గాయత్రి వ్యాసం – సంధ్యావిధి
శంకరాది దేవతలారా!విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి. మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్నూహించి న్యాసాదులతో పూజిస్తారు. ఈ మంత్రానికి ఋషి విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. మంత్రాధిదేవత సూర్యుడు. దీనికి మస్తకం బ్రహ్మ, శిఖ శివుడు. విష్ణు హృదయమే నివాసము. ఈ మంత్రరూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి. మూడు లోకాలూ ఈ మంత్రానికి చరణాలు. కాబట్టి పుడమిని పాదంగానూ విష్ణువును మొండెం గానూ బ్రహ్మను తలగానూ శివుని శిఖగానూ ఒక స్వరూపాన్ని మనసులో పెట్టుకొని కనులు మూసుకొని గాయత్రి మంత్రాన్ని పన్నెండు లక్షలమార్లు జసించాలి.
ఈ మంత్రానికి మూడు పాదాలుంటాయనేది సర్వవిదితం. కాని, నాలుగో పాదము కూడా ఉంది. జపం చేసుకున్నపుడు మూడు పాదాలనూ, గాయత్రినీ సూర్యునీ పూజించి నప్పుడు నాలుగు పాదాలను వాడాలి.
పరో రజనే.. సావదోం అనేది గాయత్రి మంత్రానికి నాలుగవపాదం. సూర్య పూజలోనే కాక ఇతర పూజలలో కూడా ఈ పాదాన్ని ప్రస్తుతం చదవడం కనిపిస్తోంది. జప, ధ్యాన యజ్ఞాది కృత్యాలలోనూ పూజలలోనూ నిత్యం ఈ సర్వపాప వినాశినియైన మంత్రానికి విధ్యుక్తంగా సాధకుడు అంగన్యాసం చేసుకోవాలి.
పాదాలబొటన వ్రేళ్ళు, చీలమండల మధ్యాలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, వెనుకభాగము, అండకోశం, నాడి, నాభి, ఉదరం, ఛాతీ రెండు వైపులు, గుండె, కంఠం, పెదవులు, నోరు, తాలువు, రెండు భుజాగ్రాలు, నుదురు, కనులు, కనుబొమ్మలు, కణతలు, తల ఈ భాగాలన్నింటిని ఈ మంత్ర వ్యాసానికి వినియోగించాలి. తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలోనూ ఈ మంత్ర వ్యాసాన్ని చేయాలి.
గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలనూ ఇరవై నాలుగు రంగులలో వర్ణానికొక వర్ణంగా భావించి పూజించాలి. ఒకవేళ గాయత్రికి రూపాన్ని ఆవిష్కరిస్తే ఆ రూపానికి ఈ రంగులుండాలి. ఇంద్రనీలమణి , అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిల వర్ణం, అగ్ని వర్ణం, పసుపు, నలుపు, కపిల వర్ణం, తెలుపు, మెరుపు తీగ రంగు, ముత్యపు రంగు, కృష్ణ వర్ణం, ఎరుపు, చామనచాయ, వెన్నెల తెలుపు, శుక్ల వర్ణం, లేత పసుపు, పద్మరాగ వర్ణం, శంఖ వర్ణం, పాండుర వర్ణం, ద్రాక్ష ఎరుపు, తేనె రంగు, నలుపు ఎరుపు కలిసిన రంగు, సూర్య వర్ణం, సౌమ్య శ్వేతం, శంఖపు రంగు ఇలా పంచరంగుల (పంచ వర్ణాల) కళల భేదాలతో ఇరవై నాలుగు అక్షరాలనూ ఒక ఫలకంపై వ్రాసి కూడా పూజించవచ్చు.
గాయత్రి మంత్రాన్ని చదువుతూ ముట్టుకునే వస్తువులూ, చూసే పదార్థాలూ కూడా పవిత్రాలై పోతాయి.
యద్యత్ స్పృశతి హస్తేన యచ్చ పశ్యతి చక్షుషా |
పూతం భవతి తత్ సర్వం గాయత్ర్యాన పరం విదుః ||
దేవతలారా! వేయిమాటలేల? గాయత్రికంటె శ్రేష్ఠమైన మంత్రం లేదు. మహాదేవా! ఇక సర్వపాపనాశినియగు సంధ్యావందన విధిని వినిపిస్తాను. ముందుగా మూడుమార్లు “ప్రాణాయామం చేసి సంధ్యాస్నానానికి ఉపక్రమించాలి.
ప్రాణవాయువును సంయతం చేసుకొని (అదుపులో నుంచుకొని) ఓంకారంతో, సప్తవ్యాహృతులతో యుక్తమైన ఆపోజ్యోతీ రసో.. మృతం భూర్భువః స్వరోం అనే మంత్రాన్ని మూడుమార్లు పలకడాన్నే ప్రాణాయామమంటారు. ద్విజుడు ప్రాణాయామాల ద్వారా మానసిక, వాచిక, కాయిక దోషాలను భస్మం చేయగలదు. కాబట్టి మనం యథావిధి, యథానియతి అన్ని కాలాల్లో ప్రాణాయామ పరాయణులమై వుండాలి.
ప్రొద్దున్న సూర్యశ్చ, అనే మంత్రంతోనూ, మధ్యాహ్నం ఆపఃపునంతు. అనే మంత్రం తోనూ, సాయంకాలం అగ్నిశ్చమామన్యుక్షు అనే మంత్రంతోనూ యధావిధి ఆచమనం చేసి ప్రణవమంత్ర యుక్తమైన ఆపోహి అనే ఋచాతో కుశోదకం ద్వారా మార్జనం చేసుకుంటూ మంత్ర ప్రతిపాదానికి ఒక మారు తలపై నీళ్ళు చిలకరించు కుంటుండాలి.
రజస్తమోగుణాల వల్లనూ, అజ్ఞానం వల్లనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలలోనూ మనం చేసుకున్న పాపాలూ, కాయిక, వాచిక, మానసిక పాపాలూ ఈ మంత్రాల వల్ల నశిస్తాయి.
కుడిచేతిలో నీటిని తీసుకొని దానిని ద్రుపదాం అనే మంత్రం ద్వారా అభిమంత్రితం చేసి తలపై పోసుకోవాలి. అఘమర్షణ మంత్రాలతో మూడు, ఆరు, ఎనిమిది లేదా పన్నెండు ఆవృతులను చేసి అఘమర్షణం చేసుకోవాలి. ఈ మంత్రాలేవనగా
ఋతుంచచాభిద్దాత్త పసో ధ్వజాయత ||
తతో రాత్ర్య జాయత తతః సముద్రో ||
అర్థవః సముద్రాదర్ల వాదధి సంవత్సరో ||
అజాయతః అహోరాత్రాణి విదధద్విశ్వస్య ||
మిషతోవశీ సూర్యచంద్ర మసౌధాతా ||
యథాపూర్వమకల్పయత్ దివంచ ||
పృథివీం చాంతరిక్ష మథో స్వః ||
వీటిని పఠించిన తరువాత చేతులను కడుక్కొని తుడుచుకొని మరల ఉదుత్యం, చిత్రమ్ అనే మంత్రాలను చదివి సూర్యోపస్థానం చేయాలి. దాని వల్ల దిన, రాత్రులలో చేసే పాపాలన్నీ నాశనమైపోతాయి.
ప్రాతఃకాలీనసంధ్యను నిలబడి వార్చాలి. ఇతర సంధ్యావందనాలను కూర్చుని చేయాలి. గాయత్రీమంత్రాన్ని పదిమార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలూ, వందమార్లు జపిస్తే పూర్వ జన్మపాపాలూ, వెయ్యిమార్లు జపిస్తే యుగంలో చేసిన పాపాలూ నశిస్తాయి.
గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే మూడు మహాశక్తులు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి. అవి క్రమంగా పొద్దున్న రక్తవర్ణంలోనూ, మధ్యాహ్నం శుక్లవర్ణంలోనూ, సాయంత్రం కృష్ణ వర్ణంలోనూ వుంటాయని పెద్దలు చెప్తారు.
ఇక వ్యాహృతి పూర్వక అంగన్యాసం ఇలా చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ వ్యాహృతియైన భూః ను ‘ఓం భూః హృదయాయ నమః అంటూ గుండెలోనూ, ద్వితీయ వ్యాహృతియైన భువః ను ఓం భువః శిరసే స్వాహా అంటూ తలపైనా, తృతీయ వ్యాహృతి స్వః ను ఓం స్వః శిఖాయైవషట్ అంటూ శిఖలోనూ న్యాసము చేయాలి.
గాయత్రి మంత్ర ప్రథమ పాదాన్ని, అనగా, తత్సవితుర్వరేణ్యలను కవచంలోనూ, రెండవ పాదం భర్గోదేవస్య ధీమహిని నేత్రాలలోనూ, మూడవ పాదం థియోయోనః ప్రచోదయాత్ను చేతులలోనూ, నాలుగవ పాదమైన పరోరజ సే… సావదోమ్ను సర్వాంగాల లోనూ న్యాసంచేయాలి. ఈ విధంగా సంధ్యావందనముచేసేవారికి సర్వశుభాలూ ప్రాప్తిస్తాయి,
గాయత్రి యొక్క మొదటి మూడు పాదాలూ బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలు. ఋషినీ, ఛందాన్నీ స్మరిస్తూ మంత్రజపం చేసేవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
”పరోరజు సే… సావదోమ్”ని గాయత్రి తురీయ (శ్రేష్ఠ) పాదమంటారు. దీనికి ఋషి నిర్మలుడు, ఛందం గాయత్రి, దేవత పరమాత్మ. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలలో ఒక వెయ్యి ఎనిమిది లేదా నూట ఎనిమిది మార్లు గాయత్రి మంత్రాన్ని పఠించేవారు బ్రహ్మలోకానికి వెళ్ళే అధికారాన్ని పొందుతారు.
ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹