Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై నాల్గవ అధ్యాయము

సాంఖ్యవిధి నిరూపణము

మునులు వ్యాసునితో ఇట్లనిరి:- ఓ విప్రేంద్రా! శిష్టమ్మతమగు యోగమార్గ ప్రక్రియను తాము యుక్తియుక్తమగు శిష్యులగు మాకు హితముగా ప్రతిపాదించితిరి. లోకత్రయము నందును ప్రసిద్ధిపొందియున్న సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన శాస్త్రతత్త్వమును దానియందు సిద్ధిని పొందగోరిన వారు పాటించవలసిన ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా మాకు ప్రవచింపగోరుచున్నాము.

ఓమునులురా! వినుడు. అత్మతత్త్వమునెఱిగిన వారును సమర్థులునునగు కపిలాదివృద్ధయతులు తెలిపిన విషయమును తెలిపెదను. వారిలో కొందరు ఉత్తమమగు బుద్ధివైశారద్యముకలమునిసత్తములును కలరు. వారు చెప్పిన వానిలో సుగుణములెన్నియో కలవు. దోషమొక్కటియులేదు. అదియేమనిన వివేక ముచే దుర్జయములగు విషయములను వానియందలి దోషములను ఎరుగవలెను. ఆ విషయములు మనుష్యలు పిశాచులు ఉరగులు గంధర్వులు పితరులు తిర్యక్ర్పాణులు గరుడులు మరుత్తులు మహర్షులు రాజర్షులు అసురులు విశ్వేదేవుడు దేవర్షులు యోగులు బ్రహ్మ వీరనుభవించు విషయములు వేరువేరు విధములుగా నుండును. వానియందలి దోషములును వివిధములు. కాలపరిమాణము ఆయువు సుఖమును అనుభవించవలసిన కాలము విషయాభిలాష వలనను తిర్వగ్జన్మలయందును నరక మునందునుగల దుఃఖములును దోషములును స్వర్గసుఖము నందలి గుణములును దోషములును వేదవాదము జ్ఞానము సాంఖ్యయోగము దశగుణములు కలనత్త్వము నవగుణములుకల రజస్సు అష్టగుణములుగల తపస్సు సప్తగుణములుకల బుద్ధి షడ్గుణయుక్తమగు సభస్సు (ఆకాశము) త్రిగుణమగు తమస్సు ఏక గుణమగు సత్త్వము మోక్షమునకు కానిపోవు మార్గము. ప్రళయతత్త్వ స్వరూపములు ఎరిగి ఈ చెప్పినవానియందలి గుణదోషములను గుర్తెరిగి ఆత్మ తత్త్వాభ్యాసముచేసిన వారు చెప్పిన యుక్తులతో జ్ఞానమును విజ్ఞానమును – జ్ఞాన మనగా విషయమును ఎరుగుట – విజ్ఞానమనగా తెలిసినదానిని అనుభవములోనికి తెచ్చుకొనుట – సంపాదించి నిఃశ్రేయసమను సర్వ శుభతమమగు మోక్షమును పొందుదురు.

చక్షుస్పు రూపముతో అగ్నితో ఘ్రాణము గంధముతో పృథివితో శ్రోత్రము శబ్దముతో ఆకాశముతో జిహ్వరసముతో జలముతో త్వగింద్రియము స్పర్శముతో వాయువుతో నిత్య సంబంధము కలవి. తమస్సునందు మోహము మొహమునందు లోభము నిలిచియున్నవి. నడకయందు విష్ణువు బలమునందు ఇంద్రుడు ఉదరమునందు అగ్ని జలము నందు భూదేవి తేజస్సునందు జలము వాయువునందు తేజస్సు ఆకాశమునందు వాయువు మహత్తత్త్వమునందు ఆకాశము మహస్సునందు సత్త్వరజస్త మన్సులు నిలిచి యుండును. సత్త్వము ఆత్మయందు ఆత్మ నారాయణునందు ఆశ్రయించి యుండును. నారాయణుడు మోక్షమునందు నిలిచి యుండును. మోక్షమున కాశ్రయమేదియులేదు. స్థూలదేహము పదునారు గుణములతో ఏర్పడినది. స్వభావము భావన అనునవి దేహమునాశ్రయించి యుండును. ఆత్మమాత్రము ఏపాపములు అంటక తటస్థమయి యుండును. విషయ సుభాభిలాష కలవాడు చేయు కర్మలను ఇంద్రియములను ఆత్మయందలి ఇంద్రియార్థములను మోక్షము దుర్లభమను విషయమును శాస్త్ర ప్రమాణమున తెలిసికొనవలెను. ప్రాణాపాన వ్యానోదాన సమానవాయువులను ప్రాణతత్త్వోత్తని ఏడు విధములుగానున్న శీర్షణ్యములగు ప్రాణములను ప్రజాపతులను ఋషులను నృష్టులను సప్తర్షులను రాజర్షులను దేవర్షులను మరుత్తులను సూర్యసమానులగు బ్రహ్మర్షులను ఉత్తమలోక సుఖానుభవము తరువాత అచటినుండి జారి అధోలోక గతి పొందువారిని మహాభూత సంఘ నాశమును శుభమగు వాక్కుల గతులను దశలను పూజార్చనోపాసనాదులను పాపకర్మలు పొందెడి వైతరణియమలోకము లందలి దుఃఖమును వివిధ జన్మల యందు జీవుని అశుభసంచారమును శోణితము ఉదకము శ్లేష్మ మూత్రపురీషములు తీవ్రదుర్గంధము – వీటితోనిండిన మాతృగర్భమున నివాసము శుక్రము శోణితము మజ్జస్నాయువు వందలకొలది సిరలు – వీటితో ఏర్పడిన ద్వారములు గలపురమగు దేహమున జీవుని నివాసమును తనకు హితమైనదానిని తామసరాజససాత్త్వాక ప్రాణులు సాధించగల యోగముల వైవిధ్యమును-తమఃప్రధాన యోగసాధకుల కుత్సితగతి విశేషములను ఆత్మతత్త్వము నెరిగిన సాంఖ్యులు ఉత్తమ విషయములు సాధించుటలో పొందు ఉపద్రవములను గ్రహముల తారల చంద్రునియొక్క నక్షత్రముల యొక్క పతనములను నక్షత్రముల తారుమారును జంటలు దీనముగా ఎడబాయుటను ఆయా ప్రాణులు పరస్పరము భక్షించుకొను అశుభకృత్యకమును బాల్యము నందలి అజ్ఞానమును స్థూలదేహపు అశుభస్థితిని సత్త్వగుణమును ఆశ్రయించి కూడ ఉండెడి రాగమోహములను వేలమందిలో ఏ ఒక్కడో మాత్రమే ముముక్షువు అగుటను వేదప్రమాణ విజ్ఞానముతో సాధించు మోక్షము దుర్లభము అగుటను లభించనికోరికలపై ఆదరమును అదితీరగానే ఉపేక్షా భావమును విషయసుఖము లలోని దోషములను ప్రాణము పోయినవారి అశుభ స్థితులను ప్రాణత్యాగము తానేచేయ నిశ్చయించుకొనిన మహానుభావులు తమ శుభమైన దేహములను కూడ భేదించుకొని పోవుటను శుభకరమైన వంశములయందు తమ సంకల్పముతో జన్మింప గలుగుటను సాత్త్వికులైన ప్రాణులు కూడ దుఃఖ మనుభవించుటను బ్రహ్మఘ్నలు పతితులు పొందెడి దారుణ గతిని బ్రాహ్మణులై ఉండియు దురాత్ములై సురాపానము గురుదారగమనము మొదలగు మహాపానములచేసి పొందుదుర్గతిని మాతృద్రోహి పొందు దుర్గతిని ఉత్తములు పొందెడి దెవలోకగతిని అశుభకర్మల గతులను తిర్యక్‌ ప్రాణులు పొందెడి మూఢ గతులను వేదవాదముల వైవిధ్యమును ఋతువుల తారుమారును సంవత్సర మాసవక్షదివసముల క్షయమునుచంద్రునివృద్ధి క్షయములను సముద్రవృద్ధిని ధనక్షయమును మరల అది పెరుగుటను యుగముల సంయోగములను దేహము శిథిలమగుటను దేహము మూలమున ఆత్మయందు కలుగు దోషములను మలినదేహమునుండి వెలువడు అశుభగంధములను ఎరిగి వివేచించి ముముక్షుకై యత్నించి దానిని పొందవలెను.

జీవుడు దేహమును గ్రహించుట వలన కలుగు దోషముల విషయములో మాకుగల సంశయములను బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవగు ఓవ్యాస మహామునీ! తీర్చ వేడెదము.

వ్యాసులు బ్రాహ్మణులతో ఇట్లు పలికెను : ఓ ముని సత్తములారా! కపిలుడు ప్రవచించిన సాంఖ్యమార్గము నెరిగిన విద్వాంసులు దైహిక దోషములు కామక్రోధభయ నిద్రాశ్వాసములు ఐదనియు అని అన్నిప్రాణులకు కలవనియు చెప్పుదురు. క్షమచే క్రోధమును సంకల్పములు విడుచుటచే కామమును సత్త్వగుణము నాశ్రయించి నిద్రను ఎచ్చరికచే భయమును అల్పాహారముచే శ్వాస – అయాసమును జయింపవలెను. అనేక గుణములనుండి ఉత్తమ గుణమును అనేక దోషములనుండి ప్రధాన దోషములను అనేక యుక్తులనుండి మోక్షసాధకమగు యుక్తులను అనేక వైచిత్ర్యములనుండి ప్రధానమైన వైచిత్ర్యములనుగుర్తించి విష్ణుని అనేక మాయలతో ఏర్పడిన ఈ లోకము నీటిమీద నురుగుతో సమానమని తెలిసికొని అజ్ఞానముచే నీటి బుడగవలె తిరుగుచు సుఖమువలె కనబడుచు నాశముతోనిండి నాశము తరువాత మహాభయము కలిగించుచు బురదలో దిగిన ఏనుగువలె రజస్తమో గుణములందు దిగబడి ఉన్నదని గుర్తించి వైరాగ్యము పొందవలెను. మహాప్రాజ్ఞులగు సాంఖ్యతత్త్వము ఎరిగినవారు దారపుత్రాదులపై ప్రీతి లేక పూజ్యమై సర్వవ్యాపియైన సాంఖ్యజ్ఞానముచే రాజస తామస అశుభ సంస్కారములను సత్త్వగుణ ప్రధానమైన పుణ్య సంస్కారములను విషయాభిలాషలను తపస్సు అనెడి కఱ్ఱతోను ఆత్మజ్ఞానమును ఖడ్గముతోను ఛేదించి దుఃఖ చింతా శోకములనెడి పెద్దగోతిని దాటగలుగుదురు. ఆగోతిలో వ్యాధులు మృత్యువువలన మహాఘెరభయమనెడిసర్పములు అజ్ఞానమనెడితాబేళ్ళు రజోగుణ మనెడి చేపలు కలవు. దానిని దాటుటకు ప్రజ్ఞయే నావ. అదియొక సముద్రము. ప్రపంచ విషయములపై ప్రీతి అనెడి బురద ముసలితనము అనెడి దుర్గములు విషయ సుఖములనెడి ద్వీపములు కథలు అనెడి అగాధములు సత్త్వము అనెడి తీరము హర్షములు అనెడి మహావేగములు అనేక అభిరుచులు అనెడి కల్లోలములు నానావిషయములపై ప్రీతి అనెడి మహారత్నములు దుఃఖసంతాపములు అనెడి వాయువు శోకము అనెడి పెద్దసుడులు. తీక్షవ్యాధి మహాబాధలు ఎముకల రాశులు అనెడి ఎదురుదెబ్బలు దానము అనెడి ముత్యముల రాసులు రక్తము అనెడి పగడములు నవ్వులు అనెడి అలల ధ్వనులు నానావిధములైన అజ్ఞానములు దుఃభాశ్రువులు అనెడి ఉప్పు ఈ సముద్రమునందు కలవు. దీనిని సిద్ధులై పూజ్యులైన యతులు జ్ఞానయోగమును నావతో తరింతురు. వారు దేహత్యాగము తరువాత నిర్మలమగు ఆకాశములో ప్రవేశించగానే అది ఎరిగి సూర్యుడు తనకిరణములతో విరినిపైకికొనిపోవును. తపోధనులునుయోగ వీర్యవంతులును వైరాగ్యవంతులును సిద్ధులును అగు ఆ యతులను సప్తవాయువులలో శ్రేష్ఠుడును చల్లనై సుఖస్పర్శ గలిగి సుగంధముతో కూడి సూక్ష్మమైన ప్రవహము అను వాయువు ఆకాశములో అత్యున్నత స్థానమునకు కొనిపోవును. ఆ అకాశోన్నత స్థానము వారిని రజోగుణముయొక్క సత్త్వ గుణముయొక్క ఉన్నత స్థితికిని సత్త్వోన్నతస్థితి శుద్ధత్ముడగు పరమ ప్రభువగు నారాయణుని లోనికిని కొనిపోగా ఆ నారాయణుడు ఈ యతులను తనలో చేర్చుకొని తన రూపమునకు తీసికొని పోవును. ఇట్లు అమలులగు ఈ యతులు నారాయణుడు అను పరమాత్మ తత్త్వమునుచేరి ఆ తత్త్వముగానే ఆ అమృతులగుదురు. వారు మరల జన్మ పరంపర లోకిని రానక్కరలేదు. సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతులై సత్యము అర్జవము సర్వభూత దయ కలిగి వర్తించిన అమహాత్మ్యములకు ఆ సాయుజ్య స్థితి పరమోత్తమ గతి.

ఇది విని మునులు వ్యాసునితో ఇట్లు పలికిరి. ఉత్తమమగు ఆ భగవత్తత్త్వ రూపమైన ఉత్తమస్థానమును చేరిన ఆ స్థిరవ్రతులు జన్మ మరణరూపమైన సంసారప్రవృత్తిని నారాయణుడు మరల ఆరంభించువరకు ఆ మోక్షస్థితిలో అనందించుచుందురా లేదా? ఈ విషయములలో వాస్తవమేమో చెప్ప వేడెదము. ఓ ఋషిసత్తమా! ఈ సంశయము నిన్నుతప్ప ఎవరిని అడుగజాలము. ఏలయన ఈ స్థితి పొందిన ఋషులు అచ్ఛటనే అనుభూతియందు ఉండిపోయినచో మరల ఈ లోకమున ప్రవృత్తి లక్షణమైన ధర్మమును దేనిని చూచుచున్నామో దానిని సాధించువారెవరు? లేక వారుమరల జీవులై లోకప్రవృత్తిలోనికి వచ్చినచో మరల దుఃఖములోనికి వచ్చుటయేగదా? ఈ విధముగా మీరు వివరించిన మోక్ష స్వరూపములో దోషమొకటి కనబడుచున్నది. ఈ సంశయమును తీర్చ ప్రార్థించుచున్నాము.

ఓ మునిశ్రేష్ఠులారా! ఈ ప్రశ్నముయుక్తి యుక్తమేగాని మిగుల క్లిష్టమైనది. ఈ విషయములో మహాత్ములగు కపిలాచార్యుల జ్ఞానమే శ్రేష్ఠమైనది. ఇంద్రియములు దేహమందుండి దానిని ఎరుగును. అవి ఆత్మకు ఉపకరణములు కాని ఆత్మలేనిచో కఱ్ఱలవలె గోడలవలె జడములై నశించును. ఇంద్రియములతో కూడ జీవుడు నిద్రించి ఆకాశములో వాయువు వలె సూక్ష్మరూపమున సంచరించుచు ఎన్నియో చూచుచు మరల మేల్కాంచిన తరువాత నిద్రకు పూర్వము తన అనుభవములో ఉండిన భవములో ఉండిన వాటిని మరల జ్ఞాపకము చేసికొని ఆయాపనులలో మొదటివలె ప్రవృత్తులగును. ఆత్మ నిద్రావస్థలలోనున్నప్పుడు మాత్రము ఆ ఇంద్రియములు తామేమియు చేయలేక లయమునొంది పడి ఉండును. కాని ఆత్మ ఆ ఇంద్రియముల సూక్ష్మతత్త్వమును తీసికొని సత్త్వ రజస్తమో గుణముల మనోబుద్థుల పంచభూతముల లక్షణములనువెంట బెట్టుకొని స్వప్నలోకమున సంచరించును. అట్లే ఓ బ్రహ్మణులారా? ఇచ్చటను పరమాత్ముడగు నారాయణుడు లోక వ్యవహారమునందలి ఆత్మవంటివాడు ఆయనలో సాయుజ్యము పొందిన ఈ ముక్తయతులు ఈ ఆత్మకు ఉపకరణములైన ఇంద్రియముల సత్త్వ రజ స్తమో గుణముల – మనో బుద్దుల – వంటి వారు. ఆ పరమాత్మునిలో లయమునొందిన ఈ మహాయతులు మరల నారాయణుని సృష్టికాలమున నిద్రమేల్కాంచిన జీవుని ఆధీనములో ఈతని ఇంద్రియాదులు మొదటివలె పనిచేసినట్లే వీరును సృష్టి ధర్మములో ప్రవృత్తిపొంది లోకవ్యవహారములో ప్రవర్తిల్ల జేయుదురు. ఇదియే వాస్తవమైన సాంఖ్యతత్త్వము. దీనిలో సమానమైన జ్ఞానతత్త్వము మరియొకటిలేదు. ఈ చెప్పిన నారాయణ పరమాత్మ తత్త్వము అక్షరము ధ్రువము సర్వపూర్వము సనాతన బ్రహ్మతత్త్వము ఆనాది మధ్యనిధనము ద్వంద్వ రహితము సర్వకర్త శాశ్వతము కూటస్థము (ఎట్టిస్థితులలో ఏ మార్పులను పొందని అఖండతత్త్వము ) ఆ తత్త్వమునుండియే సృష్టిస్థితిలయములు విప్రులు వేదములు ప్రవర్తిల్లును అని శాస్త్రప్రవక్తలగు మహర్షులు సర్వ విప్రులు ప్రణవ తత్త్వము ఎరిగిన మహానీయులు చెప్పుచున్నారు. సాంఖ్య – యోగ- పరులిద్దరును ఆయనతోడి సాయుజ్యమే కోరి సాధన చేయుదురు. ఏమైనను ఈ ప్రపంచమునందలి భూతములు అగమ్యములు గమ్యములు అని రెండు విధములు. ఈ రెంటిలో గమ్యభూతములు మేలైనవి. (అగమ్యము అనగా తాముపొందు సుఖదుఃఖాది అనుభవములను స్పష్టవాక్కుతో చెప్పజాలనివి) వేదపురాణ యోగములు ఇతిహాసశాస్త్రము లోకవ్యవహారము వీటియందు కనబడు జ్ఞానమంతయు సాంఖ్యతత్త్వమునుండి వచ్చినదే. పరమాత్ముని ఉత్తమోత్తమ బలము జ్ఞానము మోక్షము తపస్సులు వేదశాస్త్ర విహితములైన ఇతర సూక్ష్మవిషయములు ధర్మము అన్నియు సాంఖ్యము నుండి వచ్చినవే. కనుక ఈ పైచెప్పిన ముక్తజీవాత్మలు ఈ ఉత్తమ తత్త్వములను తమలో నిలుపుకొని సాయుజ్య మోక్షముతో కృతార్థులైయుండి మరలసృష్టి కాలమునపవిత్రులై నవారి గృహములయందు జన్మింతురు. మరల ఈ దేహమును విడిచిన తరువాత మొదటివలె మోక్షమును పొందుదురు. ఇట్టివారికి ఉత్తరోత్తరముగ ఉన్నతగతులే కాని తిర్యక్‌జన్మలు నరక నివాసము కలుగవు. ఈ చెప్పిన సాంఖ్యతత్త్వము విశాలము శ్రేష్టము విమలము ఉదారమైనది. అనాది మహాసముద్రము వంటిది. కనుక మీరును ఓ మునులారా! సాంఖ్యతత్త్వ పరాయణులై అప్రమేయుడును మహాత్ముడును అగు నారాయణనియందు చిత్తము నిలుపుడు. నేనుచెప్పిన ఈపరమతత్త్వ సారాంశమేమనగా అనాదియగు ఈ ప్రపంచము నారాయణుని నుండియే ప్రభవించినది. అతడే దీనిని సృష్టికాలములో సృజించును. ప్రళయకాలము వచ్చినప్పుడు సంహరించును

ఇదిశ్రీమహాపురాణమున ఆదిబ్రహ్మమున వ్యాసఋషిసంవాదమున సాంఖ్యవిధినిరూపణమను నూట ముప్పది నాల్గవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment