ఆరోగ్య వ్రతం :-
ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ అని ఆర్యోక్తి. అనగా ఆరోగ్యం కావలసినవారు సూర్యభగవానుణ్ణి ఉపాసించాలి. వ్రతాలన్నిటిలోకీ గొప్పది ఆరోగ్యాన్నిచ్చేది ”ఆరోగ్య వ్రతం”. దీన్ని అగస్త్యులవారు లోకానికందించారు. మాఘమాసం శుక్లపక్ష సప్తమినాడు ఉపవాసం ఉండి విష్ణు స్వరూపుడు, సనాతనుడు అయిన సూర్యనారాయణుణ్ణి – ఓం ఆదిత్యాయనమః, ఓం భాస్కరాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః, ఓం సూర్యాయ నమః అని ఎర్రటి అక్షతలతో పూజించాలి. ఆ మర్నాడు అనగా అష్టమినాడు భోజనం చేయాలి. ఈవిధంగా ఒక సంవత్సరం పాటు ప్రతినెలా శుక్లపక్ష సప్తమినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రద్ధా భక్తులతో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సూర్యుడి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి.
పూర్వం అనరణ్యుడు అనే మహారాజు ఈ వ్రతవిధానంతోనే భాస్కరుణ్ణి పూజించాడు. సూర్యుడు సంతోషించి అతడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. అతడికి వచ్చింది కుష్ఠురోగం ఎందుకంటే ఆ రాజు ఒకనాడు మానస సరోవరానికి వెళ్ళాడు. అక్కడ సరోవరంలో అందంగా మెరుస్తున్న బంగారు పద్మం కనిపించింది. రాజు వెంటనే తన సేవకుల్ని పిలిచి ఆ బంగారు పద్మాన్ని తెమ్మన్నాడు. సేవకులు సరోవరంలోకి వెళ్ళి ఆ పద్మాన్ని తాకగానే ”హూం” అనే పెద్ద శబ్దం వచ్చి ఒక్కసారిగా ఆ సేవకులు ఎగిరిపడ్డారు. పద్మాన్ని కోయమన్న అనరణ్య మహారాజుకి వెంటనే శరీరమంతా కుష్ఠురోగం ప్రాప్తించింది.
మహారాజు కోయమన్న పద్మం సామాన్యమైంది కాదు. ఈ పద్మం గర్భంలో స్వయంగా సూర్యుడు నెలకొని వున్నాడు. అతడే శాశ్వతమైన పరమాత్మ. రాజు అహంకారంతో బంగారు పద్మాన్ని తలమీద ధరించి వెలిగిపోవాలనుకున్నాడు. అతడి దురాశ కారణంగానే కుష్ఠువ్యాధి సంక్రమించింది. ఇలా రాజు వ్యాధితో బాధపడుతూ తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. కొన్నాళ్ళకి వశిష్ఠమహర్షి అక్కడికి వచ్చి ఈ ఆరోగ్యవ్రతాన్ని ఉపదేశించి వెళ్ళాడు. అనరణ్యుడు ఎంతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించి తనకు కుష్ఠువ్యాధిని సూర్యానుగ్రహంతో సంపూర్ణంగా తొలగించుకున్నాడు.
పుత్ర ప్రాప్తి వ్రతం :-
పుత్ర సంతానం లేని వారికి యోగ్యుడైన పుత్రుణ్ణి ప్రసాదించే వ్రతం పుత్రప్రాప్తి వ్రతం. మహాపురుషుడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి ఈ వ్రతం చేసేవారు అర్చించాలి. ఈ దివ్య వ్రతాన్ని అగస్త్య మహర్షి లోకానికందించారు. భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమినాడు ఈ పుత్ర ప్రాప్తి వ్రతాన్ని చేయాలి. వ్రతానికి ముందు షష్ఠినాడు వ్రతసంకల్పం చెప్పుకుని, సప్తమినాడు దేవకీదేవి ఒడిలో కూర్చున్న బాలకృష్ణుడి ప్రతిమ లేక చిత్రపటాన్ని స్థాపించి భక్తిగా అర్చించాలి. మర్నాడు కృష్ణాష్టమినాడు యథావిధిగా షోడశోపచారాలతో పూజచేసి, హోమకుండాన్ని ఏర్పాటుచేసుకుని నల్లనువ్వులు, నేయి, యవలు, పెరుగు కలిపిన ద్రవ్యంతో హోమం చేయాలి. హోమం చేసేడప్పుడు ఓం శ్రీకృష్ణాయ స్వాహా అనే మంత్రాన్ని పఠిస్తూ 108 లేక 1008 సార్లు హోమం చేయాలి. తరువాత యథాశక్తి విప్రులకి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి.
ఈ పుత్రప్రాప్తి వ్రతాన్ని ఆచరించిన వారు వ్రతం పూర్తయిన తరువాత కృష్ణస్వామికి నివేదించిన మారేడుపండు తినాలి. ఆ తరువాత యథేచ్ఛగా భోజనం చేయవచ్చు. ఈవిధంగా నియమంగా వ్రతాన్ని ఆచరిస్తే వారికి తప్పకుండా పుత్రసంతానం కలుగుతుంది.
పూర్వం మహాపరాక్రమవంతుడైన శూరసేన మహారాజుండేవాడు. ఆయనకి ఎంతకాలానికీ సంతానం కలగకపోవటంతో హిమాలయాలకి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. ఆయనలా తపస్సు కొనసాగిస్తుండగా ఒకనాడు భగవంతుడు ప్రత్యక్షమై ఈ పుత్రప్రాప్తి వ్రతాన్ని చేయమని చెప్పాడు. శూరసేనుడు శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని ఆచరించి యోగ్యుడైన పుత్రుణ్ణి పొందాడు. ఆయనకి జన్మించిన కుమారుడే వసుదేవుడు.
పరమపవిత్రమైన ఈ వ్రతాన్ని ఆచరించినవారు ఒక సంవత్సరం గడిచాక తిరిగి కృష్ణాష్టమినాడు యథావిథిగా కృష్ణుణ్ణి పూజించి, రెండు కృష్ణుడి ప్రతిమల్ని తయారుచేయించి పూజానంతరం విప్రులకి దక్షిణతో సహా దానమివ్వాలి. దీనితో వ్రత పరిసమాప్తి అవుతుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹