Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై ఒకటవ భాగము

విద్యా – కర్మ – గతివివేచనము

వేదవిధి ననుసరించి కర్మల నాచరించవలెననియు కర్మలను విడువవలెననియు మీరు చెప్పుచున్నారు. ఇది పరస్పరము విరుద్ధముగా నున్నది. కావున కర్మల నాచరించినచో ఏగతి కలుగునో వానిని విడిచి విద్యను, జ్ఞానమును ఆశ్రయించినచో ఏగతి కలుగునో విన కుతూహలముగుచున్నది. తెలుపుడు. అని మునులు వ్యాసునడిగిరి.

మునిశ్రేష్టులారా! మీరడిగినది చెప్పెదను. కర్మ మయమగుక్షరతత్త్వమును విద్యామయమగు అక్షరతత్త్వమును కర్మానుష్ఠానమువలన విద్యా లాభమువలన కలుగు గతులను కూడ వివరింతును. వినుడు ఈ ప్రశ్నలకు సమాధానము చాలగహన – గంభీరమైనది. ధర్మమున్నది అనుచునే అదే ధర్మము లేదని చెప్పుట పరస్పర విరుద్ధము. వేదానుసారియగు ప్రవృత్తి మార్గము విద్యానుసారియగు నివృత్తిమార్గము అని రెండుమార్గములు కలవు. కర్మము బంధహేతువు. విద్య ముక్తి హేతువు. అందుచే తత్త్వము నెఱిగిన మునులు కర్మల నాచరింపరు. కర్మల నాచరించుటచే షోడశతత్త్వ రూపుడగు పురుషుడు మరణించి మరల పుట్టును. విద్యచే అక్షరరూపుడై ముక్తినందును. (షోడశకలలు – అనగా ముఖ్య ప్రాణము – శ్రద్ధ – పంచభూతములు ఇంద్రియములు – మనస్సు అన్నము – వీర్యము – తపస్సు – వేద మంత్రములు – కర్మములు – లోకములు – నామము – ఇవి పదునారు ప్రశ్నోపనిషత్‌ – ఆరు ప్రశ్న – నాలుగు మంత్రము) అపరా విద్యను ఆశ్రయించినవారు కర్మలను మెచ్చుచు జన్మమరణ పరంపరలో చిక్కి దేహములతోనే ఆనందించుచుందురు. పరావిద్యను ఆశ్రయించినవారు ధర్మతత్త్వము నెఱిగినవారు కావున నది నీరు త్రావువారు బావినీటిని మెచ్చునట్లు కర్మమార్గమును మెచ్చరు. కర్మానుష్ఠానము వలన సుఖదుఃఖములను జన్మమరణములను పొందుదురు. విద్యచేత దుఃఖశోకములు కాని జన్మ మరణములు కాని హానివృద్ధులు కాలేని స్థానమును పొందుదురు. అవ్యక్తము అచలము ధ్రువము అవ్యాకృతము అనామయము అమృతము యోగముచే ప్రాప్యము అగు పరబ్రహ్మ స్థానమును పొందుదురు. అట్టివారు సుఖదుఃఖములవంటి ద్వంద్వముల చేతను సంకల్ప కృతములగు కర్మలచేతను బాధింపబడక అన్ని ప్రాణులయందు మైత్రభావము హితబుద్ధి కలిగియుందురు. పురుషుడును (జీవుడు) కర్మమయుడు విద్యామయుడు అని రెండు విధములు. వీరిలో కర్మమయ పురుషుడు చంద్రునివలె సుకుమార స్పర్శ కలిగి చంద్రకల వంటి సూక్ష్మ కలారూపమున నుండును. అని ఋగ్వేద పురుషుడు చెప్పెను. దానిని విస్తరించి అనుగానము చేయుదును. వస్త్రములో దారపు ఏసెవలె సూక్ష్మమగు ఆతత్త్వము సులభముగా మాటలతో చెప్పుటకుగాని ఇంద్రియములతో చూచుటకుగాని శక్యముకాదు. పంచతన్మాత్రలు గుణత్రయము మనోబుద్ధ్యహంకారములు అంతఃకరణత్రయము అనెడి ఏకాదశ తత్త్వ వికారములు షోడశకలలు కర్మలు గుణములు మూర్తీభవించిన తత్త్వముగా ఆ కర్మమయ పురుషుని తెలియవచ్చును. అతడు ఈ షోడశ కలామయమగు దేహమును ఆశ్రయించి సముద్రజలమునందు ప్రతిబింబించిన చంద్రుడు వలె నుండి యోగసాధనచే జయింపబడు తత్త్వమై క్షేత్రజ్ఞుడని వ్యవహరింపబడుచుండును. తమస్సురజస్సుసత్త్వము ఈ మూడును జీవుని గుణములు. జీవుడు ఆత్మయొక్క గుణము. ఆత్మ పరమాత్మయొక్క గుణము. ఈ గుణత్రయాత్మకమగు ఈ దృశ్య ప్రపంచము అంతయు ఈ సప్తలోకములను ఈ జీవుని సృష్టియే అని క్షేత్రతత్త్వము నెఱిగినవారి వచనము.

ప్రకృతియొక్క వికారములు అగు దృశ్యప్రపంచము – క్షేత్రజ్ఞుడనబడు ఆత్మతత్త్వము అను ఈ రెంటిలో అవి ఇతని నెరుగజాలవు. కాని అతడు వాని నెరుగును. సమర్థుడగు సారథి మేలైన గుఱ్ఱములతో రథమును నడిపినట్లు మనస్సుతో ఐదు జ్ఞానేంద్రియములతో ఆయా పనులు చేయించును. ఇంద్రియములకంటె ఇంద్రియములతో అనుభవించు విషయములు వాటికంటె మనస్సు మనస్సు కంటె బుద్ధి బుద్ధికంటె హిరణ్యగర్భుడను తత్త్వము దానికంటె జగద్బీజమగు అవ్యక్తమను ఈశ్వరతత్త్వము దానికంటె అమృతతత్త్వము ఒక దానికంటె మఱియొకటి సూక్ష్మతరములు. అమృతతత్త్వముకంటె సూక్ష్మతరము లేదు. అదే అందరకును కడపటి గమ్యస్థానము. ఈవిధముగా సర్వ భూతములయందు రహస్యముగా ప్రత్యక్తత్త్వమై యున్న పరాత్మతత్త్వము బహిర్గతమై ప్రకాశింపక కనబడక యుండును. కాని సూక్ష్మదృష్టి కల మహనీయులు నిశితమగు బుద్ధితో చూడగలుగుదురు. పంచ జ్ఞానేంద్రియముల మనస్సున లీనము చేసి ఆ అఱిటితో సుఖవిషయములను ఆలోచింపక అనుభవింపక జ్ఞానసంపన్నమగు మనస్సును పరతత్త్వధ్యానమున నిలిపి తనపై ఇంద్రియములను అధికారము చేయనీయక ప్రశాంత మనస్కుడగు వాడు ముక్తి పొందును. ఇంద్రియముల కన్నిటికి వశుడయి ధ్యానము తత్త్వముపై నిలుపలేక ఆత్మను మనశ్చాంచల్యమునకు వదలినవాడు మృత్యువును – సంసారమును పొందును. సర్వ సంకల్పములను అణచి చిత్తమున సత్త్వగుణమును నింపి తత్త్వవిచారణాపరుడు కావలెను. చిత్తము నిర్మలముగటచే ఇది శుభము ఇది అశుభము అను భేదబుద్ధి తొలగి అత్యంత సుఖమును పొందును. చిత్తప్రసాదము గాఢసుషుప్తిసుఖమువలె స్వచ్ఛమయినది. అప్పుడు చిత్తము గాలిలేనిచోట దీపమువలె నిశ్చలమై ప్రకాశించును. ఈ తత్త్వ విచారశాస్త్రము సర్వవేద రహస్యము. ఐతిహ్యములచే అగమములచే లభించదు. ఆత్మజ్ఞనము కలిగించునది. భృగువను నతనికి అతని తండ్రనియగు వరుణుడు ఉపదేశించినది. పెరుగును మథించి నవనీతమునువలె కాష్ఠము మథించి అగ్నినివలె ధర్మసత్య ప్రతిపాదకములగు శాస్త్రములను పదివేలు కొలదిగ సంవత్సరములపాటు మథించి తత్త్వవేత్తలు ముముక్షువులకు ముక్తిని సంపాదించు ఈ తత్త్వమును వారి నుద్ధరించుటకై బయల్పరచిరి. వేదవిద్యాధ్యయనము చేసినవానికి దీనిని తెలుపవలెను. ప్రశాంత చిత్తము ఇంద్రియనిగ్రహము తపస్సు వేదార్థజ్ఞానము పెద్దలను అనువర్తించుట అననూయత బుజు ప్రవర్తనము చెప్పినట్లు చేయుట- అను మంచి లక్షణములు లేనివానికిని తర్కశాస్త్రముతో బుద్ధి చెడినవానికిని కొండెగానికిని ఆత్మస్తుతి చేసికొను వానికిని అతడు భూమినంతటిని ప్రతిఫలముగా ఇచ్చినను బోధించరాదు. ఇది అన్ని ధనములకంటె జ్ఞానములకంటె శ్రేయోరూపము. రహస్యతరము. మనుష్యులకు దుర్టభము. మహర్షులు దర్శించినది. ఉపనిషత్తులతో తెలిపుబడినది. ఓ మహర్షులారా ! మీరు నన్నడిగితిరి కావున తెలిపితిని. అదంతయు వింటిరి. నాకు తెలిసినది మీకు సంశయము కలిగినది ఏదైన అడుగుడు. చెప్పెదను.

ఓ భగవన్‌ ! ఋషిసత్తమా! అధ్యాత్మమును మాకు ఇంకను విస్తరించి తెలుపుము.

విప్రులారా ! పృథివి – నీరు – అగ్ని – వాయువు – ఆకాశము – అను పంచమహాభూతములను వాటియందు నిలిచియున్న భూతస్రష్టయగు పరమాత్ముడును అనునదియే అధ్యాత్మము.

వీనిలో వేనికి రూపము కలదు? వేనికి రూపము లేదు? ఇవి శరీరమున ఎట్లు ఉన్నవి? ఇంద్రియములును వాని గుణములను ఏవి? ఎట్లు వానిని గుర్తించవలెను?

శబ్దము ఆకాశపు గుణము; చెవి దానిని గ్రహించు ఇంద్రియము. శూన్యము దేహములో దాని ఉనికి. స్పర్శ వాయువునకు గుణము. ప్రాణవాయువు దేహమున దాని రూపము. చేష్ట – చలనము – దాని వ్యాపారము. రూపము అగ్నికి గుణము. నేత్రము దాని ఇంద్రియము. విపాకము దేహమున దాని వ్యాపారము. రసము – రుచి – నీటికి గునము; నాలుక దాని ఇంద్రియము: చెమట దేహమున దాని రూపము. గంధము భూమికి గుణము. ముక్కు దాని ఇంద్రియము. శరీరము దాని రూపము. మనస్సు – బుద్ధి – స్వభావము – ఇవి స్వతఃసిద్ధములైనవి. ఇవి ఈ భూత గుణములకు అతీతములు. బుద్ధితో వాటిని వివేకులు నిగ్రహించుకొందురు. శబ్దాది గుణములు – విషయములు బుద్ధిని ప్రేరించును. బుద్ధి ఇంద్రియములను ప్రేరించును. మనస్సుతో ఇంద్రియములు ఆరు – బుద్ధప్రేరణ లేనిచో గుణ విషయ అనుభవమునకు లేదు. కనుక అది అరింద్రియములపై ఏడవ తత్త్వము – క్షేత్రజ్ఞుడగు జీవుడు ఎనిమిదవ తత్త్వము. క్షేత్రమనగా దేహము. దానియందుండి ఆయా కర్మలు చేయుచు వాని ఫలములననుభవించు జీవుడు క్షేత్రజ్ఞుడు. వీనిలో చక్షుస్సు మొదలగు ఇంద్రియములు రూపము మొదలగు విషయముల గ్రహించును. మనస్సు సంకల్ప వికల్పములను సంశయమును కలిగించునున. బుద్ధి-ఇది ఇట్టిదని నిశ్చయమును కలిగించును. క్షేత్రజ్ఞుడు వీటి సహాయమున ఆయాపనులు చేయుచుండును. సత్త్వరజస్తమో గుణములును స్వతఃసిద్ధములైనవి. ఇవి అన్ని భూతములయందును సమత్వముతోనే ఉండును. కాని జీవులలో ఎవరియందేది అధికముగా నుండునో వారికి దానినిబట్టి ప్రవృత్థులు కలుగుచుండును. ప్రహర్షము – ప్రీతి – ఆనందము – నిశ్చలచిత్తము అన్నిటిని తన అధీనములో ఉంచుకోగలుగుట – ఇవి సత్త్వగుణ లక్షణములు. అభిమానము – వ్యర్థముగా మాటాడుట – లోభము – మోహము – క్షమ ఇవి రజోలక్షణములు. అధిక మోహము – మూఢత్వము – ఏమరుపాటు – బద్ధకము – నిద్ర – ఎచ్చరిక – మెలకువ లేకుండుట తెలియవలసిన వాటిని ఎంతో శ్రమమీదకాని తెలిసికొన లేకుండుట – ఇవి తమోగుణ లక్షణములు.

భావములను సృజించునది మనస్సు : అధ్యవసాయమును – నిశ్చయమును – కలిగించునది బుద్ధి: ఆనందము మొదలగు భావములను అనుభూతి పొందునది హృదయము – అని కర్మలకై జీవుని ప్రేరించు తత్త్వములు మూడు విధములు. ఈ అంశములను ఇట్లు వివరించుకొనవలయును : ఇంద్రియములకంటె సూక్ష్మతరములు శబ్దస్పర్శరూప రస గంధములనెడి విషయములు. వాటికంటె సూక్ష్మతరము మనస్సు. దానికంటె సూక్ష్మతరము బుద్ధి: బుద్ధికంటె సూక్ష్మతరమై ఈ అన్నింటిచేత పని చేయించువాడు జీవుడు. కాని జీవునకు గల ఉపకరణములలో బుద్ధియె సూక్ష్మతమము. ఈ స్వతంత్ర శక్తి కల బుద్ధిలో సంకల్ప వికల్పములు కలిగిన స్థితియే మనస్సు. అట్లే బుద్ధియే వినుచో శ్రోత్రము స్పృశించుచోత్వక్‌ చూచుచో చక్షుస్సు – రుచి చూచుచో రసన – వాసన చూచుచో ఘ్రాణము అని ఐదింద్రియములుగా వ్యవహరింపబడును. జీవుని ఆశ్రయించియుండు ఈ బుద్ధి ఆయా భావములను బట్టి వ్యవస్థనొందును. అవి 1. సుఖము 2. దుఃఖము. 3. ఏమియు తెలియని మూఢస్థితి. బుద్ధి ఈమూడు ప్రభావములకును అతీతమైనది. సముద్రము నదులను చెలియలికట్టను తనలో ఇముడ్చుకొన్నట్లు బుద్ధి ఆయా భావములను తనలో ఇముడ్చుకొనును. బుద్ధి ఆయాభావముల యందు ప్రవర్తించునప్పడు గుణములు మూడును తమ తమ ప్రభావమును చూపును. ప్రవృత్తికాలములో రజోగుణము సత్త్వగుణముపై తన అధికారము చూపును. ఈ మూడు గుణములును చక్రనాభినేములనడుమ చక్రపు అరల – ఆకులవలె బుద్ధియందు ఇమిడియుండి ఆయా విషయముల ననుసరించి ప్రవర్తించుచుండును. వివేకులు ఇంద్రియములను మనస్సునుకూడ ఆత్మతత్త్వమును సాక్షాత్కరించుకొనుటకే వినియోగించుకోవలెను. కాని మనస్సును అదుపులో ఉంచుకొననిదే ఇంద్రియములు తమ విషయములమీద స్వేచ్ఛగా ప్రవర్తించుచున్నంతవరకు ఆత్మ సాక్షాత్కారము సాధ్యముకాదు. కనుక ముముక్షువు వివేకముతో మనస్సహాయమున ఇంద్రియములను నిగ్రహించవలెను. చీకటి తొలగగానే లోకము నందలి ప్రాణులకు ఆయా వస్తువులు కనబడునట్లు అజ్ఞానము తొలగగానే ఆత్మ సాక్షాత్కారము జరుగును. నీటిపక్షి నీటిలో తిరుగుచున్నను నీరుకాని అచటి మలినములుకాని అంటునట్లు జీవన్ముక్తుడగు యోగి ఇంద్రియ విషయములలో ప్రవర్తించినను వాని దోషములతనికి అంటవు. ఆత్మానుభవముతో తనయందు తానే ఆనందించువారు సంచిత కర్మను నశింపజేసికొని ప్రారబ్ధము అనుభవముతో నిశించి సర్వభూతములు తానైనందున త్రిగుణ సంబంధముచే విషయములలో ప్రవర్తిల్లినను ఆత్మ స్వయంజ్యోతిస్తత్త్వముతో ప్రకాశించును. ఆత్మ గుణములను ఎరుగును. జడములగుటచే గుణములు ఆత్మను ఎరుగలేవు. అతడు ధ్యానయోగముచే త్రిగుణముల తత్త్వమును గ్రహించగలడు. సత్త్వాది గుణములకును క్షేత్రజ్ఞునకు గల భేదము ఇది. వీనిలో సత్త్వాదులు గుణములను సృజించజాలవు. ఆత్మ గుణాదులను సృజించగలదు. ఇట్లు ఇవి వేరువేరయి యుండియు లోక వ్యవహారమున ఇవి అవినాభావముతో ఒక దానిని మఱియొకటి ఎడబాయక యుండును. ఇది ఖనిజ శిల- బంగారముల వంటివి. మేడికాయ – దానియందలి పురుగులవంటివి. ముంజదర్భయందలి ముల్లు వంటివి. ఇవి వేరు తత్త్వములయియును కలిసియే యుండును. వీనిని వేరుపరచుకొనుటయే ఆత్మతత్త్వ వివేకము. ఇదియే ఆత్మసాక్షాత్కారమునకు సాథనము.

శ్రీ శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాస ఋషిసంవాసమున విద్యా కర్మ గతి వివేచనమను నూట ముప్పది ఒకటవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment