Skip to content Skip to footer

🌹🌹 శ్రీమదగ్ని మహా పురాణము 🌹🌹 – మొదటి అధ్యాయము

అగ్నిచెప్పిన పురాణము అగ్నేయ పురాణము.

ప్రశ్నము

శ్రీమహా లక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమార స్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాది దిక్పాలలకును, శ్రీమహావిష్ణువునకును నమస్కరించుచున్నాను

నైమిశారణ్యము నందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహమునులు తీర్థయాత్రా సందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి.

ఋషులు

ఓ సూతమహాముని ! నీవు(మా చేత పూజింప బడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలుసుకున్నంత మాత్రముననే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సారమైన దానిని మాకుచెప్పుము.

సూతుడు

సృష్ట్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహా విష్ణువే సారములలోకెల్ల సారమైన వాడు. “ నేనే ఆ పరబ్రహ్మ స్వరూపుడను” అని ఆ విష్ణువును గూర్చి తెలిసి కొన్నచో సర్వజ్ఞత్వము కలుగును.

శబ్దములకు గోచరమగు సగుణ బ్రహ్మయు, పరమగు నిర్గుణ బ్రహ్మయు తెలియదగినవి. అథర్వ వేదమునకు సంబంధించిన మాండకోపనిషత్తు గూడ “రెండు విద్యలు తెలిసికొన వలెను” అని చెప్పుచున్నది.

నేనును, శుకుడును, పైలుడు మొదలగు వారు బదరికాశ్రమమునకు వెళ్ళి వ్యాసభగవానునికి నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారమునుపదేశించెను.

వ్యాసభగవానులు

నేను మునులతో కలిసి వెళ్ళి, పరము కంటె పరమును, సారభూతమును అగుబ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వశిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ! సూతా! నీవును శుకాదులును వినుడు.

వశిష్ఠుడు

ఓవ్యాసమునీంద్రా ! పూర్వము అగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధమైన బ్రహ్మను గూర్చి చెప్పదను, వినుము.

బ్రహ్మవిద్య నాశనరహిత మగు పరవిద్య. అందుచే తత్ప్రతిపాదక మగు అగ్నేయ పురాణము పరము. సర్వదేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపర బ్రహ్మ. ఆ పర బ్రహ్మను ప్రతిపాదించునదగుటచే దాని కాపేరు

అగ్నిచెప్పిన పురాణము అగ్నేయ పురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువువారికిని, విను వారికిని భుక్తి ముక్తుల నొసగునది.

కాలాగ్ని స్వరూపుడును. జ్యోతి స్వరూపుడును, పరాత్పరమైన బ్రహ్మయు, జ్ఞాన, కర్మలచే పూజింపబడువాడును ఆగు విష్ణుదేవుని ముని సమేతుడై (వశిష్ఠుడు) ప్రశ్నించెను.

వసిష్ఠుడు

సకల విద్యలసారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు సర్వజ్ఞత్వమును పొందునో అట్టిదియు, సంసార సాగరమును దాటించుటలో నావయు, సర్వశక్తమును అగు బ్రహ్మను గూర్చి చెప్పుము.

అగ్ని

విష్ణువు నైన నేనే కాలాగ్ని రుద్రుడను. సర్వ స్వరూపమును, సర్వ కారణమును, అతి ప్రాచీనమును అగు విద్యా సారమును గూర్చి నీకు చెప్పెదను.

మత్స్య కూర్మాది రూపములను ధరించిన నేనుసృష్టికిని, ప్రళయమునకు, వంశములకును, మన్వంతరములకును, వంశానుచరితము మొదలగు దానికిని కారణ మైనవాడను (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము.ప్రధాన రాజ వంశముల వర్ణనము వంశాను చరితము)

పర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. ఋగ్యజస్సామాథర్వ వేదములును, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగములారును, కోశము, మీమాంస, ధర్మ శాస్త్రము, పురాణము, న్యాయ శాస్త్రము, అయుర్వేదము, సంగీత శాస్త్రము, ధనుర్వేదము, అర్థ శాస్త్రము,ఇవన్నియు అపర విద్య. చూడ శక్యము కానిదియు, పట్టుకొన శక్యము కానిదియు, గోత్రముగాని శాఖగాని లేనిదియు, నిత్యమును అగు బ్రహ్మను బోధించు విద్య పరవిద్య.

పూర్వము బ్రహ్మ దేవతలకెట్లు చెప్పెనో, విష్ణువు నా కెట్లు చెప్పెనో ఆ విధముగ మత్స్యాది రూపములను ధరించిన జగత్కారణ భూతుడగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను.

అగ్ని మహా పురాణములో ”ప్రశ్నము” అను ప్రథమాధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment