అశ్వశిరుడి వృత్తాంతం :-
పూర్వం ధర్మబద్ధంగా భూమిని పాలించేవాడుగా అశ్వశిరుడనే మహారాజున్నాడు. ఆరాజు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసేవాడు. ఒకనాడు ఎంతో వైభవంగా అశ్వశిరుడు అశ్వమేధయాగాన్ని చేసి విప్రులందరికీ భూరిదక్షిణలిచ్చాడు. యాగానంతరం ఆ విప్రులతో కలిసి అవబృధ స్నానం ఆచరించి విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయన దగ్గరకి కపిలమహర్షి, జైగీషవ్యుడు వచ్చారు. వారిని చూసి పరమానందభరితుడైన అశ్వశిరుడు వారిని సాదరంగా ఆహ్వానించి అతిథిసత్కారాలు జరిపి వారితో “విప్రులారా! మహాత్ములారా! ఎప్పటినుంచో నాకొక సందేహం ఉంది. జగన్నాథుడైన నారాయణుణ్ణి ఎలా ఆరాధించాలి? అని వారిని ప్రశ్నించాడు.
కపిల జైగీషవ్యులు అశ్వశిరుడితో రాజా! నీవు నారాయణుడు అని ఎవర్ని గురించి అడుగుతున్నావు. మేమిద్దరం నారాయణులమే. ఇదిగో నీ ఎదురుగా నిల్చున్నాం అన్నారు. అది విన్న అశ్వశిరుడు అయ్యా! మీరిద్దరూ బ్రాహ్మణులు, సిద్ధపురుషులు, తపస్సుతో మీ పాపాలన్నీ భస్మమై పోయాయి. అసలు మీరిద్దరూ మేమే నారాయణులం అని చెప్పటమేమిటి. నారాయణుడి చేతిలో శంఖం, చక్రం, గద ఉంటాయి. ఆయన పట్టు పీతాంబరాలు ధరిస్తాడు. గరుత్మంతుడు ఆయన వాహనం. ఆయనే మహాదైవం. ఆయనకి సాటి రాగలవాడెవ్వడూ లోకంలో లేడు అని పలికాడు.
అశ్వశిరుడి మాటలు విన్న కపిల-జైగీషవ్యులు చిన్నగా నవ్వుతూ అశ్వశిరా! ఇదిగో నీవు చెప్పిన విష్ణువు ఇలాగేనా ఉండేది అని కపిలుడు ఒక్కసారిగా విష్ణువులా మారిపోయాడు. అలాగే జైగీషవ్యుడు కూడా విష్ణు వాహనమైన గరుత్మంతుడిలా మారిపోయాడు. అలా దివ్యమంగళాకారుడై దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుణ్ణి చూసి అశ్వశిరుడు వినయంగా “స్వామీ! విష్ణువంటే ఇలాకాదు. ఆయన బొడ్డు తామర నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మ నుంచి రుద్రుడు ఉదయించాడు. ఆయనే విష్ణువంటే” అని అన్నాడు. అప్పుడు కపిల-జైగీషవ్యులిద్దరూ మహామాయని ప్రయోగించారు. ఆ ప్రభావంతో కపిలుడు బొడ్డులో తామరతో సహా మహావిష్ణువుగా మారిపోగా, జైగీషవ్యుడు ఒక పిల్లవాణ్ణి ఒళ్ళో ఉంచుకుని బ్రహ్మగా ఆ తామర పువ్వులో కూర్చున్నాడు.
అశ్వశిరుడికి సంతృప్తి కలగలేదు. వారితో స్వామీ! ఇలా కాదు మీరేదో మాయచేస్తున్నట్టున్నారు. “శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మితో కలిసి అంతటా వ్యాపించి ఉంటాడు” అని అన్న వెంటనే ఆ ప్రాంతంలో దోమలు, నల్లులు, పేలు, తుమ్మెదలు, పక్షులు, పాములు, గుర్రాలు, ఆవులు, ఏనుగులు, సింహాలు, పులులు, నక్కలు, లేళ్ళు, పశువులు, పురుగులు, అడవిలో సంచరించే జంతువులు – ఇలా కోట్లకొద్దీ జంతువులు అశ్వశిరుడికి కనిపించాయి. అన్ని ప్రాణుల్ని చూసి ఆ రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కొద్ది సేపటికి ఆయనకి జ్ఞానోదయమైంది. కపిల జైగీషవ్యులిద్దరూ సామాన్యులు కారని గ్రహించాడు.
అశ్వశిరుడు ఆ మహర్షులిద్దరికీ నమస్కరించి “మహర్షులారా! ఇదంతా ఎంతో వింతగా ఉంది. ఈ మాయ ఏమిటి? అని ప్రశ్నించాడు. అప్పుడా మహర్షులు” రాజా! నీవు మమ్మల్ని శ్రీమహావిష్ణువుని ఎలా అర్చించాలి? అని ప్రశ్నించావు. ఆయన్నెలా పొందాలి? అని అడిగావు. అదే విషయాన్ని నీకు ఇలా చూపించాం. నీవు చూసినవన్నీ నారాయణుడి గుణాలు. ఆయన సర్వజ్ఞుడు. తనకిష్టమైన రూపాల్ని ధరించగలిగినవాడు.
కొన్ని సందర్భాలలో నారాయణుడు చాలా సౌమ్యుడుగా, సుస్థిరుడుగా మానవులకి లభిస్తున్నాడు. ఆయన్ని ఆరాధించటం వల్లనే మనుషుల వాక్కు ఎంతో అర్థవంతమవుతోంది. జగాలన్నిటికీ ప్రభువైన ఆ పరంధాముడు అన్నిజీవుల శరీరాల్లో వ్యాపించి ఉన్నాడు. నిజమైన భక్తి శ్రద్ధలు కలిగినవాళ్ళు తమ శరీరంలోనే ఆయన్ని దర్శించగలరు. ఆయన ఎదో ఒకచోటే ఉండేవాడు కాడు.
అశ్వశిరమహారాజా! ఆ విష్ణుపరమాత్మ రూపాన్ని నీకు అందుకే చూపించాం. ఆయన సర్వవ్యాపకత్త్వాన్ని నీవు గ్రహించాలని మా భావన. నీవు కోరిన మహావిష్ణువు నీ దేహంలో, నీ మంత్రుల, సేవకుల దేవతల, పురుగుల, పశు పక్ష్యాదులు అన్ని శరీరాల్లో కొలువైఉన్నాడు. ఈ సర్వం విష్ణుమయమే అని గ్రహించు. సర్వాంతర్యామి అయిన ఆయన దివ్యస్వరూపాన్ని మనసులో సదా ధ్యానించు” నిండు మనసుతో ఆయన్ని స్మరించటం, భక్తిగా పూజించటం, ధూపదీపనైవేద్యాలు సమర్పించటం, బ్రహ్మవేత్తల్ని సంతృప్తి పరచటం, నిత్యం ధ్యానం చేయటం అనే వాటిద్వారా శ్రీమహావిష్ణువుని సులభంగా పొందవచ్చు” అని అశ్వశిరుడికి బోధించారు. వారు చెప్పిన విధంగా అశ్వశిర మహారాజు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి నైమిషమనే అరణ్యానికి వెళ్ళి యజ్ఞవరాహమూర్తిని ఇలా స్తుతించాడు.
యజ్ఞవరాహ స్తుతి :-
నమామి యాజ్యం త్రిదశాధిపస్య భవస్య సూర్యస్య హుతాశనస్య ||
సోమస్య రాజ్జో మరుతా మనేక రూపం హరిం యజ్ఞవరం నమస్యే ॥
సుభీమదంష్ట్రం శశిసూర్యనేత్రం సంవత్సరే చాయనయుగ్మ కుక్షమ్ ||
దర్భాఙ్గరోమాణ యథేధ్మ శక్తిం సనాతనం యజ్ఞవరం నమామి ॥
ద్యావాపృథివ్యో రిద మన్తరం హి వ్యాప్తం శరీరేణ దిశశ్చ సర్వాః
త మీడ్య మీశం జగతాం ప్రసూతిం జనార్దనం తం ప్రణతోస్మి నిత్యమ్ ॥
సురాసురాణాం చ జయాజయాయ యుగే యుగే యః స్వశరీర మాద్యమ్ సృజత్యనాదిః
పరమేశ్వరో య స్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్ ||
దధార మాయామయ ముగ్రతేజా జయాయ చక్రం త్వమలాంశు శుభ్రమ్
గదాసి శార్ణాది చతుర్భుజోయం తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్ ||
క్వచిత్ సహస్రం శిరసాం దధార క్వచి న్మహా సర్వతతుల్య కాయమ్ ||
క్వచిత్ స ఏవ త్రసరేణు తుల్యో య స్తం సదా యజ్ఞనరం నమామి ॥
చతుర్ముఖో యః సృజతే సమగ్రం రథాఙ్గపాణిః ప్రతిపాలనాయ |
క్షయాయ కాలానల సన్నిభో య స్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్ ||
సంసార చక్రక్రమ క్రియాయై య ఇజ్యతే సర్వగతః పురాణః యోయోగిభి ర్యాయతే చాప్రమేయ స్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యమ్॥
సమ్యఙ్మన స్యర్పితవా నహం తే
యదా సుదృశ్యం స్వతనౌ ను తత్త్వమ్ |
న చాన్య దస్తీతి మతిః స్థిరా మే
యత స్తతో మావతు శుద్ధభావమ్ ॥
(శ్లో॥46-54,అధ్యా-5)
ఈ విధంగా స్తుతించిన తరువాత అశ్వశిరుడి ముందు ఒక అగ్నిజ్వాల ప్రత్యక్షమైంది. ఆ మహారాజు నిశ్చలంగా యజ్ఞవరాహమూర్తిని స్మరిస్తూ ఆ దివ్యతేజస్సులోకి ప్రవేశించి అందులో లయమైపోయాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹