Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ముప్పై నాల్గవ భాగము

శ్రీమన్నారాయణ రహస్య పూజావిధానం :-

భూదేవితో వరాహ అవతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అంటున్నాడు.

దేవీ! నీవు ఇంతకు ముందు సంసారతారణం గురించి ఏంచేయాలి? అని ప్రశ్నించావు చెబుతున్నా విను. “నా పనుల మీద శ్రద్ధతో, నన్ను పూజించాలన్న ఆసక్తితో, ఎలాంటి చెడ్డ ఆహారాన్నీ స్వీకరించకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవారే సంసారం నుంచి విడివడి నా దగ్గరకి చేరుకుంటారు.

సనాతనుడు అని ఎవరిని గురించి చెబుతారో ఆ సనాతునుణ్ణి సర్వమూ తెలిసిన వాణ్ణి నేనే. అలాగే క్రింద, పైనా అన్ని దిక్కుల్లో వుండేదీ నేనే. కనుక నా భక్తుడైన వాడు నా పరమపదాన్ని చేరుకోవాలనుకుంటే అన్ని విధాలా అందర్నీ గౌరవించాలి. పూజాది కార్యక్రమాలతో నాకు నమస్కరించాలి. దేవీ! నా మార్గాన్ని అనుసరించే భక్తులు నన్ను ఎలా నమస్కరించి పూజించాలో అది కూడా చెబుతున్నా విను.

మొదట నన్ను శ్రద్ధగా షోడశోపచారాలతో అర్చించి లేదా అర్చించినట్టు భావించి పరిశుద్ధమైన మనసుతో, దోసిలితో నీటిని తీసుకుని

శ్లో॥ యజామహే ధర్మపరాయణోద్భవం నారాయణం ప్రసీదేశాన|

సర్వలోక ప్రధానం పురాణం కృపా సంసారమోక్షణం ||

భావం :- ధర్మం అనే పరమగతికి కారణమైనవాడు, సకల లోకాలకీ ప్రధానుడు, పురాతన మైనవాడు, ఎంతో దయతో భక్తుల సంసారాన్ని పటాపంచలు చేసేవాడు. అయిన నారాయణుణ్ణి పూజిస్తున్నాను. స్వామీ! నన్ను అనుగ్రహించు.

ఈ విధంగా పలికి ఆ దోసిలిలో నీటిని ఒక పళ్ళెంలో విడిచిపెట్టాలి. తిరిగి పడమరవైపు ముఖం ఉంచి ఓం నమోనారాయణాయ అని పలికి దోసిలితో నీటిని గ్రహించి ఈ శ్లోకాన్ని పఠించాలి.

శ్లో॥ యదాసు దేవః పథమాదికర్తా పురాణ కల్పంచ యథా విభూతిః|

దివిస్థితా చాదిమనంతరూప మమోఘ మోఘం సంసారమోక్షణమ్ ||

భావం :- ఆది దేవుడు, ప్రథమసృష్టికర్త, సనాతనుడు, సకలైశ్వర్య స్వరూపుడు, స్వర్గంలో నివసించేవాడు, అన్నిటికన్నా మొదటివాడు, అనంతమైన రూపాలు కలిగినవాడు, ఎక్కడా ఎదురన్నదే లేనివాడు. సంసార బంధాలనుంచి విముక్తి ప్రసాదించేవాడు అయిన నారాయణుడికి నమస్కారం.

ఈ విధంగా చెప్పి దోసిటిలో నీటిని పళ్ళెంలో వదిలిపెట్టాలి. తిరిగి ఓం నమోనారాయణాయ అని పఠించి దోసిలితో నీళ్ళు తీసుకుని ఉత్తరంవైపు ముఖాన్ని ఉంచి ఈ శ్లోకాన్ని పఠించాలి.

శ్లో॥ యజామహే దివ్యపరం పురాణ మనాది మధ్యాంత|

మనంత రూపం భవోద్భవం సంసారమోక్షణమ్ ॥

భావం :- దివ్యమైనవాడు, పరుడు, పురాణుడు, ఆదిమధ్యాంతరహితుడు, అనంతమైన రూపాలు కలిగినవాడు, సంసారబంధాలనుంచి రక్షించేవాడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి అర్చిస్తున్నాను.

ఈ విధంగా పలికి దోసిట్లోని నీటిని పళ్ళెంలో వదలాలి. తరువాత మళ్ళీ దోసిలితో నీళ్ళని తీసుకుని ఓం నమోనారాయణాయ అని పఠించి, దక్షిణ దిశగా ముఖాన్నుంచి ఈ శ్లోకాన్ని చదవాలి.

శ్లో॥ యజామహే యజ్ఞమహో రూపజ్ఞం కాలం చ కాలాధిక |

మప్రమేయమ్ అనన్యరూపం సంసారమోక్షణమ్ ॥

భావం :- యజ్ఞ స్వరూపుడు అన్నిరూపాలు తెలిసినవాడు, కాలస్వరూపుడు, కాలానికి ఆదిగా ఉన్నవాడు, సంసార భయాన్ని రూపుమాపేవాడు అయిన నారాయణుణ్ణి పూజిస్తున్నాను.

ఈ విధంగా చెప్పి దోసిలిలో ఉన్న నీళ్ళని పళ్ళెంలో విడవాలి. ఆ తరువాత సమిధల్ని చేతిలో పట్టుకుని ఇంద్రియనిగ్రహంతో నారాయణుడి మీద స్థిరంగా మనసు నిలిపి

శ్లో॥ యజామహే సోమపథేన భానే త్రిసప్తలోక నాథమ్|

జగత్ప్రదానం మృత్యురూపం సంసార మోక్షణమ్ ॥

పద్నాలుగు లోకాలకీ నాయకుడు, సోమ (యజ్ఞ) మార్గంలో నిలిచి ఉండేవాడు, జగత్తుకి ప్రధానమైనవాడు, మృత్యుస్వరూపుడు, సంసార బంధాలు నుంచి మోక్షణం కల్పించేవాడు అయిన శ్రీమన్నారాయణుడిని యజిస్తున్నాను (యాగం చేస్తున్నాను).

ఈ విధంగా పలికి దేవదేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి మూడు సంధ్యల్లో అర్చించాలి. ఇది యోగాలలో పరమయోగం. ఎంతో రహస్యమైన విష్ణుపూజా విధానం. అందరూ ఆచరించతగ్గది. సరళమైనది. జ్ఞాన మార్గాల్లో సాఖ్యంలాంటిది. కర్మల్లో ఉత్తమ కర్మగా ప్రసిద్ధిచెందింది.

పరమ పవిత్రమైన ఈ విష్ణుపూజాయోగాన్ని భక్తుడు కానివాడికి, పిసినారికి, మొండివాడికి చెప్పకూడదు. ఉత్తమ శిష్యుడైన వాడికి మాత్రమే దీన్ని భోదించాలి. శ్రీమహావిష్ణువు స్వయంగా ఉపదేశించిన ఈ రహస్య పూజావిధానాన్ని బుద్ధిశాలి అయినవాడు అంత్యకాలంలో కూడా మరువకూడదు.

యఏతత్ పఠతేనిత్యం కల్యోత్థాయ దృడవ్రతః| మమాపి హృదయే నిత్యం స్థితః సత్త్వగుణాన్వితః ॥

యఏతేన విధానేన త్రిసంధ్యం కర్మకారయేత్|

తిర్యగ్యోన్యా పి సంప్రాప్యమమలోకాయ గచ్ఛతి ॥

(శ్లో॥21-22,అధ్యా-125)

ప్రతిరోజూ ప్రాతఃకాలంలో నిద్రలేచి నిశ్చలమైన దీక్షతో ఈ స్తోత్రాన్ని (పూరూప స్తోత్రాన్ని) పఠించినవాడు సత్త్వగుణంతో కూడుకుని నా హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందుతాడు. ఈ విధానంతో ప్రతిరోజూ మూడు సంధ్యల్లో విష్ణుపూజచేసిన వాడు పశుపక్ష్యాదులకి జన్మించినప్పటికీ అతడు నా లోకాన్నే చేరుకుంటాడు. ఈ విధంగా వరాహమూర్తి భూదేవికి తన రహస్య పూజావిధానాన్ని సవివరంగా తెలియచేసాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment