వసిష్ఠజనక సంవాదము
వసిష్ఠుడు జనకునితో నిట్లు పలికెను : ఈ చెప్పిన విధముగా ఆ అక్షరతత్త్వము జ్ఞాన్వరూపుడయియు అప్రతి బుద్ద – అజ్ఞాన సహిత – రూపుడై అప్రతిబుద్దులగు మనవంటివారి ననువర్తించుచున్నది. దేహము నుండి మఱియొక దేహములో ప్రవేశించుచు వేలకొలది జన్మలను పొందుచున్నది. వేలకొలది తిర్యగ్యోనులందును దేవతలయందును తపోవంతుడై మహాసద్గుణయుక్తుడుగా గుణక్షయముచే మనుష్యుడుగా జన్మించి పుణ్యవశమున స్వర్గమునకు పోవును. మనుష్య లోకమునకు వచ్చును. పాపముచే నరకమునకును పోవును. పట్టుపురుగు తన దేహమునుండి తీసిన దారముతో తన్నే చుట్టుకొన్నట్లు తననుండి నిష్పన్నములైన త్రిగుణములతో తన్నే బంధించుకొని ఆ అక్షరుడు తాను స్వభావముచే ద్వంద్వాతీతుడై యుండియు సుఖదుఃఖ రూపములగు ద్వంద్వములకు లోబడి శిరోరోగము నేత్రరోగము దంతశూల గల గ్రహము జలోదరము అతిసారము గండమాల విచ్చర్చిక బొల్లి కుష్ఠము అగ్నిదాహము అపస్మారము మొదలగు బాధలను పొందుచు దేహము నేనే అనియు దేహము నాదే అనియు మాయావశమున కలిగిన అభిమానముచే ఆ బాధలును కనకే అని అభిమానమును పొందుచున్నాడు.
అభిమానముచే కలుగు ఈ ద్వంద్వజనిత దుఃఖములతో పాటుగ ఆ దేహత్మా భిమాన వశముననే అహంకార మమకార వశముననే అతడు కొన్ని సుకృతములను కూడ ఆచరించుచున్నాడు. అవి ఇట్లు ఉండును. ఒకే వస్త్రము ధరించుట నాలుగు వస్త్రముల ధరించుట నేలపైపరుండుట కప్పవలె పరుండుట వీరాసనములో కూర్చుండుట వీరాసనముతోను ఆకాశమునందును శయనించుట ఇటుకల కుప్పపై బూడిదరాశిపై భూమిపై పండుకొనుట వీరస్థానమున జలముతో తడిసిన చోట కొయ్య -రాతి పలకలపై పరుండుట కాయలతో పండ్లతో పశువులతో పక్షులతో నిండినచోట ఉద్యానములో కళ్లములో పండుకొనుట పూసలతో వెంట్రుకలతో చేసిన వస్త్రములు వ్యాఘ్ర చర్మము సింహదర్మము చెట్లబెరడు పట్టములు నారతో పురికొసతో నేసిన పట్టాలు మొదలగునవి. చాపలు – చాపలవంటి ఇతరవస్తువులు నార వస్త్రములు మొదలైనవి తన అభిరుచిననుసరించి ధరించుట ఒక రాత్రి వదలి మఱియొక రాత్రియు దినమున కొకేమారును నాలుగు భోజనకాలముల కొకమారు ఎనిమిది భోజనకాములకు ఒకసారి ఎనిమిది నాళ్ళకు ఒకసారి ఆరునాళ్లకు ఒకసారి భోజనము చేయుట మాసోపవాసము చేయుట మూలములు పండ్లు తినియుండుట వాయువును నూనె పిండివంటలను పెరుగును గోధుమలతో యవలతో చేసిన వంటలను గోమూత్రమును ఱల్లుపూవులను నాచును ఎండుటాకులను వివిధములగు పండ్లను భుజించి జీవనము గడపుట కృచ్ఛమ్రులు చాంద్రాయణములు మొదలగు కఠిన వ్రతములు ఆచరించుట వివిధ వేషములు చిహ్నములు అవి నాలుగు ఆశ్రమములలో వేటికి సంబందించినవైనను ధర్మాధర్మములలో దేనికి చెందినవైనను వాటికి సన్నిహితమైన ఇతర లక్షణములను వేద విరుద్థములైన వానిని ధరించుట వివిక్తమగు శిలల నీడలను సెలయేళ్లను ఇసుక తిన్నెలను అడవులను పర్వతగుహలను వివిధ నియమములను తవస్సులకు యజ్ఞ ములను వివిధ యజ్ఞములను ఆశ్రయించుట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రజాతి ధర్మము లలో తోచిన వాటిని ఆవలంబించుట దీనులు అంధులు మొదలగువారికి వివిధ దానములు చేయుట వివిధ గుణములను స్వభావములను అలవాటును పాటించుట ధర్మార్థ కామము లతో తనకు అభిమతమగు పురుషార్థమునందు ప్రవృత్తుడగుట ఇవన్నియు దేహాత్మా భిమానము అహంకార మమకారము. అనెడి వానివలన మాయా వశమున కలుగు ప్రవృ త్తులే. స్వాహాస్వధావషట్ నమస్కారములు యజనయాజ నాధ్య యనాధ్యాపనదాన ప్రతి గ్రహములు జన్మ జరామృత్యువులు హింస శుభాశుభ కర్మల న్నియు ఈ అభిమాన వశమున కలుగునవే. ఇట్లు ఆ అక్షరతత్త్వమేక్షర రూపమున తన్ను తాను వివిధరూపములలో విభజించుకొనుచు వ్యక్తమూర్తరూపమున కనబడు చున్నది.
పూజ్యురాలగు ప్రకృతిదేవియే భయమును ప్రళయమును కూడ కలిగించును. బ్రహ్మయొక్క పగలు – అనగా సృష్టికాలము అయిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రళయ మును జరిపి ఈ త్రిగుణములకును వాటివలన కలుగు సమస్త లక్షణములకును అతీతుడై ఏకైక తత్త్వమగు తాను మాత్రమే ఉండును. సృష్టి జరుగక నిలిచిపోయిన రాత్రి – ప్రళయ కాలమున సూర్యుడు తన కిరణములను వలె కొంతకాలము పాటుఆయా గుణధర్మము లను తన లోపల ఆయన నిగ్రహించియుంచును. ఇది యంతయు ఆయన ఇట్లు లీలా – క్రీడా -ర్థమై చేయుచు తన హృదయమునకు ప్రియములైన ఈతన రూప గుణములను తనవి అను అభిమానముతో – మమకారముతో – చూచును. ఆయన త్రిగుణాత్మకుడు- త్రిగుణముల కధిపతి. క్రియాప్రవృత్తి మార్గమునందు ఆసక్తి కలవాడు. క్రియా ప్రవృత్తులతోను యజ్ఞాది క్రియలతోను సంతతమును కూడియుండువాడు. అందుచే ఈ సృష్టి ప్రళయ రూపమగు ప్రవృత్తియందు ముందునకు సాగుచు ఇది నాదియను మమకారమును లీలార్థమై మాత్రమే – వహించును. వాస్తవమున ఆ మహానుభావునకు అహంకార మమకారములు ఏవియు లేవు. ఈ జగమంతయు ప్రకృతి ధర్మముచే కన్నుగానక రజస్తమో గుణధర్మములచే అనేకవిధములుగా వ్యాప్తమై యున్నది. ఈ ద్వంద్వములు సుఖ దుఃఖ – శీతోష్ణాదులు. నాచే అతీతములై నానుండి యుత్పన్న ములగుచు నాయందే లయము నొందుచున్నవి. అని ఆయన ఎరుగును. అవి తనచే లెస్సగ సృజింపబడినవే యైనను తాను సామాన్య జీవుడై యున్నపుడు మాయావశమున ఏమియు ఎరుగక పోవుటచే అయ్యో! ఇవి యన్నియు నేను తరించవలెను. దేవలోక మున నేను ఈ ఫలములను అనుభవింపవలెను. ఈ లోకములో నున్నపుడు కర్మవశమున కలుగు శుభాశుభ ఫలము లను అనుభవింపవలసియున్నది. ఈ విధమగు కర్మములాచరించి సుఖములను సంపాదింపవలెను. ప్రతిజన్మమునందును నాకు సుఖమే కలుగుటకు యత్నించవలెను. ఇహమున నాకు అనంతమగు దుఃఖములు నరకమున యాతనలు ఉండరాదు. ఒకవేళ నరకమునకు పోయినచో మరల మనుష్యజన్మమును తరువాత దేవత్వమును పొందుదడును. అని యిట్లు బ్రహ్మణాది జన్మములు పొందిన ఈ మానవులు ఆయా గుణములతో ఆవరింపబడి భానచేయుచు అందుకు తగినట్లు కర్మము లాచరించుచు నరకమునో మున్యష్యత్వ దేవత్వములనో పొందుచు కేవలము మమకారవశమున ఈ జననమరణరూప సంసారగతిలో తిరుగుచుందురు.
ఈ విధముగా జీవుడు శుభాశుభ ఫలాత్మకమగు కర్మల నాచరించుచు జనన మరణముల నడుమ అనేక రూపములలో సంచరించుచున్నాడు. కాని ఈ జీవుల ప్రవృత్తులలోను తిర్యగ్యోని మనుష్యత్వ దేవత్వ ప్రాప్తులలోను ప్రకృతియే హేతువు. అది స్వతంత్రమైనది. జీవుడు ప్రకృతికి అతీతమైన తత్త్వమునందు వ్రణము లేదు. కర్మఫల సంగము లేదు. వ్రణద్వారములనదగిన జ్ఞాన కర్మేంద్రియములు త్రిగుణజన్యములైన రాగద్వేషాదులు తోడుకాగానే ఈ జీవుడు – అహంకార మమకారములు కలిగి తనకు ఇంద్రియములు వ్రణములు చిహ్నములు కాలము సత్తా మరణములు సంచరణము క్షేత్రము సంగము – తత్త్వము – సంసారము నాశములేకున్నను ఆజ్ఞానవశమున తనకివియన్నియు ఉన్నవని భావించుచు పెద్దలను సేవించి వివేకమును సంపాదించక దేవత్వము మొదలు నరకపాతమువరకు గర్భప్రకాశము మొదలు మరణమువరకు వివిధ స్థితులకు కారణములగు వేలకొలది సృష్టులలో సంచరించుచు సంచరించు చున్నాడు. చంద్రునకు పదునారు కళలున్నవని శాస్త్రము చెప్పుచున్నది. వానిలో పదునైదింటిని మాత్రము దేవతలనుభవింతురు. పదునారవ కళ మాత్రము దేవతల అనుభవమునకు అందక నిలిచి యుండుచు తానే దేవతలను అనుభవించుచు మరల మరల చంద్రుడు వృద్ధిక్షయములు పొందుటకు మూలమగు చున్నది. అట్లే శుద్ధమగు ఆత్మ తత్త్వముకూడ అజ్ఞానవశమున ప్రకృతికి లోబడి ఆయాజన్మ పరంపరలలో వృద్ధిక్షయములను పొందుచుండియు శుద్ధతత్త్వమునకు ఏమియు అంటక నిలుచును కావున ఆతాత్త్విక స్థితిని వృద్ధజనసేవసముచే వివేకముపొందియు యోగాది సాధనచేసియు భగవదనుగ్రహము పొందినప్పుడు గ్రహంచి ముక్తుడగుచున్నాడు.
ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వసిష్ఠ జనక సంవాదమున క్షరాక్షరతత్త్వ నిరూపమను నూట ముప్పై ఆరవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹