Skip to content Skip to footer

శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ముప్పై తొమ్మిదవ భాగము

సంసారం నుంచి ముక్తి ప్రసాదించే ధర్మాలు :-

వర్షఋతువు పూర్తికాగానే ప్రసన్నమైన శరత్కాలం వస్తుంది. ఆ ఋతువులో ఆకాశం నిర్మలంగా, స్వచ్ఛంగా వుంటుంది. ఎక్కువ ఎండా ఎక్కువ చలిలేని ఆ శరదృతువులో వచ్చే కార్తిక మాస శుక్లపక్షద్వాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన ద్వాదశినాడు విష్ణువుని అర్చించేవాడు ఎంతో ధన్యుడు. వైకుంఠ ధామాన్ని చేరాలనుకునేవారు ఆరోజు ఇలా స్తుతించాలి.

బ్రహ్మణారుద్రేణచయః స్తూయమానో భగవాసృష్టిః|

వందితో వందనీయః ప్రాప్తాద్వాదశీయంతే॥

ప్రబుద్ధస్వజాగ్రతో లోక నాథ మేఘాగతాః।

నిర్మలః పూర్ణచంద్రః శారణాది పుష్పాణి లోకనాథ॥

తుభ్యమహం దదామితి ధర్మహేతో స్తవప్రీతయే।

ప్రబుద్ధం జాగ్రతం లోకనాథ త్వాం భ్రాజమానం యజ్ఞన॥

యజంతే సత్రే సత్రిణో వేదైః పఠంతి భాగవతాః|

శుద్ధాః ప్రబుద్దా జాగ్రన్తో లోకనాథ||

(శ్లో॥ 12-14,అధ్యా-122)

బ్రహ్మరుద్రాది దేవతలు స్తుతించే ఆ పరబ్రహ్మఋషివందితుడు అందరిచేతా వందనీయుడు అటువంటి విష్ణు పరమాత్మకి సంబంధించింది. ద్వాదశీ తిథి. దేవా! లోకనాథా! మేలుకోవయ్యా! మేఘాలన్నీ వెళ్ళిపోయాయి.

చంద్రుడు నిర్మలంగా ఉన్నాడు. నీవు ధర్మానికి హేతువు లాంటివాడివి. అలాంటి నీకోసం శరత్కాలంనాడు లభించే పూలను సమర్పించుకుంటాను.

శరదృతువు :- ఓ లోకనాథా! నీవు మేలుకో. మేలుకొని వున్న నిన్ను పుణ్యాత్ములు యజ్ఞాలతో యజిస్తున్నారు. భాగవతులు వేదమంత్రాలతో నిన్ను ప్రశంసిస్తున్నారు. పరిశుద్ధులైనవారు మేలుకొన్న నిన్ను ఎంతో జాగ్రత్తగా అర్చిస్తున్నారు. ఈ విధంగా ద్వాదశినాడు శ్రీమహావిష్ణువుని స్తుతించిన వారు పరమగతిని పొందుతారు. దీనినే శ్రీమహావిష్ణు శరత్కాల పూజ అంటారు. ఇది సంసార తాపాల్ని నశింపచేస్తుంది.

శిశిరఋతువు :- శిశిర ఋతువులో విష్ణుభక్తులైనవారు రెండు చేతులూ జోడించి నాకు నమస్కరించి.

శిశిరోభవాన్ భర్తలోకనాథ హిమందుస్తరం|

దుష్ప్రవేశం కాలం సంసారాన్మాం తారయేమం ధర్త త్రిలోకనాథ॥

(శ్లో॥ 20, అధ్యా – 122)

ఓ లోకనాథా! శిశిర ఋతువు మంచుతో నిండి గడపటానికి చాలా దుష్కరంగా వుంది. దీన్ని భరించలేము. ఈ శిశిరంలాంటి సంసారం నుంచి నన్ను తరింపచేయి. నన్ను రక్షించు. ఈ విధంగా శిశిర ఋతువునాడు భక్తిగా విష్ణువుని పూజించినవాడు తరిస్తాడు.

మార్గశిర వైశాఖాలు :- శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసాలు మార్గశిర-వైశాఖాలు. పవిత్రమైన ఈ రెండు మాసాలలో గంధపత్రం పూలు లభిస్తాయి. వాటితో శ్రీహరిని అర్చిస్తే 9900 సంవత్సరాలు విష్ణులోకంలో స్థిరంగా జీవిస్తారు. ఈ రెండునెలల్లోనే కాదు కార్తిక మార్గశిర వైశాఖాలు మూడునెలల్లో వచ్చే ద్వాదశి తిథినాడు గంధపత్ర పుష్పాలతో శ్రీమహావిష్ణువుని అర్చించాలి. ఆ విధంగా మూడు నెలలు వరుసగా పూజిస్తే 12 సంవత్సరాలు శ్రీహరిని పూజించిన ఫలితం లభిస్తుంది.

అన్ని తిథులకన్నా ద్వాదశి ఎంతో గొప్పది. అది అన్ని యజ్ఞాల ఫలాల్నీ ప్రసాదిస్తుంది. అందుకే శ్రీహరికి ఈ తిథి అంటే ఎంతో ఇష్టం. ద్వాదశినాడు శ్రీహరికి ఏది సమర్పించినా అది కొన్నివేలమంది విప్రులకి దానం చేసిన ఫలితాన్నిస్తుంది.

ఇక కార్తిక వైశాఖ మాసాలు ఎందుకు గొప్పవంటే కార్తికమాసంలో శ్రీమహావిష్ణువు మేలుకొన్నాడు కనుక. అలాగే వైశాఖమాసంలో భూదేవిని ఉద్ధరించాడు కనుక. అందుకే ఈ రెండు మాసాలు శ్రీహరికి ప్రీతికరమైనవి. ఈ కార్తిక వైశాఖాలలో త్రికరణ శుద్ధిగా

ఇమం బహుతరం నిత్యం వైశాఖం చైవ కార్తీకం|

గృహాణ గంధపుష్పాణి ధర్మమేవం ప్రవర్ధయ |

నమోనారాయణేత్యుక్త్వా గంధపత్రం ప్రదాపయే ॥

(శ్లో॥36, అధ్యా – 122)

భగవాన్! ఇది ఎంతో గొప్పదైన వైశాఖ కార్తికమాసాలు వచ్చిన కాలం. నేను సమర్పించే గంధపుషాల్ని స్వీకరించి ధర్మాన్ని వృద్ధిచేయి అని చెప్పి ఓం నమోనారాయణాయ అని పలికి గంధపుష్పాల్ని శ్రీహరికి సమర్పించాలి. ఈవిధంగా శ్రద్ధతో గంధపుష్పాల్ని శ్రీహరికి సమర్పించినవాడు వెయ్యి దివ్యవర్షాలు చావు పుట్టుకలు లేకుండా పరమపదమైన వైకుంఠ దివ్యధామంలో నివసిస్తాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment