Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ముప్పై రెండవ భాగము

శక్తి స్వరూపం

పూర్వం భూదేవి వరాహమూర్తిని ప్రభూ! పరబ్రహ్మ పరమాత్మ ఎవరంటే! శివుడని కొందరు, బ్రహ్మదేవుడని మరికొందరు చెబుతున్నారు. నిజానికి పరదైవం ఎవరు అని అడిగింది. వరాహమూర్తి భూదేవితో పరదైవం గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు.

జగన్నాథుడైన నారాయణుడే పరదైవం పరబ్రహ్మ. ఆయన నుంచే చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మనుంచి రుద్రుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ కుమారుడైన రుద్రుడు అందమైన ధాతువులతో ప్రకాశించే కైలాస శిఖరం మీద నివసిస్తుంటాడు. ముక్కంటి మహాదేవుడైన రుద్రుణ్ణి సకల దేవతలూ నిత్యం పూజిస్తూ ఉంటారు. సకల భూత గణాలతో పరివేష్టించబడ్డ శివుడు పార్వతీదేవితో కలిసి అక్కడ కొలువైవుంటాడు. కైలాసంలో శివుడి ప్రమథగణాలు అసంఖ్యాకంగా ఉన్నారు. వారిలో కొందరు సింహం ముఖంతో వుండి సింహాల్లా గర్జిస్తుంటే, మరికొంతమంది గుర్రం ముఖంతో, ఏనుగు ముఖంతో, వరాహ ముఖంతో సంచరిస్తున్నారు. వారిలో కొందరు ఆడుతుంటే, మరికొందరు పాడుతున్నారు. ఇలా వేలాది ప్రమథగణాలచేత సేవించబడుతున్నాడు శివుడు.

పరమేశ్వరుడు ఆ విధంగా ఆనందంగా కాలం గడుపుతుండగా ఒకనాడు దేవతలందర్నీ వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. వారందరినీ చూసి శంకరుడు ఆనందంగా స్వాగతించి వారు వచ్చిన పనేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వినయంగా నమస్కరించి “శంకరా! అంధకుడనే మహారాక్షసుడు అన్నిలోకాల్నీ పీడిస్తున్నాడు. వాడి బాధలు పడలేక దేవతలంతా నా దగ్గరకొచ్చారు. నేనేమీ చేయలేక వారందర్నీ తీసుకుని ఇదిగో ఇలా నీ దగ్గరకొచ్చాను. దయచేసి మా అందర్నీ కాపాడు ” అని ప్రార్థించాడు. అలా అన్న తరువాత బ్రహ్మ శివుడి చేతిలో ఉన్న పినాకం అనే విల్లుని చూస్తూ మనసులో నారాయణుణ్ణి స్మరించాడు.

బ్రహ్మచేసిన స్మరణతో నారాయణుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒకేచోట త్రిమూర్తులు ముగ్గురూ కలిసారు. ఒకర్నొకరు సాభిమానంగా చూసుకున్నారు. ఒక్కసారి ఆ ముగ్గురూ తమ దృష్టిని ఒకేచోట కేంద్రీకరించారు. అంతే ఆశ్చర్యకరంగా ఆ మూడు దృష్టుల నుంచి ఒక దివ్యమైన కన్య ఆవిర్భవించింది. ఆ దేవి ఎలా ఉందంటే?

నీలోత్పలదళ శ్యామా నీలకుంచిత మూర్ధజా! సునాసా సులలాటాంతా సువక్రా సుప్రతిష్ఠితా త్వష్టాయదగ్ని జిహ్వంతు లక్షణం పరిభాషితం | తత్సర్వమేకతః సంస్థం కన్యాయాం సంప్రదృశ్యతే ॥

(శ్లో॥ 19-20, అధ్యా-89)

నల్లకలువ రేకులాంటి శరీరకాంతి, నల్లగా నొక్కులతో వున్న అందమైన కేశాలు, అందమైన ముక్కు, చక్కటి నుదురు సుందరమైన ముఖంతో ఆ దేవి ప్రకాశిస్తోంది. త్వష్టప్రజాపతి అగ్నిదేవుడి జిహ్వకి ఏ లక్షణాలైతే నిర్దేశించాడో. ఈ దేవి కూడా అదే లక్షణాలతో వెలిగిపోతోంది.

దివ్యమైన ఆ సుందరిని చూసి త్రిమూర్తులు ముగ్గురూ ఆశ్చర్యపోయి, దేవీ! నీవెవరు? ఎందుకొచ్చావు? అని ప్రశ్నించారు. నలుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతో భాసిస్తున్న ఆ దేవి “ఉత్తములైన త్రిమూర్తులారా! నేను శక్తిని. మీ ముగ్గురి దృష్టినుంచి ఆవిర్భవించాను. నన్ను గుర్తించలేదా! మీ అందరి శక్తినుంచి పుట్టిన పరమేశ్వరిని నేనే” అని మృదువుగా పలికింది. ఆమె మాటలు విని దేవతలంతా ఎంతో సంతోషించి దేవికి ఎన్నో వరాల్ని అనుగ్రహించారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment