శివ పవిత్రారోపణ విధి
శివపవిత్రారోపణ సర్వ అమంగళాలనూ నశింపజేస్తుంది. జందెపు దారములను విగ్రహానికి చుట్టడాన్నే పవిత్రారోపణమని అంటారు. ఈ పూజను ఆషాఢ, శ్రావణ, మాఘ లేదా భాద్రపద మాసంలో చేస్తారు. సత్యయుగంలో స్వర్ణంతో, త్రేతాయుగంలో వెండితో, ద్వాపరయుగంలో తామ్రంతో ఈ దారాలను తయారు చేసేవారు. కలియుగంలో పత్తిని కన్య చేత దారాలుగా పేనించి ఈ పూజకు వాడాలి.
మూడు పోగులను తయారుచేసి మరల వాటిని బలంగా చుట్టి మూడు పోగులుగా దళంగా చేయాలి. ఈ రకమైన నవగుణిత సూత్రాన్ని వామదేవ మంత్రం చదువుతూ ముడులు వేయాలి. దీనినే పవిత్రక మంటారు. తరువాత సద్యోజాత మంత్రం ద్వారా వాటిని కడిగి అఘోరమంత్రం తో తుడిచి, తత్పురుష మంత్రంతో చిక్కులు విడదీసి, ఈశాన మంత్రం చదువుతూ దానికి సుగంధిత ధూపాన్ని వేయాలి.
ఇప్పుడివి తొమ్మిది దారపు పోగులు కదా! ఈ నవతంతువులలో క్రమంగా ఓంకార,చంద్ర, అగ్ని, బ్రహ్మ, నాగ, శిఖి, ధ్వజ, సూర్య, విష్ణు, శివ ఈ దేవతలు నివాసముంటారు.
ఇటువంటి పవిత్రకాలను నూట ఎనిమిది, యాభై, లేదా పాతిక సంఖ్యలో ఒక పూజకువాడాలి. పవిత్రకంలో పదేసి ముడులు వుండాలి. నాలుగేసి, రెండేసి, లేదా ఒక్కొక్క అంగుళం దూరంలో ముడివేస్తూ పోవాలి. ఈ గ్రంథులలో నివసించి తమ పేర్లను ప్రసాదించి వాటిని పవిత్రం చేసే దేవతలు ప్రకృతి, పౌరుషి, వీర, అపరాజిత, జహ్యయ,విజయ, రుద్ర, అజిత, మనోన్మనీ, సర్వముఖి.
దేవతలారా! గ్రంథి బంధనానంతరం ఆ పవిత్రకాలను కుంకుమతో, చందనాది సుగంధాది పదార్థాలతో రంజితం చేయాలి. దానిని మహాదేవునికి సమర్పించి సర్వోపచారాలతో పూజించి ”హే దేవేశా! హే మహేశ్వరా! తమరు తమ గణాలతోసహా ఇక్కడ వేంచేసి వుండండి. ప్రాతర్వేళనే మీకు మరొక పూజను సమర్పించుకుంటాను” అని ఆహ్వానించాలి.
ఆ రాత్రంతా నృత్య, గీత, వాద్యాలతో ఉత్సవాన్ని నడిపి జాగరం చేయాలి. తెల్లవారగానే ఆ పవిత్రకాలను మహేశ్వర సన్నిధిని స్థాపించి చతుర్దశి తిథి రాగానే స్నానం చేసి ముందుగా సూర్యునీ, తరువాత శివుని పూజించాలి. తరువాత సాధకుడు ధ్యానంలోకి పోయి లలాటంలో విశ్వరూపుని చూసుకొని తన ఆత్మ స్వరూపాన్ని పూజించుకోవాలి.
అప్పుడు పవిత్రకాలను అస్త్రమంత్రాలతో కడిగి, హృదయ మంత్రంతో అర్చించి, సంహితా మంత్రాలతో ధూపం వేసి, భగవంతునికి సమర్పించాలి. ఈ క్రింది మంత్రాల ద్వారా ఈయీ తత్త్వాలను ప్రార్థించాలి.
ఓం హౌం హొం శివతత్త్వాయ నమః,
ఓం హీం (హీః) విద్యాతత్త్వాయ నమః
ఓం హాం (హౌః) ఆత్మతత్త్వాయ నమః,
ఓం హాం హ్రీం హూం క్షాః సర్వతత్త్వాయ నమః
పిమ్మట మహేశ్వరునికి విధిపూర్వకంగా పవిత్రకాన్ని సమర్పించి కాసేపుంచి దానిని తీసి కనులకద్దుకొని ప్రతి ధరించాలి.
ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹