Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఎనిమిదవ భాగము

ద్వారకా మాహాత్మ్యం

ద్వాపరయుగంలో యాదవకుల శ్రేష్ఠుడుగా వాసుదేవుడైన శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆయన చిన్నతనంలో మధురా బృందావనాల్లో గడిపాడు. తరువాత విశ్వకర్మ సముద్రంలో నిర్మించిన ద్వారకా పట్టణాన్ని తన నివాసంగా చేసుకున్నాడు.

ద్వారకానగరం ఎంతో సుందరంగా నిర్మంచబడింది. అక్కడ ”పంచసర” అనే పేరుతో ఒక దివ్య క్షేత్రం వుంది. ఆ క్షేత్రంలో ఆరురోజులు నివసించి అక్కడే స్నానం చేస్తే అలా చేసినవారు స్వర్గసుఖాల్ని పొందుతారు. ఎవరైనా ఆ పంచశర క్షేత్రంలో విధివశాత్తు ప్రాణాలు కోల్పోతే వారు సరాసరి వైకుంఠధామానికి చేరుకుంటారు.

ద్వారకానగరం పక్కనున్న సముద్రంలో మకరం (మొసలి) ఆకారంలో ఒక అందమైన ప్రాంతం ఉంది. అక్కడ చేపలు, మొసళ్ళు ఇంకా ఎన్నోరకాల జలచరాలు అటూ ఇటూ తిరిగుతూ కనిపిస్తాయి. అయితే అక్కడ స్నానం చేసేవారిని అవి ఎప్పుడూ బాధించవు. ఎవరైనా ఆ ప్రాంతంలో పిండప్రదానం చేసి పిండాల్ని నీళ్ళలో వదిలితే ఆ జలచరాలు వాటిని తీసుకువెళ్ళతాయి. అలాగే ఎవరైనా పాపాత్ములు పిండాల్ని వేస్తే వాటిని అవి కనీసం తాకవు. ధర్మాత్ములు వేసిన పిండాల్నే అవి స్వీకరిస్తాయి.

ద్వారకాక్షేత్రంలో ”పంచపిండకం” అనే పేరుతో ఒక రహస్యమైన స్థానం ఉంది. ఆ ప్రాంతంలో ఒక అగాధమైన జలం ఉంది. దాన్ని దాటటం ఎవరికీ సాధ్యంకాదు. అది మొత్తం ఒక క్రోసెడు దూరం విస్తరించి ఉంది. ఎవరైనా ఆ ప్రాంతంలో అయిదు రోజులు నివసించి అక్కడున్న విష్ణుభగవానుణ్ణి అభిషేకిస్తే నిస్సందేహంగా అతడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. ఆ ద్వారకలోనే ”హంసకుండ” అనే మరో తీర్ధం వుంది. ఆ తీర్థంలోకి పక్కనే ఉన్న మణిపురం అనే పర్వతం మీదనుంచి జలధారపడుతుంది. ఆ తీర్ధంలో స్నానం చేసి దాని తీరంలో ఆరురోజులు నివసిస్తే సకల పాపాలనుంచీ విముక్తి లభిస్తుంది.

ఇంకా ఆ ద్వారకలో ”కదంబం” అనే పేరుతో ఒక దివ్య స్థానం, చక్రతీర్థం అనే మరో దివ్య ప్రదేశం, అలాగే ”రైవతకం” అనే పుణ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ విష్ణుభగవానుడు శ్రీకృష్ణుడుగా సంచరించిన దివ్యప్రదేశాలు – ద్వారకలో మరో సుప్రసిద్ధ ప్రాంతం ”విష్ణుసంకామం” అనేది. అక్కడే ”జర” అనే పేరు గల ఒక వేటగాడు శ్రీకృష్ణుణ్ణి తన బాణంతో కొట్టాడు. ఇలా ఎన్నో విశేషాలతో పుణ్య స్థలాలతో నిండిన ద్వారకా క్షేత్రం మొత్తం ముప్ఫైయోజనాలు దూరం విస్తరించింది. అక్కడికి వెళ్ళి శ్రీమహావిష్ణువుని దర్శిస్తే ద్వారకాధీశుడైన ఆ కృష్ణ పరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment