యోగాధ్యాయము
సంసార దుఃఖనివారణౌషధమగు యోగమును తాము తెలిపినచో దానియందు పురుషోత్తముడగు అవ్యయుడగు విష్ణుని అనునంధానము చేయుదుము. అని మహర్షులు కోరగా యోగవేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసుడు మిగుల సంతోషముతో యోగ ప్రకారమును ఇట్లు చెప్పనారంభించెను.
ఓ విప్రులారా! సంసారనాశకమగు యోగమును తెలిపెదను. దానినభ్యసించి యోగియైనవాడు పరమదుర్లభమగు మోక్షమును పొందగలుగును. మొదట యోగశాస్త్రములను శ్రవణముచేసి భక్తితో గురువును ఆరాధించి యోగవిషయములనెఱిగి ఇతిహాస పురాణ వేదములతో చెప్పిన విషయములను ఆహారగుణ దోషములను దేశకాలస్థితిగుణ దోషములను తెలిసికొని పిమ్మట సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడై ఎవరినుండి ఏదియు ప్రతిగ్రహించుటపై అశనుమాని యోగమున్యభసింప వలెను. పేలపిండి గంజి మజ్జిగ దుంపలు వేళ్లు పండ్లు రవ్వతో వండిన అన్నము యవపిండితో చేసిన వంట యోగసాధనకు పనికివచ్చు ఆహారము. మనస్సు ఆవేశము చెందియున్నప్పుడు మనస్సు వికలమైయున్నప్పుడు శ్రమగా అకలిగా ఉన్నప్పుడు చలి ఉష్ణము గాలి భాదించుచున్నప్పుడు ధ్వనులు వినబడుచుండగా నీటి సమీపమున శిథిలమైన గోస్థానములో నాలుగు బాటలు కలిసిన ప్రదేశములో పాములు తిరుగుచోట శ్మశానములో నదుల చివరలలో అగ్ని సమీపమున చైత్యముల గ్రామములలో జనులు సమావేశమగుటకును దేవతా భావనతో పూజించుటకును నాటిన చెట్ల దగ్గరను – పుట్టల దగ్గరను భయమునకు అవకాశముగల చోట్లను బావుల దగ్గరను ఎండిన ఆకుల కుప్పల దగ్గరను యోగసాధన ఎప్పుడును చేయరాదు. ఒకవేళ ఇట్టిచోట్ల యోగసాధనను మూఢుడై చేసిన యెడల చెవుడు బుద్దిమాంద్యము జ్ఞాపకశక్తి లోపము మూగితనము గ్రుడ్డితనము జ్వరము కలుగును. అజ్ఞానము సంభవించును. నాలుగు పురుషార్థములకును దేహమే సాధనము కావున పైవిషయములను పాటించి దేహమును రక్షించుకొనుచు యోగసాధనచేయవలెను.
ఆశ్రమములో జనులు లేనిచోట రహస్య స్థానమున శబ్దము వినబడనిచోట నిర్భయముచోట కొండమీద శూన్యగృహమున శుచిస్థానమున అందమైనచోట ఏకాంతస్థానమున దేవాలయమున రాత్రియొక్క మొదటిజామున చివరి జామున పగలు ప్రాతఃకాలమున మధ్యాహ్నమున యోగసాధన చేయతగును. తగిన ఆహారమును మితముగా భుజించుచు ఇంద్రియముల జయించి సుఖమును నిశ్చలమునునై ఎక్కువ ఎత్తునుకాని రమ్యమైన ఆసనమున ప్రాజ్ముఖుడై కూర్చుండవలెను. నత్యవచనుడు శుచి తగినంత నిద్రకలవాడు క్రోధము జయించినవాడు సర్వభూతములకు హితమును కోరువాడు చలి వేడి మొదలగు అన్నిద్వంద్వముల సహించువాడు మనసున నిబ్బరము కలవాడు శరీరము పాదములు శిరస్సు సమముగా నుంచినవాడు కావలెను. హస్తములను నాభిపైనిలిపి శాంతుడై పద్మాసనమున నుండవలెను. మౌనియై దృష్టిని ముక్కు కొనపైనిలిపి ప్రాణాయమముచేయవలెను. జ్ఞానేంద్రియముల నైదింటిని మనస్సుతోకూడ హృదయములోనికి ఉపసంహరించవలెను. మునియై ప్రణవమును దీర్ఘముగా పూనికతో ఉచ్చరించుచు మిగుల నిశ్చలుడై తమోగుణ వ్యాపారము రజోగుణము చేతను రజోగుణ వ్యాపారమును సత్యగుణముచేతను కప్పివేసి కన్నులు మూసికొని నిర్మల శాంతస్థితిలో నుండవలెను. ఇట్లు హృదయ గుహయందు దాగినవాడును సర్వ వ్యాపియు నిరంజనుడును అగు పురుషోత్తముని తన చిత్తమున అను సంధానము చేయవలెను. జ్ఞాన కర్మేంద్రియములను భూతములను మొదట క్షేత్రజ్ఞుడు అగు జీవచైతన్యమునందును తరువాత ఆ క్షేత్రజ్ఞుని పరమాత్మ తత్త్వమునందును అను సంధానము చేయవలెను. సహజ చంచలమగు మనస్సు బాహ్య విషయ సుఖములను వదలి పరమాత్మునిచేరినవానికి యోగసిద్ది నిశ్చయముగా కలుగును. చిత్తము విషయములపైకిపోక బ్రహ్మమునందు లయమొందినచో యోగసమాధి ఫలమును సిద్దింపజేయుటచే సాధకుడు పరమపదమును పొందును. యోగసాధకుని చిత్తము ఏకర్మాచరణమునందును ఆసక్తినొందక ఆనందమును పొందినప్పుడు యోగసాధకుడు మోక్షసిద్ది నొందును. ఏ కోరికలనులేక అన్నిటిని ప్రీతికరమైనవానినిగానే చూచుచు పరతత్త్వము తప్ప మిగిలినదంతయు అనిత్యమని ఎఱుగనిదే మోక్షము సిద్ధింపదు. యోగసాధకుడు వైరాగ్యముతో నుండవలెను. ఇంద్రియసుఖముల సేవింపరాదు. యోగమునభ్యసింపవలెను. పద్మాసముతో కూర్చుండుట నాసాగ్రమున దృష్టినిలుపుట మాత్రమున యోగసిద్ధి కలుగదు. మనస్సు ఇంద్రియములు కలిసి లయము నొందుటయే యోగము.
ఓ ముని శ్రేష్ఠులారా! సంసారమోక్షసాధనమగు యోగప్రకారమును తెలిపితిని. మఱి యేమి వినగోరుదురి ఆడుగుడు.
ఇది శ్రీ మహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమమున యోగాభ్యాస నిరూపణమును నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹