భూదేవి చేసిన విష్ణు వర్ణనం
పూర్వం భూదేవి నీటిలో మునిగి పోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహావతారాన్ని ధరించి తన కోరలతో భూమిని పైకి లేపాడు. ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేడప్పుడు ఎంతో ఉన్నతమైన మేరుపర్వతం ఆయన గిట్టల మధ్యలో చిక్కి ఖడ ఖణలాడింది. అలా క్రమంగా భూదేవి ఉద్దరించబడ్డ తరువాత ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భూదేవి దగ్గరకి వెళ్ళి అమ్మా! శ్రీమహావిష్ణువు నిన్ను ఉద్దరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లీ! అని కోరాడు.
భూదేవి సనత్కుమారుడితో నాయనా! సనాతనుడైన శ్రీహరి ముఖతః నేను తెలుసుకున్న దాన్ని విన్నదాన్ని, పరమధర్మమైనదాన్ని నీకు చెబుతాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించింది.
పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు, పర్వతాలు, సముద్రాలతో సహా పూర్తిగానీటిలో మునిగిపోయాను. నీళ్ళలో ఉండిపోయిన నాకు ఏమీ దిక్కుతోచలేదు. ఆ నీళ్ళలో నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు ఏవీ కనపడటం లేదు. ఏం చేయాలో నాకు తోచలేదు. ఎవరు నన్ను ఉద్దరిస్తారో తెలియటం లేదు. అలా కొంతకాలం గడిపాను. కొన్నాళ్ళ తరువాత శక్తి తెచ్చుకుని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను. ఆయనతో…… “పితామహా! నీవే నాకు దిక్కు, నేను పూర్తిగా నీళ్ళలో మునిగిపోయాను. నాకేం చేయాలో తెలియటం లేదు. అంతా లోపల చీకటిగా ఉంది దయచేసి నన్ను ఉద్ధరించు ” అని ప్రార్థించాను. నా ప్రార్థన విన్న బ్రహ్మ ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నాడు.
దేవీ! వసుంధరా! నిన్ను ఉద్దరించే శక్తి నాకు లేదు. సకల లోకాలకీ ప్రభువు, అందరికీ కర్త, లోకేశుడు, మాయాశక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణువేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు.
నేను సరాసరి బ్రహ్మలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళాను. అక్కడ శేషపాన్పు మీద శ్రీహరి యోగ నిద్రలో ఉన్నాడు. ఆయనకి చేతులు జోడించి ప్రభూ! నేను నా బరువుని మోయలేక నీళ్ళలోకి పడిపోయాను. బ్రహ్మ దగ్గరకి రక్షించమని వెళితే ఆయన నీ దగ్గరకి వెళ్ళమని చెప్పాడు. లోకనాథా! జనార్దనా! నన్ను దయచేసి నీళ్ళలోనించి ఉద్ధరించు అని ఇలా దీనంగా ప్రార్థించాను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹