బదరికాశ్రమ మాహాత్మ్యం
పవిత్రమైన హిమాలయపర్వతాల మీద దేవతలకి కూడా దుర్లభమైన ఒక దివ్య ప్రదేశం ఉంది. అదే బదరికాశ్రమం. ఆ క్షేత్రం సంసారబాధల నుంచి ఉపశమనం కలిగించే శక్తి కలిగింది. శ్రీమన్నారాయణుడి మీద అచంచలమైన భక్తి శ్రద్ధఉన్నవారు మాత్రమే ఆ బదరికాశ్రమానికి చేరుకోగలరు. అక్కడికి వెళితేనే చాలు మానవుల మనోరథాలన్నీ తీరిపోతాయి. అక్కడున్న ఎత్తైన శిఖరాల మధ్యలో బ్రహ్మకుండం అనే ప్రసిద్ధ సరోవరం ఉన్నది. ఆ ప్రాంతంలోనే శ్రీమన్నారాయణుడు స్థిరంగా కొలువైవున్నాడు. ఆ బ్రహ్మకుండం సమీపంలో ఎవరైతే మూడు రాత్రులు ఉపవాసం ఉండి ఆ కుండంలో స్నానం చేస్తాడో అతడికి అగ్నిష్టోమ యాగం చేసినఫలితం లభిస్తుంది.
బదరికాశ్రమంలో అగ్ని సత్యపదం అనే మరో దివ్యస్థలం ఉంది. అక్కడ హిమాలయాలనుంచి మూడు ధారలు క్రిందకి పడుతుంటాయి. (జలపాతాలు) నన్నే స్మరిస్తూ ఆ దివ్యజలధారల క్రింద మూడురోజులు వరుసగా స్నానంచేసిన వాడు సత్యవాది, సకలకార్య కుశలుడు అవుతాడు. అక్కడి జలాన్ని తాకినా చాలు, ఆ జీవుడు మరణానంతరం విష్ణులోకాన్ని చేరుకుంటాడు.
ఇంద్రలోకం అనే పేరుతో నారాయణుడికి సంబంధించిన మరో ప్రసిద్ధ ఆశ్రమం అక్కడ నెలకొంది. ఆ ఇంద్రలోకాశ్రమంలో దేవాధిపతి ఇంద్రుడు నారాయణుణ్ణి శ్రద్ధగా సేవిస్తూ ఉంటాడు. ఆ ఆశ్రమం సమీపంలో ఎత్తైన హిమశిఖరాలనుంచి నిరంతరం ధారలుగా జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ పర్వతం మీద ప్రతిశిలపైనా విష్ణు ధర్మం స్థాపితమై ఉంటుంది. మానవుడు ఒక్కరాత్రి అక్కడ నివసించి స్నానం చేస్తే పరమపవిత్రుడవుతాడు. బదరికాశ్రమంలోనే ”పంచశిఖ” అని మరో దివ్యతీర్ధం ఉంది. అక్కడ ఐదు ధారలుగా శిఖరాల నుంచి జలపాతాలు పడుతుంటాయి. ఆ అయిదు ధారలూ అయిదు నదులుగా మారి ప్రవహిస్తాయి. ఆ నదుల్లో లేక ధారల్లో స్నానంచేసిన వాడు అశ్వమేధయాగం చేసిన ఫలం పొందుతాడు.
బదరికాశ్రమంలో ”చతశ్రోత” అనే దివ్యస్థలం ఉంది అక్కడ నాలుగు వైపులనుంచీ నాలుగు ధారలు పడుతుంటాయి. అక్కడ స్నానంచేసి ఒక రాత్రి నివసించినవాడు స్వర్గాన్ని చేరుకుంటాడు.
అలాగే ”వేదధారా” అనే మరో తీర్ధం ఉంది. ఆ తీర్ధం సమీపంలోనే బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలనుంచీ నాలుగు వేదాలు వెలువడ్డాయి. ఆ క్షేత్రంలో నాలుగు ఎత్తైన ధారలు పడుతుంటాయి. ఇక్కడ నాలుగు రాత్రులు నివసించి ఆ నాలుగు ధారల్లో స్నానం చేస్తే నాలుగు వేదాలు అధ్యయనం చేసిన ఫలం పొందుతారు. దానికి సమీపంలోనే ”ద్వాదశ దివ్యకుండం” అనే పేరుతో మరో స్థలం ఉంది. ఆ కుండం దగ్గరే శ్రీమన్నారాయణుడు ద్వాదశ (12) ఆదిత్యుల్ని స్థాపించాడు. ఎవడైతే ద్వాదశి తిథినాడు ఆ కుండంలో స్నానం చేస్తాడో వాడికి ద్వాదశ సూర్యుల అనుగ్రహం లభిస్తుంది.
”సోమాభిషేకం” అనే పేరుతో ఒకదివ్య తీర్థం ఆ బదరికాశ్రమంలో వుంది. పూర్వం అత్రి కుమారుడైన సోముడు శ్రీమన్నారాయణుణ్ణి ఈ ప్రాంతంలోనే అభిషేకించాడు. అందుకే ఈ తీర్థానికి సోమాభిషేక తీర్థం అనే పేరు వచ్చింది. చంద్రుడు ఇక్కడే 14 కోట్ల సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి నారాయణుడి దివ్యానుగ్రహం లభించింది. సోమాభిషేకానికి సమీపంలో ”సోమగరి” అనే మరో ప్రాంతంలో నీటికుండం ఉంది అక్కడ పైనుంచి నీరు ధారాపాతంగా పడుతుంది. ఆ ధారలక్రిందగానీ, కుండంలోకానీ స్నానం చేసినవాడు సోమలోకాన్ని చేరే అర్హత పొందుతాడు.
బదరీ క్షేత్రంలో సుప్రసిద్ధమైనది ”ఊర్వశీకుండం”. అది ఎంతో రహస్యమైనది. అక్కడే నారాయణుడి ఊరువు నుంచి ఊర్వశి ఆవిర్భవించింది. ఆ కుండం సమీపంలో నారాయణుడు ఎంతోకాలం ఎవరికీ తెలియకుండా తపస్సుచేసాడు. నూట పదికోట్ల పద్మ వర్షాల పాటు నారాయణుడు గుప్తంగా అక్కడ తపస్సు కొనసాగించాడు. ఇంద్రాది దేవతలు కూడా ఆయన జాడని కనిపెట్టలేకపోయారు. విష్ణువు కనపడక లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. ఆయన మాయని ప్రయోగించటం వల్ల ఎవ్వరూ విష్ణువుని తెలుసుకోలేకయున్నారు. అందరూ కలిసి ఏం చేయాలో దిక్కుతోచక సామూహింగా నారాయుణుణ్ణి దీనంగా స్తుతించటం ప్రారంభించారు.
దేవాదిదేవా! పరంధామా! పురుషోత్తమా నీవు కనుపించక మేమంతా ఉత్సాహాన్ని కోల్పోయాం ఏపనీ మేము చేయలేకపోతున్నాం. దయచేసి మా మీద అనుగ్రహం చూపించు. నీవెక్కడున్నావో తెలియచేయి అని పరిపరివిధాలుగా ప్రార్థించగా తపస్సులో ఉన్న నారాయణుడు కళ్ళుతెరిచి వారికి కనిపించాడు. నారాయణుడి దర్శనం కావటంతో దేవతలంతా ఎంతో సంతోషించారు. ఇది ఊర్వశీకుండం గొప్పతనం. ఎవడైతే ఈ కుండంలో స్నానంచేసి ఒక రాత్రి అక్కడ నివసిస్తాడో వాడు సకల పాపాలనుంచీ విముక్తి పొందుతాడు. మరణానంతరం ఊర్వశీలోకాన్ని చేరుకుంటాడు.
పరమపావనమైన ఈ బదరికాశ్రమ వృత్తాంతాన్ని, మహాత్మ్యాన్ని ఎక్కడ స్మరించినా అక్కడ విష్ణువు ఉన్న భావన కలుగుతుంది. ఎవరైతే ఈ మహాత్మ్యాన్ని పఠిస్తారో లేక ప్రవచిస్తారో వారు సత్యవాదిగా, క్రోధాన్ని జయించిన వారిగా, జితేంద్రియులుగా మారి విష్ణులోకాన్ని చేరుకుంటారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹