Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై రెండవ భాగము

గుణసర్జన కథనము

అన్ని భూతతత్త్వముల కంటె ఉత్తమమగు తత్త్వమును అన్ని ధర్మములకంటె మేలగు ధర్మమును మాకు తెలుపుమని మునులు వ్యాసునడిగిరి.

అతిప్రాచీనమును ఋషులును మెచ్చినదియు అన్ని ధర్మములకంటె శ్రేష్ఠమును అగు ధర్మము తెలిపెదము వినుడు. ఇంద్రియములు జీవుని కలవరపరచునవి. కనుక బుద్ధితో వాటిని బాలురను తండ్రివలె అదుపులో నుంచుకొని ఇంద్రియములకును మనస్సునకును ఏకాగ్రత అనెడి ఉత్తమ తపస్సుచే ఆ ఉత్తమ ధర్మమును ఎరుగవలెను. గోచరించు వేటిని అనుభవింపగోరక ఇంద్రియములు నివృత్తి నొందినపుడు శాశ్వతుడగు పరమాత్మ తత్త్వము సాక్షాత్కారమును పొందును. ఎన్నో కొమ్మలు పండ్లు పూలు ఆకులు కలవృక్షమునకు తన ఏ పండెక్కడనో ఏపూవెక్కడనో ఏకొమ్మ ఏ ఆకు ఎక్కడనో తెలియనట్లే అనేక వస్తు భేదములతో నిండిన ఈ సంసారములోని జీవుడును తానెవడు? ఎక్కడనుండి తాను వచ్చెను? ఎక్కడకు పోవలెను? అని తెలియకుండును. కాని జ్ఞాన దీపమును ప్రకాశింప జేసికొనినచో అతడు తన అంతరాత్మతో తనలో తన్ను తాను చూడగలుగును. కనుక ఓవిప్రులారా! అందులకై మీరును మొదట వైరాగ్యమును పూనుడు. దానిచే మీరు కుబుసము విడిచిన పామువలె పాపములను వదలించు కొనగలరు. జ్ఞానము సంపాదించి చింతా సంతాపములు విడువగలరు. లోకగతి అనాది ప్రవాహము. నది వంటిది. ఘోరమైనది. ఇది అన్ని వైపులకు వ్యాపించును. ఇంద్రియములు మొసళ్లు. మనఃసంకల్పములు దీనిగట్లు. లోభ మోహములు దీనినికప్పిన గడ్డి. కామక్రోధములు దానిలో తిరుగు పాములు. సత్యము స్నానమాడదగిన రేవు. అనృతము కల్లోలములు. క్రోధము బురద. అవ్యక్త తత్త్వమునుండి ఇది పుట్టినది. మహా వేగముకలది. సంసార సాగరములో అది కలియును. జన్మ పరంపర అను పాతాళము లోనికిది పోవును. కామముచే ఇది పుట్టును. జిహ్వాచాపల్యము సుడులు. దీనిని జ్ఞానవంతులు మాత్రమే దాటగలరు. సమస్తభూతము సృష్టి ప్రళయములు తెలిసికొనగలరు. ఇదియే సర్వశ్రేష్ఠమగు ధర్మము. దీనిని హితుడై అనుగతుడై శుచిమనస్కుడైన శిష్యునకుచు కుమారునకును మాత్రమే బోధించవలయును.

స్వయంభూ బ్రహ్మము మోక్షమునకై నిర్ణయించిన ఉపాయమును యథాశాస్త్ర న్యాయానుసారముగ మాకు తెలుప వేడుచున్నామని మునులు వ్యాసుని అడిగిరి.

వ్యాసుడు మునులకిట్లు చెప్పెను. ఓమహా ప్రాజ్ఞులారా! మనవంటివారికి వివేక జ్ఞానము సరియగు ఉపాయము. దాని సహాయమున సర్వ విషయములను అన్వేషించి కనుగొనవచ్చును. కాని మనకు ఒక కడవతో పనిపడినపుడు దాని నొక్కదానాని సరియైన దానిని సంపాదించుకొన వలయునే కాని లోకములో అన్ని కడవలను గూర్చి తెలిసికొన వలసిన పని కాని అన్ని కడవలను సంపాదించవలసిన పనికానిలేదు. అట్లేమోక్షమును కోరినవారు మోక్షధర్మమును మాత్రమేకాని ఇతర ధర్మములను తెలిసికొననక్కరలేదు. తూర్పు సముద్రమునకు చేర్చుమార్గము పశ్చిమ సముద్రమునకు చేర్చదు. అట్లే మోక్షము సిద్ధింపజేయు ధర్మము ఒక్కటియే. ఇతరమార్గములు దానిని సిద్ధింప జేయజాలవు. అట్టి ధర్మమును తెలిపెదను. యోగసాధనకు మూలముగా క్షమచే క్రోధమును సంకల్పములను విడుచుటచే కోరికలను సత్త్వవృద్ధిచే నిద్రను హెచ్చరికచే భయమును మనస్సు నిబ్బరముచే ఇచ్ఛను ద్వేషమును కామ ప్రవృత్తిని జ్ఞాన వివేకము నభ్యసించుటచే బుద్దిమాంద్యమును ఏ విషయములును చిత్తమున స్ఫురించక పోవుటను హితములు సులభముగా జీర్ణమగు మితాహారముచే దైహికములు మానసికములు అగు ఉపద్రవములను తృప్తిచే లోభమోహములను తత్త్వజ్ఞానముచే విషయ భోగములను దయాభావముచే అధర్మమును ఫలానభిసంధిచే యజ్ఞదానాది ధర్మర్మములను అయతిచే ఆశను సంగము విడుచుటచే కార్యసామర్థ్యమును దృశ్య ప్రపంచ వస్తువులు అనిత్యములను భావముచే వాటిపై ప్రీతిని యోగముచే ఆకలిని జయించవలెను. నిత్య ప్రయత్నముతో సోమరితనమును సంశయములను నిశ్చయముతోను జయించవలెను. మౌనముచే వాగుడుతనమును శౌర్యముచే భయమును విడువవలెను. వాక్కునుమనస్సును బుద్ధితో బుద్ధిని జ్ఞాననేత్రములతో అదుపులో నుంచి జ్ఞానముచే ఆత్మతత్త్వమెరిగి ఆత్మ శాంతిని సాధించవలెను. ఫలాభిసంధి లేక పవిత్రకర్మలాచరించి శుద్ధమైన చిత్తముతో జ్ఞానము సాధించవలెను. కామక్రోధ లోభ భయస్వప్నములను యోగదోషముల నైదింటిని విడిచి యోగ సాధనముచేయుచు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజువర్తనము క్షమ శౌచము ఆచారశుద్ది ఇంద్రియ జయము కలిగియున్నచో తేజస్సు వృద్ధియగును. పాపము నశించును. సంకల్పముల నెరవేరును. విజ్ఞానము ప్రవర్తిల్లును. చివరకు బ్రహ్మస్థానమున ప్రవేశించును. అమూఢత్వము సంగరాహిత్యము కామక్రోధముల విడుచుట దైన్యముకాని పొగరుకాని లేకుండుట భయములేక నిబ్బరముతో నుండుట – ఇది ప్రసన్నమును విమలమును శుచియు నైన మోక్షమార్తము. మనోవాక్కాయ నిగ్రహము తప్పక యుండవలసిన నియమము.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాసఋషిసంవాదమున సాంఖ్యయోగనిరూపణమను నూట ముప్పై రెండవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment