వసిష్టకరాల జనక సంవాదే క్షరాక్షరవిచార నిరూపణమ్
క్షరాక్షర తత్త్వ విమర్శము
మునులు వ్యాసునితో ఇట్లనిరి: అక్షరతత్త్వమును చేరినవారు సంసారమున మరల అవృత్తిని పొందరు. క్షరతత్త్వమును చేరినవారు మరల సంసారమున అవృత్తులగుదురు. అని తెలిపితిరి. ఈ రెండు తత్త్వములను వివేచించి తెలుప ప్రార్థింతుము. వేద తత్త్వజ్ఞులును మహాభాగులు నగు ఋషులును మహాత్ములగు యతులును నీవు జ్ఞానవేత్తలలో శ్రేష్టుడవని ప్రశంసించుచున్నారు. ఇట్టి మీనుండి ఈ విషయమును మేము వినగోరుచున్నాము. ఉత్తమామృతమును ఎంత వినియు మేమతృప్తుగులలేదు.
వ్యాసుడిట్లనెను: – ఈ విషయములో మీకు పురాతనమగు వసిష్ఠ జనక సంవాదరూపమగు ఇతిహాసమును వినిపింతును. ఋషులలో శ్రేష్ఠుడును సూర్య తేజోయుక్తుడునగు తన సభలోకూర్చున్నవాడునగు వసిష్ఠునిశ్రేయఃప్రదమగు ఉత్తమజ్ఞాన విషయమున ప్రశ్నించెను. ఆ వసిష్ఠుడు పరమాత్మ తత్త్వమును బాగుగా నెరిగినవాడు. అధ్యాత్మ విషయమున నిశ్చయాత్మక జ్ఞానము కలవాడు. అట్టి ఋషివర్యుని జనకుడు దోసిలి యొగ్గి నమస్కరించి తన హృదయమునుండి ఉత్పన్నమైనదియు మధురమును చక్కగా ఏర్పరచుకొనబడినదియు నగు పై ప్రశ్నమును అడిగెను;
బ్రహ్మయొక్క పగటి సమయమున పరమాత్ముడగు నారాయణుడు సృష్ఠిని జరుపును. రాత్రి కాగానే దానిని రుద్రరూపమున సంహారమొనర్చి నిద్రించును. మరల పగలు కాగానే సృష్టి నారంభించును. అణిమ లఘిమ మొదలగు అష్ఠసిద్దులకు ఈశ్వరుడు అవ్యయజ్యోతీరూపుడు అన్ని వైపులకు అంతట పాణిపాదములు నేత్రశిరోముఖములు కర్ణములు కలిగి సాంఖ్యశాస్త్రమునందు బహుధా నామములతో వ్యవహరింబడుచు విచిత్రరూపుడు విశ్వాత్ముడు ఏకాక్షరుడు అని శాస్త్రములలో చెప్పబడుచు ఏకాత్మకమగు త్రైలోక్యమును స్వశక్తితో ధరించుచున్న ఆ పరతత్త్వము బహురూపములతో విశ్వముగ కనబడుటచే విశ్వాత్ము డనబడుచు తానే మాయవశమున వికారమును పరిణామమును పొంది తన్ను తానే ప్రపంచముగా సృజించుకొనుచున్నాడు. అప్పుడతనికి విరించి అనియు మహత్తత్త్వము అనియు ఇత్యాది వ్యవహారము. ఈ తత్త్వమే శాస్త్రములలో బుద్దితత్త్వము హిరణ్యగర్భుడు అనియు చెప్పబడినది. ప్రజాపతులచేత నమస్కరింపబడు ఆ త్తత్త్వమును మహాతేజస్సంపన్నమగు అహంకార తత్త్వమనియు అవ్యక్తతత్త్వమునుండి వ్యక్తమైన విద్యాసృష్టియనియు అవిద్యాసృష్టియనియు వివిధములుగ వ్యవహరింతురు. ఏలయన ఏకైక తత్త్వమునుండియే ఆచరము చరము అవిద్య విద్య భూతసృష్టివైకృతప్రపంచము అన్నియు ఏర్పడినవి. శబ్ద స్పర్శరూప రస గంధములనెడి తన్మాత్రలు పృథివ్యప్తేజో వాయ్వాకాశములనెడి పంచభూతములు ఈ పదియు ఒకే మారు వ్యక్తములైనవి. మనస్సుతోకూడ త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వఘ్రాణములనెడి ఐదు జ్ఞానేంద్రియములు వాక్పానిపాదపాయూవస్థములనెడి కర్మేంద్రియము లైదును జన్మించినవి. ఈ విధముగా చతుర్వింశతి – ఇరువది నాలుగు తత్త్వములును ఏర్పడినవి. వీనితోనే ఈ సమస్తమగు ప్రపంచమును – నరకము – యక్షులు భూతములు గంధర్వులు కింనరులు మహోరగులు దోమలు ఈగలు పురుగులు కీటకములు శునకము శ్వపాకుడు మొదలగు రూపములలో పృథివి జలాకాశములందుండు స్థిర చర రూపములగు ప్రాణులు జడచేతన పదార్థములు ఏవేవి కలవో అన్నియు ఆ పరమాత్మునియొక్క రూపమే. ఇది ఆ అక్షర – నాశములేని – తత్త్వమునుండీ క్షరమగుచున్నది. వ్యక్తమగుచున్నది. కనుక ఇది క్షరము. ఇది మరల ఆ అక్షర తత్త్వము నందు లయము నొందుటచే కూడ ఇది క్షరము – నశించునది. అనబడును. ఇచట చతుర్వింశతి తత్త్వములు పంచభూతములు – పంచ తన్మాత్రలు – పంచ జ్ఞానేంద్రియమలు – పంచ కర్మేంద్రియములు – చిత్త మనోబుద్ద్యహంకారములు అనెడి అంతఃకరణ చతుష్టయము – ఇవి ఇరువది నాలుగు. మఱియు క్షరతత్త్వము వ్యక్తమయి సృష్ఠి జరుగు దశలు ఐదు. 1. పరమాత్మ 2. బుద్ది తత్త్వాత్మక హిరణ్యగర్భుడు. 3. ఈ హిరణ్యగర్భుని అహంకారమునుండి కలిగిన సూక్ష్మ భూతసృష్టి. 4. భూతముల వైకృతము. 5. భౌతిక లోకముల – లోకములందలి ప్రాణుల సృష్టి. ఈ జగత్తు అంతయు మొహాత్మకమైనది. అమూర్తమగు అవ్యక్త తత్త్వము నుండి వ్యక్తమై మూర్తిని ధరించినది.
ఈ క్షరస్థితికి అతీతమగు అమూర్త అవ్యక్త మూలకూటస్థ తత్త్వము అక్షరము. త్రిగుణాతీతమైనది. వ్యవహారమున సత్త్వగుణ ప్రధానమైనది. ఇంతవరకు చెప్పిన చతుర్వించతి తత్త్వాత్మక వ్యక్త జగత్తునకు అధిష్టాతయగు నిత్యతత్త్వమది. ఈ తత్త్వము అన్ని మూర్తతత్త్వములకు అంతర్యామియై వాని హృదయాకాశమున నుండును. వాటిని ఆయా వ్యాపారముల యందు ప్రవర్తింపజేయును. తనకు మూర్తి – రూపము – లేకయు మూర్తరూపమున – ప్రపంచరూపమున వ్యక్తమగును. సృష్టి ప్రళయధర్మము నొంది సృష్ఠి ప్రళయరూపమై ఇంద్రియ గోచరమగును. నిర్గుణుడయ్యు సగుణరూపము ధరించును. ఇట్లు తత్త్వము వికృతిని – పరిణామమును – పొందుచుండియు ప్రకృతి – మూలతత్త్వ రూపమయి వాటి విషయమున ఏ అభిమానమును లేక ధీరుడై యుండును. అజ్ఞానులగు జనులు తన్ను సేవించుకొనుటకు అనువుగా త్రిగుణాత్మక మూర్తులుగా అవతాములెత్తి ఆయా జన్మలు ధరించుచున్న దీ యక్షర తత్త్వము. కాని అతడు జ్ఞానస్వరూపుడు – తాను బాల్యాది దశలు లేనివాడయ్యు ఆయా రూపములలో నుండి నేను బాలుడను వృద్దుడను ఇత్యాది అభిమానములను పొందుచున్నాడు. అహంరూపుడు కాకయు అహంకారమును ప్రకటించుచున్నాడు. వ్యవహారమునకై శుక్లకృష్ణలోహిత వర్ణములు కలవిగా చెప్పబడు సత్త్వతమోర జోగుణాశ్రితుడై గోచరించుచున్నాడు. కాని ఈ గుణములు మూడును ప్రాకృత జనులలో ప్రాణులలో వ్యవహారమున గోచరించుచున్నవి. తామసజీవులు నరకమును పొందును. రజోగుణ ప్రధానులు మానుష భావమున నుందురు. సత్త్వప్రధాన జీవులు దేవత్వమును పొందుదురు. కేవలము పాపులు నరకమును పశుపక్ష్యాది తిర్యక్ జన్మములను పొందుదురు. పుణ్య పాప మిశ్రణమున మానవత్వము కలుగును. కేవల పుణ్యముచే దేవత్వము కలుగును. మోక్షము వీటికన్నిటికి అతీతము. అది కేవల జ్ఞానముచేతనే సాధ్యము. ఇరువదియైదవదియగు అక్షర తత్త్వములో అజ్ఞానము గుణములు మూర్తి మొదలగు దోషములు లేవు. ఆ తత్త్వము కేవల జ్ఞానరూపమై శుద్ద జ్ఞానముతోనే ప్రవర్తిల్లును.
ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వసిష్ఠ జనక సంవాదమున క్షరాక్షర నిరూపణమను నూట ముప్పది ఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹