Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ఇరవై రెండవ అధ్యాయం

హయగ్రీవ పూజనావిధి

సూతుడు శౌనకాది మహామునులకు విష్ణువు శివునికీ ఇతర దేవతలకూ ఉపదేశించిన హయగ్రీవ పూజను ఇలా వినిపించసాగాడు.

“హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యాశాలి, సకల విద్యలనూ ప్రసాదించేది. ఓంకార యుక్తం. అది ఇది

ఓం సౌం క్షాం శిరసే నమః

ముందుగా ఎప్పటి వలెనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. ఈ మంత్రాలిది వఱకే ఇవ్వబడ్డాయి. అయినా హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాళతంతు, రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది.

నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ఆవు పాలలాగ, కోటి సూర్యప్రభలను విరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపియైన దేవత ముకుట, కుండల, వనమాలా సుశోభితుడై సుదర్శనుడై సుందరదరహా సవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియై మంగళ స్వరూపుడై వుంటాడు.

ఈ స్వామిని, అన్ని దేవతలనూ తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకొని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి.

తరువాత మూలమంత్రంతోనే శంఖ, పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో వున్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి.

ఈ మంత్రంతో

ఓం హయ గ్రీవాసనస్య ఆగచ్ఛత చ దేవతాః !

తరువాత ఒక స్వస్తిక్ లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి. ద్వారంలో ధాతనూ విధాతనూ పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగ, మహాదేవిలను, శంఖ, పద్మ, నామక నిధులనూ, అగ్రభాగంలో గరుడునీ, మధ్యభాగంలో ఆధారశక్తినీ పూజించాలి. (ఈ మంత్రాలన్నీ ఇదివఱకే చెప్పబడ్డాయి)

అపుడు కూర్మ,అనంత, పృధ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలోధర్మునీ, నైరృత్యంలో జ్ఞానాన్నీ, వాయవ్యంలో వైరాగ్యాన్నీ, ఈశాన్యంలో ఐశ్వర్యాన్నీ పూజించాలి.

ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండలమధ్యంలో సత్త్వ రజస్తమోగుణాలనూ, అక్కడే కంద’, నాళ, పద్మాలనూ విధ్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి.

విమలాది శక్తులు తొమ్మిదింటినీ తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో (శ్రీధర పూజానావిధిలో వలెనే) పూజించాలి..

తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు, భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకొని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్రప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్ని ఇవ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి. తరువాత శుభదాయినీ, ఐశ్వర్య ప్రదాత్రీయైన లక్ష్మీదేవిని పూజించాలి.

తరువాత నలుదిక్కులలో ఇలా

తూర్పులో ఓం శంఖాయ నమః

దక్షిణంలో ఓం పద్మాయ నమః

పడమట ఓం చక్రాయ నమః

ఉత్తరంలో ఓం గదాయై నమః

అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే క్రమంలో

ఓం ఖడ్డాయ నమః,

ఓం ముసలాయ నమః,

ఓం పాశాయ నమః,

ఓం అంకుశాయ నమః

అనే మంత్రాలతో ఆయా ఆయుధాలనీ వాటి మధ్యలో ఓం సశరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లమ్ములనూ స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాలా(యై) పీతాంబరాలనూ పూజించి మరల శంఖాదిధారియైన హయగ్రీవస్వామిని అర్చించాలి.

అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరమగురు, గురు పాదుకలను క్రమంగా ఈ విధంగా

ఓం బ్రహ్మణే నమః,

ఓం నారదాయ నమః,

ఓం సిద్ధాయ నమః,

ఓం గురుభ్యో నమః,

ఓం పరగురుభ్యో నమః,

ఓం గురుపాదుకాభ్యాం నమః

అనే మంత్రాలతో పూజించాలి.

ఇపుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులనూ, ఊర్ధ్వ అధో దిశలలో బ్రహ్మనూ అనంతునీ ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ

ఇంద్రాయ నమః,

అగ్నయే నమః,

యమాయ నమః,

నిర్భతయే నమః,

వరుణాయ నమః,

వాయవే నమః,

సోమాయ నమః,

ఈశానాయ నమః,

బ్రహ్మణే నమః,

అనంతాయ నమః

లతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట

ఓం వజ్రాయ నమః,

ఓం శక్తయే నమః,

ఓం దందాయ నమః,

ఓం ఖడ్గాయ నమః,

ఓం పాశాయ నమః,

ఓం ధ్వజాయ నమః,

ఓం గదాయై నమః,

ఓం చక్రాయ నమః,

అనే మంత్రాలతో ఆయుధాలనూ

ఓం పద్మాయ నమః

అనే మంత్రంతో పద్మాన్నీ, ఈశానకోణంలో ఓం విష్వక్సేనాయ నమః,అనే మంత్రంతో ఆయననీ పూజించి అనంతరం అనంతుని మరల అర్చించాలి. పిమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్నిచేసి దానిని ఆయనకే అర్పించి ఇలా స్తుతించాలి

ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయవై నమః |

నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః ||

నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః |

సురాసుర నిహంత్రేచ సర్వదుష్ట వినాశినే ||

సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః |

నమశ్వేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ ||

నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్త్వ హితాయ చ ||

త్రిగుణాయా గుణాయైవ బ్రహ్మవిష్ణు స్వరూపిణే |

కర్రే హర్రే సురేశాయ సర్వగాయ నమోనమః ||

ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనః కమలమధ్యంలో శంఖచక్రగదాధారి, కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు, సర్వాంగసుందరుడు, అవినాశియగు మహేశునికే ఈశుడు, దేవాధిదేవుడు, పరమాత్మయగు హయగ్రీవుని నిలుపుకొని ధ్యానం చేయాలి.

హే ఫాలలోచనా! ఈ పూజను గూర్చి చదివినవారికి పరమపదం ప్రాప్తిస్తుంది.

ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment