గర్భవాస దుఃఖాన్ని పోగొట్టే ధర్మాలు : –
శ్రీహరి వరాహరూపాన్ని ధరించి భూదేవితో గర్భవాస దుఃఖాన్ని పొంద కూడదనుకునే మానవులు ఎలాంటి ధర్మాలు ఆచరించాలో ఈ విధంగా చెప్పాడు.
- గొప్ప గొప్ప పనులు చేసినప్పటికీ తన్ను తాను పొగుడుకోకుండా నిర్మలమైన మనసుతో ఎన్నో సత్కర్మల్ని ఆచరించేవాడు.
- శ్రీహరికి ప్రీతికరంగా షోడశోపచారాది పూజలుచేసి ఎలాంటి అహంకారం,కోపం పొందనివాడు.
- మనసుతో అందీర సమానంగా దర్శిస్తూ లాభనష్టాల నేవేవీ పట్టించుకోకుండా ఇంద్రియనిగ్రహం కలిగినవాడు.
- ఏది మంచి పని ఏదిచెడ్డ పని అన్న విచక్షణ తెలిసినవాడు. అన్ని ధర్మాలు ఆచరించటంలో నిష్ఠకలిగినవాడు.
- చలి, వేడి, గాలి, ఆకలి దప్పికల్ని సహించగలిగేవాడు.
- దరిద్రుడైనప్పటికీ పనులు చేయటంలో ఎలాంటి సోమరితనం లేనివాడు. ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు.
- ఇతరుల భార్య మీద ఎలాంటి వ్యామోహాన్నీ పొందనివాడు.
- సత్య స్వరూపుడైన పరమాత్మ గురించే నిత్యం పలికేవాడు.
- వివేకవంతుడు, విశేషమైన ప్రజ్ఞ కలిగినవాడు బ్రహ్మజ్ఞానుల్ని గౌరవించేవాడు.
- నిత్యం ప్రియమైన మాటల్నే పలికేవాడు. బ్రాహ్మణుల సేవలో, శ్రీహరిసేవలో శ్రద్ధా సక్తులు కలిగినవాడు. ఇలాంటి గణాలున్న వాడెవడూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించడు. ఈ ధర్మాల్ని ఆచరించే వాడు పునరావృత్తి రహితమైన విష్ణులోకాన్ని చేరుకుంటాడు.
శ్రీహరిసేవకుల గుణాలు :- పరంధాముడైన శ్రీహరిని త్రికరణ శుద్ధిగా సేవించే భక్తులు ఎన్నో ఉత్తమ గుణాల్ని కలిగి ఉంటారు. వారు ఎప్పుడూ ప్రాణుల్ని హింసించరు. సకల ప్రాణుల హితాన్నే కోరుతుంటారు. పరిశుద్ధమైన మనసుతో అందర్నీ సమానంగా చూస్తుంటారు. బంగారాన్ని మట్టి పెళ్ళలాగా భావిస్తుంటారు. వయసు చిన్నదైనప్పటికీ క్షమ దయవంటి సుగుణాలతో ప్రవర్తిస్తూ పుణ్యకార్యాలనే ఆచరిస్తుంటారు. ఎప్పుడూ మంచి పనులే చేస్తుంటారు. పగవారు తమకి కీడు తలపెట్టినా వారికి ఎలాంటి నష్టాల్ని కలుగనివ్వరు. చేయాల్సిన పనుల్ని ఎప్పుడూ మరిచిపోరు. అబద్ధాలాడరు. మోసాలు చేయరు. తన ఇల్లాల్ని సైతం కేవలం సంతానం కోసమే కలుస్తారు. ఇలాంటి ఉత్తమ గుణ సంపన్నులైన శ్రీహరి సేవకులు గర్భవాస దుఃఖాన్ని పొందరు. ఇంద్రియాల్ని గెలిచినవారు, క్రోధంమీద అదుపుకలిగినవారు, లోభమోహాల్ని వదిలినవారు, ప్రతి రోజూ దేవతల్ని, అతిథుల్ని, పితృదేవతల్ని సంతృప్తిపరిచేవారు, హింసలాంటి నీచకార్యాలు చేయనివారు, మద్యమాంసాలు ముట్టనివారు, నిత్యం గోవులకి నమస్కరించేవారు, బ్రాహ్మణ స్త్రీలని దుష్టబుద్ధితో చూడనివారు, విప్రులకు కపిల గోవుని దానం చేసేవారు, వృద్ధుల్ని ప్రేమతో సంరక్షించేవారు, తన సంతానాన్ని భేదబుద్ధితో చూడని కపిల గోవుల్ని భక్తితో తాకి నమస్కరించేవారు, కన్యల్ని చెడ్డ భావంతో చూడనివారు, నిప్పుని కాళ్ళతో తాకనివారు, కుమారుడితో వివాదం పడనివారు, నీళ్ళలో మలమూత్రాలు విసర్జించనివారు, గురువుమాటల్ని తిరస్కరించనివారు, గర్భవాసదుఃఖాన్ని పొందకుండా శాశ్వతమైన వైకుంఠ ధామాన్ని చేరుకుంటారు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹