ఆత్యన్తికలయ నిరూపణము
ఓ విప్రులారా! వివేకియగు జీవుడు ఆధ్యాత్మికములు – ఆధిభౌతికము – ఆధి దైవికములు అను మూడు విధములగు తాపమువలని దుఃఖమును దోషమును గుర్తెరిగి వైరాగ్యముతో జ్ఞానము సంపాదించుటచే ఆత్యంతికలయమును – మోక్షమును పొందును. వీనిలో ఆధ్యాత్మిక తాపము దైహికము మానసికము అని రెండు విధములు. శిరోరోగము- ప్రతిశ్యాయము – జ్వరము -శూలవ్యాధి -భగందరము – గుల్మము-ఆర్శస్సు -శ్వయథువు – శ్వాసవ్యాధి – ఛర్ది -అక్షిరోగములు- అతి సారము – కుష్ఠము – అవయవముల రోగములు – ఈ మొదలుగ దైహిక తాపము బహువిధములు. కామము – క్రోధము – భయము – ద్వేషము -లోభము – మోహము – విషాదము – శోకము – అసూయ – అవమానము – ఈర్ష్య – మత్సరము – తిరస్కారము మొదలుగ మానసతాపము అనేక విధములు ఈ రెండును కలిసి అధ్యాత్మిక తాపమనబడును. ఆత్మ అనగా ఇచట దేహమని యర్థము. పాంచభౌతిక దేహముతో సంబంధించినవి ఆధ్యాత్మికములు. పైవానివివరము ఆయుర్వేదాది శాస్త్రములనుండి తెలియదగినవి.
మృగములు – పక్షులు – మనుష్యులు – పిశాచములు – సర్పములు – రాక్షసులు – ప్రాకెడి ప్రాణులు మొదలగు వానిచే మానవునికి కలుగు తాపములు అధిభౌతికములు – భూతముల – ప్రాణుల – వలన కలుగునవి.
చలి – ఉష్ణము – గాలి – వర్షము – నీరు మెఱవులు వానివలన కలుగు తాపము అధిదైవికము.
గర్భము – జన్మము – ముసలితనము – అజ్ఞానము – మృత్యువు నరకము – మొదలగు వానివలన కలుగు దుఃఖములు వేలకొలది విధములు. ఎట్లనగా – సుకుమార శరీరము కల జీవుడు తల్లి గర్భములో అనేక మలినములు క్రమ్మియున్న గర్భములో మావిలో చుట్టబడి వెన్ను వీపు మెడ ఎముకలు వంగి దాల పుల్లనివి – కారపువి – చురుకైనవి – చాలవెచ్చనివి – ఉప్పనివి అగు ఆహారములు తల్లి తినగా అవి కలిగించు తాపమువలన చాల బాధ పడుచుండును. అవయవములు స్వేచ్ఛగా చాచలేక ముడువలేక మలమూత్రముల రొంపిలో పండుకొనుచు ఊపిరాడక చైతన్యమున్నందున గడచిన వందలకొలది జన్మములను జ్ఞాపకము చేసికొనుచు తన పూర్వకర్మలకు బద్ధుడై దుఃఖములనుభవించుచుండును. ఇది గర్భదుఃఖము. ప్రసవకాలపు గాలులచే తలక్రిందులుగా త్రిప్పబడి మలము రక్తము మూత్రము శుక్రశోణితములు మొదలగువానిచే నోరంతయు మలినము కాగా ప్రాజావత్యము అను ప్రసవద్వారపు గాలిచే ఎముకలసంధులు బాధపడుచుండ తల్లి గర్భమునుండి ఎన్నో క్లేశములతో వెలుపలికి వచ్చును. ముళ్లు గ్రుచ్చుకొనినట్లు రంపముతో కోసినట్లు అవయవములు బాధపడుచుండ క్రుళ్ళిన పుండులోనుండి బయటపడిన క్రిమివలె బయటపడి గోకికొనుటకును అటు ఇటు దొరలుటకును శక్తిలేక ఇతురుల ఇచ్ఛకు లోబడి పాలు మొదలగు ఆహారము గ్రహించును. మలినమగు ప్రక్కలపై పరుండియు పురుగులు దోమలు కుట్టచున్నను తినుచున్నను వాటిని తినుచున్నను వాటిని తోలుకొననైన లేకుండును. ఇటువంటి జన్మదుఃఖములను జన్మకు అనంతరము పొందు ఆధ్యాత్మికాది దుఃఖములను అంతులేనివి.
నరుడు అజ్ఞానాంధకారముతో కప్పబడి మనస్సు మూఢమై నేను ఎక్కడినుండి వచ్చితిని?? ఎవడను? ఎట్టివాడను? ఎక్కడికి పోవలెను? నన్ను ఏ బంధము బంధించినది? ఇది సకారణమా? అకారణమా? చేయదగినదేది! తగనిదేది? పలుకదగినదేది? తగనిదేది? ధర్మమేది? అధర్మమేది? గుణము ఏది? దోషమేది ? అని యెరుగక పశువులవలె ఆహార మైథునములకై మాత్రము ప్రాకులాడుట అజ్ఞానమువలన కలుగు దుఃఖము. అజ్ఞానము తమోగుణ ధర్మము. దానివలన నరులు చేయవలసిన కర్మలను చేయక చేయరానివానిని చేయుచుందురు.
కర్మల లోపమువలన మానవులకు నరకయాతనలు కలుగును. ఈ విధముగ అజ్ఞానులకు ఇహలోకమునను పరలోకమునను దుఃఖములే.
ముసలితనమున దేహమును దేహావయవములును శిథిలములై దంతములు కదలుచు ఊడుచు చర్మము ముడతలుపడి నాడులు నరములు తేలుచు దూరపుచూపు కనబడక కంటిపాపలు ఆకాశములోనికి పెట్టి చూచుచు నాసికారంధ్రముల నుండి వెంట్రుకలు వెలికివచ్చుచుండ శరీరము వణకుచుండ ఎముకలు బయటపడి వెన్ను వంగి ఆకలి నశించి ఎక్కువ తినలేక తిన్నది జీర్ణముకాక పనులు చేయుటకు శక్తిలేక ఎంతో శ్రమతో నడచుట లేచుట కూర్చుండుట పనులు చేయుట కలిగి చెవులు సరిగా వినబడక కన్నులు సరిగా కనబడక నోట చొల్లు కారుచు ఇంద్రియశక్తి తగ్గి చావుకు సిద్ధమై ఎప్పటికప్పుడే విషయములు మరచుచు ఒక్కమాట పలుకుటకు చాల శ్రమపడుచు దగ్గుతో ఆయాసముతో నిద్రపట్టక లేచుటకు పండుకొనుటకు కూడ ఇతరులపై ఆధారపడుచు సేవకులు భార్య పుత్రులు కూడ అలక్ష్యము చేయుచుండగా శౌచము చేసికొనుట కూడ శక్తి లేక ఏమో తినవలెనని తిరుగవలెనని కోరికలు మాత్రమధికమై పరిజనులు కూడ ఎగతాళి చేయుచుండ చుట్టములు విసుగుకొనుచుండ తాను తన యవ్వనములో శక్తి యున్నప్పుడు చేసిన పనులను ఏదో పూర్వజన్మములో చేసిన పనులనువలె జ్ఞాపకము చేసికొనుచు ఇట్టి అనేక భాదలనుభవించును.
మరణకాలమున కాళ్లు చేతులు మెడ శిథిలమగును. అంతలోనే శ్రమ అంతలోనే తెలివి – బలము కలుగుచుండును. తన భార్య సంతానము ధనము ఇల్లు సేవకులు తన తరువాత ఏమగునో అని చింత – ఱంపములతో కోయుచున్నట్లు మర్మస్థానములలో రోగబాధ – అస్థిసంధులలో యమబాణములు గ్రుచ్చుకొన్నట్లు బాధ – మెలికలు తిరిగిపోవుచున్న కనుగ్రుడ్లు – కాళ్లు చేతులు కలిగి తన్నుకొనుట – పెదవులు దౌడలు కంఠము ఎండిపోవుచు గురగురలాడుచు కంఠమునుండి శ్వాస ఆడక బాధ – అకలిదప్పులచే బాధ – పడుచు యమభటులచే బాధనొందుచు ఎంతో క్లేశముతో ప్రాణములు బయటికి పోవుచుండును. తరువాత యాతనా దేహములో ప్రవేశించును.
నరకములో యమకింకరులు పాశములతో కట్టుట- కర్రలతో కొట్టుట – యమదర్శనము-భయంకరమగు మార్గములు చూచుట మండుచున్న ఇసుక – అగ్నియంత్రములు శస్త్రములు మొదలగువానితో భయంకర బాధలు ఱంపములతో కోయుట మూసలలోవేసి క్రాచుట గొడ్డళ్లతో పగులకొట్టుట భూమిలో పాతిపెట్టుట శూలములపై గ్రుచ్చుట పులినోటిలో వేయుట గ్రద్దలచే తినిపించుట నూనెలో ఉడికించుట కారపు అడుసులో నానవేయుట ఎత్తునుండి పడవేయుట. ఒడిసెలలతో కొట్టుట మొదలైన యాతనలు జీవులు తాము చేసిన పాపానుసారము అనుభవింతురు.
ఇంతేకాదు. స్వర్గమునకు వెళ్లినవారికి కూడ ఆ పుణ్యము పూర్తికాగానే క్రిందికి పడిపోవలెనను భయము వెంటాడును. కనుక అచ్చటను సుఖము లేదు.
పిమ్మట మరల గర్భప్రవేశము పుట్టుట కడుపులోగాని పుట్టుచుకాని పుట్టిన తరువాత ఏదో సమయమున బాల్యముననో యవ్వనముననో మరణించుట ఇట్టి జన్మమరణ పరంపర సాగును. ఈ సంసారములో ఏది సుఖమునకు కారణమో ఆదే దుఃఖమునకు కారణము. కనుక దార పుత్త్రథనాదులయందు మక్కువ పెంచుకొనక ఈ తెలిపిన తాపత్రయములలోని దోషములను గుర్తించి ముక్తికొరకై యత్నించుట ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధము. కనుక వివేకులు అందుకే యత్నింపవలెను. కర్మాచరణము జ్ఞానము ఈరెండును ముక్తికి సాధనములే. ఆగమములో చెప్పిన శబ్దబ్రహ్మోపాసనము వివేకమువలన కలిగెడి బ్రహ్మతత్త్వజ్ఞానము అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్దబ్రహ్మతత్త్వమున కృతార్థుడైనచో పరబ్రహ్మత్వము ప్రాప్తించును. పరా-అపరా అను రెండు విద్యలు ఎఱుగవలసియున్నది అని అథర్వణవేదీయమగు మండకోపనిషత్తు చెప్పుచున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్తమగు కర్మానుష్టానము అపరావిద్యా. అక్షరతత్త్వమగు పరబ్రహ్మమును అందించునది పరావిద్యా. పరబ్రహ్మతత్త్వము అవ్యక్తము అజరము అచింత్యము అవ్యయము అనిర్దేశ్యము అరూపము అపాణిపాదము సర్వగతము సత్యము భూతయోనివ్యాప్యము వ్యాప్తము. ఈతత్త్వమును సూరులు మాత్రమే ఎల్లప్పుడును దర్శింపగలరు. ఆతత్త్వమే విష్ణుభగవానుడు. భూతములయొక్క ఉత్పత్తిని నాశనమును వాటిరాకడను పోకడను విద్యను అవిద్యను ఎఱిగిన మహానుభావుడు భగవానుడనబడును. హేయములగు దుర్గుణములుకాని దోషములుకాని ఏవియులేక జ్ఞానశక్తి బలైశ్వర్యవీర్య తేజస్సులను ఆఱుశక్తులు కలవాడే భగవానుడనుబడును. ఆపరమాత్ముని యందు సమస్త భూతములను – అతడుసమస్త భూతములయందును ఆవసించును. అతడు సర్వాత్మకుడు అందుచేతనే ఈ పరతత్త్వమునకు వాసుదేవడనిపేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నమునకు సమాధానముగా ప్రజాపతియే ఈవాసుదేవ పదమునకు అర్థమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందుచేతనే జగములను నిర్మించువాడు. వాటిస్థితి వ్యవస్థ చేయువాడుకూడ ప్రభువగు వాసుదేవుడే. అతడు సర్వభూతములకును ప్రకృతి – మూలతత్త్వమును సమస్తదోషములకును గుణములకును అతీతుడు. సర్వావరణములకును అతీతుడు. అఖిలాత్ముడు. ఈభువనాంతరాళమంతయు అయనచేతనే అవరింపబడియున్నది. అతడు సమస్తకళ్యాణ గుణాత్మకుడు స్వశక్తిలేక మాత్రము చేతనే సమస్తభూతసృష్టిని చేయువాడు. తన ఇచ్చచేత తన కిష్టములగు గొప్పరూపమల ధరించి సమస్తలోకములకు హితమును సాధించును. తేజోబలైశ్వర్యవీర్య శక్తిజ్ఞానములకు రాశి. పరమైనవాటికంటె వరుడు. ఈ వరావరునియందు ఎట్టిక్లేశములునులేవు. అతడు ఈశ్వరుడు వ్యష్టిసమష్టి రూపుడు, వ్యక్తరూపుడు, అవ్యక్తరూపుడు, సర్వేశ్వరుడు. సర్వద్రష్ట సర్వశక్తియగు పరమేశ్వరుడు. సమస్తదోషరహితమును శుద్ధమును వరమును నిర్మలమును ఏకరూపమునునగు ఆమహాతత్త్వమును ఏదితెలుపగలదో చూపగలదో లభింపజేయగలదో అదిమాత్రమే జ్ఞానమనబడును.
ఇది శ్రీ మహాపురాణమున ఆది బ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున ఆత్యన్తికలయ నిరూపణమను నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹