బృందావనం ఇతర తీర్థాలు
మధురామండలంలో పరమపుణ్యప్రదమైన ”వత్సక్రీడనకం” అనే పవిత్ర తీరంవున్నది. అక్కడ ఎర్రటి రంగుతో ఎన్నో విశాలమైన శిలలున్నాయి. ఒక్కసారి ఆ తీర్థంలో స్నానం చేస్తే చాలు పుణ్యం ప్రాప్తించి వాయులోకాన్ని చేరుకుంటారు. ఆ ప్రదేశంలో విధివశాత్తు మరణించినవారు సరాసరి విష్ణులోకాన్ని చేరుకుంటారు. దానికి సమీపంలోనే భాండీరక వనం అనే దివ్య స్థలం వున్నది. ఆ వనంలో మద్ది, తాళ, శాల, తమాల, ఇంగుదీ, పీలుక, కిరీల అనే ఎంతో విలువైన వృక్షాలున్నాయి. అవన్నీ ఆ వనం శోభని ద్విగుణీకృతం చేస్తున్నాయి. వనంలో ఉన్న తీర్థంలో పవిత్రమైన మనస్సుతో స్నానం చేసినవాడు సకల పాపాలూ నశించి ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు.
బృందావనం మధురామండలంలో ఉన్న పరమపవిత్రమైన దివ్యధామం. దేవతలకు దానవులకు సిద్ధులకూ పరమదుర్లభమైంది. ఈ బృందావన ధామంలో గోవులతో, గోపాలురతో శ్రీకృష్ణుడు ఇక్కడే ఎన్నో లీలలు ప్రదర్శించాడు. ఈ దివ్య ధామంలో ఒక్కరాత్రి నిద్రించి అక్కడే వున్న కాళిందీ నదిలో స్నానం చేసినవారికి గంధర్వలోకప్రాప్తి కలిగి అప్సరసలతో సుఖంచే యోగం ప్రాప్తిస్తుంది.
ఈ బృందావనంలోనే ”కేశి” అనే మరో తీర్థం ఉంది. అది గంగానది కన్నా పవిత్రమైనది. పూర్వం ఇక్కడే శ్రీమహావిష్ణుడు ”కేశి” అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఈ కేశీ తీర్థం కాశీకన్నా గొప్పది. ఈ తీర్థం దగ్గర పితృదేవతలకి పిండప్రదానం చేస్తే గయలో చేసినంత ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో స్నానం దానం హోమం చేస్తే అగ్నిష్టోమ యజ్ఞం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇక్కడ ద్వాదశాదిత్య తీర్థం దగ్గరే యమునానది ప్రవహిస్తూ ఉంటుంది.
బృందావనంలో కాళీయుడు నివసించిన ప్రాంతానికి కాళీయ హ్రదం అనే పేరు వచ్చింది. అది ఒక మడుగు. ఇక్కడే కృష్ణుడు తన పదఘట్టవనాలతో కాళీయుడి దర్పాన్ని అణిచివేసాడు. దీనికి సమీపంలోనే హరిదేవక్షేత్రం ఉంది.
ఈ క్షేత్రానికి ఉత్తర భాగాన, కాళీయ హ్రదానికి దక్షిణ భాగాన ఎవరు మరణిస్తారో వారికి పునర్జన్మ వుండదు.
యమునానది అవతలి ఒడ్డున ”యమలార్థకం” అనే మరో దివ్య తీర్థమున్నది. అక్కడే శ్రీకృష్ణుడు పెద్ద శకటాన్ని ధ్వంసం చేసాడు. (శకటాసురవధ) ఆ ప్రాంతంలో స్నానం, ఉపవాసం అధికమైన ఫలితాన్నిస్తుంది.
జ్యేష్ఠమాసం శుక్లపక్ష ద్వాదశి తిథినాడు ఆ తీర్థంలో స్నానంచేసి దానాలు, ధర్మాలు చేసినవాడు మహా పాతకుడైనప్పటికీ ఉత్తమగతుల్ని పొందుతాడు. ఇంద్రియనిగ్రహంతో యమునానదిలో స్నానంచేసి ఆలయంలో వున్న శ్రీకృష్ణుణ్ణి దర్శించినవాడు పరమపవిత్రుడవుతాడు. అదే తిథినాడు యమునానది ఒడ్డున పిండప్రదానం చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి వరాలిస్తారు. బృందావనంలో ఉంటూ ఆ దివ్య క్షేత్రానికి ప్రదక్షిణ చేస్తూ, అక్కడే కొద్ది రోజులుండి, నిత్యం గోవిందుణ్ణి స్మరించేవారు అన్ని కోరికల్ని సాధిస్తారు.
మధురా మండలంలో ఉన్న పవిత్ర తీర్థాలు పరబ్రహ్మ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన మధురానగరం పరమపావన దివ్యక్షేత్రం అక్కడ ఎన్నో దివ్య తీర్థాలు, క్షేత్రాలు, వనాలు నెలకొన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
- బహుళతీర్థం
- భాండ హ్రదం
- సప్తసాముద్రకం
- వీరస్థలం
- కుశస్థలం
6.పుష్పస్థలం
- గోపీశ్వరం
- గోవింద తీర్థం.
- వత్స్యపుత్రక తీర్థం
- ఫాల్గుణ తీర్థం
- వృషభాంజక తీర్థం
- తాళ్ళవనం
- సంపీఠకకుండం అనేవి ప్రధానంగా ఉన్నాయి.
కృష్ణావతార సమయంలో భగవానుడైన పరమాత్మ పుత్రసంతానం కోసం సూర్యుణ్ణి ఆరాధించాడు. సూర్యుడి అనుగ్రహంతో శ్రీకృష్ణుడికి జ్ఞానవంతుడు మహాసౌందర్యవంతుడు అయిన సాంబుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈ దివ్య మండలంలోనే చేతిలో పద్మాన్ని ధరించిన సూర్యభగవానుడు కృష్ణుడికి దర్శనమిచ్చాడు. సూర్యుడు ఆయనకి దర్శనమిచ్చిన తిథి భాద్రపద కృష్ణపక్ష సప్తమి. ప్రతి సంవత్సరం ఆ తిథినాడు సూర్యభగవానుడు ఆ క్షేత్రంలో స్వయంగా విరాజిల్లుతాడు. సూర్యకుండం అంత మహిమాన్వితమైనది. సప్తమీ ఆదివారం సూర్యుడికి ప్రీతి పాత్రమైన తిథి. ఆ రోజు సూర్య కుండంలో స్నానం చేస్తే. సూర్యానుగ్రహంతో సకల సంపదల్నీ పొందుతారు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹