శవాన్ని తాకటం – ప్రాయశ్చిత్తం :-
మరణించిన వ్యక్తిని తాకి ఆలయప్రాంగణంలోకి వచ్చి నిల్చుండేవాడు. వందవేల సంవత్సరాలు గర్భంలో పడి దొర్లుతుంటాడు. పదివేల సంవత్సరాలు ఛండాలుడుగా పుడతాడు. ఏడువేల సంవత్సరాలు గ్రుడ్డివాడిగా జన్మిస్తాడు.
వంద సంవత్సరాలు కప్పగా, మూడు సంవత్సరాలు ఈగగా, పదకొండు సంవత్సరాలు లకుముకి పిట్టగా జన్మిస్తాడు. ఇలా ఎన్నో నీచమైన జన్మలు పొందుతాడు. ఒకవేళ ఎవరైనా తెలియక ఈ దోషాన్ని కలిగివుంటే పదిహేనురోజుల పాటు ఒంటిపూట భోజనం చేయాలి. ఇలా ఉన్న తరువాత పంచగవ్య ప్రాశన చేయాలి. ఆ విధంగా ప్రాయశ్చిత్తం ఆచరించిన వాడికి ఎలాంటి దోషం అంటదు.
అపానవాయు దోషం – ప్రాయశ్చిత్తం :-
నారాయణుణ్ణి (ఏదేవుడైనా పూజించేడప్పుడు అపాన వాయువు వదిలేవాడు వాయువుద్వారా పీడించబడతాడు. అయిదేళ్ళు ఈగగా, మూడేళ్ళు ఎలుకగా, తిరిగి మూడు సంవత్సరాలు కుక్కగా పుడతాడు. పొరపాటున ఎవరైనా ఈ దోషాన్ని చేసినట్లైతే వారు అలసందల పిండిని ఆహారంగా తీసుకుంటూ మూడురోజులు, కేవలం రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తూ మూడు రోజులు గడపాలి. అలా ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడికి దోషాలు అంటవు.
పనికిరాని పూలతో పూజిస్తే – ప్రాయశ్చిత్తం :-
ఎవరైనా తెలిసికానీ తెలియక కానీ పాడైపోయిన పనికిరాని పూలతో పూజచేయకూడదు. అలా చేసిన వారు రౌరవాది నరకాల్లో పడి తిరిగి నీచజన్మలు ఎత్తుతారు. పొరపాటున ఎవరైనా ఈ అపరాధాన్ని చేసినట్లైతే వారు ఒక నెలరోజుల పాటు ఒంటిపూట మాత్రమే భోజనంచేయాలి. పద్నాలుగురోజులు పాటు రోజూ వీరాసనం వేయాలి. ఒక నెలరోజులు తాము నిత్యం తినే ఆహారంలో నాలుగోవంతు మాత్రమే తింటూ నేతి పాయసం త్రాగాలి. ఆ తరువాత మూడు రోజులు యవల అన్నాన్ని మరోమూడు రోజులు పూర్తిగా ఉపవాసాన్ని ఆచరించాలి. అలా చేస్తేనే పై తెలిపిన దోషం తొలగిపోతుంది.
చీకటిలో దైవస్పర్శ – ప్రాయశ్చిత్తం :-
కనీసం దీపం వెలుగు లేకుండా దేవతా మూర్తిని ఎవ్వరూ తాకకూడదు. అలాంటి పాపం చేసినవాడు ఎన్నో కష్టాలు పొందుతాడు. ఒక జన్మలో గ్రుడ్డివాడిగా పుడతాడు. ఎవరైనా తెలియక ఈ దోషాన్ని చేస్తే ఇరవై రోజులు శ్రద్ధగా ఒంటిపూట భోజనం చేయాలి. ఏదో ఒకనెలలో ద్వాదశినాడు కేవలం నీళ్ళు త్రాగుతూ ఉపవాసం చేయాలి. తరువాత ఒకరోజు గోమూత్రంతో వండిన యవల్ని భుజించాలి. ఇదే ఈ దోషానికి ప్రాయశ్చిత్తం.
నల్లని వస్త్రాలు ధరించినందుకు ప్రాయశ్చిత్తం :-
నల్లటివస్త్రాలు ధరించి విష్ణుపూజ ఎప్పుడూ చేయకూడదు. ఒకవైళ ఎవడైనా అలా చేస్తే చెట్లమీద పురుగుగా అయిదేళ్ళు, దోమగా మూడేళ్ళు, ఈగగా మూడేళ్ళు, చేపగా పదేళ్ళు, పిట్టగా పదిహేనేళ్ళు, ఇలా ఎన్నో నీచజన్మల్ని ఎత్తుతాడు. ఎవరైనా పొరపాటున ఈ పనిచేస్తే వారు ఏడురోజుల యవలపిండిని, మూడు రాత్రులు పేలాలపిండిని తింటూ ఉపవాస దీక్ష చేస్తే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
కుక్క ఎంగిలి దోషం – ప్రాయశ్చిత్తం :-
ఎవరైనా తెలిసీ తెలియక కుక్క ఎంగిలి చేసిన పదార్థాన్ని దేవుడికి నివేదన చేస్తేవాడు ఏడు జన్మలు కుక్కగా, మరో ఏడుజన్మలు నక్కగా మరో ఏడు సంవత్సరాలు గుడ్లగూబగా పుడతాడు. ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగా దుంపలు, పళ్ళు, కూరలు, పాలు, పెరుగు, పాయసం, గాలి వీటిని మాత్రమే మూడు రోజుల పాటు ఆహారంగా తింటూ ఆ తరువాత ఇరవై ఒక్క రోజులు ఒంటిపూట ఉపవాసాన్ని ఉండాలి. అలాచేస్తే ఈ దోషం నివారించబడుతుంది.
మద్యపాన దోషం – ప్రాయశ్చిత్తం
ఎవడైనా మద్యాన్ని సేవించి దైవ దర్శనానికిగానీ, దైవాన్ని అర్చించటానికి గానీ వస్తే అది మహాదోషం. అలా చేసినవాడు పదివేల సంవత్సరాలు దరిద్రుడిగా జన్మిస్తాడు. ఈ పనిచేసినవాటికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే పవిత్రమైన వస్తువులో నిప్పు రంగులో ఉండేలా ద్రవాన్ని తయారుచేసి దాన్ని పుచ్చుకోవాలి. అలాచేస్తే మద్యపాన దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹