త్రిశక్తి ఆవిర్భావం :-
సకల కళాస్వరూపిణిగా భాసిస్తున్న ఆ దివ్యశక్తిరూపిణి తెల్లగా ప్రకాశిస్తోంది. సర్వాక్షరాలూ ఆ దేవి స్వరూపాలే. అందుకే ఆమెని వాగీశ్వరి అంటారు. కొంతమంది సరస్వతి అంటారు. సకల విద్యలకీ ఆమే అధి దేవత. అందుకే పండితులు ఆ దేవిని విభావరి! విశాలాక్షీ! వరాననా! అని పిలుస్తారు. బ్రహ్మాది దేవతలంతా ఆ దేవి దగ్గరకొచ్చి “దేవీ! నీవు ముగ్గురు మూర్తుల శక్తితో ఆవిర్భవించావు. కాబట్టి నీపేరు త్రికళ అని పెడుతున్నాం. నీవు ముల్లోకాల్నీ కాపాడుతూవుండు అని కోరారు. దేవీ! నీకు ఇంకా ఎన్నో పేర్లు రాబోయేకాలంలో వస్తాయి. ఎంతో మంది నిన్ను ఎన్నో రకాలుగా కొలుస్తారు, పిలుస్తారు. నీవు మూడు రంగులతో భాసిస్తున్నావు. కనుక నీ శరీరాన్ని మూడు మూర్తులుగా మార్చుకో అన్నారు. వెంటనే దేవి నలుపు, ఎరుపు తెలుపు వర్ణాలతో కూడిన మూడు శరీరాల్ని ధరించింది.
యాసాబ్రాహ్మీ శుభమూర్తిస్తయా సృజతి వైప్రజాః |
సౌమ్యరూపేణ సుశ్రోణీ బ్రహ్మసృష్ట్యావిధానతః ॥
యాసారక్తవర్ణేన సురూపాతనుమధ్యమా |
శంఖచక్రధరాదేవీ వైష్ణవీ సా కళాస్మృతా ॥
సాపాతి సకలం విశ్వం విష్ణుమాయేతి కీర్త్యతే ||
యాసాకృష్ణన వర్ణేన రౌద్రమూర్తి శూలినీ|
దంష్ట్రా కరాళినీ దేవీ సాసంహరతి వైజగత్ ॥
(27-29, – అధ్యా 89)
ఆ దేవి సౌమ్యరూపిణిగా బ్రహ్మ సంబంధమైన శుభమూర్తిని ధరించి బ్రహ్మచేసిన విధంగా ప్రజల్ని సృష్టిస్తుంది. ఎర్రటి వర్ణంతో ప్రకాశించే శరీరంతో భాసిస్తూ, శంఖచక్రాలు ధరించి, విష్ణుకళగా రూపొందిన దేవి, విష్ణువులాగే సకల విశ్వాన్నీ రక్షిస్తుంది. నల్లని వర్ణంతో ప్రకాశిస్తూ త్రిశూలాన్ని ధరించి భయంకరమైన కోరలతో రుద్రుడిలాగా జగత్తునంతా ఆ దేవి సంహరిస్తుంది. ఆ విధంగా త్రిశక్తి రూపిణిగా ఆవిర్భవించిన దేవిలోని బ్రాహ్మీశక్తి బ్రహ్మ దగ్గర వీడ్కోలు తీసుకుని విశ్వరూపాన్ని పొందటం కోసం శ్వేత పర్వతం మీదకి వెళ్ళింది. అలాగే వైష్ణవశక్తిగా మారిన దేవి విష్ణువు దగ్గర వీడ్కోలు తీసుకుని సుందరాద్రికి వెళ్ళగా, రౌద్రీశక్తిగా ఆకారాన్ని ధరించిన దేవి శంకరుడికి వీడ్కోలు పలికి తపస్సు చేసుకోవటానికి కృష్ణనీలపర్వతానికి వెళ్ళిపోయింది.
బ్రహ్మచేసిన పరాశక్తి స్తుతి :-
బ్రహ్మవల్ల ఆవిర్భవించింది బ్రాహ్మీ శక్తి. విష్ణు వల్ల ఆవిర్భవించింది. వైష్ణవీ శక్తి. అలాగే రుద్రుడి నుంచి ఆవిర్భవించింది రౌద్రీ శక్తి. ఈ ముగ్గురు శక్తులూ కలిసిన స్వరూపమే పరాశక్తి. ముగ్గురుగా కనిపిస్తున్న వీరంతా ఒక్కటే. సకల జగత్తునీ ఈ మూడు శక్తులూ సృష్టిస్తూ, పాలిస్తూ లయం చేస్తున్నాయి. ముల్లోకాల్లో ఈ దివ్య శక్తులు మూడూ వ్యాపించాయి. పరమకారుణ్య మూర్తులైన ఆ త్రిశక్తి స్వరూపాల్ని పరాశక్తిగా భావించి బ్రహ్మదేవుడు ఇలా వారిని స్తుతించాడు.
త్రిశక్తి స్తుతి :-
జయస్వ సత్యసంభూతే ధ్రువే దేవి వరాక్షరే సర్వగే సర్వజనని సర్వభూతమహేశ్వరి |
సర్వజ్ఞే త్వం వరారోహే సర్వసిద్ధి ప్రదాయిని
సిద్ధి బుద్ధి కరీ దేవి ప్రసూతిః పరమేశ్వరి ||
త్వం స్వాహా త్వం స్వధా దేవి త్వముత్పత్తిర్వరాననే
త్వమోంకారస్థితా దేవి వేదోత్పత్తి స్వమేవ చ ॥
దేవానాం దానవానాం చ యక్షగంధర్వ రక్షసామ్, పశూనాం వీరుద్దాం చాపి త్వముత్పత్తి ర్వరాననే |
విద్యా విద్యేశ్వరీ సిద్ధా ప్రసిద్ధా త్వం సురేశ్వరి,
సర్వజ్ఞా త్వం వరారోహే సర్వసిద్ధి ప్రదాయినీ ॥
సర్వగా గత సందేహా సర్వ శత్రునిబర్హిణీ సర్వ విద్యేశ్వరీ దేవీ నమస్తే స్వస్తి కారిణి
ఋతుస్నాతాం స్త్రీయం గచ్ఛేద్ యస్త్వాం స్తుత్వా వరాననే ॥
తస్యావశ్యం భవేత్ సృష్టి స్వత్ప్రసాదాత్ ప్రజేశ్వరి
స్వరూపా విజయా భద్రా సర్వశత్రు ప్రమోహిని
(శ్లో॥ 9-15,అధ్యా-90)
దేవీ! నీ దివ్యమంగళ రూపాన్ని గుణగణాల్ని స్తుతించి ఋతుస్నాత అయిన భార్యని పొందిన వాడికి సత్సంతానం లభిస్తుంది. నీవు వజ్రేశ్వరివి. సాక్షాత్తు పరమాత్మ స్వరూపానివి. విజయ, భద్రస్వరూపిణివి. అంతః బహిః శత్రువులందర్నీ రూపుమాపే దానివి. నీకు శతకోటి నమస్కారాలు తల్లీ.
మహిషాసురవధ – దేవీస్తుతి
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు లోకకంటకుడిగా మారి దేవతల్ని,ఋషుల్ని, సిద్ధుల్ని, మానవుల్ని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. దేవతలందర్నీ తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. అతడికి సహాయకులుగా భీముడు ధ్వంక్షుడు, ధ్వస్తకర్ణుడు, శంకుకర్ణుడు, వజ్రకాయుడు, విద్యున్మాలి, రక్తాక్షుడు, భీమదంష్ట్రుడు, విద్యుజ్జిహ్వుడు, అతికాయుడు, మహాకాయుడు, దీర్ఘబాహువు, కృతాంతుడు అనే పన్నెండు మంది మహావీరులున్నారు. అదే కాలంలో వైష్ణవీ శక్తిగా రూపొందిన దేవి హిమాలయాల్లో సుందరమైన నగరాన్ని నిర్మించుకుని దాసదాసీ జనంతో సేవలందుకుంటూ దివ్యమందిరంలో నివసిస్తోంది.
ఒకనాడు నారదుడు వైష్ణవీదేవి దివ్యమందిరానికి విచ్చేసాడు. అక్కడి వైభవాన్ని, దేవి సౌందర్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే అక్కణ్ణుంచి సరాసరి మహిషాసురుడి కొలువుకి వెళ్ళి వైష్ణవీదేవి అందచందాల గురించి ఆమె ఐశ్వర్యాన్ని గురించి వర్ణించాడు. నారదుడి మాటలు విన్న దగ్గర్నుంచీ మహిషాసురుడికి నిద్రపట్టటంలేదు. ఎలాగైనా ఆ జగదేక సుందరిని చేపట్టాలని భావించాడు. విద్యుత్ప్రభుడనే దూతని పిలిచి దేవి దగ్గరకి రాయబారం పంపించాడు. విద్యుత్ప్రభుడు దేవి దగ్గరకొచ్చి మహిషాసురుడి గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు. ఆయన దేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని ఆయన్ని చేపడితే ముల్లోకాలకీ రాణివి కావచ్చనీ తెలిపాడు.
మహిషుడి దూతమాటలు విన్న దేవి అతడి అభ్యర్ధనని తిరస్కరించింది. ఓరీ దూతా! నీ ప్రభువుకి నేను కాదు కదా ఇక్కడున్న ఏ కన్యా లభించదు. ఇక నీ వెళ్ళు అని గద్దించింది. దేవి మాటలు విని భయపడ్డ దూత వెంటనే అక్కణ్ణుంచి వెళ్ళి పోయాడు.
అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. దేవికి నమస్కరించి అమ్మా! లోకపావనీ ఆ మహిషాసురుడు అందర్నీ పీడిస్తున్నాడమ్మా. వాడికి స్త్రీ చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో చావులేదు. నీవు తప్ప వాణ్ణి ఎవరూ సంహరించలేరు. దేవతలంతా నీకు మొరపెట్టుకుంటున్నారు తల్లీ! ఎలాగైనా ఆ దుష్టుణ్ణి సంహరించి అందరికీ మేలు చేయి అని దేవతలు చేసిన విన్నపాన్ని ఆమెకి వినిపించి వెళ్ళిపోయాడు.
మహిషుడి దూత తిరిగి వచ్చి దేవి అన్న మాటల్ని మహిషుడికి చెప్పాడు. అది విన్న వెంటనే అతడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్క ఆడది అబల నామాటని తిరస్కరిస్తుందా! ఎలా నాదారికి రాదో చూస్తాను అని అనుకుని వెంటనే దేవిమీదకి యుద్ధానికి బయలుదేరాడు. అక్కడ దేవి కూడా మహిషాసుర సంహారం చేయటానికి నిశ్చయించుకుని తన సైన్యాన్నంతా సన్నద్ధం చేసింది.
మహిషుడి సైన్యం దేవీ సైన్యం ఎదురుపడ్డారు. ఇద్దరిమధ్యా ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో దేవశక్తులన్నీ కలిసి మహిషుడి పరివారాన్నంతా దారుణంగా వధించారు. అది చూసి మహిషుడు రెట్టించిన క్రోధంతో స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. దేవీ సైన్యాన్ని చెల్లాచెదురు చేసాడు. ఆ విషయం తెలిసిన దేవి మహోగ్రరూపంతో ఇరవై చేతుల్లో విల్లు, కత్తి, బాణం, తోమరం, గధ, శంఖం, ఖడ్గం, డాలు, బాణం, భశుండి లాంటి ఆయుధాల్ని ధరించి మహిషుణ్ణి ఎదుర్కొంది.
దేవీ మహిషుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ రెచ్చిపోయి ఒకర్ని ఓడించాలని మరొకరు తీవ్రంగా యుద్ధంచేస్తున్నారు. మహిషుడు ఎన్నో మాయోపాయాలు ప్రయోగిస్తున్నాడు. అయితే దేవి వాటన్నిటినీ త్రిప్పి కొడుతోంది. ఇలా వారిద్దరూ పదివేల దివ్యసంవత్సరాలు యుద్ధం కొనసాగించారు. చివరికి దేవి తన దివ్యశూలాయుధంతో మహిషుణ్ణి దారుణంగా వధించింది. అతడి వథ శతశృంగ పర్వతం మీద జరిగింది. శూలంతో పొడిచిన దేవి తన ఖడ్గంతో మహిషుడి తలని నరికేసింది. ఆ విధంగా దేవి చేతిలో మరణించిన మహిషుడి శరీరం నుంచి ఒక జ్యోతి బైటికి వచ్చి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ మనోహరదృశ్యాన్ని చూసి దేవతలంతా పట్టరాని సంతోషంతో జయజయ ధ్వానాలు చేసారు. అప్సరసలు ఆనంద నృత్యాలు చేయగా దేవతలంతా నింగి నుంచి పూలవాన కురిపించారు. ఆ తరువాత అందరూ కలిసి సంతోషంతో దేవిని ఇలా కీర్తించారు.
దేవతాకృత దేవీస్తుతి :-
నమో దేవి మహాభాగే గంభీరే భీమదర్శనే, జయస్థే స్థిత సిద్ధాన్తో త్రినేత్రే విశ్వతోముఖి
విద్యావిద్యే జయే యాజ్యే మహిషాసురమర్ధిని సర్వగే సర్వదేవేశి విశ్వరూపిణి వైష్ణవి
వీతశోకే ధ్రువే దేవి పద్మపత్ర శుభేక్షణే శుద్ధ సత్వ వ్రతస్థే చ చణ్ణరూపే విభావరి
బుద్ధి సిద్ధి ప్రదేదేవి విద్యే విద్యే మృతే శివే శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వలోక నమస్కృతే
ఘంటాహస్తే త్రిశూలాస్త్రే మహామహిషమర్దిని, ఉగ్రరూపే విరూపాక్షి మహామాయే మృతస్రవే
సర్వసత్వహితే దేవి సర్వసత్వమయే ధ్రువే,
విద్యాపురాణ శిల్పానాం జననీ భూతధారిణీ సర్వదేవ రహస్యానాం సర్వ శతృవతాం శుభే
త్వమేవ శరణం దేవి విద్యే విద్యే శ్రియేబికే విరూపాక్షి తథా క్షాన్తి క్షోభితాంతర్జలే విలే
నమోస్తుతే మహాదేవి నమో స్తు పరమేశ్వరి నమస్తే సర్వదేవానాం భావనిత్యే క్షయే వ్యయే
శరణం త్వాం ప్రపద్యన్తో యే దేవి పరమేశ్వరి న తేషాం జాయతే కిఞ్చ దశుభం రణసఙ్కటే
యశ్చ వ్యాఘ్రభయే ఘోరే చౌరరాజభయే తథా,
స్తవ మేనం సదా దేవి పఠిష్యతి యతాత్మవాన్ని గడపి యో
యో దేవి త్వాం స్మరిష్యతి మానవః
సో పి బంధై ర్విముక్త స్తే సుసుఖం వసతే సుఖీ
(శ్లో॥ 53-63, అధ్యా-94)
అమ్మా! పరమేశ్వరీ ఘోరమైన కష్టాలలో ఉన్నవాడు, ఆపదల్లో చిక్కుకున్నవాడు, చోరభయం, రాజభయం కలిగినవాడు నిశ్చలంగా, పవిత్రమైన మనసుతో ఈ నీ స్తోత్రాన్ని పఠిస్తే వాడు భవబంధాలనుంచి కష్టాలు ఆపదలనుంచీ విముక్తి పొందుతాడు తల్లీ! అని దేవతలందరూ ప్రార్థించగా దేవి ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోండి అని పలికింది. దేవతలు ఆమెతో తల్లీ! మాకు ప్రత్యేకంగా ఏ వరాలు వద్దమ్మా. మేము చేసిన ఈ దివ్యస్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి నీ దివ్యానుగ్రహం కలిగేలా వారుకోరిన కోరికలు తీరేలా అనుగ్రహించు. ఇదే మాకు కావలసింది అని అన్నారు.
దేవి తథాస్తు! అని పలికి అంతర్థానమైంది. ఇక దేవతలు కూడా ఆనందంగా తమ తమ స్థానాలకి తిరిగి వెళ్ళారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹