Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – మూడవ భాగము

భూదేవి చేసిన విష్ణుస్తుతి:-

నమః కమల పత్రాక్ష నమస్తే పీతవాససే |

నమః సురారి విధ్వంసకారిణే పరమాత్మనే ॥

శేష పర్యంక శయనే ధృత వక్షఃస్థల

శ్రియే నమస్తే సర్వదేవేశ నమస్తే మోక్షకారిణే॥

నమః శార్ణాసి చక్రాయ జన్మమృత్యు వివర్జితే |

నమోనాభ్యుర్థిత మహత్కమలాసనజన్మనే॥

నమోవిద్రుమ రక్తాస్య పాణిపల్లవ శోభినే ॥

శరణం త్వాం ప్రసన్నాస్మి త్రాహినారీమనాగసమ్ ॥

పూర్ణ నీలాంజనాకారం వరాహం తేజనార్ధన |

దృష్ట్వా భీతాస్మి భూయో సి జగత్

త్వద్దేహగోచరమ్ ఇదానీం కురుమే

నాథ దయాం త్రాహిమహాభయాత్ ॥

కేశవఃపాతుమే పాదౌ జంఘే నారాయణోమమ ।

మాధవోమే కటిం పాతు గోవిందో గుహ్యమేవచ ॥

నాభిం విష్ణుస్తుమే పాతు ఉదరం మధుసూదన |

ఊరూత్రివిక్రమః పాతు హృదయం పాతువామనః ॥

శ్రీధరఃపాతుమేకంఠం హృషీకేశో ముఖంమమ ।

పద్మనాభస్తు నయనే శిరోదామోదరో మమ ॥

ఏవన్యస్యహరే ర్న్యాసనామాని జగతీతదా |

నమస్తే భగవన్ విష్ణో ఇత్యుక్త్వా విరహమహ ॥

(శ్లో॥ 20 – 28, అధ్యా – 1)

దేవతల తామరరేకుల్లాంటి కళ్ళు కలిగిన స్వామీ! పీతవస్త్రాన్ని ధరించి, శత్రువుల్ని రూపుమాపే పరమాత్మా నీకు నమస్కరిస్తున్నాను. శేషతల్పం మీద శయనించి, హృదయం మీద లక్ష్మీ దేవిని ధరించిన సర్వదేవేశా! నీకు నమస్సులు సమర్పిస్తున్నాను. శార్ణం, ఖడ్గం, చక్రం ధరించి బొడుతామర నుంచి బ్రహ్మ దేవుణ్ణి సృష్టించిన ప్రభూ! జరామరణాలు లేని ఓ స్వామీ! నీకు నేను కైమోడ్పు లందిస్తున్నాను.

పగడాలలాంటి ముఖం, లేత చిరుళ్ళలాంటి చేతులు కలిగి అలరారుతున్న దేవా! నీకు నమస్కారం. స్వామీ! నేను నిన్నే శరణువేడుకుంటున్నాను. ఏపాపం ఎరుగని స్త్రీనైన నన్నుకాపాడు. ఓ జనార్ధనా! నిలువెల్లా నల్లని కాటుకలాంటి ఆకారం కలిగిన నీ దివ్య వరాహరూపాన్ని, నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను. ఇప్పటికీ నా భయం తగ్గలేదు నాథా! దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్ధించి ఆ తరువాత శ్రీహరిని వివిధ నామాలతో సంబోధిస్తూ తన శరీరావయవాలన్నిటినీ రక్షించమని ఇలా కోరింది.

కేశవుడు నా పాదాల్ని రక్షించుగాక! నారాయణుడు నా పిక్కల్ని, మాధవుడు నా నడుముని, గోవిందుడు నా గుహ్యభాగాన్ని రక్షించుగాక!

అదేవిధంగా విష్ణువు నా పొక్కిలిని, మధుసూదనుడు నా ఉదరాన్ని, త్రివిక్రముడు నా తొడల్ని, వామనుడు నా హృదయాన్ని రక్షించుగాక! శ్రీధరుడు నా కంఠాన్ని, హృషీకేశుడు :- నా ముఖాన్ని, పద్మనాభుడు నా కళ్ళని, దామోదరుడు నా శిరస్సుని కాపాడుగాక! అని పలికి ఆయనకి భక్తిగా నమస్కరించింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment