రైభ్యుడి వృత్తాంతం
రైభ్యుడనే మహర్షి ఒకనాడు పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్ళాడు. ఆ తీర్ధంలో పితృదేవతలకి ఎంతో భక్తిగా పిండ ప్రదానం చేసి వారిని సంతృప్తి పరిచాడు. ఆ తరువాత రైభ్యమహర్షి ఎవరూ చేయనంత కఠోరదీక్షతో గొప్పతపస్సు చేసాడు.
ఆ విధంగా రైభ్యుడు తపస్సు చేస్తుండగా, ఒక దివ్య విమానంలో గొప్ప తేజశ్శాలి అయిన యోగి అక్కడకి వచ్చాడు. ఆ విమానం ఒక నలుసంత ప్రమాణంలో సూర్యుడిలా వెలుగొందుతుంటే అందులో వున్న యోగి కేవలం పరమాణువంత ప్రమాణంలో ప్రకాశిస్తున్నాడు. వచ్చిన ఆ యోగి ”ఓ ర్యైభ్యా” ! ఎందుకింత కఠోరంగా తపస్సు చేస్తున్నావు? అని ప్రశ్నించి వెంటనే భూమిని ఆకాశాన్ని తన శరీరంతో పూర్తిగా కప్పేశాడు.
ఆయన శరీరంలో అయిదు రథాల ప్రమాణంతో సూర్యుడిలా ప్రకాశించేది, బ్రహ్మలోకం దాకా వ్యాపిస్తున్నది అయిన విమానాన్ని రైభ్యుడు దర్శించాడు. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన రైభ్యుడు ఆశ్చర్యపోయి ఎంతో వినయంగా మహాత్మా! తమరెవరు? అని ప్రశ్నించాడు. అందుకా యోగి నవ్వుతూ నాయనా నేను రుద్రుడికి సోదరుణ్ణి బ్రహ్మ మానసపుత్రుణ్ణి. నా పేరు సనత్కుమారుడు. నేను ఈ భూలోకం నుంచి పైనున్న అయిదో లోకంలో అనగా జనలోకంలో నివసిస్తుంటాను. నాయనా! నీవెంతో గొప్పవాడివి, తపస్సంపన్నుడివి, బ్రహ్మ కులాన్ని ఉద్దరించేవాడివి. ఎందుకంటే? నీకు వేదం అంటే అభిమానం, గౌరవం. పరమపవిత్రమైన ఈ గయాక్షేత్రానికి వచ్చి పితృదేవతలకు పిండప్రదానాలు చేసినవారికెంతో సంతృప్తి పరుస్తున్నావు. రైభ్య మహర్షీ! నీకొక వృత్తాంతాన్ని చెబుతా విను.
విశాలుడి వృత్తాంతం
పూర్వం విశాలనగరంలో విశాలుడనే మహారాజుండేవాడు. అతడెంతో పుణ్యాత్ముడు. అయితే అతడికి పుత్ర సంతానం లేదు. ఒకనాడు ఆ విశాలుడు విప్రుల్ని పిలిపించి తనకు సంతానం ఎలా కలుగుతుందో చెప్పండి అని వారిని కోరాడు. విప్రులు రాజా! పుత్ర సంతానం పొందాలంటే మీరు గయాతీర్థానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేసి పితృదేవతల్ని సంతోషపరిస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది” అని చెప్పారు. విప్రుల మాటలు విన్న విశాలుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే సకల సంభారాలతో గయా తీర్థానికి బయలుదేరాడు. అక్కడ మాఘనక్షత్రం నాడు ఎంతో భక్తితో పితృదేవతలకి తర్పణాలు, పిండప్రదానాలు చేయటం ప్రారంభించాడు.”
విశాలుడు పిండప్రదానాలు చేస్తున్న సమయంలో ఆకాశంలో తెల్లగా, పచ్చగా, నల్లగా వున్న ముగ్గురు పురుషులు ఆయనకి కనిపించారు. వారిని చూసిన విశాలుడు అయ్యా! తమరెవరు? ఎందుకోసం వచ్చారు? మీకేం కావాలి? అని వినయంగా అడిగాడు. ఆ మాటలు విన్న వారిలో తెల్లగా వున్న పురుషుడు నాయనా! విశాలా! నేను నీ తండ్రిని. పేరునిబట్టి నడవడిక, చేష్టల్ని బట్టి నన్ను పితుడు అంటారు. ఇదిగో నా పక్కనున్న పచ్చని పురుషుడు నా తండ్రి. అనగా నీకు తాత. ఇతడు క్రూర కర్మలు చేసినవాడు, బ్రహ్మహత్య ఇంకా ఎన్నో పాపాలు చేసాడు. ఇతడి పేరు అధీశ్వరుడు. అదిగో నల్లగా ఉండే ఆ పురుషుడు నా తండ్రికి తండ్రి. అనగా నీకు ముత్తాత. ఆయన పూర్వజన్మలో ఎంతో మంది పురాణ ఋషుల్ని చంపాడు.
గయాతీర్థ మాహాత్మ్యం
నాయనా విశాలా! నాతండ్రి అధీశ్వరుడు. అతడి తండ్రి కృష్ణుడు (నల్లని పురుషుడు) మరణించిన తరువాత మహాఘోరమైన ”అవీచి” అనే నరకంలో ఎంతోకాలం భయంకరమైన శిక్షలనుభవించారు. నేను మాత్రం వారిలాగా పాపకార్యాలు చేయకుండా ఎన్నో పుణ్యకర్మల్ని ఆచరించటం వల్ల ఇంద్ర సింహాసనాన్ని పొందాను. ఈనాడు నీవు ఎంతో శ్రద్ధగా గయాక్షేత్రంలో పిండప్రదానం చేయటం వల్ల నరకంలో ఉన్న వారిద్దరూ నన్ను కలుసుకోగలిగారు. పరమపవిత్రమైన గయలో తండ్రుల్ని తాత ముత్తాతల్ని సంతోషపరుస్తానని సంకల్పించి నీవు తర్పణాలు విడిచావు. నీ సంకల్పం వల్ల మేము ముగ్గురం ఒకే సారి కలుసుకోగలిగాం. ఈ తీర్థమహిమవల్ల మేము ముగ్గురం పితృలోకానికి వెళతాం. ఇక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల ఎంత దుర్గతి పొందినవారైనా సద్గతులు పొందుతారు. ఇందుకేమాత్రం సందేహం లేదు.
బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా అతడి కొడుకు గనక ఈ గయలో పిండప్రదానం చేస్తే ఆ పాపం నుంచి అతడు తప్పక విముక్తి పొందుతాడు. ఇది ఈ తీర్థానికున్న గొప్ప మహిమ. నాయనా! ఈ కారణంగా, మాకు ఉత్తమ గతులు కల్పించినందుకు ఎంతో ఆనందిస్తూ నిన్ను చూడాలని వచ్చాం. “చాలా సంతోషం నీకు శుభం జరుగుగాక” అని విశాలుణ్ణి ఆశీర్వదించి అతడి పితరులు అదృశ్యమయ్యారు.
“ఓరైభ్యా! నీవుకూడా పరమపవిత్రమైన ఈ గయకి వచ్చి ఇక్కడ ఎంతో శ్రద్ధగా పితృదేవతలకి పిండ ప్రదానం చేసావు. అంతేకాక గయలోనే స్థిరనివాసాన్ని ఏర్పర్చుకుని గొప్ప తపస్సుచేస్తున్నావు. అంతకన్నా నీకు భాగ్యం ఏముంటుంది? అందుకే నిన్ను ధన్యుడవని అన్నాను. రైభ్యా! ఈ గయాక్షేత్రంలో గదాధరుడైన శ్రీమహావిష్ణువు శాశ్వతంగా కొలువున్నాడు. ఆయన్ని స్తుతించి సేవించి స్వామి అనుగ్రహాన్ని పొందు” అని చెప్పి సనత్కుమారుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. రైభ్యుడు సనత్కుమారుడి మాటననుసరించి ఎంతో భక్తితో గదాపాణి అయిన శ్రీహరిని ఇలా దివ్యంగా స్తుతించాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹