Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఆరవ భాగము

రాజాన్నదోషం – ప్రాయశ్చిత్తం :-

భాగవతులైనవారు ఎవ్వరూ రాజుల్ని యాచించి వారుపెట్టిన అన్నం తినకూడదు. క్షత్రియుడైన వాడు నారాయణుడి అంశతో ఉన్నప్పటికీ, రజస్సు, తమోగుణం కలిసి ఎన్నో దారుణమైన పనులు చేస్తుంటాడు. అందుకే అతడు పెట్టే అన్నం నిందనీయంగా చెప్పబడింది. ఒకవేళ రాజాన్నం స్వీకరించాల్సివస్తే రాజుద్వారా పొందిన అన్నాన్ని ముందుగా నారాయణుడికి నివేదించి ఆ తరువాత దాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తే దోషం అంటదు. ఇలా చేయక రాజాన్నం తిన్నవారు ప్రాయశ్చిత్తం ఆచరించాలి.

ఒక చాంద్రాయణ వ్రతం లేదా ఒక తపకృచ్ఛవ్రతం, లేక సొంతపనవ్రతం ఆచరిస్తే ఆ దోషం పోతుంది. చాంద్రాయణ వ్రతం అనగా- చంద్రుడి క్షీణత్వాన్ని బట్టి కృష్ణ పక్షంలో ఒక్కో ముద్ద ఆహారాన్ని తగ్గిస్తూ శుక్లపక్షంలో ఒక్కో ముద్దని పెంచుతూ అహారాన్ని స్వీకరించి చేసే వ్రతం. తప్తకృచ్ఛవ్రతం అంటే-వేడినీళ్ళు, పాలు, నెయ్యి వరుసగా మూడు రోజులు ఆహారంగా తీసుకుంటూ ఉండటం.

వేడి గాలిని పీల్చటం అనేవి ఈ వ్రత నియమాలు. ఇక సొంతపనవ్రతం అంటే – మూడు రోజులు పళ్ళని మాత్రమే తినటం. మూడు రోజులు రాత్రిపూటే భుజించటం, తరువాత మూడు రోజులూ ఎవర్నీ ఏమీ యాచించకుండా ఏది లభిస్తే దాన్ని తినటం. ఆ తరువాత మూడు రోజులు కూడా ఉపవాసం ఉంటూ చేసే వ్రతం ఈ విధంగా రాజాన్నం తిన్నవాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాడికి ఎలాంటి దోషం అంటదు.

పళ్లుతోమకుండా చేసే విష్ణుపూజ – ప్రాయశ్చిత్తం :-

ఉదయాన్నే పళ్ళుతోముకోకుండా విష్ణు ఆలయానికి వెళ్ళేవాడికి, విష్ణువుని పూజించేవాడికి, వాడు పూర్వజన్మలో చేసిన పుణ్యమంతా ఒక్కసారిగా నశిస్తుంది. మనిషి సహజంగా సకల దోషాలతో వుంటాడు. శరీరంలో వాత పిత్త కఫాలుంటాయి. ఉదయాన్నే అతడి ముఖం చెడ్డ వాసనతో ఉంటుంది. పళ్ళు తోముకున్నట్లైతే ఆ దోషం తొలగిపోతుంది. ఒకవేళ ఎవరైనా పళ్ళు తోమకుండా విష్ణుపూజ చేసినట్లైతే వారు ఏడురోజుల పాటు ”ఆకాశశయనం” (ఆరుబైట పడుకోవటం) చేస్తే పాపాలనుంచి విముక్తుడవుతాడు.

రజస్వల అయిన స్త్రీని తాకితే – ప్రాయశ్చిత్తం :-

తెలిసికానీ, తెలియకకానీ రజస్వల అయిన స్త్రీని తాకి విష్ణువుని తాకేవాడు (ఏదైవాన్నైనా) ఆ సమయంలో మోహంతో కామవశుడైనవాడు ఒక వెయ్యి సంవత్సరాలపాటు రజస్సు త్రాగుతూ, కుంటి, గ్రుడ్డి, దరిద్రుడు, జ్ఞానహీనుడు, మూర్ఖుడు అవుతాడు. ఎవరైనా పొరపాటున ఈ దోషాన్ని చేసినట్లైతే, మూడు రాత్రులు ఆకాశశయనం (ఆరుబైట నిద్రపోవటం) చేయాలి. ఈవిధంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడికి దోషం అంటదు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment