Skip to content Skip to footer

🌹🌹 శ్రీమదగ్ని మహా పురాణము 🌹🌹 – ఉపోద్ఘాతము

పురాణములు పురాతనత్వము

వేదవాఙ్మయం వలె పురాణ వాఙ్మయం కూడా అతి విస్తృతమైనది . అతి ప్రాచీన మైనది. వేదాలనువిభజించినట్లే పురాణ వాఙ్మయానికి కూడా నిశ్చిత రూపం ఇచ్చి తీర్చి దిద్దినవాడు వ్యాసుడే. ఈనాడు పద్దెనిమిది మహా పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు, ఇంకా పురాణాలనే పేరుతో మరి కొన్ని గ్రంథాలు లభిస్తున్నాయి

పురాణాలస్వరూప స్వభావాలను గూర్చి పురాణాలలోనే అక్కడక్కడ చెప్పబడి ఉన్నది. ప్రాచీన వాఙ్మయంలో మనకు “పురాణము” “పురాణసంహిత” అనే రెండు పేర్లు కనబడతాయి. ‘’పురాణం’’ అనగా లోక వృత్తము. అది ఒక నిశ్చిత గ్రంథ రూపంలో కాకుండా వివిధ కథా కథన రూపంలో, లోకప్రచారంలో ఉన్న విద్యా విశేషము. గ్రంథ రూపంలో క్రోడీ కరించినది పురాణ సంహిత.వీటిలో ‘‘పురాణం’’ అనేదివేదాల కంటె కూడా ప్రాచీనమైనదని కొన్ని పురాణాలు చెపుతున్నాయి. బ్రహ్మ నోటి నుంచిశతకోటి విస్తృతమైన (నూరు కోట్ల శ్లోకాల) పురాణం ముందు బయలు దేరినదట. పిమ్మట వేదాలుబయలు దేరినవట.

“పురాణం సర్వ శాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్‌

నిత్యంశబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరమ్‌

అనన్తరంచ వక్త్రేభ్యః వేదాస్తన్య వినిర్గతాః.”

పురాణాల ఆవిర్భావము

పురాణాల ఆవిర్భావాన్ని గూర్చి స్కంద, మత్స్య,పద్మ పురాణాదులలో మరొక సంప్రదాయం ఉన్నది. పూర్వ కల్పంలో చతుర్ముఖ ప్రోక్తమైన పురాణం శతకోటి ప్రవిస్తరంగా ఉండేదట. అల్ప బుద్ధులైన అర్వాచీనుల సౌకర్యం కోసం ఆ బ్రహ్మయే వ్యాస రూపంలో వచ్చి దానిని నాలుగు లక్షల శ్లోకాల లోనికి కుదించి పద్దెనిమిది పూరాణాలుగా చేసినాడట.

“పురాణమేకమేవాసీ దస్మిన్కల్పాన్తరే నృప

త్రివర్గసాదనంపుణ్యం శతకోటి ప్రవి స్తరమ్‌.

స్మృత్వాజగాద చ మునీన్‌ వ్రతీ దేవశ్చతుర్ముఖః

చతుర్లక్షప్రమాణేనద్వాపరే ద్వాపరే సదా

తదష్టాదశధాకృత్వా భూర్లోకేస్మిన్‌ ప్రభాష్యతే”

రెండువాఙ్మయ ప్రవాహాలు

అతి ప్రాచీన కాలం నుంచీ రెండు వాఙ్మయ ప్రవాహాలు ఆవిర్భవించి పరస్పరోపకారకాలుగా ఉంటూ రెండు మార్గాలలో ప్రవహిస్తున్నాయి. మొదటిది వేదవాఙ్మయ ప్రవాహము, రెండవది పురాణవాఙ్మయ ప్రవాహము. మొదటి దానిని బ్రహ్మ నుండి ఋషులు గ్రహించి ప్రచారం చేయగా రెండవ దానిని మునులు స్వీకరించి ప్రచారం చేశారు. అందుచేత ఈ రెండూ కూడా సమాన ప్రామాణ్యం కలవి. ఈవిషయం మార్కండేయ పురాణంలో చెప్ప బడినది.

“ఉత్పన్నమాత్రస్య పురా బ్రహ్మణోవ్యక్తజన్మనః
పురాణమేతద్వేదాశ్చముఖేభ్యోనువినిస్సృతాః
వేదాన్‌సప్తర్షయస్తస్మాజ్జగృహుస్తస్య మానసాః

పురాణంజగృహుశ్చాద్యా మునయస్తస్య మానసాః.”

పురాణాల ప్రచారము

పైన వివరించిన విధంగా, అనూచానంగా వస్తూన్న అతి ప్రాచీనమైన పురాణాన్ని విభజించి, గ్రంథస్థం చేసి, కృష్ణ ద్వైపాయనుడు పురాణ సంహిత రచించినాడు. వేదాల”వ్యాసనం” (విభజించడం) చేతనే కాకుండా ”పురాణ వ్యాసనం” చేత కూడా ఈయనకు వ్యాసత్వం సిద్దించింది. వ్యాసుడు తాను రచించిన పురాణ సంహితను రోమహర్షణుడనే సూతునకు బోధించి దానిని ప్రచారం చేయవలసి నదిగా ఆజ్ఞాపించాడు. రోమహర్షణుడు వ్యాసుని పురాణ సంహిత ఆధారంగా మరొక పురాణ సంహిత రచించి ఆత్రేయుడైన సుమతి, కాశ్యపుడైన అకృతవ్రణుడు, భారద్వాజుడైన అగ్ని వర్చసుడు, వాసిష్ఠుడైన మిత్రాయువు, సావర్ణియైన సోమదత్తి, శాంశపాయనుడైన సుశర్మ అనే ఆరుగురు శిష్యులకు బోధించినాడు. వారిలో కాశ్యప, సావర్ణిశాంశపాయనులు మరి మూడు సంహితలు రచించినారు. రోమహర్షణుని సంహితతో కలిపి నాలుగు సంహిత లైనవి.ఈ విషయం వాయు పురా ణాదులలోనూ, కొంచెంభేదంలో ఈ అగ్ని పురాణంలోనే 22వ అధ్యాయంలోనూ చెప్ప బడింది. ఇపుడు మనకు లభ్య మయ్యే అష్టాదశ మహా పురాణాలు కృష్ణద్వైపాయనుడే రచించినట్లు సంప్రదాయం. ”అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః” ఇత్యాది వాక్యాలు ఇందుకు ఆధారం.

అగ్నిపురాణము లేదా శ్రీమదగ్ని మహా పురాణము

ఇది అష్టాదశ మహా పురాణాలలో ఒకటి. అగ్ని రూపుడైన శ్రీమహా విష్ణువు నుండి ఆవిర్భవించడం చేత దీనికి ”అగ్ని మహా పురాణము” అనే పేరువచ్చినది. అగ్ని దేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతం లోను, 16000 శ్లోకాలున్న వని మత్స్య పురాణంలోను చెప్పబడి ఉన్నది. శ్లోక సంఖ్య 12000 అని అగ్ని పురాణం లోనే 22వఅధ్యాయం లోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి.వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలుపెరగ వచ్చును. 383 అధ్యాయాల ఈ మహా పురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.

ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్ప బడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. “సర్గశ్చ ప్రతిసర్గశ్చ” ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజ వంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి. ఈ పురాణం వ్యాస రచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700 – 900 సంవత్సరాల కాలంలోజరిగినట్లు భావిస్తున్నారు.

వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించవలెనని దీనిలో ప్రతిపాదింపబడింది. అగ్ని విష్ణువు గాను, కాలాగ్ని గాను, రుద్రుడు గాను ప్రారంభాధ్యాయములలో వర్ణింప బడినాడు. “విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈపురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింప బడినాడు” అని 14వ అధ్యాయంలో చెప్ప బడింది. అగ్ని విష్ణువుయొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి.అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగ పూజ, తాంత్రిక పూజావిధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విషయాలు కూడా ఉండడం చేత ఇది “తామస పురాణం” అని అంటూ, పద్మ పురాణంలో దీని నింద కనబడుతుంది. అందుచేత దీని రచన శైవ వైష్ణవాల మధ్య అంతగా విరోధ భావం ఏర్పడడానికి ముందు గానే, వైష్ణవ మతంలో రాధాకృష్ణ సంప్రదాయం ఆవిర్భవించ డానికికూడా ముందుగానే జరిగి ఉంటుందని ఆధునిక విమర్శకుల ఊహ.

ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ, శాక్త, వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేకవిషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందు చేతనేఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోనివిషయాలు ఇవి:

అన్ని పురాణాలలో ఉన్నపద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండు మూడుఅధ్యాయాలలో మత్స్య, కూర్మ, వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5 -11) రామాయణంలోని ఏడు కాండల కథ వర్ణింప బడినవి. 12వ అధ్యాయంలో హరి వంశ కథ, తరువాత మూడు అధ్యాయాలలో (13 -15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 16వ అధ్యాయంలో బుద్ధా వతారము, కల్క్య వతారముచెప్ప బడినవి. 1 – 20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ, ప్రతిసర్గ,మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.

21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, శైవ, వైష్ణవ, శాక్త, సౌరఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 21-70 అధ్యాయలలో సంవాదం నారద, అగ్ని, హయగ్రీవ, భగవంతుల మధ్యజరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండ గానే పాంచరాత్ర పద్ధతిలో వాసుదేవ, సంకర్షణ,ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణుల పూజా విధానం చెప్ప బడింది. 39 – 70 అధ్యాయలలోఇరవై యైదు పాంచరాత్రాగమ గ్రంథాలు నిర్దేశింప బడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేదిఒకటి పేర్కొన బడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన ఆదికాండ, సంకర్షణ కాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవై నలుగురు యోగినీల మూర్తుల వర్ణనంకూడా ఉన్నది.

71 -106 అధ్యాయలలో శివలింగ, దుర్గా, గణేశాది పూజా విధానం చెప్ప బడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదా తిలక మంత్ర మహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107 – 116 అధ్యాయాలలో స్వాయంభువ సృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధతీర్థాల మాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 118-120 అధ్యాయాలలో భారత దేశము, దానిఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులువర్ణింప బడ్డాయి. 15-20 అధ్యాయాలలోవివిధ వ్రతాల చర్చ ఉన్నది. 22వ అధ్యాయంలో పూరాణ వాఙ్మయాన్ని గూర్చిన వివరణ ఉన్నది. 32వ అధ్యాయంలో దేవాలయ ప్రాశస్త్యాన్నివర్ణింప బడింది.31వ అధ్యాయంలో అనేక విధాలైన నరకాల వర్ణన ఉన్నది.

“అగ్నేయేహి పురాణేస్మిన్‌సర్వావిద్యాః ప్రదర్శితాః”

అని చెప్పినట్లు, మధ్య యుగానికి చెందిన భారత దేశంలో ప్రచారంలోఉన్న అన్ని శాస్త్రీయ విషయాలూ ఈ పురాణంలో పొందు పరచబడి ఉన్నాయి.

శ్రీ గురుభ్యోనమః

శ్రీ గణాధిపతయే నమః

శ్రీ సరస్వత్యే నమః

ఓంనమో భగవతే వాసుదేవాయ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment