బుధగ్రహ జననం రెండవ భాగము
చంద్రుడు మంత్ర ముగ్ధుడిలా తార మొహంలోకి చూశాడు. అక్కణ్నుంచి చూపుల్ని కిందికి మళ్ళించకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేసి , ఓడిపోయాడు…
“చంద్రా !” తార హెచ్చరించింది.
చంద్రుడు అసంకల్పితంగా లేచి , విస్తర్లో పడి ఉన్న తార పైటను అందుకున్నాడు. తార నెమ్మదిగా లేస్తూ , నిటారుగా నిలుచుంది. పైట కొంగును చేత్తో పట్టుకున్న చంద్రుడూ లేచాడు. వణుకుతున్న చేత్తో పైటను తార భుజం మీద వేశాడు. పర్వత శిఖరాల్ని కప్పిన మంచు దుప్పటిలా ఉంది ఆమె పైట ఇప్పుడు..
తన విస్తర్లో వడ్డించడం ముగించి , కూర్చుంది తార. చంద్రుడు ఆమె ఎదురుగా తన విస్తరి ముందు కూర్చున్నాడు. ఇందాక కరకరలాడిన ఆకలి ఎందుకో మాయమైనట్టు అనిపిస్తోందతనికి. మాటి మాటికీ చంద్రుడి కళ్ళు తారనే చూస్తున్నాయి. కడుపులోని ఇందాకటి ఆకలి కళ్ళలోకి చేరిందనిపిస్తోందతనికి.
“ఎలా ఉంది , వంట రుచిగా ఉందా?” తార ఉన్నట్టుండి అడిగింది.
తార ప్రశ్నతో ఉలిక్కిపడిన చంద్రుడు భోజనం చేయడం ప్రారంభించాడు. తనను చూస్తూ , విస్తరి వైపు చూడకుండా భోజనం చేస్తున్న చంద్రుణ్ణి చిరునవ్వుతో గమనిస్తూ భోజనం చేస్తోంది తార.
“మీ అమ్మగారు మహా మహిళ అని చెప్తూ ఉంటారు మీ గురువుగారు !” తార చంద్రుడి మొహంలోకి చూస్తు అంది.
“ఔను…” చంద్రుడు మెల్లగా అన్నాడు.
“మీ అమ్మగారు అందగత్తె అని కూడా విన్నాను…” తార మళ్లీ అంది. “ఊ…” చంద్రుడు పొడిగా అన్నాడు..
“నిజమేనా ? మీ అమ్మగారు అందంగా ఉంటారా ?” తార తినడం ఆపి అడిగింది.
“అమ్మ… చాలా అందంగా ఉంటుంది…” చంద్రుడు గొంతు పెగుల్చుకుని అన్నాడు. తార మాటలు అతనిలో తాత్కాలికంగా పుట్టిన బెరుకుని చెరిపివేస్తున్నాయి.
“నా కంటేనా ?” తార నవ్వుతూ అంది.
చంద్రుడు తలెత్తి చూశాడు. తార కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. ఎర్రటి పెదవులు కొద్దిగా విచ్చుకొని , మల్లెమొగ్గలాంటి పళ్ళని చూపిస్తున్నాయి.
“చెప్పు చంద్రా… మీ అమ్మగారు అందంగా ఉంటారా ? నేను అందంగా ఉంటానా ?” తార కంఠంలో చిలిపితనం రాగాలు తీసింది.
చంద్రుడు పెదవి కదపకుండా తార మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు.
తార చిన్నగా నవ్వింది. “చెప్పవూ?”
“ఇద్దరూ… ఇద్దరూ అందంగా ఉంటారు…” చంద్రుడు తడబడుతూ అన్నాడు. తార పగలబడి నవ్వింది. “పిచ్చి చంద్రా !” అంది నవ్వు ఆపి.
“ఊ…తిను !” అంది చుంద్రుడి విస్తర్ని చూస్తూ తార.
“కడుపు నిండింది…” చంద్రుడు మెల్లగా అన్నాడు.
తార ఎంగిలి విస్తర్లను తీసుకుని , పైకి లేస్తోంది. ప్రాణం వచ్చినట్టు ఆమె పైట మళ్లీ జారింది.
“ఉస్ ! ఇవాళ ఈ పైట నా ప్రాణాలు తీస్తోంది. చంద్రా…” అంది సాభిప్రాయంగా తార. అప్పటికే ఆమె అటువైపు తిరిగి ఉంది.
చంద్రుడు ఆమె వెనక వైపు నుండే , నేల మీద పడిన పైటను అందుకుని , ఎడమ చేత్తోనే ఆమె భుజం మీదకి సర్దాడు.
భుజం మీద చంద్రుడు సర్దిన పైటను గెడ్డంతో అదుముకుంటూ , చంద్రుడి వైపు వాలుగా చూసింది తార. “ఈ నార చీరలింతే… జారిపోతూ ఉంటాయి !”
తార నడుస్తూ వెళ్తుంది. కొలను గట్టున నడుస్తున్న హంస గుర్తుకు వచ్చింది. చంద్రుడికి. వెనుక నుంచి తార సౌందర్యం ఇనుమడించి కనిపిస్తోంది. తను సిగ్గుపడుతూ , మర్యాద కోసం “ఇద్దరూ అందంగా ఉంటారు !” అన్నాడు కానీ… అమ్మ అందం వేరు…. తార అందం వేరు !
ఏదో పిలుపు వినిపించి చంద్రుడు తటాలున వెనుదిరిగి చూశాడు. అతని చూపులు తోటలో ఆత్రంగా వెతికాయి. చెట్ల కింద , పొదల కింద , పొదరిండ్ల కిందా చీకటి దోబూచులాడుతోంది. చీకట్లో పొంచివుందా… ఆమె ?
తనలాగే నిద్రకు దూరమై , మనసును కెలికే మధురమైన ఊహలకు దగ్గరై , తనలాగే ఆమె కూడా తోటలోకి వచ్చిందా ?
మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి అతనికి ఆ ”జారిపోయే నారచీరే” గుర్తుకొస్తోంది ! ఆమె కంఠంలో వలికిన వీణలే అతని చెవుల్లో , అతని హృదయంలో మారు మోగుతున్నాయి.
చంద్రుడు అక్కడా , ఇక్కడా నక్కిదాక్కున్న చీకట్లలో ఆమె కోసం ఆశగా , ఆత్రుతగా వెతుకుతూ , చప్పుడు చేయకుండా తిరుగుతున్నాడు.
ఏదో పిలుపు – ఇందాకటిలాగా అతన్ని పిలిచింది. చంద్రుడు తల తిప్పి చూశాడు. గుబురుకొమ్మల్లో ఆకులు చప్పుడు చేశాయి. ఏదో రెక్కల చప్పుడు ! ఇందాకట్నుంచీ తనను ”పిలిచిన” పక్షి ఎగిరిపోయింది !
చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు. ఆమె… ఆమె… గురుపత్ని… అలా నారచీర జారిపోవడం నిత్యమూ జరిగేదేనేమో ! సమీపంలో ఉన్న గురువుగారో , శిష్యులో ఆ పైటను సర్దడం సాధారణంగా జరిగేదేనేమో !
అందగత్తె అయిన స్త్రీని అతి సమీపంలోంచి మొదటిసారి చూసినందుకు తాను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడా ? ఆమె కళ్ళు అందర్నీ ఒక్కలాగా , తనను మాత్రం మరొకలాగా అర్ధవంతంగా – సందేశాత్మకంగా చూస్తున్నాయా ?
ఎటూ తేల్చుకోలేని చంద్రుడు విద్యార్థుల విడిది వైపు బరువుగా అడుగులు వేశాడు.
అంతసేపూ ఒక పొదచాటు నుంచే చంద్రుణ్ణి గమనిస్తూ ఉండిపోయిన పరిచారిక పుంజికస్థల పెదవి విరుచుకుని , తన పర్ణశాల వైపు వెళ్ళింది.
అప్సరస అయిన తనను ఆ మహేంద్రుడు గురువుగారి ఆశ్రమ పరిచారికగా నియమించి , స్వర్గలోకం నుంచి ఇక్కడికి పంపించి వేశాడు. ఆశ్రమ జీవితం తనకు విసుగు పుట్టించి వేసింది. గురుపత్ని చెప్పే ఆ పనీ , ఈ పనీ చేయడం , రోజూ ఉదయం గురువుగారి దేవతార్చనకు పువ్వులు కోసి , తెచ్చి సమర్పించుకోవడం , విద్యార్థుల విడిదిని శుభ్రం చేయడం… నిత్యం ఇవే పనులు.
పుంజికస్థల నిట్టూర్చింది. ఒక ఆట లేదు , ఒక పాట లేదు ! ఒక వినోదం లేదు , ఒక వేడుక లేదు ! తాను అటూ ఇటూ వయ్యారంగా అడుగులేస్తూ ఉంటే సరసోక్తులూ , ఛలోక్తులూ రువ్వే దేవయువకులూ లేరు ! హూ ! ఆ ఊర్వశిలాగో , మేనకలాగో ఆటాపాటా వచ్చి ఉంటే దేవరాజు తనని ఇక్కడికెందుకు పంపిస్తాడు ? ఈ ఏకాంతవాస శిక్ష ఎందుకు విధిస్తాడు ? అప్సరసగా జన్మించిన తనకు అప్సరసగా జీవించే అదృష్టం లేదు !
పుంజికస్థల బరువుగా నిట్టూర్చింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹