గురి జన్మ వృత్తాంతాలూ మీరు విని ఉన్నారు. ఇప్పుడు అన్వయ క్లిష్టతకూ , గందరగోళానికీ అవకాశం లేని విధంగా – బుధుని జననగాధ వినవచ్చు !

అనసూయ , అత్రి దంపతుల కుమారుడిగా చంద్రుడు జన్మించిన కథాంశం మీకు గుర్తుండే ఉంటుంది. అత్రి మహర్షి , తగిన వయసులో చంద్రుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు.

“చూడచక్కని వాడైన తన ముద్దుల కుమారుడ్ని అనసూయ మురిపెంగా చూసుకుంటోంది. తన అందంతో , ప్రవర్తనతో తల్లినీ , విద్యార్జనతో తండ్రినీ సంతోషపెడుతూ , చంద్రుడు , బాల్యాన్ని అధిగమిస్తూ , యవ్వనం వైపు అడుగులు వేస్తున్నాడు. తల్లి అనసూయ కుమారుడి వివాహ విషయం భర్త అత్రి ముందు ప్రస్తావించింది. చంద్రుడు తన దగ్గర అభ్యసించిన విద్య గోరంతనీ , ఇంకా కొండంత నేర్చుకోవాల్సి ఉందనీ , విద్యాభ్యాసం పూర్తి కానిమ్మనీ అన్నాడు అత్రి… “నిర్వికల్పానంద తన కథనాన్ని కొనసాగించాడు.

“ఓం !” అన్నాడు ఆ పూట పాఠం ముగించిన అత్రి మహర్షి తండ్రిని అనుసరిస్తూ చంద్రుడు కళ్ళు మూసి , ప్రణవ ధ్యానం చేశాడు. ఆశ్రమం ముందు చల్లని చెట్టు నీడలో విద్యాభ్యాసానికి కూర్చున్న చంద్రుడు లేవబోయాడు. “చంద్రా… నీతో మాట్లాడాలి , కూర్చో !” అత్రి అన్నాడు.

చంద్రుడు అలాగే కూర్చుని , తండ్రి వైపు మౌనంగా చూశాడు.

“నీ చదువు నా పరిమితిలో మాత్రమే పూర్తయింది. ఇంకా పరిణతిని అందుకోలేదు’ అత్రి నవ్వుతూ అన్నాడు. “ఎందుకంటే , విద్యా భాండాగారంలో ఎంతో ఉన్నది. పూర్వాంశమే నేను బోధించాను. ఉత్తరాంశాన్ని గురు శుశ్రూష చేస్తూ నువ్వు అభ్యసించాలి.”

“నాకు తెలీదు. అందువల్ల అడుగుతున్నాను. మీకు తెలియని విద్య ఉందా. చెప్పండి !” అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయ అడిగింది అత్రిమహర్షిని. “మీ కన్నా జ్ఞానులు ఎవరున్నారని ?”

“అదే మన చంద్రుడికి చెప్పబోతున్నాను !” అత్రి అనసూయ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. “మా సోదర మానస పుత్రులు అంగిరసులున్నారు కదా. ఆయనకు ‘బృహస్పతి’ అనే కారణజన్ముడు పుత్రుడుగా పుట్టాడు. ప్రజ్ఞకూ , ఉపజ్ఞకూ , ఆ బృహస్పతి పుట్టినిల్లు. అనన్య సామాన్యమైన మేథ ఆ బృహస్పతిని దేవ గురువుగా చేసింది…”

“ఔనౌను ! అతని వివాహానికి వెళ్ళాం కూడా. మనం !” అనసూయ అంది.

“బృహస్పతి ప్రస్తుతం ఆశ్రమ విద్యాలయం నెలకొల్పి , అర్థులకూ , అర్హులకూ అత్రి విద్యాదానం చేస్తున్నాడు. మన చంద్రుణ్ణి ఆయన వద్దకు పంపుతున్నాను….” అన్నాడు.

అనసూయ కొడుకుని వాత్సల్యంతో చూస్తూ అంది. “మన చంద్రుడికి ఆ బృహస్పతి తగిన గురువు !”

“గురువుకు తగిన శిష్యుడు అని మనవాడు అనిపించుకోవాలి. అనసూయా !” అత్రి చిరునవ్వుతో సరిదిద్దాడు. “నీ ప్రయాణం రేపే, చంద్రా !”

చంద్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అనసూయ ప్రయాణం చేయబోతున్న కుమారుడికి శాస్త్రోక్తపద్ధతిని పాటిస్తూ పరమాన్నం వండి పెట్టింది.

“చంద్రా ! నా దగ్గర ప్రేమనూ , భక్తినీ , చనువునూ జతచేసి , ఇంత కాలం విద్య అభ్యసించావు. గురువుగారి వద్ద అలా కాదు. భక్తినీ , గౌరవాన్నీ , శ్రద్దనూ జత చేయాలి. అతి చనువు కూడదు , సుమా ! గురువు ముందు తల వాల్చుకునే మాట్లాడాలి. ఏం ?” అత్రి ప్రవర్తనా విధానం వివరిస్తూ అన్నాడు.

“అలాగే , నాన్నగారూ !!” చంద్రుడు వినయంగా అన్నాడు.

“గురుపత్ని పట్ల కూడా నువ్వు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి నాయనా ! గురుపత్ని తల్లితో సమానం ! అమ్మ స్థానాన్ని ఆక్రమించి ఆమె విద్యార్థులకు అన్నం పెడుతుంది !” అనసూయ అంది. “అవకాశం చిక్కినప్పుడు గురుపత్నికి కూడా ఆశ్రమ కార్యకలాపాల్లో సహాయం చేయాలి !”

“అలాగేమ్మా !”

“అనన్య సామాన్యమైన ప్రవర్తనతో , ఆదర్శవంతమైన విద్యార్జనతో అమ్మకూ , నాకూ కీర్తి తీసుకు రా , నాయనా !” అన్నాడు అత్రి , నమస్కరిస్తున్న చంద్రుణ్ణి దీవిస్తూ.

పాదాభివందనం చేస్తున్న కుమారుణ్ణి అలాగే లేవనెత్తి , అతని నుదురు మీద సున్నితంగా ముద్దుపెట్టింది అనసూయ.

“నా ఆలోచనలు నీకు తోడుగా ఉంటాయి. జాగ్రత్త సుమా !” అంది కన్నీళ్ళు ఆపుకుంటూ.

చంద్రుడు వెనుదిరిగి వెళ్తున్నాడు. అత్రీ అనసూయా ఇద్దరూ జంటగా నిలబడి దూరంగా వెళ్తూ , తమకు అడుగు అడుగుకీ దూరమవుతున్న చంద్రుణ్ణి అర్థం కాని ఉద్వేగంతో చూస్తున్నారు. అశ్రువులు అనసూయ కళ్ళకు తెరలాగా అడ్డుపడి , చంద్రుడు కనిపించకుండా చేశాయి.

రేపటి నుండి బుధగ్రహ జననం ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment