Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – నలబై నాల్గవ భాగము

గోవర్ధనగిరి పరిక్రమ – మాహాత్మ్యం :-

మధురకు సమీపంలోనే పశ్చిమ దిక్కున రెండు యోజనాలు విస్తరించి గోవర్ధన గిరివుంది. దానినే అన్నకూటపర్వతమని కూడా అంటారు. ఆ పర్వతం మీద చక్కని చెట్లు, లతలు అందంగా వున్నాయి. అక్కడే ఒక అందమైన సరోవరం కూడా ఉంది.

మధురానగరానికి తూర్పుదిశలో ఇంద్ర తీర్థం, పడమర దిశలో వరుణ తీర్థం, ఉత్తర దిశలో కుబేర తీర్థం. దక్షిణ దిశలో యమతీర్ధం అని నాలుగు సుప్రసిద్ధ తీర్ధాలున్నాయి. ఇక్కడే ”అన్నకుండం” అనే పేరుతో ఒక దివ్యక్షేత్రం ఉన్నది. అదే గోవర్ధనగిరి. దీనిచుట్టూ ప్రదక్షిణ చేసేవాడు తిరిగి జన్మించడు. ముందుగా మానసికంగ స్నానంచేసి ఆ తరువాత గోవర్ధనగిరిపై ఉన్న కృష్ణ పరమాత్మని దర్శించుకోవాలి.

గోవర్ధనగిరి పరిక్రమ చేసినవారికి ఏ రకమైన బరువు భాద్యతలూ ఉండవు. ఉన్నా అవి వారిని ఏమాత్రం బాధించవు. సోమవతీ అనగా సోమవారం నాడు వచ్చిన అమావాస్య తిథినాడు గోవర్ధన గిరి దగ్గర పితరులకి పిండప్రదానం చేస్తే వారికి రాజసూయ యాగ ఫలం లభిస్తుంది. గయాతీర్థంలో పిండ ప్రదానం చేసిన దాని కన్నా అధికఫలం గోవర్ధనగిరి మీద పిండప్రదానం చేస్తే లభిస్తుంది.

గోవర్ధనగిరి ప్రదక్షిణా విధి :- భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశి తిథినాడు ఈ పర్వతం దగ్గరకి చేరి ఆరోజు ఉపవాసముండాలి. మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ పర్వతం మీద ఉన్న గోవిందుణ్ణి అర్చించాలి. తరువాత అక్కణ్ణుంచి పుండరీక తీర్థానికి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేయాలి. తరువాత అక్కడ దేవతల్ని పితృదేవతల్ని పూజించి అక్కడేవున్న పుండరీక భగవానుణ్ణి సేవించాలి. దానికి సమీపంలో అప్సరకుండం వుంది. కొంతదూరంలో సంకర్షణ కుండం కూడా వుంది. ఆ రెంటిలో స్నానం చేయాలి. దానివల్ల సకల పాపాలూ నశిస్తాయి.

ఈ గోవర్ధన గిరికి సమీపంలోనే శక్ర(ఇంద్ర) తీర్థం ఒకటుంది. ఇక్కడే శ్రీకృష్ణుడు ఇంద్రుడికోసం మధురానగర ప్రజలు చేయబోయే యాగాన్ని నివారించాడు. అందుకు కోపించిన ఇంద్రుడు మధురమీద భయంకరమైన వర్షం కురిపించాడు. అంతకుముందే యజ్ఞంలో నివేదన కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలు గోవర్ధనగిరి దగ్గరకి చేర్పించారు. ఆ ఆహార పదార్ధాలన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. ఇంద్రుడు కురిపించిన వాన నుంచి తన ప్రజల్ని ఆవుల్ని రక్షించాలని సంకల్పించిన కృష్ణుడు తన చిటికినవేలుతో గోవర్ధనగిరిని ఎత్తి పైకి లేపాడు. దానిక్రింద వర్షానికి తడవకుండా మధురానగర వాసులు గోవులు వచ్చి చేరాయి. ఆ నాటినుంచి ఈ పర్వతం అన్నకూట పర్వతంగా కూడా ప్రసిద్ధిచెందింది.

ఈ పర్వతానికి కొద్ది దూరంలో ”కదంబఖండం” అనే మరో కుండం ఉంది. అలాగే దారిలో దేవగిరి ఉంది. ఆ తరువాత ప్రదక్షిణ చేస్తూ ముందుకి వెళ్ళగా పరమపవిత్రమైన రాధాకుండం కనిపిస్తుంది. ఇది అన్నిటికన్నా మహిమాన్వితమైన దివ్యకుండం. అక్కడి ప్రజలు దాన్ని అరిష్టకుండం (అరిష్టాలు నాశనం చేసేకుండం) అని పిలుస్తారు. ఆ కుండంలో స్నానం చేస్తే రాజసూయ అశ్వమేధయాగాలు చేసిన ఫలితం లభిస్తుంది.

మధురకి పూర్వ దిశలో ఇంద్ర ధ్వజం అనే తీర్థం ఉంది. అందులో స్నానం చేసినవాడు ఇంద్రలోకానికి చేరుకుంటాడు. ఈ గోవర్ధన గిరి ప్రదక్షిణ పూర్తి చేసినవారు ఆ యాత్రా ఫలితాన్ని గోవిందుడికే సమర్పించాలి. అంతేకాదు యాత్ర ప్రారంభంలో చక్రతీర్థంలో స్నానంచేసి, యాత్ర పూర్తయ్యాక పంచకుండ తీర్థంలో ముగింపు స్నానం ఆచరించాలి. ఈ గోవర్ధన గిరి దగ్గర రాత్రిపూట జాగారం చేసే నియమం కూడా ఉంది. జాగరణ చేసిన వారి పాపాలన్నీ సునాయాసంగా నశిస్తాయి.

గోవర్ధనగిరి పరిక్రమని ఆషాఢమాసంలో కూడా చేసే ఆచారం వుంది. గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసినా ఆ ఇతివృత్తాన్ని గురించి విన్నా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment